మెయన్ ఫీచర్

పాక్‌లో మహిళలకు భద్రత మృగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థామస్ రాయటర్స్ ఫౌండేషన్ జరిపిన సర్వేలో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాలలో మూడవదిగా పాకిస్తాన్ నెలకొంది. దేశంలో పౌర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా మహిళలపై హింసను నిరోధించడంకోసం పలు చట్టాలు తీసుకువచ్చారు. గౌరవంకోసం చంపడం, యాసిడ్ దాడులు, లైం గిక వేధింపులు, మహిళలకు ఆస్తిహక్కులు, మానభంగాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, మహిళల అక్రమ రవాణా, గృహహింస వంటి అంశాలపై పలు చట్టాలు తీసుకువచ్చారు.
అయితే దేశంలో అనాదిగా నెలకొన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ, అవినీతి, లైంగిక వివక్ష, అసమర్ధ న్యాయ వ్యవస్థ, ముఖ్యం గా క్రింది స్థాయిలో నెలకొన్న రుగ్మతల కారణంగా ఈ అంశాలను పరిష్కరించడంలో, మహిళలపై హింసను అరికట్టడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైనదని ఆసియా మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. చేసిన చట్టాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. పైగా దేశంలో మహిళల గౌరవంకోసం చం పడం, మానభంగాలు, యాసిడ్ దాడులు, ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిడులు, బలవంతపు వివాహాలు, సంచరించే స్వేచ్ఛపై ఆంక్షలు, నిర్బంధంలో చిత్రహింసలు, అక్రమ రవాణా, గృహహింస, వరకట్నంకోసం హింస, అపహరణ, బలవంతంగా పడుపువృత్తి, బలవంతపు అదృశ్యాలు వంటి పలు హింసలను, వివక్షలను ఎదుర్కొంటున్నారు.
మహిళలపై జరుపుతున్న హింసలలో అత్యంత దారుణమైన, అమానుషమైన పరువు హత్యలు దాదాపుగా ప్రతిరోజూ పాకిస్తాన్‌లో జరుగుతున్నాయి. అందుకు పాల్పడిన వారిపై చట్టపర చర్య తీసుకోవడం దాదాపు అసాధ్యంగా ఉంది. గిరిజన కోర్టులలో సాక్షుల హోదా, పరపతినిబట్టి వారి సాక్ష్యాలకు విలువ ఇస్తారు. సాధారణంగా మగువలను లైంగికంగా అవినీతిపరురాలిగా పరిగణిస్తారు. అందుకనే వారి సాక్ష్యాలకు ఎప్పుడు పెద్దగా విలువ ఇవ్వరు. అసలు గిరిజనులలో పెద్దల పంచాయితీగా భావించే ‘జిర్గా’ ఎదుటకు మగువలను అసలు అనుమతించరు. 2004 ఏప్రిల్‌లో ఇటువంటి పంచాయతీలు చట్టబద్ధంకావని, ఆ విధంగా నిర్వహించే వారిపై చట్టం అమలుచేసే సంస్థలు చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని సింధ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. దివ్యత్ వంటి ఇస్లాం చట్టాలు కూడా అత్యాచారం జరిపే వారికి, హంతకులకు, మహిళలను కించపరచే వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుంటాయ. దివ్యత్ ప్రకారం హత్య, భౌతిక గాయాలు, ఆస్తుల విధ్వంసం వంటి నేరాల బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థికపర పరిహారం చెల్లిస్తే సరిపోతుంది. దానితో నేరస్తులకు శిక్షనుండి విముక్తి లభిస్తుంది. ముస్లిం పురుషులకు చెల్లించే పరిహారంలో బాధితులు మహిళలు అయితే సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అదే బాధితులు ము స్లింలు కాని పక్షంలో ముస్లిం బాధితులకు చెల్లించే పరిహారంలో 1/6వ వంతునుండి సగం వరకూ చెల్లిస్తే సరిపోతుంది.
పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నివేదికల ప్రకారం ఆ దేశంలో పరువుకోసం హత్యలు, లింగ ప్రాతిపదిక హింసా సంఘటనలు 15 శాతం మేరకు పెరిగాయి. ఇటువంటి సంఘటనల పట్ల సామాజికంగా లభిస్తున్న మద్దతు కారణంగా, నిందితులకు అధికారంలో ఉన్నవారి నుండి లభిస్తున్న అండ కారణంగా ఇటువంటి సంఘటనల సందర్భంగా పోలీసులు చట్టాలను సక్రమంగా అమలుపరచలేక పోతున్నారు.
1977లో వచ్చిన ప్రతీకారం, పరిహారం చట్టం ప్రకారం పరువుకోసం హత్యలు జరిగిన కేసులను ఏ దశలో అయినా బాధితుల వారసులు నగదు పరిహారానికి ఒప్పుకొని, నిందితులను క్షమించి, కేసును మూసివేసే వీలుంది. బాధితుల కుటుంబ సభ్యులు, నిందితుల మధ్య రాజీ, పరిహారం, కేసు ఉపసంహరణ వంటి అవకాశాలను తొలగించి ఈ చట్టాన్ని బలోపేతం చేయవలసి ఉంది. ఇటువంటి కేసులను బాధితుల కుటుంబ సభ్యులు కాకుండా ప్రభుత్వమే కోర్టులో నమోదుచేసే విధంగా నిబంధనలు రూపొందించాలని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి. ప్రపంచంలో ఆప్ఘనిస్థాన్, కాంగో దేశాల తర్వాత మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంలాగ థామస్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వేలో పాకిస్తాన్‌ను ఎంపిక చేయడానికి మహిళలకు ప్రమాదకరమైన ఇటువంటి సాంస్కృతిక, గిరిజన, మతపర సంప్రదాయాలు నెలకొనటమే అని ఈ సందర్భంగా గమనించాలి. యాసిడ్ దాడులు, బలవంతపు వివాహాలు జరగడం, రాళ్ళు రువ్వడం వంటి అమానుష భౌతిక దాడులతో శిక్షలు, ప్రతీకార చర్యలు అమలుజరగడం వంటి సంప్రదాయాలను ఈ సందర్భంగా ఫౌండేషన్ ఉదహరించింది. పాకిస్తాన్‌లోని మహిళలలో 90 శాతం మంది గృహహింసను ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక వెల్లడించింది. బలవంతపు వివాహాలకు 2014లో 1,261 మంది మహిళలను అపహరించినట్లు సింధ్ రాష్ట్రంలోని పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ సంవత్సరంలోనే 159 మందిపై 114 యాసిడ్ దాడులు జరిగాయి. 2014లో ప్రతిపాదించిన యాసిడ్, కాలిన గాయాల నేరాల బిల్లు ఇటువంటి నేరాలను అరికట్టడానికి దోహదపడాలంటే యాసిడ్ అమ్మ కం, పంపిణీలపై కఠిన నియంత్రణ విధించే విధంగా ఒక చట్టం తీసుకురావలసి ఉంది.
2014 మే 27న మూడు నెలల గర్భిణి అయన ఫర్జానా ఇక్సాల్ (25)ను దారుణంగా చంపిన సంఘటన పాకిస్తాన్ సమాజంలో నెలకొన్న కరడుగట్టిన పితృస్వామ్య ఆధిపత్యాన్ని వెల్లడిస్తుంది. తన కుటుంబ సభ్యుల ఆమోదం లేకుండా ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్న ఆమెను లాహో ర్ హైకోర్టు వెలుపల రద్దీవీధిలో రాళ్ళతోకొట్టి అమానుషంగా చంపారు. తనను అపహరించాడనే ఆరోపణపై కోర్టుకు తీసుకువచ్చిన తన భర్త మహ్మద్‌ను కాపాడటంకోసం ఆమె కోర్టువద్దకు వచ్చారు. ఆమెను దారుణంగా కొట్టి చంపడాన్ని నిలిపివేయడానికి పోలీసులు ఏమీ చేయలేదు. ఈ కేసు అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గత సంవత్సరం నవంబర్‌లో ఈ పరువుహత్య కేసులో నిందితులైన నలుగురికి హైకోర్టు మరణశిక్షను విధించింది.
ఆమెను రాళ్ళతో కొట్టి చంపిన సంఘటనతో ఆమె తండ్రికి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆయనే పోలీసుల ముందు లొంగిపోయి తానే నేరం చేసినట్లు చెప్పా రు. ఎందుకంటే కోర్టు విచారణ అనంతరం ‘దివ్యత్’ (పెద్దమనుషుల పంచాయతీ)లో రాజీచేసుకొని కొడుకులను కాపాడవచ్చని భావించారు. అయితే అతని ఉద్దేశ్యాలను మీడియా, పౌర సమాజం బహిరంగపరచి, నిందితులపై కేసు విచారణ జరగవలసిందేనని ప్రభుత్వం, పోలీసులపై వత్తిడి తీసుకువచ్చారు.
‘జిర్గా’ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడంకోసం ఒక పోలీసు అధికారి తన కుమార్తె అరిఫాబబ్బుర్ (21)ను పరువుకోసం హత్యచేసిన మరో సంఘటన కూడా పాకిస్థాన్‌లో సంచలనం కలిగించింది. ముగ్గురు సోదరులు కలిసి ఆమెను చంపివేశారు. వారిలో ఒకరు ఒక పోలీసుస్టేషన్ ఇన్‌చార్జి, ఆమె తండ్రి. మరొకరు పేరుపొందిన నేరస్థుడు. పలు హత్య, మానభంగం, దోపిడీల కేసులలో పోలీసులు వెదుకుతున్న వ్యక్తి. మూడోవారు ఆమె మామ. తనను చంపడానికి ముందు అక్రమ నిర్బంధంలో ఉంచిన సమయంలో ఆ బాలిక ఒక మానవ హక్కుల ఉద్యమకారిణికి ఫోన్‌చేసి తనను ఏ సమయంలోనైనా చంపివేయవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఆమెపై మొత్తం 30 బుల్లెట్లు కాల్చారు. వాటిల్లో 22 ఆమె శరీరంలోకి చొచ్చుకుపోగా, మిగిలినవి ఆమెను ఐదురోజులపాటు అక్రమంగా నిర్బంధించిన గది గోడలలోకి చొచ్చుకుపోయాయి.
అసలు ఈ సంఘటన జరగలేదని రెం డు జిల్లాలకు చెందిన పోలీసులు వాదించే ప్రయత్నంచేశారు. అయితే మానవ హక్కు ల కార్యకర్తలు, ఉన్నత పోలీసు అధికారుల జోక్యంతో కుట్ర బహిర్గతం కాక తప్పలేదు. ఈ బాలికతో ఒక విశ్వవిద్యాలయ విద్యార్థికి అక్రమ సంబంధం ఉందని అతనిని ఇరికించే ప్రయత్నాన్ని ఆమె తండ్రి, ఇతర నిందితులు చేశారు. దానితో అతని కుటుం బ సభ్యులను ‘జిర్గా’ పంచాయితీకి రప్పిం చి పరిహారంగా ఆస్తులు, నగదు, ఒక మైన ర్ బాలికను పొందవచ్చని కుట్ర చేశారు. తనకు కోర్టు ఆవరణలోనే బెదిరింపులు ఎదురుకావడంతో ఈ కేసులో ఒక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసునుండి తప్పుకున్నారు. సింథ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆ బాలిక తండ్రికి ‘రక్షిత బెయిల్’ను మంజూరుచేశారు. ఇంకా ఆ బెయిల్ అక్రమంగా కొనసాగుతున్నది.
పాకిస్తాన్ రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు, హోదా కల్పించినప్పటికీ సాంప్రదాయాలు, సామాజిక విలువలు మరోవిధంగా ఉన్నాయని ఆసియా మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగంలోని 25,34,35 అధికరణలు మహిళల హక్కులకు హామీ ఇచ్చింది. అయితే ‘గౌరవం’ పేరుతో ఒక మహిళ దారుణంగా హత్యకు గురయితే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. ‘మగువ, డబ్బు, భూమి’ అన్ని అనర్థాలకు మూలం అనే నానుడి ఆ సమాజంలో మహిళల పట్ల నెలకొన్న చులకనభావాన్ని వెల్లడిచేస్తుంది. ఇటీవల ఆమోదించిన 18వ రాజ్యాంగ సవరణ మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలలో రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛ కల్గించింది. అయితే ఇతర సామాజిక అంశాలవలే విధానాల అమలు పాకిస్తాన్‌లో అంతంత మాత్రంగానే ఉంటున్నది. 1961లోని ముస్లిం కుటుంబంలో ఆర్డినెన్స్, 1976లోని వరకట్నం, పెళ్ళికూతురు బహుమతులు నమోదుచట్టం, 2006లోని మహిళా రక్షణ చట్టం, 2012 లోని పనిచేసేచోట మహిళలకు రక్షణ, గృహహింస నిరోధం-రక్షణ చట్టం వంటి పలు ప్రగతిశీల చట్టాలను మహిళలకు రక్షణ కల్పించడానికి తీసుకొచ్చారు. అయితే అవి అమలుకు నోచుకోవడం లేదు.
అనాదిగా నెలకొన్న దురాచార సాంప్రదాయాల కారణంగా పాకిస్తాన్ మహిళలు వివక్షతకు, వేధింపులకు, హింసలకు గురవుతున్నారు. తమ ఇష్టంవచ్చినట్లు ఉపయోగించుకొనే చరాస్తిగా, స్థిరాస్తిగా మహిళలను భావిస్తున్నారు. మహిళలు గౌరవంతో జీవించేందుకు, ప్రాథమిక మానవ హక్కులతో సాధికారికత పొందేందుకు ప్రభుత్వం క్రియాశీలపాత్ర వహించి, వివిధ చట్టాలను అమలుపరచాలని మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు కోరుతున్నాయి. అంతర్జాతీయ సంక్షోభ బృందం నివేదిక ప్రకారం వివక్షతతోకూడిన చట్టా లు, పనిచేయని క్రిమినల్ జస్టిస్ విధానం పాకిస్తాన్ మహిళలను ప్రమాదం అంచుకు నెట్టివేస్తున్నాయి. మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల దర్యాప్తు పట్టించుకోని పోలీసు అధికారులపై ఎటువంటి చర్యతీసుకోవడం లేదు. పాకిస్తాన్ మహిళల వ్యవస్థీకృత వివక్షత, తీవ్రవాదుల హింస, మతపర అసహనాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో మహిళల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది. మహిళలకు తగు రక్షణ కల్పించి, వారి సాధికారికతకు కృషిచేస్తానని ఇచ్చిన హామీని అమలుపరచడం పట్ల ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ దృష్టి సారించాలి.

- చలసాని నరేంద్ర