మెయన్ ఫీచర్

కేరళలో కామ్రేడ్ల ‘ధ్వంస రచన’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి దేవాలయంలోకి పది నుంచి యాభై సంవత్సరాల వయసు లోపు మహిళలకు ప్రవేశార్హత లేదనే ఆచారం చాలా సంవత్సరాలుగా అమలులో ఉంది. దీనికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమకారులు కోర్టుకెక్కారు. కోర్టు ‘చట్టం దృష్టిలో అంతా సమానమే’అని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆసరాగా చేసుకొని కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వం హిందువుల విశ్వాసాలను నాశనం చేసుకొనేందుకు కంకణం కట్టుకొంది. సాక్షాత్తూ ‘కామ్రేడ్ల’ ప్రభుత్వమే ధ్వంస రచనకు వ్యూహం పన్ని జనజీవనం అతలాకుతలం అయ్యేలా హింసను ప్రేరేపించింది.
అన్ని వయసుల మహిళలు ఆలయ ప్రవేశానికి అర్హులేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సహజంగానే అయ్యప్ప భక్తులు గట్టిగా వ్యతిరేకించారు. వామపక్ష ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగింది. ఆలయంలోకి బలవంతంగా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు వామపక్ష సానుభూతిపరులైన మహిళలను ప్రవేశపెట్టింది. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ తన భర్త శరవణన్‌తో కలిసి ఆలయంలోకి ప్రవేశించింది. హిందూ మత విశ్వాసాలను మంట గలిపినందుకు కేరళ వ్యాప్తంగా హింస చెలరేగింది. కత్తిపోట్లు, బాంబుదాడులు వంటి సంఘటనలు సైతం జరిగాయి.
కేరళలోని మార్క్సిస్టు ప్రభుత్వం మహిళల్లో చైతన్యం పేరిట భారీ మానవ హారాన్ని నిర్వహించింది. అందుకు సంబంధించిన వీడియోలను దేశ ప్రజలంతా టీవీ చానళ్లలో చూచారు. ఈ మానవ హారంలో చాలామంది బురఖాలు వేసుకున్నవారు కనపడ్డారు. అంటే ఆ బురఖాల వెనుక ఉన్నది ఎవరు? వారికి హిందూ దేవాలయ వివాదాలతో ఏమిటి సంబంధం? మతం మీద విశ్వాసం లేని కమ్యూనిస్టులకు శబరిమల గొడవలపై ఏమిటి సంబంధం? సాక్షాత్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుప్రీం కోర్టు తీర్పును తాము అమలు చేసి తీరుతామని ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగినప్పటికీ ఆలయ వివాదాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. చంద్రన్ అనే అయ్యప్ప భక్తుణ్ణి మార్క్సిస్టులు కత్తులతో పొడిచి చంపారు. కేరళ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఎన్నో బస్సులు తగలబడ్డాయి. నిజానికి.. మన దేశంలోని మార్క్సిస్టులకు అటు చైనాకు కావలసింది ఈ అరాజకమే!
* * *
మధ్యప్రదేశ్‌లో గత పదిహేను సంవత్సరాలుగా భాజపా ప్రభుత్వం అధికారాన్ని చలాయించింది. అందుకని అక్కడి యువతకు కాంగ్రెస్ పాలన ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు. గత నెలలో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1984లో సిక్కుల హత్య కేసులో నిందితుడైన కమలనాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసి, అధికార పగ్గాలు అప్పగించింది. అతడు అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్‌లో ‘వందేమాతరం’ గీతాలాపనపై నిషేధం విధించాడు.
1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భారత జాతిపై ఎమర్జెన్సీ విధించింది. లక్షలాది మందిని జైళ్లకు పంపింది. అలా వెళ్లినవారిలో మహమ్మద్ అహమ్మద్ నాయక్ ఒకడు. ఇతడు నిరుపేద. భార్యాబిడ్డలు చనిపోయారు. ఇతని కుటుంబానికి భాజపా ప్రభుత్వం ఎమర్జెన్సీ బాధితులకు ఇచ్చే పెన్షన్ కింద నెలకు రెండువేలు ఇవ్వసాగింది. ఘనత వహించిన కమలనాథ్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే మహమ్మద్ అహ్మద్ నాయక్ వంటి 2000 మందికి పెన్షన్లు రద్దుచేశాడు. అంటే- కమల్‌నాథ్ తనకు అధికారం దక్కగానే కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టాడని అర్థం. ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల హత్యలను బహిరంగంగా 1984లో రాజీవ్‌గాంధీ బలపరిచాడు. ప్రస్తుతం విచారణలో ఉన్న వెస్ట్‌లాండ్ చాపర్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ భార్య సోనియా, కొడుకు రాహుల్ నిందితులుగా ఉన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో స్వయంగా రాజీవ్‌గాంధీ నిందితుడు. ఇతనికి మరణానంతరం ‘్భరతరత్న’ పురస్కారాన్ని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆమాటకొస్తే ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమిక హక్కులను హరించిన ఇందిరా గాంధీకి ఈ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వటం ఎంతవరకు సబబు?
* * *
ఎంత ఆలోచించినా కొన్ని కొన్ని విషయాలు సామాన్యులకు అర్థం కావు. ద్రవ్య వినియోగం జరిగినప్పుడు ఆడిట్‌లో యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు అడగటమే నేరమా? 2017-2018 ఆర్థిక సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి రూ. 6,243 కోట్ల నిధులు విడుదల కాగా వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను సంబంధిత అధికారులు కోరారు. ‘మేము క్లర్కులమా? మీకు రశీదులు ఇచ్చి లెక్కలు చెప్పడానికి?’- అని చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పడం సమంజసమేనా? ఇచ్చిన డబ్బు చాలకపోవచ్చు. నూతనంగా ఏర్పడుతున్న రాజధానికి మరింతగా నిధులు అవసరం ఉంటుంది. కానీ, ఇచ్చిన నిధులు దారిమళ్లించి- తగిన లెక్కలు చెప్పకపోతే ఎలా?
* * *
రాజకీయ వార్తల హడావుడిలో చాలా సున్నితమైన అంశాలు కొన్ని ప్రజల దృష్టికి రావటం లేదు. న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్వామి వివేకానంద విగ్రహ స్థాపన చేయాలనే ప్రతిపాదనను అక్కడి అధ్యాపకవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ‘వివేకానందుడు హిందువు. ప్రపంచమంతా తిరిగి హిందూ ధర్మప్రచారం చేశాడు. కాబట్టి ఆయన విగ్రహం పెట్టకూడదు’ అని కొందరు ప్రొఫెసర్లు వాదించారు. ఈ విశ్వవిద్యాలయం నుండే ఏచూరి సీతారాం, కన్నయ్యకుమార్ వంటి వామపక్ష నేతలు చదువుకొని బయటకు వచ్చారు. 1905 తర్వాత భారతదేశంలో జరిగిన జాతీయ పునరుజ్జీవన ఉద్యమానికి స్వామి వివేకానందుడు స్ఫూర్తిదాత. నేతాజీ సుభాష్‌బాబు, అరవింద యోగి వంటివారు వివేకానందుని నుండే స్ఫూర్తిని పొందారు. చైనా ప్రేరేపిత ఉగ్రవాద అధ్యాపక వర్గాలు ఇప్పుడు జెఎన్‌యూ వంటి విశ్వవిద్యాలయాలను ప్రణాళికాబద్ధంగా ఆక్రమించుకున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవటంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది?
* * *
ఒంగోలులోని ‘మాగుంట’ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. ఇది కక్షసాధింపు చర్య అని తెలుగుదేశం నాయకులు అభివర్ణించారు. ప్రముఖ సినీనటుడు మహేష్‌బాబు ఒక్కొక్క సినిమాకు 15 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటాడని సినీవర్గాల భోగట్టా. ఎంతైనా తీసుకోవచ్చు కాని నిబంధనల ప్రకారం పన్ను కట్టాలి కదా! అడ్వర్‌టైజ్‌మెంట్లకు సంబంధించిన ఆదాయంపై పన్ను కట్టలేదని ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాలు స్తంభింపచేశారు. ఆ తర్వాత కథ సుఖాంతమైంది. అది వేరే విషయం. కర్నాటకలో సినీనటులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, యాష్ సుదీప్, నిర్మాతలు సి.ఆర్.మనోహర్‌రావ్, లైన్ వెంకటేశ్, విజయ్ కిర్లిండన్‌ల ఇండ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వీరు ఎంత పన్ను ఎగవేశారో మాత్రం తెలియదు.
ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఇది రాజకీయ దురుద్దేశ పూర్వక చర్య అని అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తున్నది. ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. కాని పన్ను కట్టాలికదా? అది లేనప్పడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. విలాస జీవితాలు గడిపే పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఆదాయపు పన్ను ఎగవేయటం తప్పుకాదా? ఇక- హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌ను డ్రగ్స్ నగరంగా మార్చింది ఎవరు? దానిపై విచారణ నిమిత్తం నమోదైన కేసులను నీరుకార్చింది ఎవరు?
* * *
‘తైవాన్ ద్వీపం మా మాతృభూమిలో అంతర్భాగం కావాలి. అవసరమైతే సైనిక చర్యకు కూడా మేము వెనుకాడము’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నూతన సంవత్సర సందేశం వినిపించారు. దీనికి ఆగ్రహించిన తైవాన్ అధ్యక్షుడు త్యాయి ఇంగ్‌వింగ్ తన రాజధాని లూమ్‌పే నుండి మాట్లాడుతూ ‘‘మా స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము’’ అని ప్రకటించాడు. ఈ అంశాన్ని కొంచెం పరిశీలిస్తే తేలే సారాంశం ఏమిటంటే చైనా తన రాజ్యవిస్తరణ కాంక్షను దినదినం పెంచుకుంటుపోతున్నది. తైవాన్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలా ఒక్కొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటూ తన సామ్రాజ్యవాద తత్వాన్ని చైనా ప్రదర్శించుకుంటున్నది. భారతదేశంలోని కమ్యూనిస్టులకు తైవాన్ అధ్యక్షుని ప్రకటన కనువిప్పు కావాలి.
చైనా అధ్యక్షుని ప్రకటనను సీపీఎం నేతలు సమర్ధిస్తే ఇండో-పాక్ ఏకీకరణను, ఉభయ కొరియాల ఏకీకరణను కూడా వీరు సమర్ధించాలి. కాని అందుకు వీరు సిద్ధంగా లేరు. దీంతో కమ్యూనిస్టుల ద్వంద్వ ప్రమాణాలు వెల్లడికావటం లేదా??

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్