మెయన్ ఫీచర్

రాహుల్ దూకుడుతో భాజపా బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ రాజకీయాలపై నిర్ణయాత్మక ప్రభావం చూపనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా అఖిలేష్ యాదవ్, మా యావతి పొత్తు ఏర్పర్చుకొంటున్నట్లు ప్రకటించగానే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనని చాలామంది అంచనాలు వేయడం ప్రారంభించారు. మరోవంక కో ల్‌కతలో ప్రతిపక్షాల ఐక్యతను చాటుతూ మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యక్తిగతంగా ఆహ్వానించకుండా ఒక విధంగా అవమానకరంగా వ్యవహరించారు. రాహుల్‌తో సంబంధం లేని ప్రతిపక్షాల వేదికగా ఆ సభను నిర్వహించారు. 22 పార్టీలకు చెందిన 25 మంది నేతలు పాల్గొన్నారు. మోదీకి వ్యతిరేకంగా గత ఐదేళ్లల్లో జరిగిన అతి పెద్ద సభ ఇదేనని చెప్పవచ్చు. ఇంతమంది విపక్ష నేతలు ఒక వేదికపైకి రావడం గమనార్హం.
వాస్తవానికి మోదీకి వ్యతిరేకంగా రాజీలేని రాజకీయ పోరాటాన్ని గత నాలుగేళలుగా చేస్తున్న నేత రాహుల్ ఒక్కరు మాత్రమే. 2018లో దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరిగాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్‌కు లేకపోయినా, గత నవంబర్ వరకు ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ను గెలిపించలేక పోయారని సొంత పార్టీ వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా- మోదీ వ్యతిరేక వాతావరణం సృష్టించడంలో రాహుల్ విజయం సాధించారు. సూటు- బూటు రాజ్ అంటూ మోదీ పారిశ్రామిక వేత్తలకే మేలు చూస్తున్నారనో, గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ జీఎస్టీ రైతులు, చిన్న వ్యాపారుల పాలిట అరిష్టంగా మారిందనో, రాఫెల్ ఒప్పందం ద్వారా మోదీ అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనో... నేరుగా ప్రధానిని రాహుల్ ఆత్మరక్షణలో పడవేస్తూ వస్తున్నారు. గుజరాత్, కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారం వైపు నడిపించడం కోసం పోరాడినా విజయం సాధించకలేక పోవడంతో పార్టీ వర్గాలు ఆయన నాయ కత్వం పట్ల ఆశలు వదులుకోవడం ప్రారంభమైనది. ఇంతలో మూడు రాష్ట్రాలలో పార్టీని విజయం వైపు రాహుల్ నడిపించడంతో కాంగ్రెస్ శ్రేణులలో కొం తమేరకు స్థైర్యం నింప గలిగినా జాతీయ స్థాయిలో ఆయన ఇంకా వెనుకబడే ఉన్నారు.
వచ్చే ఎన్నికలలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ప్రధాని పదవి అధిష్టించాలని ఎదురు చూస్తున్న మాయావతి, మ మతా బెనర్జీ అనేక సందర్భాలలో- రాహుల్‌తో కలసి ఎటువంటి ప్రతిపక్ష వేదికను, కూటమిని పంచుకోవడానికి సిద్ధంగా లేమనే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. యూపీలో కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేయడం, కోల్‌కత సదస్సులో రాహుల్ లేకపోవడం ద్వారా- తాము ప్రధాని పదవి చేపట్టడానికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితులను రాహు ల్‌కు సృష్టించడానికి మమత, మాయావతి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో రాహుల్ ఎత్తుగడలు బిజెపిలోనే కాకుండా ఇతర ప్రతిపక్షాలలోనూ విస్మయం కలిగిస్తున్నాయి.
సోదరి ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పజెప్పడం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి దక్క లేదన్న అసంతృప్తితో ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను మరో ప్రధాన కార్యదర్శిగా నియమించి తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పజెప్పడం ఒక విధంగా రాహుల్ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఎత్తుగడ అని చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ పార్టీ శ్రేణులకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టగానే వృద్ధతరం నేతలను పక్కకు నెట్టివేసి, యువతరం నేతలను అందలం ఎక్కిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వృద్ధతరం నేతలకే ముఖ్యమంత్రి పదవులతో పాటు పార్టీలో కీలక పదవులు అప్పజెబుతూ వచ్చారు. ఇదంతా పార్టీలో ఏ వర్గం అసంతృప్తి చెందకుండా చేయడం కోసమే అని, అసలు లక్ష్యాలను వ్యూహాత్మకంగా సాధి స్తున్నారని భావించ వలసి వస్తున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా యూపీలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుపొందే అవకాశాలు కనిపించక పోవడంతో పాటు, చివరకు గత ఎన్నికలలో గెలుపొందిన రెండు సీట్లను కూడా గెలవడం కష్టమనే పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో ప్రియాంకకు పార్టీ నాయకత్వం అప్పజెప్పడం ఒక విధంగా ఆమె రాజకీయ భవిష్యత్‌కు శరాఘాతమే. అయితే రాజకీయాలలో నాయకులు కలిసినంత మాత్రాన ఓటర్లు అదే రీతిలో కలవరని గతంలో స్పష్టమైనది. రెండు పార్టీలు కలిస్తే ఆయా పార్టీల ఓట్లర్లు కలిసే అవకాశం ఉండదు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలుగా పేరొందిన వారితో పొత్తు ఏర్పర్చుకొంటే ఓటర్లు నమ్మరని తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపి రాహుల్ గాంధీ గ్రహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గతంలో ఎస్పీతో పొత్తు ఏర్పరచుకున్నా ఓట్లు బదిలీ కాలేదు.
దేశం మొత్తం మీద గత రెండేళ్లలో గణనీయంగా ఓట్లు పెంచుకొంటున్న పార్టీ కాంగ్రెస్ అని మాత్రమే అని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే అఖిలేష్, మాయావతి, మమత వంటి వారు కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుం డగా, ఈ పరిస్థతి ఒక విధంగా తమకు వరప్రసాదమని రాహుల్ భావిస్తున్నారు. ఆయా పార్టీలతో చేతులు కలిపితే కాంగ్రెస్‌కు మద్దతు దారులుగా ఉన్న ఓటర్లు కలవరని, వారంతా బిజెపి వైపు వెళ్లే ప్రమాదం ఉన్నదని భా విస్తున్నారు. ఉదాహరణకు యూపీలో రాహుల్ అఖిలేష్, మాయావతిలతో పొత్తు ఏర్పర్చుకొంటే, ఇప్పుడిప్పుడే బిజెపి పట్ల వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు వస్తున్న అగ్రవర్ణాలకు చెందిన ప్రజలు ఈ పార్టీలకు వోటు వేసే అవకాశం లేదు. కాంగ్రెస్ ఓటర్లు కూడా బిజెపి వైపు వెళ్లే అవకాశం ఉన్నది. తెలంగాణలో ఇదే విధంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు దేశంతో చేతులు కలిపితే కాంగ్రెస్ ఓటర్లు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు బిజెపిని కట్టడి చేయడంపై కన్నా, కాంగ్రెస్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలకు ఇది ఒక గుణపాఠంగా మారే అవకాశం ఉంది.
2009లో బిహార్‌లో ఏం జరిగిందో ఒక సారి గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన రెండు భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ ను వదిలి వేసి తామే సీట్ల సర్దుబాట్లు ప్రకటించాయి. అప్పట్లో రైల్వే మంత్రిగా ఉంటూ, రాష్ట్రంలో 25 మంది ఎంపీలను కలిగి ఉన్న ఆర్ జె డి నేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌తో సీట్లు పంచుకున్నారు. రా హుల్‌ను గాని, అహ్మద్ పటేల్‌ను గాని కనీసం ఆహ్వా నించకుండా లాలూ, పాశ్వాన్ ఢిల్లీలో సీట్ల సర్దుబాట్లను ప్రకటించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ రెండు సీట్లు మించి గెలవలేదని కనుక ఆ సీట్లను వదులుతున్నట్లు అఖిలేష్, మాయావతి ప్రకటించిన విధంగా బిహార్‌లో గతంలో కాంగ్రెస్ మూడు సీట్లు మించి గెలవలేదని మూడు వదిలారు. వాటిల్లో కాంగ్రెస్ రెండు గెలిచింది. కానీ లాలూ బలం 25 నుండి తగ్గింది. ఐదు సీట్లు ఉన్న పాశ్వాన్ ఒక్క సీటు కూడా గెలుపొందలేక పోయారు. ఇప్పుడు రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా డీఎంకే అధ్యక్షుడు ఏంకే స్టాలిన్ తప్ప మరెవ్వరూ పూర్తి మద్దతు ఇవ్వడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఉండడంతో హెచ్‌డి కుమారస్వామి, హెచ్‌డి దేవెగౌడ తప్పనిసరి పరిస్థితులలో రాహుల్‌కు మద్దతు ఇవ్వవలసి వస్తున్నది. కానీ మిగిలిన నేతలెవరూ రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేరు.
గ్రామీణ సంక్షోభం, యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, మోదీ అట్టహాసంగా ప్రారంభించిన పలు పథకాలు ఆశించిన విధంగా అమలు కాకపోవడం వంటి పరిస్థితులు నేడు మోదీకి ప్రధాన ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. గత నాలున్నరేళ్లలో తన ప్రభుత్వ పనితీరు చూసి వోటు ఆడితే ధైర్యం లేక ప్రధాని ఇప్పుడు ఎన్నికల ముందు 10 శాతం రిజర్వేషన్, జీఎస్టీ రాయి తీలు, రైతులకు వరాలు వంటి పలు ఆకర్షణీయ పథ కాలను ప్రజల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ పథకాలన్నీ గత ఎన్నికల్లో మద్దతుగా నిలబడి, ఇపుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడం కోసమే. అంటే కొత్తగా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే పరిస్థితులలో మోదీ నేడు లేరు. ఈ ఓటర్లు కోపంతో బిజెపికి ఓటు వేయక పోయినా కాంగ్రెస్‌కు మాత్రం వేయరు. ను ఓడిపోతే ప్రతిపక్షాలు అస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాయని ప్రజలను బెదిరించే విధంగా మోదీ మాట్లాడుతున్నారు. గతంలో ఆయన గొప్పగా చెప్పుకున్న మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల గురించి ఇప్పుడు మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. బహిరంగ సభలలో మినహా పార్లమెంట్‌లో గాని, పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గాని, మంత్రివర్గ సమావేశంలో గాని, మీడియా సమావేశాల్లో గాని తనపై వస్తున్న ఆరోపణలకు ఆయద సమాధానాలు చెప్పలేక పోతున్నారు. మోదీ బలహీనతలనే ఆయుధాలుగా చేసుకొని రాహుల్ ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ప్రధాని పదవి కోసం ఎదురు చూస్తున్న వారందరిలో రాహుల్ యువకుడు. ఆ పదవి కోసం మరో ఐదేళ్లు ఆయన ఎదురు చూడగలరు. కానీ దేశ రాజకీయ అంశాలను నిర్ధేశించే స్థాయికి ఆయన ఎదుగుతున్నారని మాత్రం చెప్పవచ్చు.

-చలసాని నరేంద్ర