మెయన్ ఫీచర్

రాజకీయాల్లో విలువలకు పాతర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఎక్కడికి వెళ్లాడు?’ అంటూ మీడియా ప్రతినిధులంతా కలసి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ (కాంగ్రెస్)ను ప్రశ్నించారు.
‘సకుటుంబంగా ఓ పెళ్లి వేడుకకు వెళ్లాడు.’
‘ఆ పెళ్లి మండపం ఎక్కడ ఉంది?’
‘ఎక్కడో ఉంది.. అది ఆయన వ్యక్తిగత కార్యక్రమం.’
ఈ సంభాషణ ఇలా సాగుతుండగా- మరికొద్ది సేపటికి బెంగళూరు పోలీసు అధికారి నుండి ఒక ప్రకటన వెలువడింది. ‘ఆనంద్ సింగ్ అపోలో హాస్పటల్‌లోని ఆరవ అంతస్థులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదు.. ఆయనకు ఎముకలు విరగలేదు...’
అప్పుడు మరొక కాంగ్రెస్ నాయకుడు మీడియా ముందుకు వచ్చాడు. ‘ఆనంద్ సింగ్ నడుస్తూ కాలు జారిపడ్డాడు... కాస్త దెబ్బ తగిలింది. కాలుకు కట్టుకడుతున్నారు.. అంతే..’ అన్నాడు.
రేణుకాచార్య అనే మరొక లింగాయత్ నాయకుడు- ‘పెళ్లీ లేదు- కాలు జారటమూ లేదు.. ఓ రిసార్ట్‌లో జనవరి 20వ తేదీన తెల్లవారకముందు ఎం.ఎల్.ఎలు తాగి ఒకరినొకరు ఖాళీ సీసాలతో పొడుచుకున్నారు. ఈ మద్యం సీసాలను రాష్ట్ర ప్రభుత్వమై జెడిఎస్-కాంగ్రెస్ ఎంఎల్‌ఏలకు సరఫరా చేసింది..’ అని చెప్పారు.
ఇంతకూ ఆనంద్ సింగ్ మీద దాడి చేసింది ఎవరు? కంపిలి నియోజకవర్గానికి చెందిన గణేశ్, ఖేమానాయక్ అనే మరో ఎంఎల్‌ఏ గొడవలో ఉన్నారట. ఆనంద్ సింగ్ విజయనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు. దీంతో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగాడు. ‘మా ఎంఎల్‌ఏలను భాజపా వారు కొనుగోలు చేస్తున్నారు. అందుకే వారిని వారం రోజులుగా ఓ రిసార్ట్‌లో దాచిపెట్టాం..’ అని ఆయన చెప్పారు.
సిద్ధరామయ్య మాటలను భాజపా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఖండించాడు. ‘మా ఎంఎల్‌ఏలను కాంగ్రెస్ వారు కొనాలని చూస్తున్నారు’ అని ఆయన ప్రత్యారోపణ చేశాడు. ఇందులో ఏది నిజం?
రెండూ నిజమే కావచ్చు.
రిసార్ట్‌లో క్యాంపు రాజకీయం జరగటం ఇది మొదటిసారి కాదు. భారత రాజ్యాంగాన్ని, రిపబ్లిక్ దినోత్సవాన్ని పరిహసిస్తూ బెంగళూరులో ఇటీవల జరిగిన ప్రహసనం ఇది! వర్తమాన భారతదేశ పరిస్థితులకు ఇది దర్పణం. ఇంతకూ రిసార్ట్‌లో ఏం జరిగింది? ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేశ్ తాగిన మత్తులో తెల్లవారుజామున మద్యం సీసాలతో పొడుచుకున్నారు. ఎన్నికల సమయంలో గణేశ్‌కు ఆనంద్ సింగ్ భారీగా ఆర్థిక సహాయం చేశాడు. ఆ డబ్బు రాబట్టుకునే విషయంలో గొడవ మొదలయింది. ఆనంద్ సింగ్‌కు తీవ్రమైన గాయాలై రక్తస్రావం జరిగింది. ఆయనకు ‘గుండెపోటు’ వచ్చినట్లు అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులు నిర్ధారించారు.
***
విలేఖరుల ప్రశ్న: రిసార్ట్‌లో తాగి ఎం.ఎల్.ఎలు ఎందుకు కొట్టుకున్నారు?
కాంగ్రెసు ప్రతినిధి: అలాంటిదేమీ లేదు. వాళ్లు సరదాగా ఆడుకున్నారు.. దీనిని ఫ్రెండ్లీ ఫైట్ అంటాము.
విలేఖరుల ప్రశ్న:-అసలు ఆ రిసార్ట్‌లో మీ పార్టీ ఎంఎల్‌ఏలను ఎందుకు బంధించారు?
మాజీ సీఎం సిద్ధరామయ్య సమాధానం: త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకని వాటికి సంబంధించి వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకోవడానికి శాసనసభ్యులు ఇక్కడ చర్చాగోష్టి జరుపుకున్నారే తప్ప ఎవరూ వారిని బంధించలేదు.
విలేఖరులు: ఇది నిజమేనా?
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీ మాట్లాడుతూ, రిసార్ట్ సంఘటన చాలా చిన్నది. దానిని సోషల్ మీడియాలో గోరంతలు కొండంతలు చేసి చూపించారని అన్నారు.
కానీ- జరిగిందేమిటి?
విజయనగర్ ఎంఎల్‌ఎ ఆనంద్ సింగ్ పోలీసులకు ఇలా ఫిర్యాదు చేశాడు. ‘నన్ను జెఎస్ గణేశ్ హత్యచేయాలని ప్రయత్నించాడు. నాపై మారణాయుధాలతో దాడి చేశాడు. నా కుటుంబ సభ్యులను ఆశ్లీల భాషలో తిట్టాడు.’
జనవరి 21న ఎమ్మెల్యే గణేశ్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పోలీసులు గణేశ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఏం సమాధానం చెపుతుంది? కర్నాటకలోని జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణం ఏ క్షణంలోనైనా పడిపోవచ్చుననడానికి ఈ ఉదంతం సంకేతమా?
***
వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల కోర్టుకెక్కింది. తనపై అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రచారం అయినందుకు ఆమె మనస్తాపం చెందింది. స్ర్తిలను గౌరవించే సంప్రదాయం మనది. రాజకీయ లబ్ధికోసం షర్మిలను అవమానించటం తగదు. ఈ పని ఎవరు చేశారు? జగన్ ప్రత్యర్థులు చేశారని కొందరి అనుమానం.
అలనాడు ఎన్‌టిఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసినప్పుడు ఆయనపై కాంగ్రెస్ వారు అభాండాలు వేశారు. ఓ ప్రముఖ నటిని నమ్మించి ఎన్టీఆర్ మోసగించాడని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇపుడు అదే కాంగ్రెస్ వారితో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేతులు ఎలా కలిపారు? మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒకరిద్దరు ప్రముఖ మహిళలతో సన్నిహితంగా ఉండేవారన్న కథనాలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఇలా ఎంచుకుంటూపోతే రాజకీయాల్లో కొందరు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. రాజకీయ నాయకుల సేవానిరతినే మనం చూడాలి గాని వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లటం మంచి సంప్రదాయం కాదు.
చేతనైతే ఎన్నికల బరిలో తెలుగుదేశం వారు, వైకాపా వారు బాహాబాహీ తేల్చుకోవచ్చు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి. అంతేకాని రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలను, ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలను అవమానించటం తగదు.
హైదరాబాద్ పోలీసులు అందిస్తున్న అధికారిక సమాచారం ప్రకారం షర్మిలపై అనుచితంగా సామాజిక మాధ్యమాల్లో సమాచారం పెట్టిన ముగ్గురిని అరెస్టు చేశారు. మరొక 23 సమాచార టేపులను పరిశీలనలోకి తీసుకున్నారట. ఇప్పుడు మళ్లీ షర్మిలపై ఈ తప్పుడు ప్రచారం వెనుక ఎన్నికల వ్యూహం ఏదైనా ఉన్నదా? లోగడ అరెస్టు చేయబడిన ఆ ముగ్గురే ఇప్పుడూ నిందితులా? లేక మరెవరైనా ఉన్నారా? అని పరిశోధనా విభాగం వారు కేసు విచారణను వేగవంతం చేశారు.
షర్మిల తాను చెబుతున్నది నిజమని పిల్లలమీద ప్రమాణం చేసింది. రాజకీయ లబ్ధికోసం ఈ దుమారం ‘ఫలానా’రాజకీయ పార్టీ సృష్టించింది అని జన కథనం. ఇందులో నిజం ఉందా? ఇప్పుడీ విషయం తెలుగు సోషల్ మీడియా ఛానల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనివల్ల మన సమాచార వ్యవస్థ ఎంత ‘గాసిప్’లకు దారితీస్తున్నదో సాంకేతిక పరిజ్ఞానం ఎంత కలుషితమైందో తెలుస్తున్నది.
* * *
కనకదుర్గ పేరు మళ్లీ వార్తలలోకి ఎక్కింది. ఈమె కేరళలోని మల్లపురం జిల్లాకు చెందిన ఉద్యమ నాయకురాలు. అర్బన్ మావోయిస్టు అనే ముద్ర కూడా ఆమెపై ఉంది. ఈమెను సీపీఎం కార్యకర్తలు ఇటీవల రహస్యంగా శబరిమలై దేవాలయంలో దాచిపెట్టారు. తెల్లవారే లోపల ఆమె బిందు అనే మరో మహిళతో కలిసి స్వామిదర్శనం చేసుకున్నది. ఆ తర్వాత ఆలయం అధికారులు శుద్ధి-సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నట్లుండి కనకదుర్గ అదృశ్యమై పదిహేను రోజుల తర్వాత ఇంటికి చేరింది. తమ మాట వినకుండా శబరిమల వెళ్లిందని ఆమెపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కుటుంబం నుంచి ఆమెను బహిష్కరించారు. కనకదుర్గను ఆమె అత్త కర్రతో కొట్టిందట! ఆమె ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో ఉందట! ఇదంతా భాజపా కుట్ర అని సీపీఎం వారు ఆరోపిస్తున్నారు. అంటే కనకదుర్గ అత్త బిజెపి సభ్యురాలా? ఇంతకన్నా అబద్ధం మరొకటి ఉంటుందా??
* * *
ఇంతకూ కేఏ పాల్ ఎవరు? ప్రజాశాంతి పార్టీ అధినేతగా చెలామణి అవుతున్న ఈయన నేపథ్యం ఏమిటి? లోగడ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితోను ఇప్పుడు చంద్రబాబుతో, నరేంద్ర మోదీతోనూ విరోధం పెంచుకున్నాడు. ఇతడు కాపు కులంలో పుట్టి మతం పుచ్చుకొని విదేశాల నుండి భారీగా క్రైస్తవ మత ప్రచారానికి నిధులు తెచ్చుకున్నాడు. వాటికి ఆటంకం ఏర్పడితే విమర్శలకు దిగుతున్నాడు. దళితులతో సన్నిహితంగా ఉంటూ మతం మార్పిడులు చేస్తున్నాడు. తనను తానే శాంతిదూతగా ప్రకటించుకున్నాడు. దేశంలో ఇలా ఎందరో శాంతిదూతలు విదేశీ నిధుల కోసం సంస్థలు నడుపుతున్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జకీర్ నాయక్ అనే ముస్లిం ఉగ్రవాది తనను తాను శాంతిదూతగా ప్రకటించుకొని భారతదేశంలో అతివాద కార్యకలాపాలు జరుపుతూ ప్రస్తుతం మరో దేశంలో దాక్కున్నాడు. దశాబ్దాలుగా ఇలాంటివారు మన దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందుకు ఫలితమే- నేడు జోరుగా సాగుతున్న మత మార్పిడులు, విస్తరిస్తున్న ఉగ్రవాదం అని నేతలు గ్రహించేదెపుడో...?

-డా. ముదిగొండ శివప్రసాద్