మెయిన్ ఫీచర్

సోషల్ మీడియా చేటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో మనుషులు ఇందులో నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు.. ఇంకా ఏమేమో చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్లమంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా.. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో నలభై శాతం మంది. వీరు రోజుకు సగటున రెండు గంట సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జీవితంలో ఇంతగా భాగమైపోయిన ఈ సోషల్ మీడియా మనిషికి భారంగా మారుతోందా? మానవుల ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలపై ప్రభావం చూపుతోందా? అవుననే అంటున్నాయి నివేదికలు..
సోషల్ మీడియా దాదాపు దశాబ్దం కిందటే పుట్టుకొచ్చింది. అందువల్ల మనిషి భావోద్వేగాలపై దీని ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగల పూర్తిస్థాయి పరిశోధనలు ఇంకా జరగలేదు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలన్నీ దాదాపు ఫేస్‌బుక్ చుట్టూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంపై పరిశోధనలు మరింత లోతుగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కొన్ని పరిశోధనల ఫలితాలను సమీక్షించి ఆసక్తికరమైన విషయాలను మీముందుంచుతున్నాం..
సోషల్ మీడియాలతో మానసిక ఒత్తిడి పెరుగుతోందా? అనే విషయంపై వాషింగ్టన్ డీసీకి చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్‌లో 2015లో పరిశోధనలు చేసింది. 1800 మంది పురుషులు, మహిళల అభిప్రాయాలను సేకరించింది. మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫలితాలు వచ్చాయి. ట్విట్టర్ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆ పరిశోధన చెబుతోంది. మొత్తానికి సోషల్ మీడియా వల్ల ఒత్తిడి కొంతమేరకు ఉందని, అదేమీ భరించలేని స్థాయిలో లేదని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
సోషల్ మీడియా మానసిక స్థితిని కూడా ప్రభావితం చేయగలదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా 2009-2012 మధ్య 100 కోట్లకు పైగా ఫేస్‌బుక్ స్టేటస్ అప్‌డేట్లను పరిశీలించింది. వాతావరణం బాగా లేనప్పుడు నెగిటివ్ పోస్టులు ఒక శాతం పెరిగాయి. వర్షం పడుతున్న ప్రాంతంలోని వ్యక్తి ఒక నెగిటివ్ పోస్ట్ చేస్తే.. వర్షం పడని ఇతర ప్రాంతాలలోని సదరు వ్యక్తి స్నేహితులు కూడా ఆ ప్రభావంతో 1.3 నెగిటివ్ పోస్టులు పెట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇందులో మంచి విషయం ఏమిటంటే.. ఒక సంతోషకరమైన పోస్ట్ ప్రభావంతో 1.75 ఎక్కువ సంతోషకరమైన పోస్టులు వచ్చాయి.
సోషల్ మీడియా వినియోగదారులు అశాంతి, నిద్రలేమి, ఏకాగ్రత లేకపోవడం వంటి ఆందోళనకర పరిస్థితులకు లోనవుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా రెండు కంటే ఎక్కువ సోషల్ మీడియా వేదికలు ఉపయోగించేవాళ్లు మూడు రెట్లు అధికంగా ఆందోళన చెందేందుకు అవకాశం ఉందని ‘కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్’ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది. అయితే సోషల్ మీడియా ఈ ఆందోళనకు ఎలా కారణమవుతుందో ఈ పరిశోధనలో తెలియలేదు.
ఆన్‌లైన్ వేదికగా జరిగే సంభాషణలకు దిగులు, నిరాశ, నిస్పృహ వంటి కుంగుబాటు లక్షణాలకు సంబంధం ఉన్నట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 700 మంది విద్యార్థులపై జరిపిన రెండు అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడించాయి. నెగిటివ్ పోస్టులు చేసినవారిలో ఎక్కువమంది కుంగుబాటుకు లోనవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అత్యధిక సోషల్ మీడియా వేదికలు ఉపయోగించేవారు మూడు రెట్లు అధికంగా కుంగుబాటుకు లోనయ్యే ముప్పు ఉందని 2016లో జరిపిన ఒక పరిశోధన తేల్చింది. ఆన్‌లైన్ వేధింపులు (సైబర్ బుల్లీయింగ్) వంటివి ఇందుకు కారణమని ఆ అధ్యయనం చెబుతోంది. కుంగుబాటును గుర్తించి సత్వరమే చికిత్స అందేలా చూడటానికి సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై శాస్తవ్రేత్తలు దృష్టి పెట్టారు. మైక్రోసాఫ్ట్ పరిశోధకులు 476 మందికి చెందిన ట్విట్టర్ ప్రొఫైళ్లను విశే్లషించారు. భాష, శైలి, భావోద్వేగం తదితర అంశాలను పరిశీలించారు. పదింట ఏడు కేసుల్లో కుంగుబాటు లక్షణాలను ముందే గుర్తించవచ్చని ఫలితాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రజలు పడుకునే ముందు చివరిసారిగా చూసింది, నిద్రలేవగానే తొలుత వెతికేది స్మార్ట్ఫోన్లు, ట్యాబులు వంటి వాటినే.. ఎందుకంటే సోషల్ మీడియా వినియోగదార్లు రాత్రిళ్లు కూడా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో విహరిస్తుంటారు. ఈ పరికరాల నుంచి వెలువడే కాంతి వల్ల నిద్రనిచ్చే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. గత ఏడాది 18-30 ఏళ్ల వయసు గల 1700 మంది సోషల్ మీడియా అలవాట్లపై యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ పరిశోధించింది. నిద్రలేమిలో నీలికాంతి పాత్ర కూడా ఉందని వీరు నిర్ధారించారు. అయితే నిద్రలేమికి సోషల్ మీడియా కారణమవుతోందా? లేక కలత నిద్రపోయేవాళ్లు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారా? అనే విషయాలు ఈ పరిశోధనల్లో స్పష్టం కాలేదు.
సోషల్ మీడియా నేడు వ్యసనంగా మారుతోందా? అనే అంశంపై గతంలో నిర్వహించిన 43 అధ్యయనాలను నాటింగామ్ ట్రెంట్ యూనివర్శిటీకి చెందిన డారియా కస్‌మార్క్‌గ్రిఫిత్‌లు విశే్లషించారు. సోషల్ మీడియా వ్యసనం ఒక మానసిక ఆరోగ్య సమస్య అని, దానికి నిపుణుల చికిత్స అవసరం కావచ్చునని వారు నిర్ధారించారు. సోషల్ మీడియాలో అధిక సమయం గడపడానికి చదువులో రాణించలేకపోవడం, మానవ సంబంధాల్లో ఒడిదుడుకులు వంటివి కారణాలుగా వారు గుర్తించారు. అయితే సోషల్ మీడియా వ్యసనం ఇంకా మానసిక ఆరోగ్య జాబితాలో చేరలేదు.
సోషల్ మీడియా వేదికలపై ఎక్కువ సమయం గడిపేవారిలో చికాకు, ఈర్ష్య అధికంగా కనిపిస్తుంటాయని ఓ సర్వేలో తేలింది. ప్రధానంగా ఇతరులు తమ ప్రయాణాలకు సంబంధించిన ఫొటోలు పెట్టినప్పుడు ఈ భావాలు అధికంగా వ్యక్తమవుతున్నాయని సర్వేలో పాల్గొన్న 600 మంది చెప్పారు. అయితే.. సోషల్ మీడియా వల్ల ఏర్పడే ఈర్ష్య కొన్నిసార్లు మేలు కూడా చేస్తుందని మిచిగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఈ ఈర్ష్య కొందరిలో మరింత కష్టపడాలన్న కసి కూడా పెంచుతుందని వెల్లడించారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడిపేవారిలో ఒంటరితనం పెరుగుతోంది. 29 నుంచి 32 సంవత్సరాల వయసున్న 7,000 మందిపై అధ్యయనం నిర్వహించగా వారిలో సామాజిక అనుబంధాలు, బంధుత్వాల పట్ల అవగాహన కొరవడుతోందని తేలింది. సోషల్ మీడియాలో ఎక్కువగా సంభాషణలు జరపడం ద్వారా ముఖాముఖి పరిచయాలు తగ్గిపోతున్నాయి.
ఇంతకూ సోషల్ మీడియా మంచిదా? కాదా? అంటే చెప్పలేం.. దీని ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కో విధంగా ఉంటుందన్న మాట వాస్తవం. అది ఆయా వ్యక్తుల పరిస్థితి, వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో అతిగా గడపాలని సలహా ఎవ్వరూ ఇవ్వలేరు. అలాగని సోషల్ మీడియాతో పూర్తిగా చెడే జరుగుతుందని చెప్పడం కూడా పొరబాటే.. ఎందుకంటే దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.