మెయన్ ఫీచర్

ప్రియాంక ప్రతిష్టకు పెను సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంకా వాద్రా రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర నిర్వహిస్తారన్న విషయం తేటతెల్లమైంది. ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. ఒకప్పుడు నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారంటే పెద్ద చర్చ జరిగేది. అయితే, ఇపుడు ప్రియాంక రాజకీయ రంగప్రవేశంపై ప్రజలు ఆసక్తిని కనపరచడం లేదు. ఎవరైతే ఏంటి? మనకు ఒరిగిదేముందనే భావన నేటి యువతలో కనిపిస్తోంది. దేశం కంటే వ్యక్తిగత లాభనష్టాలతో జీవితాలను బేరీజు వేసుకుని బతకడం, వ్యక్తిగత ఆనందాన్ని ఇచ్చే సామాజిక మాధ్యమాల్లో యువత మునిగి తేలడం వల్ల- ‘రాజకీయాల్లోకి ప్రియాంక రావడం’ అన్నది ప్రసార మాధ్యమాలకే పరిమితమైంది.
గతంలో వలే ప్రస్తుతం ప్రజల్లో బానిస మనస్తత్వం లేదు. చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం గురించి పక్కనపెడితే, ప్రతిభ ప్రాతిపదికన రాజకీయాల్లోనూ రాణిస్తేనే మనుగడ ఉంటుంది. ప్రియాంక రాజకీయాల్లో వస్తే ఊరేగింపులు చేయాలా? అని యువత నిర్మోహమాటంగా ప్రశ్నించడం అభినందనీయమే. నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందినందున వారసత్వ రాజకీయాల్లోకి ఆమెకు అవకాశం వచ్చిందే తప్ప సహజంగా వచ్చిందా? అని ప్రశ్నించిన వారున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటే తప్ప- నాన్న రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ మాదిరిగా జనం బ్రహ్మరథం పట్టే అవకాశాలు లేవు.
నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 11వ వ్యక్తి ప్రియాంక. మోతీలాల్ నెహ్రూ, ఆయన కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, జవహర్‌లాల్ కుమార్తె ఇందిరా గాంధీ (ప్రధానమంత్రి), ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, ఇందిర కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ రాజకీయాల్లో పలు పదవులు నిర్వహించారు. రాజీవ్ మరణించాక కొనే్నళ్ల విరామం అనంతరం ఆయన భార్య సోనియా గాంధీ 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. సోనియా వారసుడిగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. సంజయ్ గాంధీ అకాలమరణంతో ఆయన భార్య మేనకాగాంధీ మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మేనక కుమారుడు వరుణ్‌గాంధీ బీజేపీ ఎంపీగా ఉన్నారు. దేశ రాజకీయాలను దాదాపు 120 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసిస్తూ వచ్చిన నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఇపుడు ప్రియాంక రాజకీయ భవిష్యత్తును దేశ ప్రజలు నిర్ణయిస్తారు.
తొలుత మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ మూడు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ 16 ఏళ్లపాటు, రాజీవ్ గాంధీ ఐదేళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. కాశ్మీరీ బ్రాహ్మణులైన ఈ కుటుంబం దేశ రాజకీయాలపై 20వ శతాబ్దం అంతా తనదైన ముద్ర వేసింది. 21వ శతాబ్దంలో కూడా తమ పట్టును సడలనివ్వకుండా రాజకీయాల్లో ఈ కుటుంబ సభ్యులు తమ ఆధిపత్యాన్ని రుజువు చేసుకున్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందంటే, అందుకు సోనియాగాంధీ రాజకీయ వ్యూహం, చతురత వల్లనేనని చెప్పాల్సిన పనిలేదు.
సంజయ్ గాంధీ అకాల మరణం, ఇందిరాగాంధీ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో పైలెట్‌గా ఉన్న రాజీవ్ గాంధీ అనూహ్య రీతిలో ప్రధానమంత్రి అయ్యారు. 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా రాజీవ్ అనేక సంస్కరణలు తెచ్చినా, దౌత్యం, చాణక్యనీతి లోపించడం వల్ల శ్రీలంక తమిళుల విషయంలో చేసిన తప్పు ఆయన ప్రాణాలనే బలిగొంది. రాజీవ్ గాంధీ తమిళ ఉగ్రవాదుల చేతిలో మరణించడంతో దాదాపు ఆ కుటుంబం రాజకీయాలకు పదేళ్ల పాటు దూరమైంది. కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకు రాజీవ్ భార్య సోనియా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, యూపీఏ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత తర్వాత రాహుల్ గాంధీ పార్టీ పదవులను చేపట్టారు.
మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు, తమతో పొత్తుకు నిరాకరిస్తున్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు తన చెల్లెలు ప్రియాంకను రాహుల్ రంగంలోకి దింపారు. ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రచారానికి బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంకను ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం పార్టీ ఇన్‌చార్జిగా రాహుల్ నియమించారు. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్‌లో ప్రధాన కార్యదర్శి పదవి అంటే సామాన్య విషయం కాదు. వారసత్వ రాజకీయాల వల్లనే ఆమెకు అంత ఉన్నత పదవి సునాయాసంగా లభించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవికి ప్రియాంక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తామనే సంకేతాలు కూడా రాహుల్ ఇచ్చారు. అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో తెలుస్తుంది. ఇప్పటికే యూపీలో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తు ఖరారైంది. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణులు 14 శాతం మంది ఉన్నారు. వీరితో పాటు ఠాకూర్లు, రాజపుత్రులు,వైశ్యులు, ఇతర అగ్ర వర్ణాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడేవి. ఈ ఓట్లు బీఎస్పీ, ఎస్పీలకు పడవు. ‘మా ఓట్లు మీకు బదలాయింపు అవుతున్నాయి, కానీ మీ ఓట్లు మాకు రావడం లేదం’టూ ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో పొత్తుకు గుడ్ బై చెప్పారు. ప్రియాంక వల్ల కాంగ్రెస్‌కు గత వైభవం వస్తుందా? లేదా?? అనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్షే. పార్టీని బలోపేతం చేయడం, ఇతర పార్టీలకు తరలివెళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవడం లాంటి పనులను జయప్రదంగా ప్రియాంక నిర్వహిస్తారా? అన్నది తేలాలి.
ప్రియాంక ముఖ కవళికలు ఇందిరా గాంధీతో పోలి ఉన్నాయని కొంత మంది కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. ఇటువంటి కాకమ్మ కబుర్లకు కాలం చెల్లింది. ఈ తరహా కాలదోషం పట్టిన సిద్ధాంతాలతో చేసే ప్రచారాలను నమ్మే స్థితిలో జనం లేరు.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో వారసత్వ రాజకీయాలను ప్రజలు ఆదరించే ధోరణి క్రమేపీ తగ్గుతుంది. ఈ దేశాల్లో ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. ఈ తరహా పాచికలను నమ్మి జనం ఓట్లు వేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. బీజేపీని నిలువరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పడంలో సందేహానికి తావులేదు. ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని వారికి చేరువయ్యే ప్రయత్నాలు చేయడం వల్ల కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉంటుంది. రాహుల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద పొరపాటు చేసింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కేంద్రమంత్రిగా రాహుల్ గాంధీ పదవీ బాధ్యతలను చేపట్టి ఉంటే కొంత అనుభవం వచ్చి ఉండేది. ఇందిరా గాంధీ లాల్ బహదూర్ శాస్ర్తీ మంత్రివర్గంలో పనిచేసి రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. రాజకీయాలంటే ఇష్టపడని రాజీవ్ గాంధీ ఎకాఎకిన దేశ ప్రధాని అయ్యారు. కొన్ని విషయాల్లో అనుభవ రాహిత్యం వల్ల ఏమి జరిగిందో అందిరికీ తెలిసిందే.
పీవీ నరసింహారావు, వాజపేయి, మన్మోహన్‌సింగ్ లాంటి అగ్రశ్రేణి నేతలు ప్రధానిగా రాణించారంటే వారు అంతకుముందు పరిపాలనలో కీలకమైన పదవులు నిర్వహించారు. పీవీ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ పదవులు నిర్వహించి చివరకు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలోనే ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌సింగ్ ప్రధాని అయ్యారంటే ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. అటల్ బిహారీ వాజపేయి జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. సుదీర్ఘ రాజకీయానుభవం తర్వాత ప్రధాని అయ్యారు. దేవెగౌడ కూడా మంత్రిగా, కర్నాటక సీఎంగా పనిచేసిన తర్వాతనే ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు పనిచేశారు. ఈ అనుభవాలను చూసైనా రాహుల్, ప్రియాంకలు రాజకీయంగా పాఠాలు నేర్చుకోవాలి. నెహ్రూ- గాంథీ కుటుంబంలో పుట్టిన వారు ప్రధానమంత్రి పదవి తప్ప మరో పదవి చేపట్టరనే సెంటిమెంట్లు పనిచేయవు.
వారసత్వ రాజకీయాలపై విమర్శలను పక్కనపెడితే, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీని వల్ల పరిపాలనాపరంగా అనుభవం వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన కుమారుడికి తొలి ఐదేళ్లు మంత్రిగా అవకాశం కల్పించారు. రెండవసారి గెలిచిన తర్వాత పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీలో,ప్రభుత్వంలో పనిచేయకుండా ఒకేసారి అత్యున్నత పదవిని చేపడితే వ్యక్తిగతంగా కంటే, దేశానికి చేకూరే నష్టం ఎక్కువ. వందిమాగధులు, భజనపరులు, అవాస్తవాలను వాస్తవాలుగా చూపేవారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరుతారు. నేడు రాజకీయాల్లో వ్యక్తి ఆరాధాన సంస్కృతిని ప్రజలు ఇష్టపడడం లేదు. స్వయం కృషితో పైకి వచ్చిన చంద్రబాబు, కేసీఆర్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, నితీష్ కుమార్, షీలా దీక్షిత్, యోగి ఆదిత్యనాథ్ దాస్, శివరాజ్ సింగ్ చౌహాన్, అశోక్ గెహ్లాట్ లాంటి నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒక మోడల్‌గా తీసుకోవాలి. ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దానంతట అదే వస్తుందనే పగటి కలలు, భ్రమల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బయటపడడం మంచిది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097