మెయిన్ ఫీచర్

శత దళ పరిమళ సంగీత సుమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారతదేశంలో కర్నాటక శాస్ర్తియ సంగీత సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ సంగీత సంపదను తరతరాలకు అందిస్తున్న మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల శతజయంతి వేడుకలను జరుపుకుంటుంది. 1919 ఫిబ్రవరిలో పూసపాటి విజయరామ గజపతిరాజు చేతులమీదుగా నెలకొల్పిన ‘విజయరామ గాన పాఠశాల’ అంచెలంచెలుగా ఎదిగి అలక్ నారాయణ గజపతిరాజు హయాంలో కళాశాలగా మార్పు చెందింది. దక్షిణ భారతదేశంలోనే తొలి సంగీత, నృత్య కళాశాలగా పేరుగాంచిన ఈ పాఠశాలను కేవలం ఒక అంధ విద్యార్థి కోసం నెలకొల్పారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆనాడు పూసపాటి విజయరామ గజపతిరాజు తన స్నేహితుడు చాగంటి గంగరాజు కుమారుడు చాగంటి జోగరావు కోసం ఈ పాఠశాలను నెలకొల్పారు. జోగారావు పుట్టుకతో అంధుడు కావడంతో ఆయనకు సంగీతం పట్ల మక్కువ ఉండటాన్ని తండ్రి గంగరాజు గుర్తించి తన స్నేహితుడైన మహారాజు విజయరామరాజును వేడుకోగా అప్పట్లో టౌన్‌హాలుగా ఉన్న దీనిని గాన పాఠశాలగా మార్పు చేశారు.
గురువులను మించిన శిష్యులు
విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో ఓనమాలు దిద్దిన ఎందరో మహానుభావులు సంగీత ప్రపంచంలో దేశ, విదేశాల్లో కీర్తి శిఖరాలను అందుకున్నారు. ఈ కళాశాలలో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, ప్రముఖ గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు, ప్రముఖ గాయని పి. సుశీల, ప్రముఖ దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, బి.ఎ. నారాయణ, పవన్, సంతోష్, సాయికుమార్ వంటి వారెందరో ఈ కళాశాలలో విద్య నేర్చుకుని దేశ విదేశాల్లో విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేసారు. ఈ కళాశాల ఎందరో సినీ సంగీత దర్శకులను, గాయకులకు బతుకునిచ్చింది. సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఘంటసాల వెంకటేశ్వరరావు, గాన సరస్వతి పులపాక సుశీల (పి. సుశీల)వంటి ఉద్ధండులు ఈ నేలపై నడిచినవారే. ద్వారం వెంకటస్వామినాయుడు వద్ద శిష్యరికం చేసిన సుశీల 1950 నుంచి 1990 వరకు ఆరు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాలం, బెంగాళీ, ఒడిషా, సంస్కృతం, తులు, బడగ, సింహళీ భాషలలో 50వేలకు పైగా గీతాలను ఆలపించారు. 2004లో కన్నడ ప్రభుత్వంచే గాన సరస్వతి అవార్డు, 2008లో భారత్ ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ప్రముఖ కర్ణాటక విద్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నూకల చిన సత్యనారాయణ వంటి వారెందరో ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారే.
ఉద్దండులైన ప్రధానాపోచార్యులు
ఇదిలా ఉండగా ఈ కళాశాలకు ప్రధానాపోచార్యులుగా పనిచేసిన ఉద్దండులెందరో ఉన్నారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు భూపాలరాగం పాడితే నిద్రపోయే పక్షులు కూడా మేల్కొంటాయని ప్రతీతి. ఆటపాటల మేటిగా, పుంభావ సరస్వతిగా, సర్వకళావిదుడిగా విశిష్టఖ్యాతినార్జించిన ఆదిభట్ల నారాయణదాసు ఆజన్మ ప్రతిభాసిద్ధుడు. హరికథా పితామహుడైన ఆయన 1864 ఆగస్టు 31న బలిజపేట మండలం అజ్జాడలో జన్మించారు. పుట్టింది అజ్జాడలోనైనా కలం పట్టింది, కాలికి గజ్జెకట్టింది, హరికథా ప్రక్రియ వికాసానికి విశేష కృషి చేసింది విజయనగరంలోనే.. ఈ గాన పాఠశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్‌గా 1919లో బాధ్యతలు చేపట్టిన ఆయన 1936 వరకు కొనసాగారు. ఆ తరువాత ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ప్రొఫెసర్ ద్వారం వెంకటస్వామినాయుడు 1936-1953 వరకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఆయన 26 ఏళ్ల ప్రాయంలోనే ఈ కళాశాలకు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే ఈ గాన పాఠశాలను ‘శ్రీ విజయరామ సంగీత - నృత్య కళాశాల’గా మార్పు చేశారు. ఆయన 1941లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి, 1950లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, 1953లో సంగీత నాటక అకాడమీ, 1967లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
ఆ తరువాత ద్వారం నరసింగరావు 1953-60 వరకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన కుమారుడు ద్వారం భావనారాయణరావు 1962-73 వరకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదును పొందారు. ఈయన మద్రాసు మ్యూజిక్ అకాడమికి సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి 1977-79 వరకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఈయన 1940లో ఇదే కళాశాలలో ద్వారం నరసింగరావునాయుడు వద్ద వయోలిన్, గాత్రం నేర్చుకున్నారు. ఈయన 54 సంస్థల నుంచి అవార్డులను కైవశం చేసుకున్నారు. 1976లో చెన్నైకి చెందిన శ్రీకృష్ణ గాన సభ నుంచి సంగీత చూడామణి బిరుదును పొందారు. 1986లో సంగీత నాటక అకడమీ అవార్డు బిరుదాంకితులయ్యారు.
ఈయన విజయ నగరంతోపాటు తిరుపతి ఎస్వీ సంగీత కళాశాల, సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, విజయవాడలోని జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. టి.టి.డి. రూపొందించిన అన్నమాచార్య కీర్తనలకు ఈయన సంగీతాన్ని అందించారు. ఈయన టి.టి.డి. ఆస్థాన్ విద్వాన్‌గాను, కంచికామకోటి పీఠం ఆస్థాన్ విద్వాన్‌గా పనిచేశారు.
శ్రీరంగం గోపాలరత్నం 1979-80 వరకు పనిచేశారు. ఈమె కూచిపూడి, యక్షగానం, జవేలి, ఎంకిపాటలులో ప్రసిద్ధి చెందారు. ఈమె చిన్ననాటి నుంచే హరికథాగానం చేస్తుండేది. మధురగాయనిగా పేరుగాంచారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈమె 1992లో రాష్టప్రతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ద్వారం దుర్గాప్రసాదరావు 1982-2000 వరకు, పి.వి.ఎస్. శేషయ్యశాస్ర్తీ 2000-2006 వరకు పనిచేశారు. ఆ తరువాత బురిడి అనురాధ పరశురాం 2007 నుంచి ఇప్పటి వరకు ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
ఏడు రకాల కోర్సులు
ఈ కళాశాల 1955 ఆగస్టు 15న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ
విద్యాలయానికి అనుబంధంగా చేర్చారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా తెలుగు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలు నిర్వహించడంతో పాటు రెండేళ్ల డిప్లమో, నాలుగేళ్ల సర్ట్ఫికేట్ కోర్సులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కళాశాలలో గాత్రం, భరతనాట్యం, వయోలిన్, వీణా, మృదంగం, నాదస్వరం, డోలు కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కళశాలలో 450 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు
ఆదిభట్ల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఈ కళాశాలలో హరికథావిభాగం లేకపోవడం శోచనీయం. 1936నుండి 1953వరకు ద్వారం వెంకటస్వామినాయుడు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ కళాశాలలో హరికథ, చిత్రలేఖనం, నటన విభాగాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఆ ప్రతిపాదనకు మోక్షం లభించలేదు.
అలనాటి వైభవం ఏది?
శాస్ర్తియ సంగీతంలో ప్రఖ్యాతి చెందాలన్న తపన విద్యార్థుల్లో కరువవుతుంది. ప్రతి ఒక్కరూ డాక్టర్ కావాలనో, ఇంజనీరు కావాలనో ఆలోచించడం వల్ల ఎక్కువ మంది వాటిపై దృష్టి సారిస్తున్నారు. చదువులు, ర్యాంకులు కోసం ఆరాటమే తప్ప, కళలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో నేడు బిజీలైఫ్‌లో మహిళలు కూడా బతుకు బండిని ఈడ్చడానికి పరుగులు తీయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అందువల్లనే పెళ్లిళ్లలో ఒకప్పుడు మీ అమ్మాయి పాటలు పాడగలదా? నాట్యం చేయగలదా? అని ప్రశ్నించే ధోరణి నుంచి ఇపుడు మీ అమ్మాయి ఎంత వరకు చదువుకుంది? నెలకు ఎంత సంపాదిస్తుందని ప్రశ్నించే మగపెళ్లివారు తయారయ్యారు. దీంతో మహిళల ఆలోచనాధోరణిలో కూడా మార్పు వచ్చింది. అందువల్లనే సంగీతం నేర్చుకుంటే తిండి పెట్టదని, అదే ఏ కంప్యూటరో, ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సు చేసుకుంటే ఎంచక్కా నెలకు లక్షలాది రూపాయలు ఆదాయం సంపాదించవచ్చనే భావన అందరిలో నెలకొంది. దీంతో మహిళలు కూడా ఆదాయం వైపు పరుగులు తీస్తున్నారే తప్పా, మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని కలిగించే కళల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
ఉమ్మడి కుటుంబాలుగా కలసిమెలసి ఉన్న రోజుల్లో ప్రతీ ఇంట్లో ఒకరో, ఇద్దరో మహిళలు సంగీతం, నృత్యం నేర్చుకునేవారు. అప్పట్లో కాలక్షేపానికి సంగీతం, నృత్యం మినహా వేరొక సాధనం ఉండేది కాదు. అందువల్లనే విద్యార్థులు కూడా ఏకాగ్రతతో విద్యను అభ్యాసించి ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆ తరువాత కొంత కాలం వీటిపట్ల ఆసక్తి తగ్గినప్పటికీ, శంకరాభరణం సినిమా విడుదలైన తరువాత వీణ పట్ల ఎక్కువ మంది మహిళలు మొగ్గు చూపారు. ఆ తరువాత ఆ కోర్సుకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఆ తరువాత ఇటీవల కొంత కాలంగా ఆ కోర్సులపై మక్కువ తగ్గింది. అయితే కేవలం శాస్ర్తియ సంగీతం, నృత్యం, వయోలిన్, నాధస్వరం, డోలు, గాత్రం, మృదంగం వంటి అనేక అంశాలను బోధిస్తున్న విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో అంకితభావం గల విద్యార్థులను తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నారు.
ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్‌లో కళలు కేవలం చెప్పుకోడానికే తప్ప వాటిని ఆలకించే అదృష్టం కరువయ్యే ప్రమాదం ఉంది. సంగీతం, నృత్యం వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. కేవలం వాటిని తిలకిస్తూ ఆనందం పొందడం మినహా, ఆయా రంగాల్లో ప్రావీణ్యం సంపాదించడానికి ఆసక్తి కనబరచడం లేదు. కర్ణాటక శాస్ర్తియ సంగీతం, వీణా, భరతనాట్యం, నాధస్వరం, వయోలిన్ వంటి విద్యను అందించే పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కేవలం మొక్కుబడిగానే జరుగుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లోనే ఉన్న సమయమంతా వెచ్చిస్తున్నారు. ఉన్న కొద్ది మంది విద్యార్థినులు తీరిగ్గా ఉన్న సమయంలో సంగీతం, నృత్యం నేర్చుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. అలా రోజుకి ఏ గంట సేపో సాధన చేస్తే వచ్చే విద్య కాదు. అందువల్లనే సంగీతం, నాట్యం వంటి అంశాల్లో అంకితభావం గల విద్యార్థులను తీర్చిదిద్దడంలో నేటి గురువులు విఫలమవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వయోజన విద్యలాగే సంగీతం మారిపోయే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
వైభవంగా ఉత్సవాలు
మహారాజా ప్రభుత్వ సంగీత - నృత్య కళాశాల వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, మంత్రి అఖిలప్రియ, ఎంపీ అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ , భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ విజయభాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఉత్సవం మొదటి రోజున ఆరు వేల మంది విద్యార్థులతో శకట ప్రదర్శన ఉంటుంది. గాత్రం, వీణా, వయోలిన్, మృదంగం, నాధస్వరం, డోలు, భరతనాట్యం, హరికథ శకటాలతో ప్రదర్శించనున్నారు. తొలిరోజున మాండలిన్ విద్వాంసురాలు యుపి రాజు, నాగమణితో కచేరి ఉంటుంది. అదే రోజున హరికథా భాగవతార్ కోట సచ్చిదానంద శాస్ర్తీకి హరికథా పితామహుడు ఆదిభట్ల పురస్కారాన్ని అందజేయనున్నారు.
రెండో రోజున తనికెళ్ల భరణి, గొల్లపూడి మారుతీరావులతో చర్చాగోష్టి నిర్వహిస్తారు. సంగీత విద్వాంసులు కమలాకరరావు, అన్నవరపు రామస్వామి, కొమండూరి శేషాద్రి, పి.వి.ఎస్. శేషయశాస్ర్తీ, ద్వారం లక్ష్మి, ద్వారం దుర్గాప్రసాద్ తదితరులతో సంగీతం భావితరాలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై ప్రసంగిస్తారు. ద్వారం వెంకటస్వామినాయుడు పేరిట శతజయంతి పురస్కారాన్ని ద్వారం మంగతాయార్‌కు అందజేయనున్నారు. శాస్ర్తియ కర్ణాటక సంగీతాన్ని ప్రియా సిస్టర్స్ ఆలపించనున్నారు. ఉత్సవాల చివరి రోజున ప్రముఖ గాయని పి. సుశీల ఉత్సవాలలో పాల్గొని ఆహుతులను కనువిందు చేయనున్నారు. ప్రముఖ నటి మంజుభార్గవి నృత్యం ప్రదర్శించనున్నారు. చివరి రోజున పి. సుశీలకు, ఘంటసాల రత్నకుమార్ (చెన్నై) అతిథుల చేతుల మీదుగా శతజయంతి పురస్కారాలను అందజేయనున్నారు.

భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా..
భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న జిల్లా యంత్రాంగం, మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అఖిల ప్రియ, డైరెక్టర్ విజయభాస్కర్ తదితరులు సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాము.
- బి. అనురాధ పరశురాం ప్రిన్సిపాల్, మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల

లోగో స్ఫూర్తిదాయకం
మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల వందేళ్ల ఉత్సవాలకు లోగోను రూపొందించడం ఆనందంగా ఉంది. రాజావారు కళాశాల స్థాపించినపుడు ఏ వైభవం జరిగిందో చూడలేదు గాని.. ఇపుడు శతజయంతి ఉత్సవాలలో కీలక భూమిక వ్యవహరించడం ఆనందంగా ఉంది. ఇటువంటి మహాత్తర ఘట్టంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఉత్సవాలకు లోగోను రూపొందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. లోగోలో విజయరామరాజు ఫొటొతోపాటు ఇప్పటి వరకు పనిచేసిన ప్రిన్సిపాళ్ల ఫొటోలు, ఉద్దండుల ఫొటోలను లోగోలో పొందుపరిచాము.
- బూరాడ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి, పూర్వ విద్యార్థి సంఘం

కళాశాల ప్రతిష్టకు కృషి
ఆనాటి పూర్వ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయడం ఆనందాన్నిచ్చింది. కళాశాలను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, యంత్రాంగం సహకారం అందించడం ఆనందాన్నిచ్చింది. భవిష్యత్ తరాల విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు చేయగలిగితే విద్యార్థులు అంకితభావంతో విద్యను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవాల ద్వారా కళాశాల ప్రతిష్ట మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము.
-బి.ఎ. నారాయణ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు

- బొండా రామకృష్ణ