మెయన్ ఫీచర్

పోరాట యోధుడు ఫెర్నాండెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో మంగళూరులో కాథలిక్ క్రైస్తవ కుటుం బంలో పుట్టి, క్రైస్తవ ఫాదర్ కావాలని ఆయన భావించాడు. నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నిధులను సేకరించే నేతగా, ముంబైలో తిరుగులేని నాయకుడిగా పేరొందిన ఎస్కే పాటిల్‌ను 1967 ఎన్నికల్లో ఓడించి జాతీయ స్థాయిలో ఆయన సంచలనం సృష్టించాడు. అతనే విలక్షణమైన రాజకీయ నేత- జార్జి ఫెర్నాండెజ్. ఒక ఆటో డ్రైవర్‌ను, రైల్వే కార్మికుడిని ఎంతగా ఆదరిస్తారో ఒక ప్రధాన మంత్రితో అదే విధంగా ఉండటం, రక్షణ మంత్రిగా ఉంటూ ఇంటివద్ద ఎటువంటి రక్షణ అవసరం లేదనడం ఆయనకే చెల్లింది. తన ఇంటికి ఎవరైనా ఎటువంటి అడ్డు లేకుండా రాగలగడం, పార్లమెంట్‌కు నడుచుకొంటూ వెళ్లడం, ఇస్ర్తీ కూడా చేయని దుస్తులతో అతి సాధారణంగా కేంద్ర మంత్రిగా తిరగడం... ఇటువంటి మరో నాయకుడిని భారత దేశంలో మనం మరలా చూస్తామని ఊహించలేం.
నిత్యం దేశం కోసం, ప్రజల కోసం, అన్యాయాలకు గురుతున్న వర్గాల కోసం ఆరాటపడే ఇటువంటి నేత మరొకరు మళ్లీ మనకు తారసపడే అవకాశం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఫెర్నాండెజ్ మృతితో భారత దేశం చిట్ట చివరి జాతీయ నాయకుడిని కోల్పోయింది. ఓట్ల కోసం, పదవుల కోసం రకరకాల నాటకాలు ఆడే నాయకులను మనం నేడు చూస్తున్నాం. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు వారే నేతృత్వం వహిస్తున్నారు.
జార్జి అంటేనే ఒక అగ్ని పర్వతం. రాజకీయ ప్ర త్యర్థులపై ఆయన ఎక్కుపెట్టే మాటల తూటాలు, ప్రదర్శించే రాజీలేని వైఖరి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గాలకు అందించే ఆపన్న హస్తం, వారి పక్షాన ఎటువంటి సంకోచం లేకుండా నిలబడ గలగడం, కల్మషం లేని ధోరణి, ఎటువంటి అహంకారం ప్రరర్శించని మానవీయత వంటి లక్షణాలు మనం మరో నేతలో చూడలేం. సిద్ధాంతపరంగానే కాకుండా నిజమైన సామ్యవాదిగా ఫెర్నాండెజ్ జీవించారు. లక్షలాదిమంది యువకులకు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తి కేంద్రంగా నిలిచారు. వారి జీవితాలలో ఉన్నతమైన ఆదర్శ జ్యోతులను వెలిగించారు. వారి పక్షాన నిలబడ్డారు. తన సొంత మనుషులైనా సరే అవకాశవాదం ప్రదర్శిస్తున్నారని మరెవరైనా చెబితే వెంటనే ఆవేశంతో ఆయన స్పందించే వారు. తన వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసేవారు. అవిశ్రాంత పోరాట యోధుడు. కేంద్రంలో రక్షణ, రైల్వేలు, పరిశ్రమలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించినా ఆయనలో అధికారం ఎన్నడూ అహంకారాన్ని నింపలేదు. ఉన్నత పదవులలో సైతం సాధారణ ప్రజల గురించే తపన చెందేవారు. దేశంలో కార్మిక ఉద్యమం అంటే వామపక్షాలదే గుత్త్ధాపత్యం అనుకొంటున్న సమయంలో ముంబ యిలో వారి కంచుకోటలను బద్దలు చేసి సోషలిస్ట్ కార్మిక సంఘాలను మేటిగా బలోపేతం చేశారు. ఆ ప్రభావం ఇంకా ముంబై ప్రాంతంలో కొనసాగుతున్నది.
1930 జూన్ 3న మంగళూరులో క్యాథలిక్ కుటుం బంలో పుట్టిన ఫెర్నాండెజ్ చదువును మధ్యలోనే ఆపేసి, 16 ఏళ్ళ వయస్సులో ప్రీస్ట్‌గా శిక్షణ పొందారు. 1949లో ముంబాయికి చేరుకొని సోషలిస్ట్ కార్మిక సంఘాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఆవేశంగా ప్రసం గాలు చేయడంలో పేరొందిన ఆయన నాయకత్వంలో కార్మికులు అనేక సమ్మెలు, పోరాటాలు జరిపారు. 1950వ, 1960వ దశకాలలో భారతీయ రైల్వేలో పనిచేస్తూ ఎన్నో బంద్‌లు, సమ్మెలు జరిపారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా 1974లో ఆయన జరిపిన రైల్వే సమ్మె చారిత్రాత్మకమైనది. ఈ సమ్మెను పాశవికంగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ అణచి వేశారు. సుమారు 30 వేలమంది కార్మికులను అరెస్ట్ చేశారు. కార్మికుల ఉద్యమం పట్ల బ్రిటిష్ కాలంలో సహితం ఇంత దారుణంగా పాలకులు వ్యవహ రించ లేదు. 1975లో అత్య వసర పరిస్థితి విధిం చడానికి ఈ సమ్మెను ఒక కారణంగా ఇందిరాగాంధీ చూపారు.
అత్యవసర పరిస్థితి సమ యంలో జార్జ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసాధారణమైనవి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్త పోరాటానికి సన్నాహాలు జరిపారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా అంత ర్జాతీయంగా మద్దతు కూడదీయడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఆయనను అరెస్ట్ చేయడం కోసం నాటి ప్రభుత్వం ఆయన సన్నిహితులు, బంధువుల పట్ల దారుణంగా వ్యవహరించింది. అరెస్ట్ చేసి జైలులో చిత్ర హింసలకు గురి చేయడంతో నటి స్నేహలత రెడ్డి మృతి చెందింది. ఆయన సోదరుడిని కూడా బెంగుళూరులో తీవ్రమైన చిత్ర హింసలకు గురిచేశారు. 1976లో ఫెర్నాండెజ్‌ను అరెస్ట్ చేసి,బరోడా డైనమైట్ కేసు పెట్టి విచారణ జరిపారు. ఆయన సన్నిహితులను కూడా ఈ కుట్ర కేసులో నిందితులుగా చేర్చారు. 1977లో అత్యవసర పరిస్థితిని తొలగించిన అనంతరం జరిగిన ఎన్నికలలో బిహార్ లోని ముజఫర్‌పూర్ నుండి- జైలులో ఉంటూనే 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తులు ముఖ్యంగా సోషలిస్టులు, భాజపా వారు కలసి పనిచేసేందుకు ఆయన ఎంతో శ్రమించారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీల పాత్ర వహించారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా ఉంటూ ప్రముఖ బహుళజాతి కంపెనీలు అయిన ఐబీఎం, కోకాకోలా కంపెనీలను నిబంధనలు అతిక్రమిస్తున్నాయని అంటూ దేశం వదిలి వెళ్లిపొమ్మని ఆదేశించారు. తాను స్వదేశీ అని గర్వంగా చెప్పుకున్న మొదటి కేంద్ర మంత్రి కావడమే కాకుండా, ఆ దిశలో పలు చర్యలు తీసుకున్నారు. ఆనాడు ఐబీఎం ను దేశం నుండి పంపి వేయడం వల్లనే- తర్వాతి కాలంలో మనం ఐటిలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. అణు, అంతరిక్ష రంగాలలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడింది. వీపీ సింగ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా ఉంటూ స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం రైల్వే స్టేషన్‌లలో టీని కుండ కప్పులలో విక్రయించేటట్లు చేశారు. ముంబ యి-మంగళూరులను కలుపుతూ కొంకణ్ రైల్వే మార్గం ఏర్పాటు చేయడానికి ప్రధాన సూత్రధారిగా నిలిచారు. జనతాదళ్ నుండి వైదొలిగి సమతా పార్టీ స్థాపించి, భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. వాజపేయి మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా ఉంటూ కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ వద్ద అణు ప్రయోగం వంటి వ్యవహారాలలో కీలక పాత్ర వహించారు. దేశ సరి హద్దులలో సైనిక శిబిరాలకు వెళ్లి, వారి పరిస్థితులను మెరుగు పరచేందుకు ప్రయత్నం చేసిన మొదటి రక్షణ మంత్రిగా కూడా పేరొందారు.
అయితే, ఫెర్నాండెజ్ పలు వివాదాల్లోనూ ఉన్నారు. ఇతర సోషలిస్ట్ నాయకుల వలే మేధోపర చర్చలకు పరిమితం కాకుండా, నిత్యం సాధారణ ప్రజలతో మెలిగేవారు. వారి పరిస్థితులను మెరుగు పరచేందుకు తన వంతు కృషి చేసేవారు. పలు శిక్షణ సంస్థలు, పత్రికలు నెలకొల్పారు. వాజపేయి మంత్రివర్గంలో ఉండగా బరాక్ మిస్సైల్ వివాదం, శవపేటికల కొనుగోలు వివాదం, తెహెల్కా వ్యవహారం ఆయనపై ఆరోపణలు వచ్చాయ. అప్పుడు వాజపేయి ఆయనకు అండగా నిలబడ్డారు.
వాజపేయి ప్రభుత్వానికి రాజకీయంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా, సంక్షోభాలు ఎదురైనా వాటి పరిష్కారం కోసం ఫెర్నాండెజ్ ముందుండేవారు. నాడు బీజేపీలో ఎల్‌కె అద్వానీ వంటి వారు వాజపేయి బలహీనుడైతే ప్రధాన పదవి అలంకరించాలని కాచుకొని ఉండేవారు. 1979లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వమైన- మొరార్జీ దేశం సర్కారు పడిపోవడానికి తాను కార కుడయ్యానన్న ఆవేదన ఫెర్నాండెజ్‌ను జీవితాంతం వెంటాడింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో దానిని వ్యతిరేకిస్తూ గంటకు పైగా ఆవేశంగా ప్రసంగించిన ఆయన ఆ మరుసటి రోజుకల్లా ప్రభుత్వం నుండి వైదొలిగారు. దాంతో చాలామంది ఆయనను తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కూల్చిన విద్రోహిగా నిందించారు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి రాగలగడానికి తానే కారణం అని అయన సన్నిహితుల వద్ద ఎంతగానో కుమి లిపోయారు. చిరకాలంగా సోషలిస్ట్ ఉద్యమంలో కలసి ఉంటున్న మధు లిమాయే, రాజనారాయణ్, మధు దండావతే, సురేంద్రమోహన్ వంటి సోషలిస్ట్ నేతలంతా కలసి తమతో జనతా పార్టీ నుండి వచ్చి చరణ్‌సింగ్ కు మద్దతు తెలుపమని వత్తిడి తేవడంతో అన్యమనస్కంగానే సోషలిస్ట్ సహచరుల కోసం వచ్చారు. దశాబ్దాలుగా రాజకీయంగా సహజీవనం జరుపుతున్న సోషలిస్ట్ లను కాదనలేక పోయారు. ఆయనలోని ఆ సంశయమే తర్వాత భారత దేశ చరిత్రను మార్చివేసింది.
అటువంటి పొరపాటు మరోసారి జరుగకుండా ఉండేం దుకు వాజపేయ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రికి అన్ని విపత్కర పరిస్థితులలో మద్దతుదారుడిగా జార్జి ఉన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, సహచరులు ఎంతమంది వత్తిడి చేసినా తన కారణంగా మరో కాంగ్రెసేతర ప్రభుత్వం పడిపోరాదని పట్టుదలతో నిలబడ్డారు. ఆయనలోని ఆ పట్టుదల నాటి వాజపేయి ప్రభుత్వానికి పెట్టని కోటగా ఉన్నా, అనేకమంది మాత్రం పదవని వదులుకొని ఫెర్నాండెజ్ రాలేక పోతున్నారని అపోహలకు గురయ్యారు.
పొరుగు దేశాలలో కూడా స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం జరిగే పోరాటాలకు మద్దతు ప్రకటించి, అండగా ఉంటూ ఉండేవారు. శ్రీలంకలో తమిళులు, టిబెట్‌లో బౌద్ధులు, మయన్మార్‌లో సైనిక పాలకులకు వ్యతిరేకంగా జరు గుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలకి మద్దతు ఇచ్చారు. చివరకు ఇరాన్ లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యువకులకు ఢిల్లీలో ఆయనే రక్షణ కల్పించేవారు. సంఘీభావం తెలుపుతూ ఉండేవారు. చిన్నప్పటి నుండే పీడనకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు. జార్జిని న్యాయవాదిగా చేయాలని తండ్రి అనుకొన్నారు. అయితే మెట్రిక్ తోనే చదువును ఆపివేసి ప్రీస్ట్ గా శిక్షణ కోసం వెళ్లారు. అందుకు కారణం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నన్ను న్యాయవాదిగా చేసి తన కేసులను వాదించాలని మా నాన్న అనుకున్నారు. అయితే, ఆయన బాకీల వసూలు కోసం భూముల నుండి రైతులను బలవంతంగా తొలగించడం చూస్తూ ఉండే వాడిని. అటువంటి దౌర్జన్యాలకు మద్దతుగా ఉండ దలచుకోలేదు.. అని చెప్పారు. రెండున్నరేళ్ల పాటు బెంగళూరులోని సెయింట్ పీటర్స్ సేమినారి లో రోమన్ కాథలిక్ ప్రీస్ట్ గా శిక్షణ పొందినా అక్కడ కూడా బోధనలకు, ఆచరణలు సంబంధం లేదని తెలుసుకొని విరక్తి చెందారు. రెక్టార్లు ఎత్తుగా ఉండే టేబుల్ పై కూర్చొని మిగిలిన వారికన్నా మెరుగైన భోజనం చేస్తూ ఉంటే సహించలేక పోయేవారు. 19 ఏళ్ల వయసు నుండి ముంబైలో రోడ్డు రవాణా, హోటళ్లు, రెస్టారెంట్‌లలో కార్మికులను సంఘటిత పరచి, కార్మిక సంఘాలను ఏర్పా టు చేయడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రా రంభించారు.
ప్రజాజీవనంలో నిజాయతీకి మారుపేరుగా ఉండేవారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉండేవారు. సహచరులైనా, అనుచరులైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేవారు కాదు. జార్జి నిష్కళంకమైన దేశ భక్షుడు. ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడంతోనే జీవితంలో ఎక్కువ కాలం గడిపారు.

-చలసాని నరేంద్ర