ఎడిట్ పేజీ

కర్నాటకలో మళ్లీ కురుక్షేత్రం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారత యుద్ధం ఫలితంగా పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం నశించిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ద్రౌపదీ వస్త్రాపహరణ ఉదంతం. నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపది పాలిట చేసిన దుర్మార్గం. ఇలాంటి సంఘటనలు ఆధునిక భారతంలో కూడా జరిగాయి. తమిళనాడు శాసనసభలో గతంలో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను డీఎంకే పార్టీ వారు వస్త్రాపహరణం చేశారు. ఫలితంగా డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జైలులో చిప్పకూడు తినవలసి వచ్చింది. తాజాగా మైసూరులోని కరుణివద్ద ఒక బహిరంగ సభలో అలాంటి ‘దుశ్శాసన పర్వం’ చోటు చేసుకొంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతుండగా సభలో జమలార్ అనే మహిళ లేచి తమ నియోజకవర్గంలోని సమస్యలను చెప్పడానికి ప్రయత్నించింది. సిద్ధరామయ్య కొడుడు యతీంద్ర ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏడు నెలలుగా ప్రజలకు యతీంద్ర కనపడటం లేదని ఆమె బల్లగుద్ది చెప్పింది. దాంతో సిద్ధరామయ్య ఆగ్రహోదగ్రుడై ఆ మహిళపై చేయి చేసుకొని ఆమె బట్టలను పట్టి గుంజి ద్రౌపదీ వస్త్రాపహరణ సన్నివేశాన్ని ప్రదర్శించాడు.
కర్నాటక ప్రశాంతమైన రాష్ట్రం. బసవన్న పెజావరు విశే్వశ్వరతీర్థ వంటి మహనీయుల బోధనలతో ఆ ప్రాంతం పునీతమైంది. అలాంటప్పుడు ఈ భ్రష్ట సంస్కృతి రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించింది? జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ సిద్ధరామయ్య మీద సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయాలని సూచించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులను తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఐతే దురహంకారంతో ప్రజాప్రతినిధులు, మంత్రుల కొడుకులు ఇలా విర్రవీగితే ఏమవుతుంది? ప్రజాస్వామ్యానికి ‘సన్ స్ట్రోక్’ తగులుతుంది. ఈ నైతిక పతనాన్ని ప్రజాస్వామ్యం అనే అంటారా? నేతలు, వారి కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు ముగింపే లేదా? కర్నాటకలోని ఓ ప్రఖ్యాత రిసార్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్యం సేవించి ఖాళీ సీసాలతో ఒకరినొకరు పొడుచుకున్నారు. తాజాగా ద్రౌపదీ వస్త్రాపహరణ నాటకం అభినయించారు. ఇక, దేశాన్ని ముక్కలు ముక్కలు చేయండని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ను దేశ రాజధానిలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సమావేశానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. వేర్పాటువాదులు, దౌర్జన్యకారులు కలసిపోతుంటే ఇక ఈ దేశానికి దిక్కెవరు?
***
ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమే! మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో పాటు జగన్ పార్టీలో చేరడం ఏపీ రాజకీయాల్లో మరో మలుపు. శాసనసభ ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని కొన్ని సర్వేలు సూచించాయి. ఈ దశలో ఇలాంటి వలసలు మరికొన్ని జరగవచ్చు. తెలంగాణలో కేసీఆర్‌పై పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరారు. ‘పార్టీతో నాకేమిటి సంబంధం? నా నియోజకవర్గం అభివృద్ధి నాకు ముఖ్యం’ అని అన్నాడాయన. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ నుండి తెదేపాలోకి చేరడం ఖాయమని తేలాక అక్కడి రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. దేశవ్యాప్తంగా ఇలాంటి వలసలతో మరో రెండు నెలల్లో అనూహ్య పరిణామాలు తప్పవు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురించి గుసగుసలు వినిపించాయి. కాని అసలు విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఎవరైనా విజయాన్ని చూచి ఆకర్షింపబడుతారే కానీ మునిగే పడవలో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ ప్రభుత్వానికి చాలా తక్కువ మెజారిటీ ఉంది. నలుగురైదుగురు ఎంఎల్‌ఏలు ఫిరాయించినా భాజపా మాజీ సీఎం శివరాజ్ సింగ్ మళ్లీ అధికారంలోకి రావచ్చు.
***
తిరుపతిలో ఇటీవల హరికథా సదస్సు జరిగింది. అందులో సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- ‘దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టింది..’ అని వ్యాఖ్యానించారు. హత్యలు చేసినవారు మంత్రులు, హోం మంత్రులూ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. హరికథా సదస్సులో రాజకీయ ప్రసంగమేమిటి? సినీరంగం నుండి దాదాపు నిష్క్రమించిన ఈయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతున్నాడా? ఇంతకూ బాలసుబ్రహ్మణ్యం ఏ రాష్ట్ర హోం మంత్రిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానం చేశారు? ఇక- తెలుగు భాషను తెలుగువారే గౌరవించటం లేదని ఆయన అనటం సమంజసమేనా? ఇలా చర్చోప చర్చలు జరిగాయి. సమయం, సందర్భం మాట అలా ఉంచితే బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనలో సత్యాలు లేవని అనగలమా?
ములాయం సింగ్ కేంద్రమంత్రిగా పనిచేశాడు. లల్లూ యాదవ్, ఆయన కొడుకు తేజస్వీ యాదవ్ హోం మంత్రులు, ముఖ్యమంత్రులు అయినారు. తమిళనాడులో డీఎంకే పార్టీ ఎన్నో నేరాలు, ఘోరాలు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ హత్య కేసులో నిందితుడు. ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో నాయకుల నేర పూరిత చరిత్రలు మనం సమకాలీన సమాజంలో ప్రత్యక్షంగా దర్శిస్తూనే ఉన్నాం. భారత ప్రజాస్వామ్యానికి ఇది మరొక పార్శ్వం. విలువలతో కూడిన రాజకీయాలు నడపాలనుకొన్న వారికి ఆశాభంగం కలుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో లోగడ బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై సమాజ్‌వాదీ పార్టీవారు భౌతిక దాడికి దిగినప్పుడు ఆమెను భాజపా వారు రక్షించారు. ఇప్పుడు భాజపాకు వ్యతిరేకంగా ఎస్‌పి, బిఎస్‌పి కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ విచిత్ర రాజకీయ విన్యాసాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్‌టిఆర్‌ను అవమానించి ఆయనను గద్దె దింపిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికల పొత్తుపెట్టుకోవటం తాజా సంఘటనే.
***
హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి మరికొన్ని వారాల తర్వాత ఖాళీ కాబోతున్నది. అందుకని ఆ పోస్టును కొందరు ఆశించటం సహజమే. ప్రజాగాయకుడు గద్దర్ వైస్ చాన్సలర్ కావాలని కోరుకుంటున్నాడట! తాను ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు. మరి టిఆర్‌ఎస్‌లో చేరుతాడేమో తెలియదు. పరిపాలనాదక్షుడు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలంగాణ కవిరత్నం డా.తిరుమల శ్రీనివాసాచార్య, ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, వెల్దెండ నిత్యానందరావు,డాక్టర్ నందిని సిధారెడ్డి (తెలంగాణ సాహిత్య ఎకాడమీ అధ్యక్షుడు) తదితరుల పేర్లు విన్పడుతున్నాయి. ఇదే తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అలేఖ్య పుంజల డీన్‌గా, రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇంతకూ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్ మానస పుత్రిక. రాష్ట్ర విభజన తర్వాత దీనిని కూడా విభజించారు. నృత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, అభినయం వంటి రంగాలకు ఇతోధికంగా ప్రోత్సాహం కల్పించవలసి ఉంటుంది. గనుక ఈ విశ్వవిద్యాలయానికి నిధుల కొరత లేకుండా చూడాలి. ఏ విద్యాసంస్థ అయినా అక్కడి పరిపాలనా దక్షత వల్లనే అభివృద్ధిలోకి వస్తుంది. కూచిపూడి ప్రేరణ-లాస్యం- ఒగ్గుకథ- హరికథ వంటి ప్రాచీన సాంస్కృతిక రూపాలను ప్రభుత్వం పోషించాలి. కె.వి.రమణాచారి తన అరవై జన్మదినోత్సవం నాడు అరవై మంది హరిదాసులతో కథాకాలక్షేపం చేయించటం గొప్ప ఆదర్శం. ఆయన టీటీడీ కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు హరిదాసులకు ఇచ్చిన ప్రోత్సాహం ఇతర దేవస్థానం అధికారులకు ఆదర్శం! తెలంగాణలో కొన్ని జానపద కళలు దాదాపు అదృశ్యమైనాయి. తెలుగు విశ్వవిద్యాలయం శ్రద్ధ తీసుకుని వాటిని పునరుద్ధరించాలి. ఈ కళల వివరాలు పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో చూడవచ్చు. రామప్ప దేవాలయం వద్ద పెద్ద శిల్పవిద్యాలయం ఉన్న సంగతి ఎందరికి తెలుసు?
***
సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక రాజకీయ రంగప్రవేశం చేసింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఎన్‌డీఏ కూటమికి ఓటమి ఖాయమని విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గత పది సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నారు. లోగడ యూపీ ఎన్నికలలో ప్రచారం చేశారు. ఐనా ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈమె రాక ఏరువాక కాజాలదు. ఈమె చూడడానికి ఇందిరా గాంధీలా ఉంటుందని కాంగ్రెస్ వారు అభివర్ణిస్తున్నారు. పోలికల వరకూ అయితే ఫర్వాలేదు.. కానీ- ఇందిరలా ఏకపక్షంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందులే.
దేశం అవినీతి కుంభకోణాల్లో కూరుకొనిపోయింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని కావాలని వాంఛిస్తున్నది. బెంగాల్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బెంగాల్‌లో గత ఏడాది 25 లక్షల మంది ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజ్‌లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర జనాభాలో 6.8 శాతం మేరకు నిరుద్యోగులు ఉన్నారని అకారికంగా వెల్లడి చేశారు. ఇదీ వామపక్ష, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం. ప్రధాని పదవి పొందాలనుకొంటున్న మమత మరి ప్రియాంకను రాజకీయంగా ఎదగనిస్తుందా? రాహుల్ గాంధీ రాజకీయంగా విఫలమైనందునే ప్రియాంకను రంగప్రవేశం చేయించామని కాంగ్రెస్ వారు చెప్పకనే చెప్పినట్లయింది. ఇందిరా గాంధీ మాదిరి తెలంగాణలోని మెదక్ నుండి ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి నిలుపుతుందా? కేంద్రంలో పాగా వేయాలని ఆశపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- మెదక్‌లో ప్రియాంక పోటీ చేస్తే అందుకు తగిన అభ్యర్థిని తెరాస తరఫున నిలబెట్టకుండా ఉంటారా? అయినా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన తెలంగాణ నుంచి పోటీకి ప్రియాంక అంగీకరిస్తారా? తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ‘అనాయాస విజయం’ లభించే నియోజకవర్గం ఏదైనా ఉంటుందా?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్