ఎడిట్ పేజీ

ప్రజల సంపద ప్రజలకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 1న కేంద్రం రూ. 27.84 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, మధ్యతరగతి ప్రజలకిది ఎంతో ప్రయోజనకరమైనదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించినా, మరో రకంగా ఆలోచించినా బడ్జెట్ బడ్జెట్టే..
తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి నకలు లాంటిదని భావిస్తున్న ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, దీనివల్ల 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుండడం అద్భుతం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించారు.
మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా రూ.5 లక్షల ఆదాయానికి పన్ను లేదని ప్రకటించారు. దీంతో కొనుగోలుశక్తి గణనీయంగా పెరగనున్నది. మహి ళా శిశు సంక్షేమానికి కేంద్రం గతంలో కన్నా 20 శాతం నిధులు తాజా బడ్జెట్‌లో పెంచింది. దాంతో మాతాశిశువుల ఆరోగ్యానికి భరోసా పెరిగింది.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి 60 ఏళ్ళ అనంతరం నెలనెలా రూ.3 వేలు చెల్లించే పింఛన్ పథకం ప్రజలకు ప్రయోజనకరమైనది. ఈ పథకం ద్వారా రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు లాభపడగలరని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సైతం 35.6 శాతం నిధులు పెంచి పెద్దపీట వేశారు.
ఈ సమగ్రమైన విధానంతో దేశ ఆర్థిక స్థితి మెరుగుపడగలదని విశ్వసిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు గుర్తింపు తెచ్చేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ బడ్జెట్ ఉందని కొందరి అభిప్రాయం.
ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల కోసం అన్నిరంగాలలో అత్యాధునిక సౌకర్యాల పరిచయం కోసం కృషిచేయాలన్న సంకల్పం కేంద్ర బడ్జెట్‌లో కనిపిస్తోంది. అందులో భాగంగానే కృత్రిమ మేధకు సముచిత స్థానం కల్పించారు. లక్ష డిజిటల్ గ్రామాలను అభివృద్ధి పరచాలన్న ఆలోచన దీనికి అద్దం పడుతోంది. కృత్రిమ మేధ కోసం జాతీయ స్థాయి కేంద్రాన్ని నెలకొల్పి దానికి అనుబంధంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అత్యంత ఆవశ్యకమైనది. ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించడం ఆహ్వానించదగ్గది. డిజిటలీకరణ, డిజిటల్ సేవలు అందించేందుకు కేంద్రాల ఏర్పాటును సైతం ప్రతిపాదించారు. వర్తమానంలో ప్రపంచమంతా ఈ కక్ష్యపై తిరుగుతోంది కాబట్టి ఈ విషయమై అందరి దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రతిపాదనలు చేయడం ఎంతో ప్రాసంగికమైన అంశం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని నిపుణులు అభిప్రాయపడటం ఆనందించదగ్గ విషయం.
ఇప్పటికే ‘మేకిన్ ఇండియా’ ద్వారా డిజిటల్ టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఒకప్పుడు సెల్‌ఫోన్ తయారీచేసే కంపెనీలు దేశంలో కేవలం రెండు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 268కి చేరడం గణనీయమైన వృద్ధికి చిహ్నం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రంగం దూసుకుపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్, అటు తిరుపతి, విశాఖలో కొత్తకొత్త టెక్నాలజీతో సెల్‌ఫోన్ల తయారీ జరుగుతోంది. విడిభాగాల ఉత్పత్తి ఊపందుకొంది.
అంతిమ సారాంశమేమిటంటే.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉత్ప్రేరకం అందింది. రైతులు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు, అసంఘటిత కార్మికులకు, అల్పజీవికి మంచి ఆలంబన లభించడంతో ‘ప్రగతి చక్రం’ గిర్రున తిరిగే అవకాశాలు పెరిగాయి. ఏ దేశానికైనా కావలసిందే ఇది! డిమాండ్-సప్లైకి కందెనలా పనిచేసే బడ్జెట్ రూపకల్పన జరగడం నేటి అవసరం. దానే్న బడ్జెట్ రూపంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అందించారు. జాతీయ విద్యామిషన్‌కు ఈ బడ్జెట్‌లో రూ.38.572 కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోల్చితే 20 శాతం ఎక్కువ. దీనివల్ల పల్లెనుంచి పట్నం దాకా విద్యాసుమాలు వికసించే వీలుంది. దీనికనుగుణంగా ప్రైవేట్ రంగం స్పందించనున్నది. దాంతో ప్రపంచ స్థాయి విద్య దేశంలో పాదుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. వర్తమానంలో విద్యద్వారా నైపుణ్యం.. నైపుణ్యం ద్వారా మంచి ఉపాధి లభ్యమవుతోంది. ప్రపంచమంతటా ఈ దృశ్యం కనిపిస్తోంది. దాన్ని మన దేశంలోకి ఆహ్వానించడంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు. అందుకు తగ్గట్టుగానే కేంద్రం చొరవ చూపుతోంది. ‘గ్లోబల్’ అనే మాట అన్ని రంగాలలోకి విస్తరించింది. ఆ రకమైన ప్రమాణాలు నెలకొల్పేందుకు అవసరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రాథమిక వనరు విద్య. అదిప్పుడు దేశమంతటా విస్తృతంగా పరచుకోనున్నది.
ఇలా ప్రపంచ గతికి అనుగుణంగా అడుగులు పడుతున్న వేళ.. అభివృద్ధిలో పొరుగున ఉన్న చైనాతో పోటీపడుతూ దూసుకెళుతున్న సందర్భంలో, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దేశంలో యువశక్తి ఉన్నందువల్ల వర్తమాన ప్రగతిని ఉరకలెత్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు తరచూ విశే్లషిస్తున్న తరుణంలో భారతదేశ మావోయిస్టుల దృష్టికోణం దరిద్రంగా కనిపిస్తోంది. బడ్జెట్‌కు ముందురోజు జనవరి 31న మావోయిస్టులు ఇచ్చిన భారత్‌బంద్ పిలుపు ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అది పూర్తిగా విఫలమైంది. మావోయిస్టు పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన నంబాళ్ళ కేశవరావు ఇచ్చిన తొలి పిలుపు కాస్త ఇలా తిరగబడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తుగా కొన్ని చెట్లు నరికి రోడ్లకు అడ్డంగావేసి, కొన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడినా, మీడియాలో ప్రచారం చేసినా బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.
దీంతో మావోయిస్టులకు వాస్తవం బోధపడుతుందని అనుకోవచ్చు. తమపై పెరుగుతున్న నిర్బంధం, అణచివేతకు వ్యతిరేకంగా నిరసన వారోత్సవానికి పిలుపునిచ్చి ఆఖరురోజున భారత్ బంద్‌ను పాటించాలని పోస్టర్లు అతికించారు. తమ అనుబంధ సంస్థల ద్వారా సర్వవిధాలా ప్రయత్నాలు చేశారు. అటు ఝార్ఖండ్‌లో తమ ప్రతాపం చూపేందుకు ప్రయత్నించారు. అయితే పిఎల్‌ఎఫ్‌ఐ గ్రూపుకు చెందిన మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 29న జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు గెరిల్లాలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటనా స్థలంలో రెండు ఎ.కె.47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సును, లారీని మావోయిస్టులు దగ్ధం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర కాల్చి చంపారు. ఇంతటి హింస, విధ్వంసానికి పాల్పడినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అడవిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సైతం బంద్ ప్రభావం లేదు. విశాఖ మన్యంలో అయితే గిరిజనులు బంద్‌ను గట్టిగా వ్యతిరేకించారని పోలీసులు ప్రకటించారు. ముంచింగ్‌పుట్, చింతపల్లి, జి.కె.వీధి, మాడుగుల, పెద్దబయలు తదితర ప్రాంతాల్లో దుకాణాలు, ఇతర సంస్థలు యథాతథంగా పనిచేశాయని అధికారులు చెప్పారు.
ప్రజల నాడిని పట్టుకోలేనివారు, ప్రగతి మార్గాన్ని దర్శించలేనివారు, వాస్తవిక ప్రపంచానికి ఆమడ దూరంలో నిలిచి.. నిరంతరం పిడి వాదనలు వినిపించేవారు ఎలా 130 కోట్ల మందిని ముందుకు నడిపిస్తారు? ప్రగతి నిరోధకులుగా, నూతన ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్టవేసేవారిగా మావోయిస్టులు ఉండరాదుగా! అదేమిటో గాని మావోయిస్టులు మార్క్స్ కాలానికే అంకితమై పనిచేసేందుకు నిశ్చయించుకోవడం పూర్తిగా దురదృష్టకరం. మార్క్స్ సమయంలో కనిపించని ప్రజలు సృష్టిస్తున్న సంపద ప్రజలకే అందుతున్న వైనాన్ని చూసేందుకు మావోలు నిరాకరిస్తే ఎలా..?

-వుప్పల నరసింహం 99857 81799