మెయిన్ ఫీచర్

ప్రేమను ప్రేమగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండక్షరాల ప్రేమ..
రెండు మనసులను ఊపేస్తుంది..
ఏదో తియ్యని భావన నిలువనీయదు..
నిద్ర రానీయదు..
మెలకువలో స్వప్నాలు..
నిద్రలో కలల కలవరాలు..
ఇలా.. ఎన్నో అనుభూతులు.. ఎనె్నన్నో ఆలోచనలు..
ప్రేమించిన సఖికి మదిలో పదిలంగా దాచుకున్న మాటను వ్యక్తీకరించే సమయం వచ్చేసింది. అదేనండీ.. ప్రేమికుల దినోత్సవం వచ్చేసింది. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతిలా భావించే ఈ పండుగ.. నేడు మన దేశంలోని గ్రామాలకు కూడా విస్తరించింది. ఈ రోజు.. ఎక్కడ చూసినా ప్రేమికుల సందడే సందడి.. గులాబీలతో గుండెల్లోని గుసగుసలను మనసుకు నచ్చిన మనసుకు చెప్పి.. ఒప్పుకోగానే ఒక్కటయ్యే ప్రేమ జంటలు.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవితాంతం ఒకటిగా జీవించాలనే తాపత్రయం.. ఇదంతా.. ఎన్ని తరాలు, స్వరాలు మారినా ప్రేమ అమృతంలా ఇంకా సశేషమే..
ఆకర్షణ..
ప్రేమ.. రెండు ఆత్మల ఆత్మీయ కలయిక. ప్రేమలో ఆకర్షణే మూలం. కానీ ఆకర్షణే ప్రేమ కాదు.. జీవితం మొత్తానికి సరిపడా సమగ్ర అవగాహనతో, ఏదిఏమైనా కలిసి బతకాలనే ఆలోచనతో ప్రేమికులు ఒక్కటవ్వాలి. పెద్దలను ఒప్పించి కలిసి జీవించేందుకు సిద్ధపడాలి. ప్రేమలో క్షణికావేశం ఉండకూడదు. తొందరపాలు నిర్ణయాల వల్ల వివాహానంతరం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చదువులో రాణించి, ఉద్యోగ ప్రస్థానంలో స్థిరపడి, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించి, పరిణితి చెందిన వయసులోనే నిజమైన ప్రేమను అందుకోవచ్చు. నిజమైన ప్రేమ లక్ష్యం పెళ్లే అవుతుంది. అటువంటి ప్రేమ సామాజికంగా సర్వదా ఆమోదయోగ్యం, అభిలషణీయం. అలా జరగనిరోజు అది యువత వ్యక్తిత్వంపై మాయని మచ్చే.. బలవంతపు ప్రేమ, యాసిడ్ దాడి ప్రేమ, లైంగిక దాడి, హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడటం.. వంటివన్నీ నేటి సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న వైపరిత్యాలు.. మానసిక పరిపక్వత కలిగిన ప్రేమ గెలిచినా, ఓడినా మరపురానిదిగా ఉంటుంది. అందుకే ప్రేమికులకు కావల్సింది అందం, ఆకర్షణ కాదు.. మనోధైర్యం. అది ఉంటే ఈ దాడులు, ఆత్మహత్యలు ఉండవు. అటువంటి ప్రేమలే భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు..
వ్యాపార ప్రేమ
ప్రేమికుల దినోత్సవం వారం ముందే.. ‘రోజ్ డే’ పేరుతో ఈ వేడుక ప్రారంభమవుతుంది.
* రోజ్ డే..
* ప్రపోజ్ డే..
* చాక్లెట్ డే..
* టెడ్డీ డే..
* ప్రామిస్ డే..
* హగ్ డే..
* కిస్ డే..
* వేలంటైన్ డే..
అంటే ఫిబ్రవరి ఏడో తేదీన మొదలైన ప్రేమికుల దినోత్సవం.. ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. ఇదంతా పాశ్చాత్య సంస్కృతే అయినా మనదేశంలోనూ ఈ సంస్కృతి విస్తృతంగా వ్యాపించింది. ఈ ఎనిమిది రోజులు ఆయా వస్తువుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లున్నా.. ప్రేమకు అడ్డు ఎవరు? అని ముందుకు సాగే ప్రేమ జంటలు చాలా ఎక్కువే.. ఈ రోజున ప్రేమను వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే, ఇదో లగ్జరీగా చేసుకునే ప్రేమికులు కొందరు. ఈ రోజున ప్రియుడు, ప్రేయసికి కానుకలు ఇవ్వడం సహజం. సోషల్ మీడియా ఎంతగా విస్తరించినా ఒకరికొకరు కలుసుకుని కానుకలు ఇచ్చుకోవడంలో ఉన్న మజానే వేరు. అందుకే ప్రేమికులరోజు అనగానే గ్రీటింగ్ కార్డులు మొదలుకొని బంగారు షాపుల్లో వజ్రాల ఆభరణాల వరకు అన్ని కొంగ్రొత్తగా కొలువుదీరుతాయి.
19వ శతాబ్దంలో చేతితో రాసిన లేఖలను కానుకలుగా ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. తరువాత ఈ ప్రేమ.. భారీస్థాయిలో గ్రీటింగ్ కార్డుల తయారీకి.. ఇప్పుడు ఈ-కామర్స్ ఆధారంగా జరుగుతున్న బహుమతుల వ్యాపారంగా పరిణామం చెందింది. గ్రేట్ బ్రిటన్‌లో 19వ శతాబ్దంలో ప్రేమ కానుకలను పంపడం నాగరికమైంది. ఈ ప్రేమ కానుకలను వాలెంటైన్‌లు అంటారు. 1847లో ఈస్టర్ హోలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారుచేసి, విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది. క్రిస్‌మస్ తర్వాత కార్డులు ఎక్కువగా పంపే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది.

వాలెంటైన్ కథ
ప్రేమ ప్రేమికులను గమ్మతె్తైన మత్తులో ముంచెత్తుతూ ఆశల పల్లకిలో ఊరేగిస్తుందని కొందరి అభిప్రాయం. ఇలా రకరకాలుగా ప్రేమ గురించి రకరకాలుగా నిర్వచనం చెప్పుకునే ప్రేమను పండుగలా జరుపుకోడానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు. కొత్తగా ప్రేమలో పడ్డ యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు వారి ప్రేమను తమ ప్రియుడికి లేదా ప్రియురాలికి చెప్పాలని తపన పడుతుంటారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని పడిగాపులు పడుతుంటారు. ఇది ఇలావుంటే.. వారు తమ ప్రేమను అంగీకరిస్తారో లేదో అనే భయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఎక్కడ చూసినా ప్రేమజంటలే కనిపిస్తాయి. ఈ రోజున అమ్మాయిలు ‘యూ ఆర్ మై వాలెంటైన్’ అంటూ వారి ప్రియులకు చెబుతారు. అబ్బాయిలైతే ‘నువ్వే నా ప్రేమ దేవత’ అంటూ ప్రియురాళ్లకు చెబుతారు. నిజం చెప్పాలంటే.. ఈ మాటలను ఏ రోజైనా చెప్పొచ్చు. కానీ ప్రేమించుకునేవారికి ప్రేమికుల రోజుకు ఉండే ప్రాముఖ్యతే వేరు. వాలెంటైన్స్ డేకి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. దానిలో ఓ చిన్న కథ..
క్రీస్తు పూర్వం చక్రవర్తి క్లాడియన్ రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతనికి పెళ్లంటే అసలు నమ్మకమే ఉండేది కాదు. పెళ్లి చేసుకోవడం వల్ల మగాళ్ల బుద్ధి, సామర్థ్యం నశించిపోతుందని ఆయన నమ్మేవాడు. దాంతో వారి సామ్రాజ్యంలోని సైనికులు, అధికారులు పెళ్లి చేసుకోకూడదని ప్రకటించాడు. ఈ మాటను విన్న ప్రేమికులు అసహనానికి లోనయ్యారు. ఈ సమయంలో క్లాడియన్ చక్రవర్తి చెప్పిన మాటను వాలెంటైన్ అనే వ్యక్తి తిరస్కరించి.. ప్రేమికులకు దగ్గరుండి వివాహం జరిపించాడు. దీంతో క్లాడియన్ నా మాటనే తప్పుతావా? అంటూ వాలెంటైన్‌ను ఉరి తీయించాడు. ప్రేమకోసం, ప్రేమికుల కోసం తన ప్రాణాలను అర్పించిన వాలెంటైన్‌కు గుర్తుగా ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు.
గులాబీలు..
ప్రేమ అంటే.. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడమే కాదు.. కష్టనష్టాలను పంచుకునేది కూడా. కానీ నేటి సమాజంలో బహుమతుల ప్రేమలు ఎక్కువయ్యాయి. ఈ రోజున ప్రేమికులు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ బహుమతుల్లో ముఖ్యమైనది గులాబీ పువ్వు. గులాబీలు ప్రేమకు చిహ్నాలు. ఒక్కో గులాబీకి ఒక్కో అర్థముంటుంది. ఎరుపు రంగు గులాబీ మాత్రం ప్రేమకు చిహ్నం. సంప్రదాయ ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులు గులాబీలను ఇచ్చి పుచ్చుకుంటారు. ఎర్రగులాబీకి, మనిషి హృదయానికీ ఏదో సంబంధం ఉందని కొందరి మాట. అందుకే ప్రేమికులు ఒకరికొకరు ఎరుపు గులాబీలు ఇచ్చుకుంటే.. ఒకరి హృదయం మరొకరికి ఇచ్చినట్టవుతుందని నమ్ముతారు. గులాబీలతో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చుకుంటారు. ప్రేమికుల బహుమతుల్లో మొదటిగా చాక్లెట్స్‌కే ప్రాధాన్యం. పైగా ఈ రోజు వీటిని చాలా విలువైన బహుమతిగా తీసుకుంటారు. అమ్మాయిల్లానే.. చాక్లెట్స్ కూడా సున్నితంగా ఉంటాయని ఇలా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే.. మనసులోని కోరికలను ఉత్తేజపరచడంలో వీటిదే ప్రథమ స్థానం. ముఖ్యంగా హార్ట్‌షేప్‌లో ఉండే చాక్లెట్స్‌ను ఇస్తారు. ఎరుపు గులాబీ, హార్ట్‌షేప్ చాక్లెట్ మీ ప్రియమైన వారికి ఇస్తే.. అంతకుమించిన సంతోషం వారికి మరోటి ఉండదు.

నిజమైన ప్రేమ..
ప్రేమ విశ్వజనీనమైనది. అద్భుతమైన, అపూర్వమైన భావన. ఇది కులమతాలకు, వయసు తారతమ్యాలకు, భాషా ప్రాంతాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతమైన బంధం. ఇది వాలెంటైన్‌తో మొదలవ్వలేదు.. తాజ్‌మహల్ కూలినా ప్రేమే ఉంటుంది. మనిషి పుట్టినప్పుడే ప్రేమ పుడుతుంది. అసలు ప్రేమతోనే మనిషి పుడతాడు. ఈ భావన కొత్తది కాదు. ప్రేమను పంచుకోవడానికి సోషల్ మీడియా లేటెస్ట్ ట్రెండ్ అయితే.. ఆ రోజుల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమలేఖలు నడిచేవి. అందుకోసం రాజహంసలు, పావురాలు.. రాయబారులు. భావకుడైన ప్రేమికుడైతే చందమామ, మేఘాలు, చెట్లు.. ఇలా ప్రకృతిని ప్రతీకలుగా చేసి ప్రేయసికి కవితాత్మక సందేశాలు పంపేవాడు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ప్రేమ వ్యక్తీకరణకు అనేక బహుమతులు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రేమను వ్యక్తపరిచే చిహ్నాలుగా మారిపోయాయి. దాంతో ఎంత ప్రేమతో ఇచ్చారనే దానికంటే.. ఎంత ఖరీదైనది ఇచ్చారనే దానికి ప్రాధాన్యత పెరిగింది. ఇది వ్యాపార ప్రపంచం సృష్టించిన మాయాజాలం. ఈ మాయలో నిజమైన ప్రేమకు గుర్తింపు లేదు.. ఫలితంగా బహుమతి లేకుండా ప్రేమను వ్యక్తం చేయలేని పరిస్థితిలోకి ప్రేమికుల్ని నెట్టేసింది నేటి సమాజం.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి