మెయన్ ఫీచర్

ప్రచారపర్వం ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా పుష్కరాల ముగింపు, సింధు సాధించిన విజయాల ప్రచారహోరు ముగిసింది. 12 రోజుల పాటు పుష్కరుడిని స్వయం గా తీసుకువచ్చిన తెలుగు ప్రభుత్వాలు, దగ్గరుండి మరీ సాగనంపాయి. ఈ విషయంలో ఏపి సర్కారు చేసిన ప్రచారంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రచారం తక్కువే. పుష్కరుడిని బెజవాడకు తీసుకువచ్చిన బాబు రోజూ హారతికి హాజరయి, పంపేంతవరకూ అంతా తానుగా వ్యవహరించారు.
ఏదైనా ఒక ఈవెంట్‌కు ప్రచారం కల్పించాలం టే ఆ విషయంలో అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్లు కూడా బాబు ముందు బలాదూరే. అయితే ఎందుకోగానీ ఈసారి ఆకాశమంత పందిరేసి, భూలోకమంత అరుగేసి వెయ్యికోట్లకు పైగా వె చ్చించి కృష్ణా పుష్కరాలను నిర్వహించిన బాబు కష్టానికి, జాతీయ స్థాయి ప్రచారం దక్కకపోవడం తమ్ముళ్లను బాధించేదే. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మీడియా పేరులో జాతీయత తప్ప అంతా ఢిల్లీ లోకలేనని సొంత మీడియానే సెలవిచ్చింది. సరే, పుష్కరాల సంగతి ఎలా ఉన్నా ఆ పేరుతో జరిగిన పనులు దక్కించుకున్న సొంత వర్గం వారయితే బాగుపడ్డారు. ‘మన’ అనే భా వన లేకపోతే మనుగడ కష్టం కదా?! తెలంగాణలో కూడా ఘాట్ల నిర్మాణాల నుంచి మిగిలిన పనులను గు‘లాబీ’లే దక్కించుకున్నాయి. పు ష్కరాల ఏర్పాట్లు, జనాల హాజరు, స్పందనలో తమ మీద ఈగ వాలకుండా చూసుకోవడంలో ఇద్దరు చంద్రులు సక్సెస్ అయ్యారు. మీడియా కూడా యథాశక్తిన శ్రమదానం చేయడంతో, కృష్ణా పుష్కరాలు కూడా గోదావరి స్థాయిలో సక్సెస్ అయినట్లు కనిపించింది.
అయితే, భక్తుల హాజరు విషయంలో రెండు ప్రభుత్వాలు ఎవరి లెక్కలు వారు చెప్పాయి. ఈ సందర్భంగా ఒక కథ చెప్పాల్సి ఉంది. అక్బర్ తన ఆస్థానంలో ఉన్న వారందరినీ పిలిచి, నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కపెట్టిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారట. ఆ సమయం రానేవచ్చింది. కాకిలెక్క ఎంతవరకూ వచ్చిందని అడిగితే అంతా వౌనం వహించారు. చివరకు బీర్బల్ లేచి ప్రభూ ఈ నగరంలో 5,340 కాకులున్నాయని చెబితే, అప్పటికి వౌనంగా ఉన్న ఇద్దరు లేచి ఇది అబద్ధం అని వాదులాటకు దిగారు. అందులో ఒకాయన తాను 8020 కాకులున్నట్లు గుర్తించానని చెబితే, ఇంకొకాయన 5 వేల కాకులే ఉన్నాయన్నాట్ట.
అందుకు బీర్బల్ సమాధానం చెబుతూ ‘ప్రభూ మొదటి ఆయన లెక్కబెట్టినపుడు పక్క ఊరి కాకులు వచ్చాయి. దానితో ఆ సంఖ్య వచ్చింది. రెండో ఆయన లెక్కబెట్టినప్పుడు మన ఊరి కాకులు పక్క ఊరికెళ్లాయి కాబట్టి నాదే రైటు’ అన్నాట్ట. పుష్కరాలకు వచ్చిన భక్తుల సం ఖ్య విషయంలో రెండు ప్రభుత్వాల వాదన కూ డా ఇలాగే ఉంది. కొనే్నళ్ల క్రితమయితే పుష్కరాలకు ఇలాంటి హడావిడి ఉండేది కాదు. ఎవరి మానాన వారు నదీతీరాలకు వెళ్లి మూడు మునకలేసి వచ్చేవారు. అప్పట్లో చంద్రబాబు, చంద్రశేఖరరావు వంటి తెలివైన సీఎంలు లేరు కాబట్టి, వచ్చిన వాళ్ల సంఖ్య పెట్టే ప్రయత్నం జరగలేదు.
అయినా భక్తి, సెంటిమెంటుకు ఈ లెక్కలు, ప్రచారమేమిటో?! జగన్ పుష్కరస్నానంపై తెదే పా అధికార మీడియా వర్గం ప్రశ్నల వర్షం కురిపిస్తే..ప్యాంటు, షర్టు వేసుకుని, బూట్లతో పు ష్కర కార్యక్రమంలో పాల్గొన్న బాబు చిత్తశుద్ధిని వైకాపా వెక్కించడాన్ని బట్టి, చివరకు పష్కరాలకూ రాజకీయబురద అంటించారని అర్ధమవుతుంది.
* * *
మన తెలుగు క్రీడాకారిణి సింధు సాధించిన విజయం అసామాన్యం. బంగారం దక్కకపోయినా ఆమె సాధించిన రజతమే మనకు బంగారంతో సమానం! తెలుగు ప్రభుత్వాలు పోటాపోటీగా ఆమెకు ప్రకటించిన నజరానాలు, ఆమె ప్రతిభపై పేటెంట్ పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఆసక్తికలిగించేవే. పుష్కరాల సమయంలోనే సింధు విజయం కలసిరావడంతో ప్రచారం హోరెత్తింది. ఈ విషయంలో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు సింధు సాధించిన విజయాన్ని తమ కృషి ఖాతాలో కలిపేసుకునే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం. తానే సింధును ప్రోత్సహించానని బాబుగారు ప్రకటించుకుంటే, మా గడ్డమీద నేర్చుకోబట్టే ఆమె ఆ స్థాయికి ఎదిగిందని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ప్రకటించుకున్నారు. ఒకరు సాధించిన విజయాలను కూడా మరొకరు సొంతం చేసుకుంటారా?అన్న అనుమానాలున్న వారికి, రెండు ప్రభుత్వాలూ ఈ విధంగా సమాధానమిచ్చాయన్నమాట.
అంతా బాగుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకొచ్చి సింధు, సాక్షికి నజరానాలు ప్రకటించి భుజం తట్టడం మెచ్చదగ్గదే. దాన్ని ఎవ రూ ఆక్షేపించజాలరు. విద్యనేర్పిన ద్రోణాచార్యుడికి నజరానాలివ్వడాన్నీ తప్పుపట్టరు. అయితే, దేశంలో ప్రతిభ ఉండి, అవకాశాలు రాని వేలమంది సింధుల చేయి పట్టుకుని నడిపించాల్సిన పాలకులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారన్నదే చాలామంది బాధ. సింధు విజయం తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆలోచింపదగ్గదే. సింధు విజయాన్ని, ఆమెకు నజరానాలను స్వాగతిస్తూనే, దేశ క్రీడావిధానాన్ని ఎత్తిచూపిన నెటిజన్ల ప్రశ్నలకు పాలకులు జవాబు ఇచ్చి తీరాల్సి ఉంది.
రియో ఒలింపిక్స్‌కు మన దేశం నుంచి దాదా పు వందమంది క్రీడాకారులను పంపించాం. గతంలో బీజింగ్ ఒలింపిక్స్‌లో 3, లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు వచ్చాయి కాబట్టి ఈసారి డజను పతకాలు వస్తాయని క్రీడాశాఖమంత్రి సెలవిచ్చారు. క్రీడాకారుల ప్రతిభను అంచనా వేసే భారతీయ క్రీడల సంఘం కూడా కనీసం 15 పతకాలొస్తాయని లెక్కవేసింది. అయితే, మనకు వచ్చింది రెండంటే రెండు పతకాలు! ఎందుకీ పరిస్థితి? దీనికి కారణమేమిటి? బడ్జె ట్‌లో క్రీడలకు కేటాయించింది 900 కోట్లు. అభినవ్ భింద్రా వంటి క్రీడాకారులు చెప్పినట్లు బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక్క పతకం సాధించేందుకు సరాసరి 46 కోట్లు ఖర్చుపెడతారట. ఆ లెక్కన మన క్రీడాసంఘాలు ఎన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తయారుచేశాయి?
మనది వెళ్లిపోయిన బస్సుకోసం ఎదురుచూసే మనస్తత్వం. నేటి జర్నలిజం మాదిరిగానే క్రీడావిధానం కూడా జూలో సింహాల మాదిరయింది. వేటాడటం మరిచి, విసిరేసిన ఆహారాన్ని కూడా వేగంగా అందుకోలేని బద్ధక పరిస్థితి. నవనవోనే్మష ఆలోచనలు, నేటితరం ఆలోచనలు, ఏమి కావాలి? ఏమి ఇవ్వాలన్న వాస్తవాలకు దూరంగా బతుకున్న దుస్థితి. ఎందుకంటే మన క్రీడాకారులు ఆర్చరి, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి విభాగాల్లోనే ఎక్కువగా రాణిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వ దృష్టికోణం ఆ విభాగాలను అభివృద్ధి చేయడంపైనే ఉండాలి.
కానీ ఘనత వహించిన పాలకుల నిర్ణయాలు అందుకు విరుద్ధం. క్వాష్, యాటింగ్ వంటి క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించింది. అంటే విధాన నిర్ణయాలు తీసుకునే వారి మైండ్‌సెట్ ప్రకారం నడుస్తున్న దుస్థితి. ఏ రంగంలోనయినా ఇది ప్రమాదకరం. దేనికైనా క్షేత్రస్థాయి వాస్తవాలే ప్రామాణికం కావాలి. 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్న అథ్లెట్ ఓపీజైషాకు మంచినీరు కూడా ఇచ్చే దిక్కులేని, అవమానకర పరిస్థితులలో క్రీడాకారుల నుంచి పతకాలు ఆశించడం అత్యాశ కాదా?
సింధు, సాక్షి మాలిక్ సాధించిన విజయాలు అపూర్వం, అద్భుతమే. ప్రోత్సాహకాలకు వారు అర్హులే. కానీ, గెలిచిన తర్వాత వారికి కోట్లాది రూ పాయలు ఇచ్చేకంటే, ప్రతి పట్టణం, ప్రతి హైస్కూలులో గ్రౌండ్ ఏర్పాటుచేయాలన్న ఆలోచన ఎందుకు చేయరు? అసలు ఎన్ని స్కూళ్లకు ప్లేయింగ్ కిట్స్ ఉన్నాయి? లోకల్ టాలెంట్స్ కోసం ఎన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు? గ్రౌండ్ లేకపోయినా స్కూళ్లకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? స్కూల్ టైంటేబుల్‌లో రోజూ ఒక్క పిరియడయినా పిల్లలు స్కూల్లో ఆడాల్సిందేనని ఎందుకు ఉత్తర్వులివ్వరు? ఆటలాడినందుకు పరీక్షల్లో మార్కులు కలిపే ఆలోచన ఏదీ? ఇలా గెలిచిన వాడి భుజం మీద చేయి వేసి, వాళ్లు మావాళ్లేనని ప్రచారం చేసుకునే దౌర్భగ్యం కంటే, ఇలాంటివి పాటిస్తే ఊరుకో సింధు తయారుకాదా?..గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో శరపరంపరగా పాలకులపై జరుగుతున్న ప్రశ్నల దాడి ఇది. వాటికి జవాబు చెప్పే ధైర్యం ఉందా?
సింధు విజయం తర్వాత చానెళ్లు గొట్టాలు పట్టుకుని తలిదండ్రుల మీద పడి, ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. కెమెరాలను చూసి ఉబ్బితబ్బిబ్బయిన సదరు తలిదండ్రులు మేము కూ డా మాపిల్లలను ప్రోత్సహిస్తామన్నారు. అదంతా నిజమే కామోసనుకున్న కుర్ర జర్నలిస్టు తన ఆలోచన, వారి ఆలోచన కలగలిపి, సింధు స్ఫూ ర్తితో ఇకపై తమ పిల్లలను కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తామంటున్నారని ఒక ప్యాకేజీ వార్త గాల్లోకి వదిలారు. అది నిజంగానే జరిగేదేనా అంటే కాదు! ఈ దేశంలో ప్రతి ఒక్కరు భగత్‌సింగ్, సింధు, సచిన్ పుట్టాలని కోరుకుంటారు. అది తమ ఇంట్లో కాదు. పక్క ఇంట్లో! ఇదీ అంతే!! స్పెషల్ క్లాసులు, కోచింగ్ సెంటర్లు, కానె్సప్టు స్కూళ్లకు పంపించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను చేయాలన్న ధ్యాస తప్ప, దేశానికి క్రీడాకారులను అందించాలన్న ఆలోచన ఉన్న తలిదండ్రులు ఎంతమంది? కాబట్టి సర్కారు క్రీడలను ప్రోత్సహించడం లేదని గుండెలు బాదుకునే తలిదండ్రులు ముందు దాన్ని తమ ఇంటి నుంచే మొదలుపెడితే మంచిది.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144