మెయన్ ఫీచర్

మధ్యతరగతి వారికి వరాలే లేవా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలూ బడుగు వర్గాల వారిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పథకాలతో మేనిఫెస్టోలను రూపొందించడం ఆనవాయితీగా మారింది. మధ్యతరగతి ప్రజలు ఏనాడూ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన ఎన్నికలలో 65% మించి ప్రజలు ఏనాడు ఓటు హక్కును వినియోగించుకొనలేదు. ఈ బలహీనతను కనిపెట్టిన మన పాలకులు ఓటు హక్కు వినియోగంపై సర్వే చేయిస్తుంటారు. ఇలాంటి సర్వేలను నిర్వహించిన వారు జనాభాను మూడు తరగతులుగా- ఉన్నత వర్గం, మధ్యతరగతి, బడుగు వర్గాలుగా విభజించారు. వారి లెక్కల ప్రకారం ఉన్నత వర్గం వారు 5-6%, మధ్యతరగతి వారు 40-45%, పేదవారు దాదాపు 50% వున్నారు. ఈ మూడు వర్గాలలో ఒక్కొక్క వర్గంలో దాదాపు రెండు నుంచి మూడు వేల మందిని ఇంటర్వ్యూ చేశారు. ముందుగా ఉన్నత వర్గం వారిని- ‘మీరు ఓటు హక్కును ప్రతి ఎన్నికలలోను వినియోగించుకొంటున్నారా?’ అని ప్రశ్నించగా, దానికి వారు తామెన్నడు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోలేదని, కాని తాము ప్రతి రాజకీయ పార్టీకీ నిధులు ఇస్తామని, ప్రభుత్వ అధికారులకు, అనధికారులకు లంచాలు, బహుమతులు ఇచ్చి తమ పనులు జరిపించుకొంటామని తెలిపారు. ఇచ్చిన విరాళాల కన్నా ఎక్కువగానే మరలా రాబట్టుకుంటామని, అందువల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫరవాలేదని, ఎన్నికల్లో మా వాళ్ళు ఎవరైనా నిలబడితే అప్పుడు మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటామని వారు చెప్పారు. దీని సారాంశం ఏమంటే- ఉన్నత వర్గాలలో 5 శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పోలింగ్ జరిగే 65 శాతంలో వీరి వాటా 0.5% మాత్రమే.
పేదప్రజలను, బడుగువర్గాల వారిని సర్వే చేయగా వారిలో 90 శాతం మంది ఎన్నికలు ఏడాదికి ఒకసారి వస్తే చాలా బాగుంటుందని చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలవారు, అధికార పార్టీ సహా వీరి చుట్టూ తిరిగి డబ్బులు, సారా ప్యాకెట్లు ఇస్తారు. చిల్లర, మల్లర పనులన్నీ అప్పుడే చేస్తారు. అన్ని పార్టీలవారి నుండి డబ్బులు, సారా తీసకొని మరి ఎవరికి ఓటువేస్తారని వీరిని ప్రశ్నించగా- ఎవరు ఎక్కువ డబ్బు, మద్యం ఇస్తారో వారికే వేస్తామని, ఎవరి మీద అభిమానం కలిగితే వారికి వేస్తామని చెప్పారు. మద్యం మత్తులో ఉంటే ఎవరో ఒకరికి వేసేస్తామని మరికొందరు చెప్పారు. మొత్తం జనాభాలో 50% ఉన్న పేద, బడుగు వర్గాలు 90% ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని సర్వేలో తేలింది. అంటే 60 నుండి 65 శాతం పోలింగ్‌లో 45% వీరి వల్లే జరుగుతున్నదని తేలింది.
ఇక మధ్యతరగతి వారిని విచారించగా- వీరిలో దాదాపు 90% మంది ఓటింగ్‌పై నిరాసక్తత వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై వీరి సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలవారు దొంగలే. అందుకని ఎవరికీ ఓటు వేసేది లేదని కొంతమంది చెప్పారు. తాము ఓటింగ్‌కు వెళ్ళేటప్పటికి అప్పటికే తమ ఓట్లు ఎవరో ఒకరు వేసి వుంటారని, అందుకే ఓటింగ్‌కు వెళ్ళడం లేదని కొందరు చెప్పారు. పోలింగ్ బూత్‌ల వద్ద కొట్టుకుంటారు లేదా బాంబులు వేస్తారు, అందుకని ఓటింగ్‌కు వెళ్ళనని కొందరు చెప్పారు. ‘నేను ఒక్కడినే వేయకపోతే ఫలానా అభ్యర్థి గెలుస్తాడా? మరో అభ్యర్థి ఓడిపోతాడా?’ అని వీరు వాదిస్తుంటారు. పోలింగ్ బూత్‌ల వద్ద గంటల తరబడి నిలబడి ఓటువేయాలంటే తమకు గొప్ప చిరాకు అని కొందరు, పోలింగ్ రోజున సెలవు గనుక హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తామని కొందరు, తమకు ఓటర్ కార్డులు యివ్వలేదని కొందరు, రాజకీయాలంటే గిట్టవు అని మరికొందరు వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఉన్నారు. వీరిలో 10% మాత్రమే హటు హక్కు వినియోగించుకుంటున్నారని సర్వేలో తేలింది. జనాభాలో 40% మేరకు ఉన్న మధ్యతరగతి వారిలో 10% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే 60-65% జరిగే పోలింగ్‌లో మధ్యతరగతి ప్రజలు 4% లేక 4.5% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకొనుచున్నారు.
ప్రభుత్వం నియమించిన సర్వే బృందం సమర్పించిన నివేదిక ప్రకారం దాదాపు 65% జరిగే పోలింగ్‌లో 49.5% లేక 50% పోలింగ్ మాత్రమే జరుగుతున్నది. మిగిలిన 15% పోలింగ్ ఆయా రాజకీయ పార్టీల పలుకుబడి, పెత్తనం ఉన్న ప్రాంతంలో రిగ్గింగ్ చేసుకొని ఈ 50% పోలింగ్‌ను 65% వరకు తీసుకువెళ్ళగలుగుతున్నారు. రిగ్గింగ్‌ను సులభతరం చేసేందుకు ఇప్పుడు బోగస్ ఓట్లను చేర్పించడం మొదలయింది. 50% పోలింగ్‌లో 45% పేద బడుగు వర్గాల ప్రజల వల్లనే జరుగుతుంది. మధ్యతరగతి ప్రజలు శాతం 4% మాత్రమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా దారుణమైన విషయం.
ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వాధినేతలు తేల్చిన విషయం ఏమిటంటే ఉన్నత వర్గాలవారు ఓటింగ్‌లో పాల్గొనకపోయినా- వారి అవసరం వీరికి, వీరి అవసరం వారికి ఉన్నది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. ఈ ధోరణి ఇరువురికీ అవసరమే. అందువల్ల వారి మంచి చెడులను చూడాలి. ఇక మధ్యతరగతి ప్రజలు జనాభాలో 40-45% ఉన్నా ఓటింగ్‌లో పాల్గొనేవారు 4%- 4.5% మాత్రమే. అధికార పార్టీవారు రిగ్గింగ్ ద్వారా అంతకంటే ఎక్కువ శాతమే ఓట్లు తెచ్చుకోగలుగుతున్నారు. కాబట్టి మధ్యతరగతి వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదని పాలకులు భావిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలలో ఎక్కువ శాతం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు తమ తమ వృత్తుల ద్వారా కొద్దోగొప్పో డబ్బు కూడబెట్టగలుగుతున్నారు. కాబట్టి వీరి అభివృద్ధికి ఖర్చు చేయడం కంటే వారివద్ద నుండి పన్నులు, ఇతర చార్జీల ద్వారా డబ్బులు గుంజుతున్నారు. ‘మిడిల్ క్లాస్’ను పాడి ఆవులా భావించి, రకరకాల పన్నుల రూపేణా ప్రభుత్వ ఖజానాను నింపుతున్నారు. వీరికి అందుబాటులో వుండే విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటీకరించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వ్యాపారస్తులకు వ్యాట్, టర్నోవర్ టాక్స్, జీఎస్టీ లాంటి పన్నులు వేసి వారిని కూడ పిండుతున్నారు. మధ్య తరగతి రైతులకు నీరు, కరెంటు ఇచ్చేందుకు శ్రద్ధ చూపడం లేదు. ఎరువులపై సబ్సిడీ ఎత్తివేసి ఎరువుల కంపెనీలను ఆదుకుంటున్నారు. మధ్య తరగతి వారు ఇకనైనా ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును పూర్తిగా వినియోగించి సేవచేసే పార్టీని ఎన్నుకొనాల్సి ఉంది.
మధ్యతరగతి ప్రజలు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా రాజకీయ చైతన్యం పొంది వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోలపై అవగాహన పెంచుకోవాలి. ఈ మేనిఫెస్టోల కంటే ప్రజలకు అవసరమైన పీపుల్స్ మేనిఫెస్టోలు తయారుచేసి రాజకీయ పార్టీలకు అందజేయాలి. తమ డిమాండ్లను అమలు చేసే వారికే ఓట్లు వేసి, మధ్యతరగతి ప్రజల పోలింగ్ శాతం పెంచగలిగితే, మన దేశంలో పెనుమార్పులు తప్పకుండా చోటుచేసుకొనే అవకాశం ఉంది. నిశితంగా పరిశీలిస్తే ప్రస్తుత రాజకీయాలు వ్యాపార ధోరణిలో సాగడానికి ప్రజల ఆలోచనా విధానం కారణం అని భావించాలి. రాజకీయ పార్టీలు కూడ ఓట్ల కోసం అడ్డదారులు తొక్కడానికి ప్రజల బలహీనతలే కారణం అని అంగీకరించాలి.
మధ్యతరగతి ప్రజలు ఓటు విలువ తెలుసుకొని దానిని సద్వినియోగం చేసుకుంటే రాజకీయ పార్టీలు కూడా నీతి నిజాయితీ గల అభ్యర్థులనే ఎన్నికల్లో నిలబెట్టేందుకు వీలుంటుంది. మధ్యతరగతి వారు ఓటింగ్ పాల్గొనకుండా భవిష్యత్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగితే వారి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావు. బడుగువర్గాల ప్రజల్లో 90% మంది ఓటింగ్‌లో పాల్గొంటారు గనుక వారు ప్రభుత్వాలను నిలబెట్టగలరు లేదా పడవేయగలరు. కాబట్టి వీరిని మచ్చిక చేసుకొని, వారి అవసరాలను అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం తీరుస్తుంటే ప్రభుత్వంపై వారికి సదభిప్రాయం కలిగి అనుకూలంగా ఓట్లు వేయవచ్చు. వారిని ప్రసన్నం చేసుకోవటానికి అన్ని రాజకీయ పార్టీల వారూ ఆచరణ సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలలో పెట్టి ఓటర్లను ఆకర్షించడానికి తంటాలు పడుతుంటారు. అయితే, అధికారం చేపట్టాక జనాకర్షక పథకాలన్నింటినీ అమలు పరచలేక రాజకీయ పార్టీల నేతలు చతికిలబడుతుంటారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 40-50 సంవత్సరముల వరకు శాసనసభ్యులకు గాని, పార్లమెంట్ సభ్యులకు గాని జీతభత్యములు లేవు. సభలకు హాజరైనప్పుడు మాత్రమే ఖర్చులకు డబ్బులు చెల్లించేవారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పాలకులు తమ జీతభత్యములు, ఇతర అలవెన్సులు విపరీతంగా పెంచుకుంటున్నారు. మరెన్నో రాయితీలను, విలాసవంతమైన సౌకర్యాలను నేతలు అనుభవిస్తున్నారు.
ప్రజలందరూ ఇకనైనా దేశ రాజకీయాలను గమనించి, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాజకీయ పార్టీలను అదుపుచేసి నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకులను ఎన్నుకొనేందుకు విచక్షణతో ఆలోచించాలి. మన ప్రమేయం లేకుండా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మాత్రం ఎదురు చూస్తే చివరికి నిరాశే మిగులుతుంది. మనవంతు ప్రయత్నం చేస్తేనే సమాజంలో మార్పు తీసుకురాగలం.

-రాఘవరపు కృష్ణమోహన్ 94402 71022