మెయిన్ ఫీచర్

కులమతాలకు అతీతంగా.. ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతాబ్దాలుగా వంచనకు గురై, స్వేచ్ఛ కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో
రిజర్వేషన్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
వారి అభివృద్ధికి సాయం చేస్తున్నాయి. ఎంతో కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్ల కోసం కులం సర్ట్ఫికెట్
తీసుకోవడానికి స్నేహ వ్యతిరేకి కాదు.

ఎన్నో మతాలు..
ఎనె్నన్నో కులాలు..
ఒకడిని ఏమైనా అంటే ‘కులం’ పేరు తీసుకువచ్చి తన్నులాటకు దిగుతారు. అదే ఇతర మతస్థుడిని ఏమరుపాటుగా ఏమైనా అంటే.. దేశానే్న అట్టుడికిస్తారు.. ఇదీ నేటి వరకు భారతదేశ పరిస్థితి. భారతదేశం అనగానే ఎన్నో మతాలు, కులాలవారీగా విభజనకు గురైన ఒక దేశంలానే అనిపిస్తుంది ప్రపంచానికి. కానీ ఆ దృష్టిని రూపుమాపేందుకు మొదటి అడుగు పడింది. ఆ అడుగు.. తమిళనాడు రాష్ట్రంలోని స్నేహది.. ఎంతోమంది తన దారిలో నడిచేందుకు బాట వేసింది. భారతదేశంలో కులం, మతం లేకుండా సర్ట్ఫికెట్ పొందిన మొట్టమొదటి మహిళ ఈమేనని అందరూ భావిస్తున్నారు. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్ట్ఫికెట్ పొందలేదని.. భవిష్యత్తు తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకుంటున్నానంటూ.. ఈమె వేసిన బాట అందరికీ ఆదర్శనీయం.. ఆచరణీయం.. వివరాల్లోకి వెళితే..
స్నేహ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఈమె తండ్రి ఆనంద్ కృష్ణన్, తల్లి మణిమొళి.. ఇద్దరూ లాయర్లే.. వీరికి ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే.. ఈ ముగ్గురికీ ఎలాంటి కులమతాల ముద్రా లేకుండా చూసుకున్నారు ఆ తల్లిదండ్రులు. అందుకే వీరిపేర్లు స్నేహ, ముంతాజ్, జెన్నిఫర్ అనే పేర్లు పెట్టారు వారు. మునుపు ఆనంద్ కృష్ణన్ కూడా ఇలాంటి సర్ట్ఫికెట్ పొందాలని ప్రయత్నించాడు. ఒకసారి కాదు.. చాలాసార్లు ప్రయత్నించాడు. అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఆనంద కృష్ణన్, మణిమొళిల జీవనశైలి చాలా భిన్నంగా ఉండేది. సమాజంలో అందరికంటే భిన్నంగా జీవించారు వారు. అలాగే పిల్లల్ని కూడా పెంచారు. వీరే కాదు.. స్నేహ భర్త పార్తిబరాజా కూడా కులం, మతం అనే ఆచారాలకు వ్యతిరేకి.. ఇతను స్ర్తివాద ఆలోచనలపై చాలా ఆసక్తి చూపిస్తాడు. అందుకే వీరిది కులమతాలు లేని వివాహం. నిజానికి.. కులమతాలు లేకుండా సర్ట్ఫికెట్ తీసుకోవాలన్న స్నేహ నిర్ణయానికి పార్తిబరాజా అండగా నిలిచాడు. భవిష్యత్తు తరాలకు కూడా కులమత రహిత సిద్ధాంతాన్ని నేర్పించాలనేది ఈ దంపతుల కోరిక.
వీరికి ముగ్గురు కూతుర్లు.. వారు ఆతిరై నస్రీన్, ఆతిలారేన్, హారిఫా జెస్సీ అనే పేర్లు పెట్టారు. అప్లికేషన్‌లో కులం ఏదో రాయకుండానే వారిని స్కూల్లో చేర్పించారు. కులమతాల గుర్తింపును తుడిచిపెట్టేందుకు ఈ కుటుంబం చేస్తున్న కృషి గురించి వేరే చెప్పక్కర లేదు కదా.. తర్వాతి తరాలకు కూడా ఇది కొనసాగుతుందని మాత్రం స్నేహం ఘంటాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే తాము ఏ కులాచారాలను, మతాచారాలను పాటించకపోవడం వల్లే సంతోషంగా ఉన్నాము.. అందుకే తాము ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తున్నామని చెబుతుంది స్నేహ. ఇప్పుడున్న కుల, మత ఆధారిత రాజకీయాల్లో స్నేహ చేసిన పని చాలా ప్రత్యేకమైనది. కుల, మతాల పేరుతో ఒకరి నుంచి ఒకరిని విడదీయలేరన్న సంకేతాన్ని అందిస్తోంది స్నేహ. కులమతాలపైనే సమాజం ఏర్పడిందని చెప్పడానికి ప్రయత్నించేవారికి, ఇంకా ప్రయత్నిస్తున్న వారందరికీ షాక్‌ను ఇచ్చింది స్నేహ. ఈమెలాగే మరింత మంది ముందుకు వచ్చి కుల, మతాలను వదులుకుంటే.. వాటిపైనే ఆధారపడే ఎంతో మంది నాయకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. వారి రాజకీయాలు కూడా కనుమరుగవుతాయి.
అలాగని ఈమె చేసిన ఈ పని రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఇలా కొంతమంది భావిస్తున్నారు.., భావిస్తుంటారు కూడా.. శతాబ్దాలుగా వంచనకు గురై, స్వేచ్ఛ కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో రిజర్వేషన్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వారి అభివృద్ధికి సాయం చేస్తున్నాయి. ఎంతో కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్ల కోసం కులం సర్ట్ఫికెట్ తీసుకోవడానికి స్నేహ వ్యతిరేకి కాదు. దాన్ని నిరోధించడం కూడా లేదు. కానీ అణచివేతకు గురైన వారికి కచ్చితంగా ధ్రువీకరణ పత్రం అవసరమే అని చెబుతోంది స్నేహ. కులవ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్నవారికి ఈమె వ్యతిరేకి. వాళ్లు తమపై సమాజం ముద్రను, సర్ట్ఫికెట్‌ను వదులుకోవాలని, అణచివేతకు గురైనవారికి అండగా నిలవాలనీ స్నేహ కోరుకుంటోంది.
ప్రభుత్వ సాయం..
కులమతాలు లేని సర్ట్ఫికెట్ తీసుకోవాలని స్నేహ అనుకున్నప్పుడు ఆమె కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభించిందట. స్నేహ పది సంవత్సరాల క్రితమే ఈ సర్ట్ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా చాలాసార్లు చేసింది. చేసిన దరఖాస్తులు సాధారణంగా తాలూకా ఆఫీసుల్లోనే చెత్తబుట్టల్లోకి వెళ్లిపోయేవి. కొందరు మాత్రం స్నేహను ‘ఎందుకు ఇలాంటి సర్ట్ఫికెట్ అడుగుతున్నారు? ’ అని అడిగేవారు. ఎన్నోసార్లు విఫలం అయ్యాక.. రెండు సంవత్సరాల క్రితం కూడా స్నేహ మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈసారి మాత్రం సబ్ కలెక్టర్, తాశీల్దార్ స్నేహకు మద్దతుగా నిలిచారు. ఇతరుల హక్కులను కాలరాయడానికి స్నేహ ఈ సర్ట్ఫికెట్ అడగడం లేదని నమ్మిన కలెక్టర్ సర్ట్ఫికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇలాంటి సర్ట్ఫికెట్ మొదటిసారి జారీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపాడు. స్నేహ ఒక లాయర్ కాబట్టి దీన్ని సాధించుకుంది అని అనుకోకండి.. ఇది ప్రతి పౌరుడికీ సాధ్యమే.. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసమే పనిచేస్తుంది. సామాన్యుల ప్రతి అవసరం, కోరిక నెరవేర్చడం వాళ్ల విధి.. ఇలాంటి సర్ట్ఫికెట్ ఎవరు అడిగినా ప్రభుత్వ అధికారులు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సామాజిక విప్లవంగా మారుతుందేమోనన్న భయంతో వారు దానికి సిద్ధంగా లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని సానుకూలంగా తీసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇదే స్నేహ మనసులోని కోరిక కూడా.. మరి కులమతాలకు అతీతంగా బతకాలనుకునేవారు స్నేహ అడుగుజాడల్లో నడుస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు.