ఎడిట్ పేజీ

పదవులే కీలకం.. విలువలు పతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియడంతో అందరి దృష్టి మరో రెండు నెలలలో జరు గనున్న సార్వత్రిక ఎన్నికలపై పడింది. ఈ ఐదేళ్లు పార్లమెంటు సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరిగాయని తన ముగింపు ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేయగా, రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు వృథాగా జరిగాయని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన సమావేశాల వివరాలను వివరిస్తూ, గతంతో పోల్చితే సభలో చేపట్టిన కార్యకలాపాలు దిగజారుతూ వస్తున్నట్లు వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావించిన రెండు కీలక బిల్లులకు ఈ సందర్భంగా కాలదోషం పట్టింది. అవి ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ బిల్లులు. ఈ బిల్లులను రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకు వచ్చారా? ఆమోదింప చేసుకోవడం కోసం తీసుకువచ్చారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటె వాటిని ఆమోదింప చేసుకోవడానికి ప్రభుత్వ పక్షం నుండి ఎటువంటి ప్రయత్నం జరగనే లేదు. దేశ ప్రయోజనాల కోసం మరోసారి తమకు మెజారిటీ ప్రభుత్వాన్ని అందించాలని మోదీ కోరడం గమనార్హం.
మోదీని గద్దె దింపాలని ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఎప్పుడు ఎటువంటి ప్రయత్నం చేసినా- మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవ్వరో చెప్పండి?- అని భాజపా నేతలు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మీ నాయకుడు ఎవరని నిలదీస్తున్నారు. ఒకే పార్టీకి మెజారిటీ ఉంటే తప్ప సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోలేదని మోదీ మాటలే వెల్లడి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు, మనుగడకు మెజారిటీ మద్దతు అవసరమైనా, ప్రజాస్వామ్య వికాసానికి అంతకన్నా ఏకాభిప్రాయం ముఖ్యం. ఏకాభిప్రాయం ద్వారా తీసుకొనే నిర్ణయాలు ఎప్పటికైనా సర్వజనామోదం పొందగలవు. మరెవ్వరికీ లేనంత ఆధిక్యతతో ఒకప్పుడు ప్రభుత్వం నడిపిన రాజీవ్ గాంధీ, ప్రస్తుతం పూర్తి మెజారిటీతో ప్రభుత్వం నడిపిన మోదీ కన్నా మధ్యలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలే పలు అంశాలలో కఠిన నిర్ణయాలు తీసుకోగలిగాయి. కీలకమైన మార్పులు తీసుకురాగలిగాయి. తగిన హేతుబద్ధత లే కుండా, కేవలం పార్టీ నిరంకుశత్వాన్ని ఆపాదింప చేయడం కోసం రాజీవ్ గాంధీ హడావుడిగా తీసుకు వచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టమే- 400 మందికి పైగా ఎంపీలు ఉన్న ఆయన ఎంతటి అభద్రతా భావానికి లోనయ్యారో వెల్లడి చేస్తుంది. కానీ పీవీ నరసింహారావు చారిత్రాత్మకమైన ఆర్థిక సంస్కరణలు, వాజపేయి ప్రభుత్వం అణు ప్రయోగం, యుపిఎ ప్రభుత్వంలో అణు ఒప్పందం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, భూసేకరణ సవరణ చట్టం... వంటి విప్లవాత్మకమైన మార్పులను చెప్పుకోదగిన వ్యతిరేకత లేకుండా తీసుకురాగలిగారు. కానీ ఇంత మెజారిటీ ఉన్నా నరేంద్ర మోదీ భూసేకరణ చట్టాన్ని సడలించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సమాచార హక్కు చట్టంలో మార్పు తీసుకు రాదలచి వెనుకడుగు వేశారు. జీఎస్టీ అమలు కోసం రెండేళ్లకు పైగా సమాలోచనలు జరపడంతో పాటు, దాని అమలు ప్రారంభమైన సంవత్సరం వరకు మార్పులు చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అవసరమైనది ఎన్నికల కోసం, ఓట్ల కోసం అడ్డదిడ్డంగా కొత్త పథకాలు తీసుకు రావడం కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ని ర్ణయాలు తీసుకురాగాల నాయకత్వం. పీవీ నర సింహారావు, వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో తీసుకువచ్చిన పలు చారిత్రాత్మకమైన చట్టాలు, చర్యలను ఓట్ల రాజకీయాలతో ముడి పెట్టలేము. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నేతలు అభద్రతా భావానికి గురవుతున్నారు. అందుకనే ఎన్నికల ముందు ఎడాపెడా కొత్త కొత్త పథకాల ఆశలు చూపుతూ, వోట్ల కోసం ప్రజలకు నిధులను విరజిమ్ముతున్నారు. దారుణమైన అనైతికతకు పాల్పడుతున్నారు.
నరేంద్ర మోదీ, చంద్రబాబు , మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్... వంటి నేతలు గత ఐదేళ్ల పాలనలో అమలు పరచిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను చూపి, ఇపుడు ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితులలో లేరు. అటువంటి సాహసం చేయలేక పోతున్నారు. అందుకనే మరో రెండు నెలలో ఎన్నికలు వస్తుండగా హడావుడిగా, బలమైన ప్రాతిపదిక ఏర్పర్చకుండా పలు కొత్త పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి దృష్టి అంతా ఓట్లు రాబట్టడం వైపే ఉంది గాని, సుపరిపాలన అందించాలనే ధ్యాస వారెవ్వరిలో కనిపించడం లేదు. కనీసం తాము అమలు చేయచూస్తున్న పథకాలకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఇతర బిల్లుల చెల్లింపులు ఆపివేసి, పథకాల కోసం నిధులను మరలిస్తున్నారు. మళ్ళి గెలిస్తే చూసుకొంటాములే.. అనే తెంపరి తనం వారిలో కనిపిస్తున్నది. ఎన్నికలలో ఏదో విధంగా గెలుపొందాలన్న ఆరాటమే గాని విశాలమైన రాజకీయ లక్ష్యాలను, విధానాలు ఎవరిలోనూ కనిపించడం లేదు. ఎన్నికల పొత్తులు సైతం అందుకు భిన్నంగా లేవు.
పార్లమెంట్ చివరి రోజున లోక్‌సభలో శారద కుంభకోణాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఉధీర్ రంజన్ చౌదరి ప్రస్తావిసూ, మమతా బెనర్జీతోపాటు తృణమూల్ పార్టీలో మెజారిటీ ఎంపీలకు శారదా, ఇతర చిట్‌ఫండ్ కంపెనీల కుంభకోణాలతో సంబంధం ఉందని ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పేద ప్రజలకు చెందిన దాదాపు రూ. 30 వేల కోట్లను మమతా బెనర్జీ, టీఎంసీ ఎంపీలు మింగేశారని ఆయన దుయ్యబట్టారు. శారదా ఇతర చిట్‌ఫండ్ కంపెనీల డబ్బు కాజేసిన వారందరినీ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. కానీ, ఆ సాయంత్రమే శరద్ పవార్ ఇంట్లో మమతా బెనర్జీతో కలసి రాహుల్ గాంధీ సమావేశమై బిజెపికి వ్యతిరేకంగా తామంతా ఒక కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాల్లో తమ పార్టీలు కొట్టుకొంటూనే ఉంటాయి, కేంద్రంలో మాత్రం బిజెపికి వ్యతిరేకంగా కలుస్తాం అంటూ చంద్రబాబు ప్రకటించారు. అంటే వీరి మధ్య బిజెపిని గద్దె దింపి, తాము అధికారంలోకి రావాలనే ఆరాటం తప్ప స్పష్టమైన విధానాలు ఏవీ లేవని వెల్లడి అవుతోంది. బిజెపితో కలసి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకొంటూ నిత్యం ప్రధానమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న శివసేన ధోరణి కూడా ఇంతకన్నా భిన్నంగా లేదు.
రాజకీయ అవసరాల కోసం భిన్న ధోరణులు అవలంబించినా, ప్రజా జీవనంలో మర్యాద పాటించడం చాల అవసరం. నేడు అటువంటి పరిస్థితి కనబడటం లేదు. ప్రధాన మంత్రి తమ రాష్ట్ర పర్యటనకు వస్తే, రాజధానికి కూతవేటు దూరంలో అధికార కార్యక్రమంలో పాల్గొంటే, కనీసం పలకరించే మర్యాదను చూపలేని చంద్రబాబు ఎన్ని సాకులు చెప్పినా ఆయనకు గౌరవం కలిగించవు. నిత్యం బిజెపితో వీధి పోరాటాలకు దిగుతున్న కేరళలోని సిపిఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీ వస్తే విమానాశ్రయంలో స్వాగతం పలికి, తమ సమస్యలను విన్నవించుకొంటున్నారు. భాజపా, సీపీఎం పార్టీలు రాజకీయ పోరాటాలు చేసుకొంటున్నా, వీటి నేతలు కలసి అధికార కార్య క్రమాలలో పాల్గొంటున్నారు.
ప్రధాన మంత్రి పట్ల గతంలో ఇంత అమర్యాదకరంగా ప్రవర్తించిన ఘనత సీపీఎం ముఖ్యమంత్రి జ్యోతిబసుకు మాత్రమే ఉంది. అప్పట్లో ప్రధానిగా వాజపేయి కలకత్తా వస్తే స్వాగతం పలకకుండా తన పెడ ధోరణిని ప్రదర్శించుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు వెళ్లి ప్రధా నికి స్వాగతం పలికితే బిజెపి ఇరకాటంలో పడి ఉండేది. ప్రధాని గుంటూరు సభలో తన హోదాను మరచి వ్యక్తిగత విమర్శలకు దిగి ఉండేవారు కాదేమో.
తెలంగాణ సీఎంగా కేసీఆర్ పదవిని చేపట్టిన కొత్తలో ప్రతి ప్రధాన అంశంపై అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, అందరితో సమాలోచనలు జరుపుతానని శాసనసభలో హామీ ఇచ్చారు. కానీ ఆయనే కాదు.. కేంద్రంలో ప్రధాన మంత్రి గాని, పలువురు ముఖ్య మంత్రులు గానీ అటువంటి సత్సంప్రదాయాలను పాటించడం లేదు. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటక నేతలను అభినందించ వలసిందే. స్థానికంగా ఎంతగా రాజకీయ వైషమ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒకే స్వరం వినిపిస్తారు. పలు మార్లు అఖిల పక్ష ప్రతినిధి వర్గాలతో ప్రధాని వద్దకు వెళ్లారు. ఇటువంటి వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు.
కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు పార్టీ కార్య క్రమాలకు వస్తే వారి విమానాలు దిగడానికి అనుమతి ఇవ్వకుండా మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న అసహనం రాజకీయ విలువల దిగజారుడుకు పరాకాష్ఠగా భావిం చవచ్చు. బెంగాల్‌లో సిపిఎం పాలనలో సహితం బిజెపి నేతల ప్రచారానికి ఎప్పుడూ అడ్డంకులు కల్పించనే లేదు. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అలహాబాద్ యూని వర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరితే అక్కడ శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆందోళన వ్యక్తం చేయడం ఆయన పరిపాలనా సామర్ధ్యాన్ని వెల్లడి చేస్తుంది. తన కార్యక్రమాన్ని రద్దుచేసుకోమని ముందుగానే అఖిలేశ్‌ను కోరవచ్చు. విమానం ఎక్కు తుండగా, ఎటువంటి అధికార ఉత్తర్వులు లేకుండా అడ్డగించడం అహంకార ధోరణినే వెల్లడి చేస్తుంది.
అధికారంలో ఉన్న పక్షాలను ఎన్నికల సమయంలో గద్దె దింపే ప్రయత్నం చేయడం ప్రతిపక్షాల సహజ స్వభావం. అంతమాత్రం చేత వారి పట్ల అసహనం ప్రదర్శించడం తగదు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం నెరవేరుతుంది. భారతీయ ఓటర్లు ప్రపంచంలోనే అత్యంత పరిణతి గలవారిని అనేకమార్లు స్పష్టమైనది. వివేకంగా వారు నిర్ణయం తీసుకోగలరని కూడా రుజువైంది. ఎన్నికల ముందు నేతలు వేసే పిల్లిమొగ్గలు ప్రజలను తప్పు దారి పట్టిస్తాయని అనుకొంటే పొరపాటే. కేవలం భారీ ప్రచారాలతో గెలవటం సాధ్యం కాదు.
నేడు ఏ రాజకీయ పార్టీ కూడా అంతర్గతంగా కూడా విధానపరమైన అంశాలపై సమాలోచనలు జరపడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. దేశ భవిష్యత్ పట్ల ఆందోళన కలిగిస్తున్నది. ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే విధానాలు రూపొందిస్తున్నారు. నాయకులు అనేవారు ప్రజలను నడిపించ గలగాలి గాని, ప్రజల వెంట నడిచే వారు కారా దు అని అంటారు. కానీ ఇప్పుడు ప్రజలను నడిపించగల నేతలు కనిపించడం లేదు. రైతులకు నగదు బదిలీ పేరుతో తమ గృహ అవసరాలకు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఆ విధంగా కేసీఆర్ తెలంగాణలో ప్రయోజనం పొందడంతో నేడు చాలామంది ఆయనను గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయగలమా? అని ఆలోచించడం లేదు.
వ్యక్తులు, కుటుంబాలకు పరిమితమైన పార్టీ నాయకత్వాలు నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. సమష్టిగా నిర్ణయం తీసుకోగలగడమే ప్రజాస్వామ్యం బలం. అటువంటి పరిస్థితులు నేడు దే శంలో లేవు. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్... అనే నినాదం ప్రధాని మోదీ ఇచ్చారు. కాంగ్రెస్ నేడు చాలా బలహీనంగా ఉండవచ్చు. ఆ పార్టీలోని రుగ్మతలు అన్ని పార్టీలకూ వ్యాపించాయి. ఎన్నికలలో నేతలు సీట్లు అమ్ముకోవడమే కాదు, పార్టీ పదవులనూ దాదాపు అన్ని పార్టీలలో అమ్ముకొంటున్నారు. కొంతవరకు వామ పక్షాలను ఈ విషయంలో మినహాయించవచ్చు. రాజకీయ సంస్కరణలు చేపట్టకుండా- కేవలం ప్రభుత్వాలు, నేతలు మారితే దేశంలో చెప్పుకోదగిన మార్పు వస్తుందని చెప్పలేము. గత 30 ఏళ్లుగా దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా- విలువలు దిగజారుతున్నాయి గాని, ప్రజాజీవనంలో చెప్పుకోదగిన మార్పు రావడం లేదు.

-చలసాని నరేంద్ర