మెయన్ ఫీచర్

ఆదివాసీలా? వన్యప్రాణులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు మన వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆదివాసీల భవిష్యత్ ఏమిటి? 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు ఆదివాసీలు అందరికీ వర్తిస్తుందా? తీర్పు అమలు చేయడం ఎలా అంటూ రాష్ట్రాలు న్యాయసలహాలు తీసుకుంటున్నాయి. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు కేవలం పోడు పట్టాలకు సంబంధించింది మాత్రమే. పోడు పట్టాలను తిరస్కరించిన ఆదివాసీలను మాత్రమే అటవీ భూముల నుండి తొలగించాలని తీర్పు చెప్పింది. పోడు పట్టాల వ్యవహారం కూడా చాలా రాష్ట్రాల్లో న్యాయబద్ధంగా, శాస్తబ్రద్ధంగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో 1/70 చట్టాన్ని అమలులోకి తెచ్చినా, చాలా రాష్ట్రాల్లో అటవీ హక్కుల చట్టం -2006 అమలుపై ఆయా రాష్ట్రాలు స్పష్టత ఇవ్వకపోవడం ఆదివాసీల జీవనానికే ముప్పు తెచ్చి పెట్టింది.
దేశవ్యాప్తంగా అసలు అటవీ ప్రాంతం అంటే ఏమిటి? దేనిని అటవీ ప్రాంతంగా గుర్తించారు? ఎస్టీలు ఎక్కడి నుండి ఆవిర్భవించారు? వారి జీవనానికి ప్రత్యేక రాయితీలు కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా అధ్యయనం చేయాలంటే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అటవీ ప్రాంతాల గుర్తింపు చట్టాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలను నోటిఫై చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకోవాలి. ఆనాడు అటవీ ప్రాంతాలుగా నోటిఫై చేసిన భూములను ఏ అవసరం కోసమైనా వినియోగించాల్సి వస్తే వాటిని డీ నోటిఫై చేయాలి, అందుకు కొన్ని నిబంధనలను కేంద్రప్రభుత్వం విధించింది. ఇదంతా కేంద్రం చేతిలో ఉండటంతో అమలులో రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. అటవీ ప్రాంతాల నోటిఫై చేసే అధికారం, డీ నోటిఫై చేసే అధికారం తమకే ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీ హక్కుల చట్టం కారణంగా అటవీ ప్రాంతం కోతకు గురవుతోందని, రోజురోజుకూ కుంచించుకుపోతున్న అటవీ ప్రాంతంతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోందని ‘వైల్డ్‌లైఫ్ ఫస్టు’ అనే ఎన్‌జీవో 2008లో దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌తో పాటు పలువురు అటవీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2019 ఫిబ్రవరి 14న సంచలన తీర్పును ఇచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆక్రమిత అటవీ భూముల్లో సంప్రదాయ అటవీ నివాసితులను ఈ ఏడాది జూలై 24 కంటే ముందే ఖాళీ చేయించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చిత్రం ఏమంటే ఈ కేసు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థల మధ్యనే సాగింది. ఈ వ్యవహారంలో గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ లేకపోవడం విచిత్రం.
అటవీ హక్కు చట్టం -2006 కింద భూ యాజమాన్యం హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను తొలగించి అందుకు సంబంధించిన అఫిడవిట్‌ను తదుపరి విచారణలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలగింపు ప్రక్రియ చేపట్టకుంటే న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తుందని, తీవ్రమైన చర్యలను తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించింది. అటవీ ఆక్రమణలపై ఉపగ్రహ ఆధారిత సర్వే చేపట్టి నివేదిక సమర్పించాలని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ)ని ఆదేశించింది. ఆక్రమణల తొలగింపు తర్వాత పరిస్థితిని మళ్లీ సర్వే చేసి దానిని కూడా నివేదించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆయా రాష్ట్రాల్లోని సుమారు 11 లక్షల మంది ఆదివాసీ కుటుంబాలు వలస వెళ్లాల్సి వస్తుంది. అటవీ హక్కు చట్టం -2006 చెల్లుబాటుపై అనేక స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు , భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిని అటవీ ప్రాంతం నుండి తొలగించకుండా ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాయని నిలదీసింది. చత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖాండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిసా, బీహార్, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, యూపీ, బెంగాల్, మణిపూర్ రాష్ట్రాలు తమ అఫిడవిట్లను ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసీలు 1,14,400 ఎకరాల్లో ఉంటున్నారని, అందులో భూ యాజమాన్య హక్కులు కోరిన 66,351 మంది దరఖాస్తులను తిరస్కరించినట్టు పేర్కొనగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ యాజమాన్య హక్కులు కోరుతూ దాఖలైన 1,83,252 దరఖాస్తుల్లో 82,075 దరఖాస్తులను తిరస్కరించినట్టు పేర్కొంది. దేశం మొత్తం మీద 11,72,931 దరఖాస్తులను తిరస్కరించారు. కానీ మరో అంచనా ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 44 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా అందులో 20.5 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశాల్లోనే దాదాపు 20 శాతం ఉన్నాయి. ఎన్నికలు కారణంగా ఆదివాసీలను పంపించలేకపోయామని ప్రభుత్వాలు పేర్కొనగా, తమ ఆదేశాలకు ఎన్నికలతో పనే్లదని, అమలుచేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమేగాక, రాజకీయ కారణాలతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు కోర్టు ఆదేశాలను అమలుచేయకపోతే వారిని దేవుడే రక్షించాలని కూడా వ్యాఖ్యానించింది. వాస్తవానికి చట్టంలో కూడా లోపాలు ఉండటం ఇబ్బంది కరంగా మారింది. యాజమాన్య హక్కులను తిరస్కరించిన వారిని ఆయా ప్రాంతాల నుండి తొలగించాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. ఈ పరిస్థితుల నుండి ఆదివాసీలను రక్షించాలంటే కేంద్రప్రభుత్వమే సమగ్రమైన ఒక ఆర్డినెన్స్ తీసుకురావల్సి ఉంటుంది. వాస్తవానికి అటవీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకువచ్చింది. 2005 డిసెంబర్ 31 నాటికంటే ముందు మూడు తరాలుగా అటవీ భూమిలో నివసిస్తున్న వారు నాలుగు హెక్టార్లకు మించకుండా భూ యాజమాన్య హక్కు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. గృహ, గ్రామ అవసరాలకు కలప వినియోగానికి సాముదాయక హక్కు పత్రాలను కూడా జారీ చేయాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు పరిశీలించి హక్కులను కల్పించే వీలుకల్పించారు. దీంతో అటవీ ప్రాంతాల్లో రోజురోజుకూ నివాసితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అది కాస్తా వన్యప్రాణులకు ముప్పుగా తయారైంది. 2011 గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో 10.4 కోట్ల మంది ఆదివాసీలున్నారు. అటవీ ప్రాంతాల్లోని 1.70 లక్షల గ్రామాల్లో 20 కోట్ల మంది ఎస్టీలు, ఇతర అటవీ నివాసితులున్నారు. ఒకప్పుడు ఆదివాసీల జాబితాలో లేనివారందరినీ 1970లో ఆదివాసీ జాబితాలో చేర్చడంతో ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తెలంగాణలో పకడ్బందీగా నూతన జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రాలో సీఎం చంద్రబాబునాయుడు కూడా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గట్టి చట్టం అమలులోకి వస్తే ఆదివాసీల భవిష్యత్ అగమ్యగోచరం అవుతుంది. ఆదివాసులకు అటవీ హక్కులు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్న మాటలు నీటిమూటలు కాబోతున్నాయి. 13 ఏళ్ల క్రితం రూపొందించిన చట్టం సమగ్రంగా అమలు కాకముందే అది చెత్తబుట్టలో చేరబోతోంది. చట్టంలో అస్పష్ట అంశాలను సాకుగా చూపుతూ అటవీ హక్కుల కల్పనలో అడుగడుగునా మొకాలుఅడ్డు పడటంతో చాలా మందికి భూ హక్కులు లభించలేదు. ఆదివాసులను అడవుల నుండి వేరుచేయడం అనేది తెల్లదొరల ఏలుబడిలోనే మొదలైంది. పర్యావరణం, అటవీ, వన్యప్రాణి పరిరక్షణ చట్టాల పేరుతో అడవి నుండి వారిని దూరం చేసే వైఖరి నేటికీ కొనసాగుతోంది. ఆదివాసీలను రక్షించాలంటే వన్యప్రాణులను దూరం చేసుకోవాలని కాదు, అలాగే వన్యప్రాణుల కోసం ఆదివాసీల జీవనాన్ని ధ్వంసం చేయమని అంత కంటే కాదు. పలు దేశాల్లో ప్రజల మధ్య ,వాడల మధ్య, గ్రామాల మధ్యనే అటవీ సమతుల్యతను పాటించడమే గాక, వన్యప్రాణుల రక్షణకు ఎంతో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఒక పక్క ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షిస్తూనే మరో పక్క వన్యప్రాణులను పరిరక్షించుకునే అవకాశం ఉందనేది నిపుణుల భావన. దేశం మొత్తం మీద భూభాగంలో 21.54 శాతం అటవీ ప్రాంతం ఉందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అటవీ ప్రాంతం 17.27 శాతం కాగా, తెలంగాణలో అది 18.22గా నమోదైంది. అందులో రెండు శాతం భూమిపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా వారి జీవన భద్రత కల్పిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్ వంటి వారు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రికి లేఖలు కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి ఆదివాసీలను కాపాడాల్సి ఉంటుంది. అదే విధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టంలోనూ స్వల్ప మార్పులు చేయడం ద్వారా వాటినీ పరిరక్షించే వీలుంది.

- బీవీ ప్రసాద్ 9849998090