మెయిన్ ఫీచర్

హరహర మహాదేవ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం జరుపుకునే పర్వదినాలలో మహాశివరాత్రి ప్రధానమైనది. ప్రతి నెలలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు కూడా శివరాత్రి అన్న పేరుతో శివపూజలు చేస్తాము. పనె్నండు నెలల్లో వచ్చే మాస శివరాత్రుల్లోకి ప్రధానమైన పర్వదినం మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ చతుర్దశిని ‘మహాశివరాత్రి’గా జరుపుకోవాలని ధర్మసింధు చెబుతుంది.
మాఘ కృష్ణ చతుర్దశ్యాం
ఆది దేవో మహానిశిః
శివలింగ తమోద్భూతః
కోటి సూర్య సమప్రభమ్‌॥
మహాశివరాత్రినాడు పరమేశ్వరుడు లోక కళ్యాణార్థమై అర్ధరాత్రి సమయాల్లో లింగాకారంలో ప్రావిర్భవించాడు. దీనినే ‘లింగోద్భవ కాలం’ అంటున్నారు. ‘శివ’ అంటే శమించి ఉండేవాడని అర్థం. ‘శ్యమతి పరమానంద రూపత్యా నిర్వికారో భవతీతి శివః’ అంటే బ్రహ్మానంద స్వరూపుడు నిర్వికారుడు గనుక శమించి ఉండే రూపమే శివరూపం అని అర్థం. రాత్రి అంటే సుఖాన్నిచ్చేదని అర్థం. ఈ మహావశివరాత్రి రోజునే క్షీర మథనం జరిగి శివుడు గరళాన్ని తన కంఠంలో దాచుకున్నాడని, పార్వతీ పరమేశ్వరుల పెళ్లిరోజుగానూ శివరాత్రిని జరుపుకుంటారని, గంగ దివి నుండి భువికి వచ్చింది ఈ రోజేనని అనేక కథనాలున్నాయి. సాధారణంగా అన్ని పండుగలు పగలు జరుపుకుంటూ ఉంటాం కానీ ఒక్క మహాశివరాత్రి మాత్రమే రాత్రి జరుపుకుంటాం. ఈ రోజు లింగరూపంలోనున్న శివున్ని అర్చించి, తరిస్తూ, స్తుతిస్తూ పగలంతా శివునితో మమేకమై ఈ రోజు రాత్రి జాగరణ చేసి తపస్సుతో మెలిగినట్లయితే తప్పక శివుడు సాక్షాత్కరిస్తాడు. ఈ రోజు పరమేశ్వరుడు లోకానికి తన స్వరూపం దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవటంలో అర్థంలేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం.
లింగార్చన ప్రాశస్త్యము
శివరూపం సగుణ, సాకార, నిరామయమై, లింగాకారంగా కలియుగాన వెలసి ఉన్నాడు. పంచభూతాలతో నిర్మించబడ్డ ఈ మానవ శరీరం కూడా పంచభూతాత్మకమే. వీటన్నింటి నిదర్శనమే శివరూపం. ఈ పంచభూతాలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. శివుడికి రెండు రూపాలు చెప్పింది శివపురాణం. నిర్గుణ, సగుణం, నిర్గుణ రూపమే లింగం. సగుణ రూపం పంచముఖం. అభిషేకం శివుడికి ప్రశస్తంగాన నిర్గుణమైన లింగాన్ని పూజించడమే శ్రేష్ఠం. సగుణమైన సాకారం ధ్యానించడంలో ముఖ్యం. లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం. లింగం అనగా ‘లియతి గమ్యతే ఇతి లింగో’-లిం అనగా లియతి, ‘గం’ అనగా గమయతి. అనగా ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లియమగుచున్నదో అదే లింగం. ఈ సమస్త సృష్టి పంచభూతాలతో నిండి ఉంది. దీనికి ప్రతీకలుగా పరమేశ్వరుడు కంచిలో ‘పృథ్వీలింగం’గా, శ్రీకాళహస్తిలో ‘వాయులింగం’గా, జంబూకేశ్వరంలో ‘జలలింగం’గా, అరుణాచలంలో ‘తేజో(అగ్ని)లింగం’గా, చిదంబరంలో ‘ఆకాశలింగం’గా, పాంచభౌతిక లింగాకృతిని ధరించి నిరంతరం పూజించబడుతున్నాడు.
శివరాత్రికి లింగోద్భవ కాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మమయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నం లేక లక్షణం అనే అర్థాలున్నాయి. నిజానికి ఆకాశమే లింగం, భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం.
ఆకాశం లింగ మిత్యాహుః
పృథ్వీతస్య పీఠికా
ఆలయః సర్వ దేవానాం
లయనాల్లింగ ముచ్యతే
అని స్కాంద పురాణ వచనం.
శివుడికి పునఃప్రతిష్ఠ లేదు, శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దానే్న పూజిస్తారు.

బిల్వ పత్రార్చన ప్రాధాన్యం
బిల్వానాం దర్శనం పుణ్యం
స్పర్శనం పాపనాశనమ్
అఘోర పాప సంహారం
ఏకబిల్వం శివార్పణమ్‌
బిల్వపత్రం యొక్క దర్శనం వలన పుణ్యం లభించును. వాటిని స్పృశించుటవలన సర్వపాపములు నశించును. ఒక బిల్వ పత్రమును శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించుటవలన ఘోరాలు, ఘోరములైన పాపములు సైతం నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములుగల బిల్వ దళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము అని అర్థం. శివార్చనకు మూడు రేకలు వున్న బిల్వ దళమునే ఉపయోగించవలెను. ఒక్కసారి కోసిన బిల్వ పత్రములు సుమారు పదిహేను రోజుల వరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాడిపోయిననూ దోషం లేదు. మారేడు చెట్టు క్రింద శివుడు కొలువై ఉంటాడని అంటారు.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్
త్రిదళం ఈశ్వరునికి ఎంతో ప్రీతికరం. దీనితోపాటు ఉమ్మెత్తపూలు కూడా ఆయనకు సమర్పించడం మంచిది. బిల్వ పత్రాలలో ఈశ్వరుణ్ణి అర్చించే భక్తులకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు లభిస్తాయని అంటారు. శివునికి ఇష్టమైన సోమవారంనాడు శుభ్రమైన జలంతో అభిషేకించి ఒక్క బిల్వ పత్రం సమర్పిస్తే చాలని అంటారు. కానీ బిల్వ పత్రాలు రంధ్రాలు లేకండా చక్కగా ఉండాలి. ఒక్కొక్క ఆకుగా విడిపోయిన పత్రిని శివునికి పెట్టకూడదు.
పంచామృత అభిషేక ఫలం
అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని ‘పంచామృతం’తో అభిషేకించినట్లయితే శివుని కృపకు పాత్రులు కావచ్చు. పంచామృతం అనగా పాలు, పెరుగు, పేరిన నెయ్యి, తేనె, టెంకాయ నీరుని కలిపిన దానిని పంచామృతం అంటారు. ఇందులో పాలతో జ్ఞానం, సంతానప్రాప్తి, పెరుగుతో దేహప్రీతి నశించటం, తేనెతో ఆరోగ్య ప్రాప్తి, నేతితో విషయ సేకరణ, పిపాస పెరగడం, టెంకాయ నీరులో అహంకారం నశించటం వంటివి ఈ పంచామృతాభిషేకం వలన కలుగుతాయని ఋషులు చెప్తున్నారు.
విభూతి
గంగాధరుని ఫాలభాగంపై విభూతి రేఖలు జీవాత్మ ఆత్మ పరమాత్మలకు సంకేతాలు.. విభూతి నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రం ప్రతిదినము పఠిస్తూ ఉంటే, లలాటమున బ్రహ్మ వ్రాసిన వ్రాత కూడా తారుమారవుతుంది. విభూతి (్భస్మం)్ధరించటప్పుడు ‘ఓం నమఃశివాయ’ అనే మంత్రాన్ని ధరించాలి. అంతేగాక గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహవనీయం అనే ఈ మూడు అగ్నులకు ఈ మూడు భస్మరేఖలు ప్రతీకలు. గంగా, యమున, సరస్వతీ అనే త్రివేణీ సంగమ కూడలి నుదురు. ఇళా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడుల కలయికకు ఆటపట్టు ఆ చోటు. ఆధ్యాత్మిక, అదిధైవిక ఆది భౌతిక తాపాలను ఈ మూడు రేఖలు తొలగిస్తాయి. మనోవాక్కాయ కర్మలను ఆచరించడంలో సంక్రమించే త్రివిధ దోషాలను జన్మాంత దోషాలను తొలగిస్తుంది. భస్మం ధరించనివాడి ముఖాన్ని చూడకూడదని జబాలోపనిషత్తు చెబుతోంది. ఆవుపేడను కాల్చి పొడి చేసి తయారుచేసిన బూడిద, యజ్ఞంలో దర్భలను కాల్చివేసిన బూడిద శ్రేష్ఠమైనది.
ఓం త్రయంబకం యజామహే సుగన్దిం పుష్టివర్థనం
ఉర్వారూక బన్దనాస్మృత్యో ర్ముక్షీయమామృతాత్‌॥
అని అనుకుంటూ నుదుటన విభూతి పెట్టుకుంటే మృత్యుంజయమే! పరమ మంగళమైన శివరూపాన్ని అనుసంధానం చేయగోరేవారు మొదటగా విభూతి ధారణ తప్పక చేయాలి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలి శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటినిండా భస్మం అలదుకుంటాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది శివుడే. పాలకడలిని చిలుకుతుండగా హలాహలం పుట్టగానే సురాసురులంతా మొరపెట్టుకుంది శివుడినే. శివుడు అభిషేకప్రియుడు. ఆయన ఏ సంపదలూ కోరడు. భక్తితో నీరు, బిల్వదళం, పండు ఏది సమర్పించినా పరమానందభరితుడవుతాడు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
సోమనాథలింగం- సోమనాథ్, గుజరాత్
మల్లికార్జున లింగం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
మహాకాళేశ్వర లింగం - ఉజ్జయిని, మధ్యప్రదేశ్
ఓంకారేశ్వరుడు - మధ్యప్రదేశ్
కేదారేశ్వరలింగం - కేదార్‌నాథ్, ఉత్తరాఖంఢ్
భీమశంకర లింగం - భీమశంకర, మహారాష్ట్ర
కాశీవిశే్వశ్వర లింగం - వారణాసి, ఉత్తరప్రదేశ్
త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, మహారాష్ట్ర
వైద్యనాథ లింగం - పార్లీ, మహారాష్ట్ర
నాగేశ్వర లింగం - దారుకావనం, గుజరాత్
రామనాథస్వామి లింగం -రామేశ్వరం, తమిళనాడు
ఘృష్ణేశ్వరలింగం - ఘృష్ణేశ్వరం, ఔరంగాబాద్, మహారాష్ట్ర
ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లను ప్రతిరోజూ పఠించడం చాలా మంచిది.
వేదాంత శివుడు
శివుడి దక్షిణ హస్తంలోని త్రిశూలం సత్వరజస్తమో గుణాలను సూచిస్తాయి. ఎడమ చేతిలోని డమరుకం శబ్దబ్రహ్మాన్ని ప్రతిధ్వనిస్తుంది. సకల భాషలకూ ఆధారభూతమైన ఓంకారం, సంస్కృత భాష ఈ డమరుకంలోనే ప్రతిబింబిస్తాయి. శివుని శిరస్సులోని నెలవంక మనసుని నియంత్రించే శక్తికి ప్రతీక. విషయ వ్యాధులను జయించడానికి సూచనగా పులిచర్మంమీద ఆసీనుడై ఉంటాడు శివుడు. కంఠంలో సర్పాన్ని ధరించడం వివేకానికి, శాశ్వతత్వానికి ప్రతీకగా భావిస్తారు. సర్పం జీవాత్మకు ప్రతీకగా ఆయన కంఠంలో అలరారుతుంది. ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే శివనామస్మరణం సకల పాపహరణమంటారు. పంచాక్షరి పఠనం శ్రేయోదాకం. తెలుగునాట శివక్షేత్రాలకు కొదవలేదు. శివ అంటేనే మంగళం. శ్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని అమరకోశం వ్యాఖ్యానిస్తోంది. మహాశివరాత్రినాడుచేసే శివారాధనవల్ల మానసిక దోషాలు తొలగుతాయి. శివరాత్రినాడు శివుడిని ఆరాధించడం శివరాత్రి జాగరణ చేయడం గొప్ప విశేషం. ఇది కోటి యాగాల ఫలాన్ని ప్రసాదిస్తుంది. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు. మనం కూడా శివాలయాన్ని సందర్శించి, జాగరణ, ఉపవాస, అభిషేకాలతో శివుణ్ణి పూజించి మన జన్మను సార్థకం చేసుకుందాం.

- కె. రామ్మోహనరావు, గద్వాల్