మెయిన్ ఫీచర్

శివశివ అనరాదా మనసా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.
‘‘వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే, జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’ అని స్త్తులంధుకునే పార్వతీ పరమేశ్వరులిద్దరూ మితిలేని వాత్సల్యాన్ని కురిపించేవారే. సర్వమంగళ అయిన పార్వతి జగజ్జనని కాగా, సకల శుభంకరుడు శంకరుడు జగత్పిత. వారే లోకాలన్నింటకీ తల్లీదండ్రీ. వారిద్దరే ఆదిదంపతులు. శివశక్తులు లేనిదే ఏకార్యమూ కాదు అసలే సృష్టే లేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఆ తల్లిని అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని గౌరవిస్తారు. ఆ తండ్రిని ‘‘శివం కరోతి శంకరః’ శుభాలను కలిగించేవాడు శంకరుడు అని కీర్తిస్తారు.
మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం.లయకారుడైన హరుడు తేజోలింగరూపమున వెలసిన మహా పర్వదినమే శివుడు లింగోద్భవుడైన శుభసమయం. ఆనాడు ఉపవాసం, జాగారం, అభిషేకం, పూజాదికాలలో నిమగ్నమై శివభక్తితత్పరులౌతారు భక్తజనం. ఆదిఅంతాలు, రూపవికారాలు, నావౌచిత్యాలు లేని అఖండ జ్యోతిస్వరూపంలో శివుడు శివరాత్రి నాడు దర్శనమిచ్చాడు.
‘‘శివరాత్రి రితిఖ్యాతా తిధి రేఫా మమ ప్రియా’’- ‘‘ఈ రోజు పవిత్రమైనది. నాకు ప్రియమైనది. ఇక మీదట ఈ దినం శివరాత్రిగా ఖ్యాతినొందుతుంది’’ అని ఈ మాటలు సాక్షాత్తు పరమ శివునినోటి వెంట వచ్చాయని శివపురాణం చెబుతుంది. వేదవాఙ్మయంలో రుద్రుని రుతుపవనంతో పోల్చడం జరిగింది. మేఘములు కేశములుగానూ, మెరుపు రంగుగానూ, ఉరుము గర్జనగానూ, ప్రచండవాయువు ప్రళయ స్వరూపంగానూ రుద్రుని భావన చేస్తారు. అందుకే ఆయనను కపర్ది; వ్యోమకేశుడు, వర్షీయుడు అన్న పేర్లతో కీర్తించారు.
సాకారుడూ, నిరాకారుడూ అయిన ఆ మహాదేవుని స్మరించుకోవడం ముక్తిదాయకం.‘స్వస్తి శివం కర్మాస్త్వితి’ అనగా కర్మములు శివునిచే కాపాడబడుతాయని వేదం చెబుతుంది. శివనామం స్మరిస్తూ అసువులు బాసిన వ్యక్తి ఎన్నో జన్మలుగా చేసిన ఘోర పాతకముల నుంచి విముక్తి పొంది మోక్షగతిని పొందుతాడని కూడా పురాణాలు పల్కుతూన్నాయి.నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటుకొని ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొంది శివసాయుజ్యం పొందుతారని భారతీయ రుషిగణం ప్రవచిస్తోంది.
‘శం’అంటే మేలు అని అర్థం. ‘కర’అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడయ్యాడు’. ఆ స్వామి సర్వాంతర్యామి. భక్తితో ఆర్తిగా పిలిస్తే వచ్చి ఆదుకుంటాడు. శివతత్త్వంలో శివ, రుద్ర, ఈశ్వర అనే పేర్లు ప్రధానం. రుద్ర అనే శబ్దానికి దుఃఖ నివారకుడుఅని, శివ అంటే మంగళకరుడని, ఈశ్వర అంటే సర్వ నియామకుడని అర్థాలు ఉన్నాయ.
శివ శబ్దం మంగళకరం. తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ముందు వెనుకలు చూడకుండా వరాలిస్తాడు. శివ శబ్దం కల్యాణకరమైన ముక్తినిచ్చు పదం. శివస్తోత్రం పరమ పావనం. శివనామం అనే దావానలంతో సమస్త పాపరాసులూ అనాయాసంగా భస్మమైపోగలవు. అభ్యుదయాన్ని కోరుకునే ప్రతి వ్యక్తీ శివనామ సంకీర్తనం చేస్తేనే సత్ఫలితాలనే పొందుతాడు. సంసారచక్రంలో ఇరుక్కుని తాపత్రయపడేవారు కూడా ఆ శివుడిని ‘సంసార గహన తారకమూర్తి’ అని సంకీర్తన చేస్తే చాలు సంసార చట్రం నుంచి విడవడవచ్చు.
శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి నాటి రాత్రి నాల్గు జాములలో విధి విధానంగా క్రమపద్ధతిలో శివుణ్ణి అర్చించాలన్నది శాస్త్ర వచనం. ఈ విధంగా పూజలు చేయుటకు వీలుకాని పక్షంలో ‘శివప్రీత్యర్థం శివరాత్రౌ శివపూజాం కరిష్యే’ అని సంకల్పించి పూజించవచ్చునని కూడా శాస్త్రాలు పల్కుతూన్నాయి. శివరాత్రివ్రతంనాడు సత్యం, అక్రోధం, బ్రహ్మచర్యం, దయ, క్షమ, లాంటి గుణాలతో ఉపవసించాలి. ఈ శివరాత్రి వ్రతాన్ని 12 ఏళ్లు గాని, ఇరవై ఏళ్లుకాని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఈలోకంలోనూ, పరలోకంలోనూ సుఖశాంతులు లభిస్తాయని ఈశ్వర సంహిత తెలుపుతోంది.

- కందాల. వెంకటేశ్