మెయన్ ఫీచర్

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ‘సీమ’కు అన్యాయమే జరుగుతోంది. పాలకులు ఇక్కడి వారే అయినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ నూతన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా సమైక్యత కోణంలో సీమ ప్రజలు స్వాగతించారు. అమరావతి ప్రాంతం ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమైన రాజధాని. నూతన రాజధాని వద్ద 29 గ్రామాల్లో ఏ మూలకు వెళ్లిన గజం స్థలం ధరను 15వేల నుంచి 75వేల రూపాయల వరకు చెబుతున్నారు. దీంతో అట్టడుగు, మధ్యతరగతి ప్రజలకు అమరావతి ప్రాంతం కేవలం ఓ మ్యూజియం మాత్రమే. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికీ శివార్లలో స్థలాల ధరలు అందుబాటులో ఉన్నాయి. అమరావతి వద్ద జనానికి జీవనోపాధి కల్పించే వనరులు లేవు. పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు కాస్త పెరగవచ్చు. నిర్మాణ దశలోనే అమరావతిలోకి పేదలు, మధ్యతరగత వర్గాలు రాకుండా ఆంక్షలు విధించినట్లయింది. సొంత రాజధానిలో రాష్ట్ర పౌరులే పరాయివారన్న భావన కలిగేలా పరిస్థితులున్నాయి.
ఎట్టకేలకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమైంది. గోదావరి జిల్లాలకు వరం లాంటి పోలవరం ప్రాజెక్టు పనులు చకాచకా సాగుతున్నాయి. మిగతా ప్రాంతాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అమరావతిలో హైకోర్టు ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.
రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత సీమనేతలే రాజ్యాధికారం చేజిక్కించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాం తంలో సామాజిక వర్గాల మధ్య పరస్పర వైరుధ్యాలు, నాయకత్వ లక్షణాల లేమి వల్ల సీమ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. హైకోర్టును ఒకప్పటి రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని సీమ ప్రాంత ప్రజలు కోరారు. రాజధానిలోనే హైకోర్టు ఉంటే బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షకు ఎవరూ ఎదురుచెప్పలేకపోయారు. సీమప్రజలు వచ్చే ఐదేళ్లలో తేల్చుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి హైకోర్టు బెంచి, రెండవది కర్నాటక, మహారాష్ట్ర, కశ్మీర్ తరహాలో రెండవ రాజధాని ఏర్పాటు. రాష్ట్ర సమగ్రత దృష్ట్యా పాలకులు ఈ రెండు డిమాండ్లను ఆమోదించాల్సి ఉంటుంది. ఇవేమీ ఆచరణలో అసాధ్యమైన డిమాండ్లేమీ కావు. రాజకీయ సంకల్పం ఉంటే చాలు. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా, రైల్వేజోన్‌కు అర్హతలున్న గుంతకల్‌ను నిర్లక్ష్యం చేసినా సీమవాసులు కిక్కురమనలేదు. గుంతకల్ డివిజన్‌లో కర్నాటకలోని రాయచూరు, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంత మంతా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రాయచూరు, వాడి ఎక్కడ? విశాఖ ఎక్కడ? కానీ కర్నాటక ప్రజలు ఏమైనా మాట్లాడారా? శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రైల్వే స్టేషన్లను విశాఖ జోన్‌లో కలపాలన్న కొన్ని పార్టీల డిమాండ్‌లో తప్పేమీలేదు. రైల్వేజోన్ వచ్చినా, డివిజన్ గల్లంతైందని, ఏడు స్టేషన్లు కలపలేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. సీమ నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్ హైవే లేదా జాతీయ రహదారి నిర్మాణం కావాలంటే మరో పదేళ్లు పడుతుంది. ఇప్పటికీ దోర్నాల ఘాట్ రోడ్డు ద్వారా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. రాయలసీమ తన పూర్వ ఔన్నత్యాన్ని పొందాలంటే రెండవ రాజధాని, హైకోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటు చేయాలి.
కర్నాటకలోని బెల్గాంలో ఏటా ఒక సీజన్‌లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. మహారాష్టల్రోని నాగపూర్‌లో కొన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరుపుతున్నారు. కశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్ములలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కర్నాటకలో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకుని బెల్గాంలో రెండవ రాజధానిని ఏర్పాటు చేశాయి. బెంగళూరులో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉండగా- గుల్బర్గా, ధార్వాడ్‌ల్లో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ముంబయిలో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉంటే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, పానాజీలో బెంచ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో కొల్హాపూర్, పూణెలలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులోని చెన్నైతో పాటు మధురైలో, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌తో పాటు ఇండోర్, గ్వాలియర్‌ల్లో, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌తో పాటు లక్నోలో, బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు జల్పాయ్‌గురిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు రాజధాని రాయ్‌పూర్ అయినా హైకోర్టును బిలాస్‌పూర్‌లో, కేరళ రాజధాని తిరువనంతపురం అయితే కోచిలో, ఒడిశా రాజధాని భువనేశ్వర్ అయితే హైకోర్టును కటక్‌లో ఏర్పాటు చేశారు.
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు లేదా వైఎస్ జగన్‌లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారన్న వాదనలున్నాయి. ఈ ఇద్దరు నేతలూ రాయలసీమ బిడ్డలే. పంతాలకు, స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పి సీమనేతలు కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. ఇది జరగనపుడు మరోసారి సీమ ప్రజలు మోసానికి గురవుతారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలను హైకోర్టు బెంచి, రెండవ రాజధాని అంశంపై సీమ ప్రజలు, మేధావులు నిలదీయాలి. హైకోర్టు బెంచి స్థానంలో సర్క్యూట్ బెంచిని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనలను ప్రభుత్వాలు చేస్తుంటాయి. వాస్తవానికి సర్క్యూట్ బెంచిల వల్ల ప్రయోజనం ఉండదు. సంవత్సరానికి కొన్ని రోజులు హైకోర్టు న్యాయమూర్తులు సర్క్యూట్ బెంచి ఉన్న నగరానికి వచ్చి కేసులను విచారిస్తారు. ఈ తరహా బెంచిలను గుల్బర్గా, ధార్వాడ్‌లలో ఏర్పాటు చేసినట్లే చేసి, వెంటనే వాటి స్థానంలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం, 100 కోట్ల రూపాయలు అవసరం. ఇదేమీ పెద్ద బడ్జెట్ కాదు. కర్నూలులో రాయలసీమ విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో లా కాలేజీని ఏర్పాటు చేయవచ్చు. హైకోర్టు బెంచి పరిధిలో నెల్లూరు జిల్లాతో పాటు పాత కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను తీసుకురావచ్చు.
హైకోర్టు బెంచి ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాష్ట్రం పంపే ప్రతిపాదనలను కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరస్కరించదు. సామాన్య ప్రజలకు అందుబాటులో న్యాయస్థానాలు ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను తిరస్కరించిన సందర్భాలు లేవు. ఔరంగాబాద్ హైకోర్టు బెంచి ప్రతిపాదనను ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్క రోజు వ్యవధిలో అమోదించారట! 230వ ‘లా కమిషన్’ తన నివేదికలో హైకోర్టు బెంచిలను వీలైనన్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. జస్టిస్ జశ్వంత్ కమిషన్ కూడా బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని, ఉన్నత న్యాయస్థానాలను కోరింది. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు. 1866లోనే అలహాబాద్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక లక్నో బెంచ్ ఏర్పాటు చేశారు. మీరట్, గోరఖ్‌పూర్‌లలో హైకోర్టు బెంచిలను ఏర్పాటు చేయాలని 70 ఏళ్లుగా న్యాయవాదులు, ప్రజలు పోరాడుతున్నారు. ఎక్కువ మంది ప్రధానులు యూపీ నుంచే వస్తున్నా, బెంచ్ ఏర్పాటు చేయరని యూపీ న్యాయవాదులు వాపోతున్నారు. రాయలసీమది కూడా ఇదే దుస్థితి. చాలామంది సీఎంలు సీమవాసులే అయినా ఈ ప్రాంతాభివృద్ధికి వారి స్పందన అంతంత మాత్రమే.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్‌లోనే ఉంది. విశాఖపట్నం లేదా విజయవాడలో ఎన్‌సీఎల్‌టీని ఏర్పాటు చేయాలి. న్యాయశాఖ పరిధిలోని అనేక ట్రిబ్యునల్స్ హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నాయి. వీటిని విభజించి ఆంధ్ర రాష్ట్రానికి తరలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తగిన కార్యాచరణకు పూనుకునే విధంగా జనం వత్తిడి తేవాల్సి ఉంది. దీనికి కిందిస్థాయి నుంచి శాంతియుత మార్గంలో ఉద్యమ నిర్మాణం జరగాలి. ఉత్తరాంధ్రలో రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి రైల్వే జోన్‌ను సాధించాయి. హైకోర్టు బెంచి, రెండవ రాజధాని సాధించేందుకు సీమ న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి. రాజకీయ పార్టీలు సంకుచిత ధోరణిని విడనాడి సముచిత నిర్ణయాలను తీసుకోవాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097