మెయిన్ ఫీచర్

చెట్టెక్కిన హిట్టు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరాణికంలో-
పధ్నాలుగేళ్లు అధికారానికి దూరమైతే -రాజ్యం కోల్పోవాల్సి వస్తుందన్నది మహాభారత నియమం. అందుకే -సుయోధునుడు కుట్రపన్నాడు. జూదమాడించి.. పాండవులను ఓడించి -పనె్నండేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం నియమాన్ని విధించాడు. అరణ్యవాసం పూర్తిచేసిన పాండవులు, విరాటుని కొలువుకు చేరి ఏలాగో అజ్ఞాతవాసాన్నీ ముగింపునకు తెచ్చారు. చివరి ఘడియల్లో విషయం తెలుసుకున్న దుర్యోధనుడు -కలుగులోవున్న పాండవులను కెలికి బయటకు రప్పించే కుట్రపన్నాడు. ఫలితంగా విరాట్ వర్సెస్ విలన్ యుద్ధానికి తెరలేచింది. రాజు కొలువులో నక్కిన పాండవులు బయటకు వస్తారని దుర్యోధనుడి ఆలోచన. వ్యూహం ఫలించింది కానీ, లెక్కతప్పి అప్పటికే అజ్ఞాతవాసం పూరె్తైంది. దాంతో బృహన్నల వేషం తీసేసి -పాండవ మధ్యముడు సీన్‌లోకి దిగాడు. జమ్మి చెట్టునుంచి ‘గాండీవాన్ని’ దింపాడు. యుద్ధాన్ని గెలిచి హీరోగా హిట్టందుకున్నాడు. ఈ స్టోరీకి ‘గాండీవం’ హిట్ పాయింట్.

జానపదంలో..
యథాప్రకారం విక్రమార్క మహారాజు అర్థరాత్రి ఊరి చివరికెళ్లాడు. బ్యాక్‌డ్రాప్‌లో నక్కల ఊళలు, వింతశబ్దాలు. అతని ముఖంలో ప్రశాంతత తప్ప భయం లేదు. చూస్తేనే -గుండాగిపోయే మర్రిచెట్టు చెంతకు చేరాడు. భూమిలోకి ఊడల్ని దింపి కొమ్మలనే మిడిగుడ్లేసుకుని చూస్తున్న మర్రి మొదలెక్కి కొమ్మల్లోకి చూశాడు. దాపులో శవం. కిందకు దింపాడు. శవాన్ని భుజానేసుకుని బయలుదేరుతుంటే -్భయంకర భూతం ప్రత్యక్షమైంది. విక్రమార్కుడికి అడ్డంగా నిలిచింది. ‘ఆగు విక్రమార్కా, నాకు జవాబు చెప్పిగానీ శవాన్ని తీసుకెళ్లలేవు’ అంటూ ఓ తిక్క ప్రశ్న వేసింది. విక్రమార్కుడు వౌనం వహించాడు. భుజంనుంచి మాయమై శవం తిరిగి చెట్టెక్కేసింది. ఈ స్టోరీలో సీడ్ పాయింట్ ‘విక్రమార్కుడి వౌనం’.
**
ఈ రెండు కథల్నీ -హిట్టుకు దూరమైన హీరోలకు అన్వయించాలి. ఎందుకంటే -చాలాకాలంగా సరైన హిట్టులేక విలవిల్లాడుతున్న హీరోలే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాప్ అవుతున్నారు. స్క్రీన్‌మీద ఎన్ని వేషాలేసినా -హిట్టుకొట్టినోడే హీరో అన్నది టాలీవుడ్ థియరీ. హీరోలు ఎంత హంగామా చేసినా, ఎముకల్ని పిండేసే మెలికలు తిరిగి డ్యాన్స్‌లేసినా, దుమ్మురేపే ఫైట్లు చూపించినా -ఫైనల్‌గా హిట్టుపడిందా? లేదా? అన్నదే ఆడియన్సూ చూసేది. హిట్టుకొడితే హీరో, లేదంటే జీరో. హిట్టుపడిన హీరోల ఫ్యాన్సూ కాలరెగరేసుకుని బిల్డప్ ఇస్తారు. ఫ్యాన్స్‌ని హోల్డ్ చేసి క్రేజ్‌ని సంపాదించాలంటే హిట్టొక్కటే మార్గం. సో, హీరోలంతా హిట్టుకోసం ఎగబడుతూనే ఉన్నారు. చెట్టుమీదున్న హిట్టు (గాండీవం)ని దింపి చేతబట్టాలనే సినిమాలు చేస్తున్నారు. కానీ, విడుదలైన తరువాత భుజంమీదున్న శవం మాత్రం -మళ్లీ చెట్టేక్కేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించాలన్న ‘ప్రయత్నం’ కథ మళ్లీ మొదలవుతుంది.
***
గత ఏడాది సరైన హిట్‌లేక అభిమానులను ఎలా సంతోషపెట్టాలి? క్రేజ్ ఎలా నిలుపుకోవాలన్న విషయంలో చాలామంది హీరోలే అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. చేస్తున్న సినిమాలన్నీ హిట్టవ్వవు కదా. ఒకవేళ సక్సెస్‌ఫుల్ దర్శకుడితో సినిమా చేసినా, అది హిట్టవుతుందన్న గ్యారంటీ జీరో. సో ఇలాంటి టెన్షన్‌లోవున్న టాలీవుడ్ హీరోలపై ఓ లుక్కేద్దాం.
గతేడాది స్టార్ హీరోలంతా అద్భుతంగా నటించేశారు. వెండితెరపై అదరగొట్టారు. అంతవరకు బాగానే వుంది. కానీ కొందరు హీరోలు మాత్రం డిజప్పాయింట్ చేశారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ మంచి కంటెంట్ తీసుకుని దానికోసం మేకోవర్ కూడా మార్చేసి, ఓ రేంజ్ సినిమా చేశాడు. కానీ సినిమా మాత్రం డిజాస్టరైంది. ఆ ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందంటే, దాదాపు ఎనిమిది నెలలపాటు నెక్స్ట్ సినిమా విషయంలో టెన్షన్ పడ్డాడు బన్నీ. ఎలాంటి కథను ఎంచుకోవాలి, ఏ దర్శకుడితో చేయాలంటూ. కొత్త ఏడాదిలో హిట్ కొట్టాలని ఆశపడుతున్న బన్నీ, సేఫ్ గేమ్ మొదలెట్టాడు. ఫైనల్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కమిటయ్యాడు. అయినా ఇంకా ఆ సినిమా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. అటు త్రివిక్రమ్ కూడా అరవింద సమేతతో మంచి హిట్టందుకున్నాడు. ఇపుడు దాన్నిమించిన హిట్ ఇవ్వాలన్న తాపత్రయంలో ఉన్నాడు. ఈ సినిమా మార్చి చివరిలో మొదలవుతుందని టాక్.
ఇక ఈ జాబితాలో తరువాత ప్రస్తావించాల్సిన హీరో -నాచురల్ స్టార్ నాని. గతేడాది నాని రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి కృష్ణార్జునయుద్ధం. అంతకుముందు వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి కృష్ణార్జునయుద్ధం పెద్ద బ్రేక్ వేసింది. దీంతో కథల ఎంపికలో కాస్త జాగత్త్రగా ఉండాల్సిందేనని ఫిక్సయ్యాడు. కృష్ణార్జునయుద్ధం తర్వాత నాగార్జునతో కలిసి చేసిన దేవదాస్ అంటూ ఓ మల్టీస్టారర్ చేశాడు. ఈ సినిమా బాగానే వుందని టాక్‌వచ్చినా, క్రెడిట్ మాత్రం నాగ్ అకౌంట్‌లో పడింది. దీంతో నానికి మరో హిట్‌తో ప్రూవ్ చేసుకునే అవసరమొచ్చింది. దాంతో కథలన్నీ జల్లెడ పట్టేసి ఫైనల్‌గా కొత్త దర్శకుడితో ‘జెర్సీ’ అంటూ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం నాని హోప్స్ జెర్సీపైనే.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఫ్లాపుల్లో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. చేసిన ఆరు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో ఇపుడు తేజ్‌కి అర్జెంట్‌గా హిట్టవసరమైంది. లేదంటే సాయిధరమ్ తేజ్ హీరో ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం. అందుకేనేమో మంచి కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే కిషోర్ తిరుమలతో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ ఆశలన్నీ ఇపుడు దీనిపైనే. దాంతోపాటు గీతగోవిందం అంటూ మంచి హిట్టిచ్చిన పరశురామ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు.
మాస్ రాజాగా క్రేజ్ తెచ్చుకున్న రవితేజ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వరుస పరాజయాలతో టెన్షన్‌పడిన రవితేజ, ఏడాది గ్యాప్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినా ఫలితం మాత్రం దక్కలేదు. రాజా ది గ్రేట్ తప్ప మిగిలిన సినిమాలన్నీ తేలిపోవడంతో, ఇపుడు ఆయనకు అర్జెంట్‌గా హిట్టు అనివార్యమైంది. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చల్లో వున్నాడు. ఇక గోపీచంద్‌కి సీనియారిటీ పెరుగుతోంది తప్ప, హిట్ల లిస్ట్‌లో మార్పు లేదు. ఇటీవలే ఓ థ్రిల్లర్ మొదలెట్టాడు కానీ, సక్సెస్ రుచిచూసి అయితే చాలాకాలమే అవుతోంది. ఇప్పటికే ఆరడుగుల బుల్లెట్ అంటూ ఓ సినిమా చేస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇక మిగతా హీరోల గురించి చూస్తే -రాజ్‌తరుణ్ ట్విట్టర్‌లో చాట్ దగ్గర తప్ప ఎక్కడా కనిపించడం లేదు. అసలు కొత్త సినిమా ఎపుడు స్టార్ట్ చేస్తాడో క్లారిటీ లేదు. రెండేళ్లు వరుస ఫ్లాప్‌లతో మొహం వాచిపోయిన ఈ యంగ్ హీరోకి అర్జెంటుగా ఓ బ్రేక్ కావాలి. నితిన్‌కు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి కానీ, ఒక్కటీ స్టార్ట్ కాలేదు. ఇక నిఖిల్ ముద్రను అర్జున్ సురవరంగా మార్చి తన ఫ్లాప్ అడ్రస్ మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కినేని హీరోలు నాగచైతన్య ప్రస్తుతం సమంతతో కలిసి మజిలీ మొదలెట్టాడు. అఖిల్ మాత్రం ఎప్పటిలాగే మిస్టర్ మజ్నుతో మరో ఫ్లాప్ అందుకుని నెక్స్ట్ సినిమా ఏమిటా? అనే సందిగ్ధంలో ఉండిపోయాడు. అల్లరి నరేష్ చేతిలో మహర్షి సినిమా ఒక్కటే వుంది. అదీ హీరోగా కాదు, సపోర్టింగ్ రోల్. మంచు హీరో లైట్ సినిమాలు మరచిపోయినట్టు కనిపిస్తోంది. ఇంతమంది హీరోలకు నిర్మాతలున్నా, సరైన బ్రేక్‌నిచ్చే కథలు, దర్శకులు మాత్రం కనిపించటం లేదు. ఈ లిస్టుకు హిట్టిచ్చే ‘హీరో’లెవరో?

-శ్రీనివాస్ ఆర్ రావ్