మెయిన్ ఫీచర్
వినాశకర శక్తులపై ‘కలం’ దూయాల్సిందే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ భూగోళంమీద మానవుడి మనుగడ మాసిపోకుండా ఉండాలంటే పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండాలి. ప్రకృతి సంపదను నాశనం చేయకుండా పరిరక్షించి భావితరాలకు అందించడమే భవిష్యత్తు తరాలకు నేటితరం వారసత్వంగా ఆత్మజ్ఞానంతో బహుకరించే వరంగా భావించాలి. ప్రకృతి సంబంధం లేకుండా మానవుడి ఉనికి మనలేదనేది సత్యం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ నూతన సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం నేల విడిచి సాము చేసినట్లుగానే ఉంటుంది అనడం యధార్థం.
ఈనాడు పెట్టుబడిదారీ వర్గాలు పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిస్తూ నవ సమాజ నిర్మాణ దృక్పథంతో ప్రకృతి సంపదను కొల్లగొట్టడం జరుగుతోంది. ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జల విద్యుత్ ప్రాజెక్టులు, పురుగుమందు ఫ్యాక్టరీలు కడుతున్నారు. పర్యావరణాన్ని విష వాయువులతో, కాలకూట కాలుష్యాలతో నింపివేస్తున్నారు. మితిమీరిన స్వార్థంతో ధనార్జనే ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు ప్రజల అవసరాలకు సంబంధం లేని వస్తు ఉత్పత్తిని చేస్తున్నారు. మానవ సంబంధాలను వ్యాపార వస్తువులుగా మార్చి పారేసే యత్నంలో సఫలీకృతులవుతూ, వారి వస్తువులను మార్కెట్ చేసుకుంటూ అపర కుబేరులుగా చలామణి అవుతున్నారు. పాలకుల్లో నయా ఉదారవాదం చోటుచేసుకునే కొద్ది, పెట్టుబడిదారీ వర్గాలు ప్రభుత్వాలతో కుమ్మక్కయి విచ్చలవిడిగా ప్రకృతి సంపదను హరిస్తున్నారు. అడ్డు ఆపు లేకుండా అనేక ప్రకృతి కీలక వనరులను కబళిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పారిశ్రామికవేత్తలు దోపిడీతనాన్ని దొరతనంగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదార వాద విధానాలవలన పెట్టుబడిదారీ వర్గాలు తమ సంపదను అంతులేని ఎత్తులకు పెంచుకుంటున్నారు. శ్రమజీవులు అట్టడుగు స్థితికి చేరుకుని అలమటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ పర్యావరణ వినాశనానికి పాల్పడుతుంది. ప్రజల్ని వస్తువ్యామోషితుల్ని చేస్తూ, వ్యసనపరుల్ని చేస్తూ, దిగజారుడుతనాన్ని ప్రోత్సహిస్తూ పాలకవర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా పబ్బం గడుపుకుంటున్నారు. పెట్టుబడిదారీ వర్గాలు తమ చేతుల్లో జనాన్ని కీలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారు. ప్రకృతి వనరుల కొరత ప్రపంచానే్న పట్టి పీడించే దశకు చేరుకుంది. తక్షణ లాభాలకు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న పారిశ్రామిక వర్గాలకు కళ్ళెంవేసే పాలకులే లేకుండా పోతున్నారు. దోపిడీలో కార్పొరేటెడ్ వర్గాలతో చేతులు కలిపి పాలక పక్షాలు కూడా ఆస్తులు కూడేసుకోవడమే పరమావధిగా భావిస్తున్నారు.
ఆకలి, రోగాలతో అత్యధిక శాతం ప్రజలు అలమటిస్తుంటే ఏ కొద్దిమందో దోపిడీ వర్గాలు అపరకుబేరులై విలాస జీవితాన్ని వెలగబెడుతున్నారు. పేదలగానైనా ప్రకృతి రక్షణలో ప్రజలు సుఖశాంతులతో గడిపే వీలులేకుండా వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని సృష్టించేందుకు సహకరిస్తూ మోడరన్ టెక్నాలజీ ముసుగులో కార్పొరేట్ వ్యాపార సంస్థలు తమ ఆర్థిక వనరులను మెరుగుపరచుకుంటున్నాయి. ప్రజల్లో అత్యధిక మందికి పెట్టుబడులు లేకపోయినా పాశ్చాత్య దేశాల సంస్కృతి సంప్రదాయాల కారణంగా ప్రతి మానవుడిలో పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలు అంతర్లీనంగా వ్యక్తవౌతున్నాయి. వస్తువ్యామోహితులైన జనం పక్కవారిని దోపిడీ చేయడం సహజ లక్షణంగా భావించడం పరిపాటైపోతుంది.
పర్యావరణ పరిరక్షణకోసం, ప్రకృతి సమతుల్యతకోసం, బడా పారిశ్రామిక వర్గాల దోపిడీ నుండి ప్రకృతి సంపదను సంరక్షించుటకోసం పెద్దసంఖ్యలో కవులు, రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను విప్పి ఉద్యమంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యంపై తిరుగుబాటు తలెత్తడానికి సంకల్పబలాన్ని కలిగించే భావజాలాన్ని సాహితీవేత్తలు కళాకారులు వారి వారి సాహిత్యం మరియు కళారూపాల వలన కలిగించాలి. పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీని ఆర్థిక లాభాపేక్షకు మాత్రమే వాడుకుంటూ పర్యావరణ వినాశనాన్ని పట్టించుకోకపోవడమే మానవ జాతికి ఆ వర్గాలు చేస్తున్న ద్రోహంగా చెప్పుకోవచ్చును. పెట్టుబడిదారీ వర్గాలు పారిశ్రామికవేత్తలుగా అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ తమ వినాశకర విధానాలను నిరాఘాటంగా కొనసాగిస్తూ, ప్రకృతి వనరులను అవసరం మించి వాడుకుంటూ, పర్యావరణ విఘాతానికి మూలకారకులవుతున్నారు. జీవజాతులు మానవుడు కలసి జీవించే వనరులను సర్వనాశనం చేస్తూ మనిషికి ప్రకృతికి మధ్య అదృశ్యకుడ్యాలను నిర్మించే స్వార్థం అగ్ర దేశాల నైజంగా మారిపోతుంది.
సాహిత్య రంగం మొదటినుంచి రెండు ప్రధానమైన మార్గాలుగా విడివడి సాగిపోతుంది. ఒక మార్గం ఆధ్యాత్మిక వాదం అయితే రెండో మార్గం భౌతికవాదం- నేడు ఆధ్యాత్మికవాదులు ఆత్మజ్ఞానాన్ని అంటే, లోచూపును విడనాడి భక్తి, భజనల ముసుగులో మూఢ విశ్వాసాల్ని, నమ్మకాల్ని, అభూతకల్పనల్ని ప్రచారం చేస్తూ కట్టుకథల్ని సృష్టిస్తూ, సమాజాన్ని తిరోగమనం వైపుకు మళ్లింపజూస్తున్నారు. అట్లే భౌతికవాదులు మానవునికి కావాల్సిన కూడు, గుడ్డ, గూడు వసతులకోసం ప్రజల్ని చైతన్యపరుస్తూ శ్రమదోపిడీని నిలువరించేందుకు తిరుగుబాటు విధానాల్ని ఏకరువుపెడుతూ ఉద్యమస్ఫూర్తిని కలిగిస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక వాదులు కాని, భౌతికవాదులు కాని పూర్తి బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకోసం వారి శక్తియుక్తులను ఉద్యమ రూపంలో తీసుక రాలేకపోతున్నారు. పర్యావరణ శాస్తవ్రేత్తలు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణకోసం అప్పుడప్పుడు ఉద్యమాలుచేస్తూ తెరమీద కనిపిస్తుంటారు. కవులు, రచయితలు మొక్కుబడిగా కవితలు వ్యాసాలు రాస్తుంటారు. పెట్టుబడిదారీ పారిశ్రామికవర్గాలు పాలక వర్గాలను ఆర్థిక పాశాలతో కట్టి పడేసి, స్వార్థానికి విచ్చలవిడిగా ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ పర్యావరణ విధ్వంసానికి నడుము బిగించడాన్ని జీవావరణ హననానికి కారణమవటాన్ని ‘టాప్ మోస్ట్ సీరియస్ మేటర్’గా అన్ని వర్గాల కవులు, రచయితలు పరిగణించక పోవడమే శోచనీయం. నేడు కలం కదుపుతున్న కవులు రచయితలు ‘టాప్ ప్రేయారిటీ’ యివ్వాల్సిన ముఖ్యాంశం పర్యావరణ పరిరక్షణ. అనేక సామాజిక రాజకీయ కోణాల్లోంచి ఈ అంశాన్ని చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నట్లే కవులు, రచయితల మీద కూడ ఉంది అనేది నిర్వివాదాంశం. అడవులు అంతరించిపోతున్నాయి, కొండలు బోడువైపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. సకాల వర్షాలు సన్నగిల్లాయి. అకాల తుఫానులు చెలరేగుతున్నాయ్. రుతువులు గతులు తప్పుతున్నాయ్. జలాశయాలు హోమ్స్ ఫ్లాట్గా మారిపోతున్నాయి. వన్యమృగాలు అంతరించిపోతున్నాయి. ఉన్న అడవి జంతువులు ఊర్లమీద పడి ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. వర్షాభావంవలన పంటలు ఎండి రైతు అప్పుల నిప్పుల్లో మాడిమసైపోతున్నాడు. బహుళ అంతస్థుల మేడల ఆకాశాన్ని ముద్దాడుతూ భూమికి బరువైపోతున్నాయి. సమతుల్యం అంతటా అస్తుబిస్తుగా మారిపోతుంది. ఇంతటి బీభత్సాలు సమాజాన్ని అల్లకల్లోలంగా మార్చిపారేస్తుంటే కవులు/ రచయితలు భావకవిత్వాన్నో, భక్తి కవిత్వాన్నో, భజన కవిత్వాన్నో, ఆకలి కవిత్వాన్నో రాసుకుంటూ అసలు మూలాలను, ప్రపంచానికే సవాళ్లుగా మారిపోతున్న వినాశనకర శక్తుల్ని విస్మరించటం అసలు కారకాలమీద కవిత్వం రాయకుండా ఏమరపాటు ప్రదర్శించడం నిజంగా గర్హింపదగిన విషయంగా భావించాల్సి వుంటుంది. ఈనాడు దేశంలో సాగునీరు, త్రాగునీరు కూడ కరువైపోయింది. తాగేనీరు అంగడి సరుకుగా మారిపోయింది.
భవిష్యత్తులో అతి త్వరలో పీల్చుకునే గాలి కూడా అంగడి సరుకు కాబోతుంది అనడం అతిశయోక్తికాదేమో!
ముఖ్యంగా సాహితీవేత్తలు దిగువ అంశాలపై స్పందించి రచనలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
1) ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా పర్యావరణాన్ని పణంగా పెడుతున్న పారిశ్రామిక వేత్తల స్వార్థాన్ని బట్టబయలు చేయాల్సిన అంశాలు.
2) ‘పర్యావరణ అర్థశాస్త్రం’ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
3) భూగోళం వేడెక్కడానికి గల కారణాలు
ఎ) పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా మండించడంవలన కర్చబన కాలుష్యాన్ని సృష్టించడం
బి) అడవులను నరికివేయడం, పచ్చదనాన్ని పాడుచేస్తూ సహజ వనరులను విచ్చలవిడిగా వినియోగించడం
4) అస్తవ్యస్తమవుతున్న పర్యావరణ కారణంగానే విపత్తులు, విలయాలు ముంచుకొస్తున్నాయి అనే అంశాల మీద స్పందించాల్సి వుంది.
5) ఆర్థికవృద్ధి జరగాలంటే కాలుష్య సృష్టి తప్పదంటున్న ప్రపంచ ఆర్థికవేత్తలు, పర్యావరణ వేత్తలు, శాస్తవ్రేత్తలు, దీనిపైన విస్తృతమైన అధ్యయనం జరిపి నివారణకు తగిన పరిష్కారాన్ని సూచించాల్సి వుంది.
6) థర్మల్ విద్యుత్తు ఉత్పత్తివలన కాలుష్యం పెరిగే ప్రమాదముంది. అందుకే సౌర, పవన విద్యుత్తుల ఉత్పత్తిని పెంచాల్సి వుంది.
పై విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని సరైన పరిష్కారం చూపాలంటే ఇది చాలా ఖరీదైన వ్యవహారం కనుక ఈ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరించాల్సి వుంటుంది. ఇప్పుడు మన పర్యావరణంలో ఉన్న కర్బన కాలుష్యంలో 28% అమెరికా సృష్టించిందనే సత్యం తెలుసుకోవాలి. కనుక అమెరికా సౌర విద్యుత్తును, పవన విద్యుత్తును ఉత్పత్తిచేసుకొని ఉపయోగించుకోవడం ప్రపంచ సంక్షేమానికి ఊతమిచ్చినట్లవుతుంది. ధార్మిక విద్యుత్తు పేద దేశాలు ఉపయోగించుకోవడం వలన పెద్ద నష్టం పర్యావరణానికి వాటిల్లదు.
పై అంశాలను లోతుగా పరిశీలించి, వీలైతే ప్రకృతి పరిశోధనలను అధ్యయనం చేసి కవులు, రచయితలు పర్యావరణ పరిరక్షణ మీద కవితలు, కథలు, వ్యాసాలు రాయాల్సి వుంది. కష్ట్భరితమైన, సంక్షోభ భరితమైన, సంక్లిష్ట భరితమైన, దుఃఖాస్వితమయిన, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడంలో కవులు/ రచయితలు తమవంతు కృషి తాము చేయాల్సి వుంది.