మెయన్ ఫీచర్

‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అయోధ్య వివాదం’ కేవలం 1,480 గజాల స్థలం కోసం 1,500 ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి వివాదం అందరికీ తెలిసినట్టు 1528 (మరికొన్ని వివరణల్లో 1527) సంవత్సరంలో బాబర్ భారత్‌కు రాకతో మొదలుకాలేదు. ముంబయిలో లభించిన ‘్ఫర్ రిపోర్ట్సు’ (1862, 1863, 1864, 1865) నివేదిక ప్రకారం రామజన్మభూమి స్థలాన్ని 1426 బీసీ లోనే కూల్చేశారు. అంటే దాదాపు 3,445 ఏళ్లుగా వివాదం ఉందనేది సుస్పష్టం.
రామజన్మభూమి స్థలంలో బాబ్రీ మసీదు ఉన్న మాట ఎంత నిజమో, బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామజన్మభూమి అన్నది కూడా అంతే నిజం. శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడో, ఎన్నాళ్లకు అవతారం చాలించాడో పురాణాల్లో ఆధారాలున్నా, అంతకుమించి అవి పరిశోధనాత్మకంగా గ్రంథస్తం కాలేదు. 7323 బీసీ డిసెంబర్ 4న రాముడు జన్మించాడని, 7307 బీసీ ఏప్రిల్ 7న ఆయనకు వివాహం అయిందని, 7306 బీసీ నవంబర్ 29న రాముడు అవతారం చాలించాడని కొంతమంది చరిత్ర పరిశోధకుల వాదన. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సీతాదేవికి, లక్ష్మణుడికి, ఆంజనేయుడికి దేవాలయాలున్నాయి. సమీపంలోని ఒక గుహ కూడా ఉంది. ఆ గుహలోనే రాముడి అంతిమయాత్ర సాగిందని ప్రతీతి. అయితే ఇతిహాసాల్లో అయోధ్యను భిన్నమైన పేర్లతో వ్యవహరించేవారు, ప్రధానంగా యోధ్‌గా పిలిచేవారు.
ఇబ్రహీం లోదీని ఓడించమని బాబర్‌ను 1526లో ఆనాటి ఇండియన్ గవర్నర్ ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే బాబర్ అయోధ్యను సందర్శించాడు. ఇంత వరకూ అన్ని రికార్డులూ ఉన్నా, కొన్నింటిలో బాబర్ ఆదేశాలతోనే అయోధ్యలో మసీదు నిర్మాణం జరిగిందని పేర్కొనగా, అసలు అక్కడ రామజన్మభూమి విషయం బాబర్‌కు తెలియదని, బాబర్ వద్ద సైన్యాధిపతిగా ఉన్న మీర్ బాకీ తాష్కండి ఆ పని పూర్తి చేశాడని కొంతమంది చరిత్రకారులు రాశారు. మందిరం కూల్చివేత బాబర్ పనేనని ఆధారాలు లభించకూడదనే ‘బాబర్ నామా’లో 1528 ఏప్రిల్ 2 నుండి 1528 సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పేజీలు లేకుండా చేశారని చెబుతారు. అబుల్ ఫజల్ అక్బర్‌కు అంకితం ఇస్తూ రాసిన ‘ఇనీ అక్బరీ’లో అయోధ్య ప్రస్తావన, రాముడి ప్రస్తావన చేశారు. ఎర్లీ ట్రావెల్ ఇండియా అనే తన గ్రంథంలో విలియం ఫాస్టర్ అయోధ్య ప్రస్తావన చేశారు. 1608-11 కాలం గురించి విలియం ఫించ్ రాసిన గ్రంథంలోనూ రామజన్మభూమికి సంబంధించిన పలు ఆధారాల ప్రస్తావన ఉంది. ఫాదర్ జోసఫ్ తిఫిన్ తిలర్ 1789లో అయోధ్యకు వచ్చినపుడు ఆనాటి ప్రజాబాహుళ్యంలో ఉన్న భావనలను గ్రంథస్తం చేశాడు. అందులో కూడా అయోధ్య గురించి, రాముడి జన్మస్థలం గురించి ప్రస్తావన ఉంది. అయోధ్యలోని ఒక ఇంట్లో విష్ణువు జన్మించాడని ఫించ్ పేర్కొన్నాడు. ఇక్కడ విష్ణువు అంటే రాముడే. వాల్టర్ హమిల్టన్ ప్రచురించిన ఈస్ట్ ఇండియా గెజిటర్ -1816లో అబుల్ ఫజల్ రాసిన ఇనీ అక్బరీ గ్రంథం ప్రస్తావన ఉంది. అందులో అయోధ్య గురించి చాలాస్పష్టంగా పేర్కొన్నారు. మాంట్గోమెరి మార్టిన్ రాసిన మరో గ్రంథంలో 360 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నాడు. మీర్‌బాకీ తాష్కండీ అక్కడ ఉన్న పూజారుల నుండి రామజన్మభూమి నిర్మాణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇందులో ప్రస్తావించాడు. తాష్కండీ కొత్త నిర్మాణం తర్వాత ఆ మసీదును కొంత కాలం పాటు ‘మసీదు ఇ జన్మస్థాన్’ అని పిలిచేవారు. ఆ తర్వాత దాని పేరును బాబ్రీ మసీదుగా మార్చేశారు.
1859లో బ్రిటిష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. లోపల భాగంలో ముస్లింలు, బయటిభాగంలో హిందువులు ప్రార్ధనలు చేసుకోవడానికి అనుమతించారు. అయితే మసీదును కూల్చినపుడు దొరికిన శిలాఫలకాలపై ఉన్న శాసనాలను గమనిస్తే మసీదుకు పూర్వం దాని కింద దేవాలయం ఉండేదని స్పష్టమవుతోందని ఆర్కియాలజీ నిపుణులు ప్రొఫెసర్ ఏఎం శాస్ర్తీ, డాక్టర్ కేవీ రమేష్, డాక్టర్ టీపీ వర్మ, ప్రొఫెసర్ బీఆర్ గ్రోవర్, డాక్టర్ ఏ కే సిన్హా, డాక్టర్ సుధామలైయ, డాక్టర్ డీపీ దుబో, డాక్టర్ టీసీ త్రిపాఠీలు చెబుతున్నారు. మహంత్ రఘుబీర్ దాస్ 1885 జనవరి 29న దాఖలు చేసిన పిటీషన్(61/280)పై ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి 1886 మార్చి 18న తీర్పు ఇస్తూ స్థల విషయమై యథాతథస్థితిని కొనసాగించాలని పేర్కొన్నారు. ఆనాటికే జరగాల్సిన తప్పిదం జరిగిపోయిందని, ఈ దశలో జోక్యం చేసుకుని వివాదాన్ని పెంచదల్చుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. 1886 నాటికే అయోధ్య వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
1949 డిసెంబర్ 23న మసీదులో రాముడి విగ్రహాలను ఉంచినపుడు ఆనాటి యూపీ సీఎం జీబీ పంత్‌కు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లేఖ రాశారు. వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహాలను ఉంచడంపై ముస్లింలు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దాంతో రెండు వర్గాలూ న్యాయస్థానంలో కేసులు వేశాయి. ప్రభుత్వం దానిని వివాదాస్పద స్థలంగా పేర్కొంటూ తాళాలు వేసేసింది. 1986లో ఆనాటి ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ హిందువులు ప్రార్ధించుకోవడానికి వీలుగా మసీదు తాళం తీయాలని ఆదేశించారు. మస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ప్రారంభించారు. 1989లో వీహెచ్‌పీ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. వివాదాస్పద స్థలం వద్ద రామమందిరానికి పునాది వేసింది. 1990లో వీహెచ్‌పీ కార్యకర్తలు బాబ్రీ మసీదును స్వల్పంగా ధ్వంసం చేశారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును వీహెచ్‌పీ,శివసేన, బీజేపీ కార్యకర్తలు, హిందూ అభిమానులు కలిసి కూలగొట్టారు. దాంతో దేశవ్యాప్తంగా మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్కడి నుండి వ్యవహారం ముదిరిపోయింది.
2002 మార్చి 13న సుప్రీం కోర్టు తన తీర్పులో యథాతథస్థితిని కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని పేర్కొంది. ప్రభుత్వం సుప్రీం తీర్పును శిరసావహిస్తామని చెప్పింది. 2003 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ తవ్వకాలను ప్రారంభించగా, ఆ ఏడాది జూన్ వరకూ కొనసాగాయి. మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని పురాతత్వశాఖ నివేదిక ఇచ్చింది. వివాద పరిష్కారానికి కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కూడా ప్రయత్నించారు. బాబ్రీ మసీదు కూల్చిన కేసులో విచారణకు ఏర్పాటుచేసిన లిబర్‌హాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత నివేదికను ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు 2009 జూన్ 30న అందించింది. అదే ఏడాది జూలై 7న యూపీ ప్రభుత్వం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలుచేస్తూ స్థల వివాదానికి సంబంధించిన 23 ఫైళ్లు కనిపించడం లేదని పేర్కొంది. 2010 సెప్టెంబర్ 30న వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. దీనిపై 2011 మే 9న సుప్రీం స్టే విధించింది.
2017 మార్చి 21న అయోధ్య వివాదాన్ని పరస్పరం చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ సూచించారు. తర్వాత అలహాబాద్ హైకోర్టులో ఇస్మాయిల్ ఫరూఖీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీం 2017 ఆగస్టు 7న త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అనేక మార్లు ఈ అంశంపై వ్యాజ్యాలు జరిగి చివరికి తాజాగా సుప్రీం కోర్టులో మధ్యవర్తిత్వ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కూల్చేసిన తర్వాతనే భారతీయులందరికీ ఈ వివాదంపై ఆసక్తి పెరిగినా శతాబ్దాలుగా ఈ అంశంపై ఎడతెగని చర్చలు, పరిశోధనలు, ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వివాద పరిష్కారానికి ముగ్గురు మధ్యవర్తులను నియమించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీపుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులతో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటుకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు తేల్చి చెప్పింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు అన్ని అవకాశాలనూ అనే్వషించాలని సుప్రీం ఈ మండలిని ఆదేశించింది. వారం రోజుల్లో ఈ మండలి తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే మరికొంత మందిని కో-ఆప్ట్ చేసుకోవచ్చు. అన్నిరకాల ప్రయత్నాలూ అయోధ్యకు ఏడు కిలోమీటర్ల పరిధిలోని జిల్లా కేంద్రమైన ఫైజాబాద్‌లోనే జరగాలి. అందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సంప్రదింపులు గోప్యంగా జరగాలి. నాలుగు వారాల తర్వాత సంప్రదింపుల తీరుపై సుప్రీంకు నివేదిక ఇవ్వాలి. మొత్తం ప్రక్రియను 8 వారాల్లో పూర్తిచేయాలి. మధ్యవర్తిత్వ ప్రతిపాదనను ముస్లిం సంస్థలు స్వాగతించగా, హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. ఇందుకు కారణం- తమదనుకున్న స్థలంలో ‘తగుదునమ్మా’ అంటూ మధ్యవర్తులు దూరడం ఎవరికి ఇష్టం ఉంటుంది?

-బీవీ ప్రసాద్ 98499 98090