ఎడిట్ పేజీ

భారతీయ యువతను ‘సాంకేతికత’ పిలుస్తోంది...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత 21వ శతాబ్దంలోని 3వ దశాబ్దిలో ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవం కొత్త వాకిళ్ళు తెరుస్తున్న సాంకేతిక, శాస్ర్తియ ప్రజ్వలనం సృష్టిస్తున్న ఉజ్వల నేపథ్యంలో ప్రపంచంతోపాటు భారతదేశం అధి భౌతిక అత్యాధునిక జీవన స్థితిగతులను సంతరించుకొనే దిశలో అడుగులు వేస్తోంది. భారతీయ విద్యార్థి, యువత యింతవరకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్‌గా మనం అనుసరించే సంప్రదాయ ‘స్టెమ్’ విద్యా విధానం నుండి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రోబోటిక్స్, ఆటొమేషన్, మెకాట్రొనిక్స్ వంటి ప్రత్యేక విద్యా నైపుణ్యత సాధించే కొంగ్రొత్త ఆవిష్కరణాంశాల వినియోగ విజ్ఞాన ప్రగతి, అభిలషిస్తోంది. మేథా పరిజ్ఞానంలో అంతర్జాతీయ రంగంలో ఏ దేశానికి తీసిపోని భారతీయ యువ, విద్యార్థి లోకం, ఇండియాలో కూడా మరో ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశలో దూసుకుపోతోంది. ‘ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజన్స్’ అనే మాట నేడు సాంకేతిక, శాస్ర్తియ ప్రపంచానికి కొత్తకాదు. ఈ వేళ ప్రపంచంలో, రోబోట్స్ కేవలం మూగ యంత్ర సంబంధిత బొమ్మలు కానేకావు. సోఫియా, సాఫ్ట్ బ్యాంక్ పెప్పర్ వంటి ‘హ్యూమనోయిడ్స్’ అడుగుపెట్టిన దిశలో పరిశ్రమలలో మానవ శక్తికి బదులుగా ఇండస్ట్రియల్ రొబొట్స్ సవాళ్ళు విసిరే రోజులు రానున్నాయి. ఉత్పత్తి రంగమైనా, వినియోగ రంగమైనా ఆటోమేషన్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక శాతం యువశక్తి నెలకొని వున్న మన దేశం యిప్పటికే నిరుద్యోగ సమస్యతో అతలాకుతలమవుతున్నా, ఆటోమేషన్ తాకిడి ప్రభావం తప్పేటట్టు లేదు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేర్కొన్నట్టుగా మెకానికల్, ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీల అనుసంధాన పరిజ్ఞానం ‘మెకాట్రొనిక్స్ మరిన్ని యూనివర్సిటీలలో విస్తరిస్తే కొత్త శకం ఆరంభమవుతుంది. సురక్షితంగా లభించే ఉద్యోగ అవకాశాల అనే్వషణలో సాగిపోతున్న యువత, సంపన్న అగ్ర దేశాల్లో దూసుకుపోతున్న భవితవ్య పరిజ్ఞాన విద్యావకాశాలను అందిపుచ్చుకోవటానికి అర్రులు చాస్తోంది. ప్రధానంగా అంతర్జాతీయ రంగంలో హెల్త్ కేర్, సాంఘిక సేవా సహాయ రంగాలలో నూతనంగా ప్రవేశించే దివ్యాంగుల సంబంధిత ప్రాజెక్టులు, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ భారీఎత్తున జనసామాన్యానికి ఆరోగ్య జీవన ప్రయోజనాలు, భద్రత సమకూర్చటంతో లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రాంలైన జియో ఫిజిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, గేమ్ డిజైన్ వంటివి విద్యార్థులను ఆకట్టుకొంటున్నాయి.
నాటి రేడియో- నేడు రొబొట్ ఎ.ఐ. సాంకేతికం
1969లో నవభారత నిర్మాణంలో భాగంగా, అధిక ఆహారోత్పత్తి లక్ష్యంగా ‘శాటిలైట్ ఇన్‌స్ట్రక్చనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్’ (ఎస్‌ఐటియి) నాటి ఏకైక టీవీ స్టేషన్ దూరదర్శన్‌పై, క్రిషిదర్శన్ కార్యక్రమం ఢిల్లీ పరిసర 80 కమ్యూనిటీ టీవీ సెట్లలో ఆరంభమైంది. ఇండో-యు.ఎస్. భాగస్వామ్యంతో 1975 ఆగస్టు నాటికి బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో స్కూళ్ళు, పంచాయతీ కేంద్రాలలో తొలిగా గ్రామీణ సమాజానికి 2,400 గ్రామాల్లో టీవీ సెట్లు ప్రవేశించాయి. గతంలో రేడియో నుంచి టీవీ ప్రస్థానంలో, అయిదు దశాబ్దాలు వెనుతిరిగి చూస్తే ప్రస్తుతం భారత జనాభాలో అత్యధికంగా మొబైల్స్ అరచేతిలో అందుబాటుగా మొబైల్ హాండ్ సెట్స్ మార్కెట్ 300 మిలియన్ సంఖ్య పైబడే డిజిటల్ ఇండియా ఆవిర్భవించింది. దైనందిన జీవితంలో సంపన్నుని నుంచి సామాన్యుని వరకు సాంకేతిక విప్లవానికి సంకేత దృష్టాంతంగా సెల్‌ఫోన్‌లు సాక్షాత్కరిస్తున్నాయి. రెండేళ్ళలో మన దేశంలో మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తి 500 మిలియన్ యూనిట్‌లు దాటే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోంది. గ్లోబల్ సర్వే ప్రకారం 2/3 వంతు ప్రపంచ జనావళి ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించలేకుండా జీవిస్తున్నారు. ఇండియాలో అంతర్జాలం లేనిదే జీవించలేమనే వారి శాతం 82 కాగా యు.కె.లో 78.శాతం, చైనాలో 77 శాతం, జర్మనీలో 73 శాతం, అమెరికాలో 73 శాతం, రష్యాలో 66 శాతం, 23 దేశాలలోని ఇటీవల శాంపిల్ సర్వే స్పష్టం చేస్తోంది. మన దేశంలో 2015లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 259.88 మిలియన్ కాగా ప్రస్తుతం 407.11 మిలియన్ నుండి 2022 నాటికి 511.89 మిలియన్ అంటే 54 శాతం పెరిగి ఇంటర్నెట్ మార్కెట్‌లో రెండవ అగ్ర దేశంగా విలసిల్లుతోంది. చైనాలో వినియోగదారులు 731.43 మిలియన్‌గా ప్రపంచంలో అగ్రస్థానంలో వుండగా, అమెరికా 286.94, బ్రెజిల్ 139.11, ఇండోనేసియా 132.7 మిలియన్‌ల అత్యధిక వినియోగదారులు కలిగివున్నాయి. మన దేశంలో అంతర్జాల వినియోగదారులలో అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా పట్ల విపరీత ఆసక్తి కలిగివున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌కి సంబంధించి ఫేస్‌బుక్ అత్యధిక ప్రాచుర్యం పొందుతోంది. వాట్స్‌యాప్, గూగుల్, స్కైప్‌తోపాటు 2016 సర్వే ప్రకారం 195 మిలియన్ ఫేస్‌బుక్ వినియోగదారులు మన దేశంలో ఉన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ అంశం కూడా రిటైల్ ఇ-కామర్స్ విక్రయంలో 2021 నాటికి 45 బిలియన్ డాలర్లు దాటే అవకాశాలున్నాయి.
ఇంటర్నెట్ లేని జీవితం భవిష్యత్తులో సాధ్యమా?
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పురోగతిలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా ఐటి పరిశ్రమ ఆటోమేషన్, క్లౌడ్, డిజిటల్ అనలిటిక్స్ ప్రగతితో జత కలుపుతోంది. నిపుణులు కొరత అవరోధంగా వుంది. ఇండియాలో యువతకు ఎంత ప్రతిభ వున్నా, తగినంత నైపుణ్యం సాధించే అవకాశాలు అందుబాటులో లేవు. ప్రతీ ఏటా సుమారుగా 1.5 మిలియన్ ఇంజనీరింగ్ విద్యావంతులు విద్యాసంస్థల నుండి వస్తున్నారు. అధిక సంఖ్యలో అవకాశాలు చేజిక్కించుకొంటున్నారు. భారతీయ ఐటి రంగం కొత్త టెక్నాలజీ తరానికి తగ్గట్టుగా సిబ్బంది నైపుణ్యం పెంపునకు శత విధాలా ప్రయత్నిస్తోంది. నాణ్యతతో విద్య, పరిశోధన అభివృద్ధి రంగానికి తగినంత నిధుల కొరత కారణంగా కాళ్ళకు బంధాలు పడుతున్నాయి.
ఒక పుష్కర కాలంలో అయినా చైనా, కృత్రిమ జ్ఞాన (ఎ.ఐ.) ప్రపంచ అగ్రసనాధిపత్యం చేజిక్కించుకొనే ప్రయత్నంలో నిమగ్నమైంది. 2017 అక్టోబరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రియల్ వరల్డ్ ఎకానమీతో ఇంటర్నెట్, బిగ్‌డేటా, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ మూడింటినీ మరింతగా అనుసంధానం చేసే లక్ష్యాలను నిర్దేశించారు. చైనాలో వున్న 751 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు అపరిమితమైన డేటాతో ఎ.ఐ.ని మున్ముందుకు నడిపిస్తున్నారు. అమెరికా కంటే అక్కడ వినియోగదారులు 50 రెట్లు మొబైల్ చెల్లింపులు సాధించారు. ఆ దేశంలో ఎ.ఐ. పరిశ్రమ 150 బిలియన్ డాలర్ల సామర్థ్యం సాధించి 2030నాటికి 26 శాతం జి.డి.పి. పెంపు సాధించే కృషి కొనసాగుతోంది. 2016 గణాంకాల ప్రకారం చైనా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ (స్టెమ్) గ్రాడ్యుయేట్స్‌ను 4.7 మిలియన్ ఉత్పత్తి చేయగలిగితే ఇండియా 2.6 ఎమ్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం యు.ఎస్. మూడవ, రష్యా నాల్గవ, ఇరాన్ అయిదవ, ఇండోనేసియా ఆరవ, జపాన్ ఏడవ స్థానాలు సాధించగలిగాయి.
రేడియో, టి.వి, కంప్యూటర్, సెల్, ఇంటర్నెట్, రోబో యింకా ముందుకు ప్రపంచ మానవాళి న్యూటెక్నాలజీతో శరవేగంగా దూసుకుపోతోంది. వయస్సు మళ్ళిన సమాజ తిరోగమనానికి యిక తెరపడింది. శ్రీశ్రీ ఆశించిన మరో ప్రపంచంలో ప్రస్తుత డిజిటల్ విప్లవ అలల కెరటాల మేథోజ్ఞానం, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లేనిదే జీవితం సాధ్యం కాదంటోంది. ‘పదండి ముందుకు...’’

-జయసూర్య