మెయిన్ ఫీచర్

పరీక్షలు రాస్తూ.. పరుల సేవలో తరిస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనం, నమ్మకం, సమన్వయం, సేవాభావం.. అనే పదాలకు ఆమె సజీవ తార్కాణం.. పరుల సేవలో తరించడంలోనే జీవిత పరమార్థం ఉందని ఆమె ఆచరణలో నిరూపిస్తోంది.. కొందరు ఆమెను తమ పాలిట దేవత అని అభివర్ణిస్తుంటారు.. అనారోగ్యం, శారీరక వైకల్యాలతో బాధపడేవారి తరఫున పరీక్షలు రాస్తూ మానవసేవకు ప్రతిరూపంగా ఆమె నిలిచింది.. ఇంతటి ఘనమైన సేవలను అందిస్తున్నందుకు ఆమెను ‘నారీ శక్తి పురస్కారం’తో భారత రాష్టప్రతి సత్కరించారు..
బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల ఎన్‌ఎం పుష్ప ఇంతవరకూ 700పై చిలుకు పరీక్షలు రాసి జాతీయస్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ పరీక్షలన్నీ ఆమె తన కోసం రాయలేదు.. 'భిన్నమైన వ్యక్తుల’ (శారీరక వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యం) కోసం పరీక్షలు రాసేందుకు నిరంతరం సర్వసన్నద్ధంగా ఉండే పుష్ప పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. మామూలు రోజుల్లో తన వృత్తిలో నిమగ్నమయ్యే ఆమెకు- ‘పరీక్షలు రాయాలంటూ’ ఎవరి నుంచైనా సమాచారం వస్తే చాలు వెంటనే నిండు మనసుతో స్పందించడం అలవాటు. 2018 సంవత్సరానికి గాను ‘నారీ శక్తి పురస్కారాన్ని’ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అందుకున్నాక పుష్ప పేరు ఇపుడు కర్నాటకలో మార్మోగుతోంది. 2007లో జర్నలిజం వృత్తిలో ప్రవేశించాక, స్వచ్ఛంద సంస్థను నడిపే తన స్నేహితురాలి అభ్యర్థనతో తొలిసారిగా ఓ అంధ విద్యార్థి తరఫున పుష్ప పరీక్షలు రాశారు. ఆ తర్వాత ఆమె ఎంతోమంది 'భిన్నమైన వ్యక్తుల’ తరఫున పరీక్షలు రాసి వారిని విజేతలుగా నిలిపారు.
బీద కుటుంబానికి చెందిన పుష్ప ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా ఏనాడూ నిరాశ చెందలేదు. డబ్బు సంపాదించడం అనేది తనకు ప్రధానం కాదని, ఇతరుల సేవలో లభించే సంతృప్తికి ఏదీ సాటిరాదని ఆమె చెబుతుంటారు. మనం సేవ చేయడం వల్ల ఇతరులు సంతోషంగా ఉన్నారంటే అంతకుమించిన ఆత్మసంతృప్తి ఎక్కడా దొరకదంటారు. ట్రాఫిక్ కూడళ్లలో, షాపింగ్ మాల్స్‌లో అంధులకు సహాయం చేయడమే కాదు, వారి తరఫున పరీక్షలు రాయడంలోనూ ఆమె ఎప్పుడూ ముందుంటారు. పాత్రికేయురాలిగా అంధుల సమస్యలపై ఎన్నో వార్తా కథనాలను అందిస్తుంటారు.
ఏడవ తరగతి చదువుతుండగా తన జీవితంలో జరిగిన సంఘటనను ఎప్పుడూ మరచిపోనని పుష్ప గుర్తు చేస్తుంటారు. పేదరికం కారణంగా తన తల్లిదండ్రులు స్కూలు ఫీజును చెల్లించకపోవడంతో ఉపాధ్యాయులు ఆమెను పరీక్ష హాలు నుంచి బయటకు పంపేశారు. ఆ సమయంలో పొరుగింటి వారు స్కూల్ ఫీజు చెల్లించడంతో ఆమె ఏడవ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతి లభించింది. పీయూసీ పరీక్షల సమయంలోనూ ఆమెకు ఇటువంటి ఆర్థిక సమస్యలు రాగా, పోలియో పీడితుడైన ఓ వ్యక్తి సహాయం చేశాడు. ఇతరులు ఆర్థిక సహాయం చేసినందునే తాను ఏడవ తరగతి, పీయూసీ పరీక్షలు రాయగలిగానని, ఇదే తీరులో ఇతరులకు పరీక్షల సమయంలో సేవలందించాలన్న దృఢ సంకల్పం ఆమెలో కలిగింది. మెదడుకు సంబంధించిన పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్న ఇరవై రెండేళ్ల బి.కార్తీక్ తరఫున పుష్ప పరీక్షలు రాశారు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన కార్తీక్ పీయూసీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేలా ఆమె అండగా నిలిచారు. మెల్లగా మాట్లాడగలిగే కార్తీక్ నుంచి సమాధానాలు రాబట్టి ఎంతో సహనంతో పుష్ప పరీక్షలు రాశారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు తన జీవితంలో మరచిపోలేనివి అని ఆమె చెబుతుంటారు.
గత పన్నెండు సంవత్సరాల్లో వందలాది మంది విద్యార్థుల తరఫున పరీక్షలు రాసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన పుష్ప ఏనాడూ అలసట చెందలేదు. ప్రతి సంవత్సరం సగటున 50 నుంచి 60 పరీక్షలు రాయడం ఆమెకు అలవాటుగా మారింది. ప్రతి పరీక్షా తనకు ప్రత్యేకమైనదేనని, పరీక్షలు రాయడానికి ముందు ఆ విద్యార్థులతో మమేకం కావడం ఎంతో ముఖ్యమని పుష్ప చెబుతుంటారు. పరీక్షలు రాసేందుకు తన ఆఫీసులో ‘షిఫ్ట్’ మార్చుకొంటానని, పాత్రికేయ వృత్తిని నిర్లక్ష్యం చేయనని ఆమె తెలిపారు. పరీక్షలు రాసేందుకు అనువుగా పనివేళలను మార్చుకొనేందుకు తన యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తోందని ఆమె గుర్తు చేస్తున్నారు. ఇతరుల తరఫున పరీక్షలు రాయాలంటే సహనం, సమన్వయం, నమ్మకం కలిగి ఉండాలంటారు. తాను రాసే పరీక్షలు ఆ విద్యార్థుల 'ఫలితాన్ని’ నిర్ణయించడమే కాదు, వారి భవిష్యత్‌ను సైతం నిర్దేశిస్తాయని, ఈ కారణంగా ఎంతో అప్రమత్తతతో పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఆమె చెబుతుంటారు. పరీక్షలు రాసే తనతో పాటు ఆ విద్యార్థులు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉంటేనే సాఫీగా సమాధానాలు రాసే పరిస్థితి ఉంటుందన్నారు. విద్యార్థి నుంచి సమాధానాలు రాబట్టేందుకు సహనంతో నిరీక్షించాల్సి ఉంటుందని, ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని పుష్ప అంటున్నారు. విద్యార్థి చెప్పే సమాధానాలను ఓపిగ్గా వినడం, కాలాన్ని వృథా కానీయకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరమంటున్నారు. సమన్వయం ఉన్నపుడే ఇవన్నీ సాధ్యమవుతాయంటారు. శారీరక వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారి పట్ల సహనంతో వ్యవహరించాలని, వారి పట్ల జాలి చూపుతున్నామన్న భావన సరికాదని పుష్ప అంటారు. విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు పలు పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని, వారు చెప్పని అంశాలను జోడించి సమాధానాలుగా రాయడం మంచిది కాదంటారు. తాను పరీక్షలు రాయడం వల్ల వారు మంచి మార్కులు సంపాదించారని తెలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమె అంటున్నారు. ‘నా పరీక్షల్లో నాకు ఫస్టు మార్కులు వచ్చినా’ ఆ సంతోషం తక్కువేనంటున్నారు. నేత్రదానానికి ప్రచారం చేయడం, భిన్నమైన వ్యక్తుల తరఫున పరీక్షలు రాయడం, వృత్తిలో రాణించడం మాత్రమే తన జీవితాశయాలని చెబుతున్న పుష్ప సేవామార్గం ఎందరికో అనుసరణీయం.

-ఎస్.ఆర్.