మెయిన్ ఫీచర్

వనె్నల వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంతోత్సవం ఫాల్గుణమాస శుద్ధ పంచమి నుండి మొదలవుతుంది. వసంతుని ఆగమనం, కోయిలమ్మ కుహుకుహు రాగాలు, మావిళ్ళ చిగుళ్ళు, వేప పూత ఆరంభంతో ప్రకృతి శోభాయమానమవుతుంది. సంవత్సరమంతా చిరాకుపరాకు ఆందోళనలతో గడుపుతూన్న జీవితాలకు ఈ వసంతోత్సవం ఆటవిడుపు లాంటిది. సంవత్సరంలో వచ్చే చివరి పర్వదినం హోళీ పూర్ణిమ. ఈ పర్వదినం రోజున స్ర్తిలు చప్పట్లతో ‘హోళి హోళి యెరంగ హోళి’అంటూ ‘కాముడొచ్చాడు. కాళ్ళు కడగండి. మేమొచ్చాం డబ్బులివ్వండి’అని ఉత్సాహంగా పాడుతూ వాడవాడల్లో, ఇల్లిల్లూ తిరుగుతుంటారు. పురుషులు కూడా కోలాటాలు, ‘అల్లోమల్లో రాగాలమల్లో’’అంటూ గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ హోళి ఇనాం అడుగుతారు.
ప్రపంచీకరణ వల్లనైతేమేమి, నాగరికత ప్రబలిపోతూ ఉరుకుల, పరుగుల జీవితాల వల్లనైతేనేమి ఈ పండుగను ఇంతకు ముందులా ఉత్సాహంగా జరుపుకోవడం లేదు. చాలా కుటుంబాలు తలుపులు బిడాయించి ఇంట్లో కూర్చుంటున్నారు. ఇప్పటికీ పట్టణాల్లో, పల్లెల్లో జనపదులు గత సంస్కృతిని కాపాడుతూ తమదైన భాషలో, యాసతో జానపద గేయాలు పాడుతూ కనబడుతున్నారు.
ఇక వసంతోత్సవం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. దక్షయజ్ఞం తరువాత సతీదేవి ఆత్మార్పణంతో శివుడు విరాగిగామారి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటాడు. ఇదే తరుణంగా భావించి తారాకాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరప్రసాద గర్వితుడై ముల్లోకాలను గడగడలాడిస్తుంటాడు. తరుణోపాయానికి విష్ణువును ముల్లోకవాసులు ప్రార్థించగా శివపార్వతుల సమాగమంవల్ల జన్మించే పుత్రుని ద్వారా తారకాసురుడు మరణిస్తాడని వివరిస్తాడు.
సతీదేవి తిరిగి పర్వత రాజపుత్రికగా జన్మిస్తుంది. పార్వతిగా పరమేశ్వరుని తప్ప ఇతరులను వరించనని ఆయన్ను మెప్పించి పరిణయమాడుతానని తన తండ్రి పర్వతరాజు అనుమతితో అనుదినం శివుడు తపస్సుచేసుకునే ప్రాంతానికి వెళ్ళి అర్చిస్తుంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని శివునిలో పార్వతిపై రాగరంజితం ఏర్పడే విధంగా యత్నించమని ఇంద్రాదులు మన్మథుడిని అర్థిస్తారు. తపస్సు భంగం కలిగించినందుకు శివుడు తనను భస్మంచేస్తాడని తన మన్మధుడు తన అనుమానాన్ని వెలిబుచ్చుతాడు. ముక్కోటి దేవతలు మన్మధునికి అభయమిచ్చి, అనునయించగా లోక కళ్యాణంకోసం తాను ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడతాడు మన్మధుడు.
పార్వతి తన దినచర్యగా శివుని తపస్సుకు భంగం కలుగకుండా నిశ్శబ్దంగా శివునికి అభిముఖంగా ఉండి అర్చన ప్రారంభిస్తుంది. ఇదే అదనుగా మన్మధుడు తన ధనస్సును శివుని ఎదపై ప్రయోగిస్తాడు. ఆ విరుల బాణం శివునిలో మరులు కలిగించగా, ఒక్క క్షణం పార్వతి తనువెల్ల పులకరించగా, పార్వతిపై తన కటాక్ష వీక్షణం చేస్తాడు శివుడు. పార్వతి లక్ష్యం సిద్ధిస్తుంది. ముక్కంటి తపస్సుకు భంగం కలుగుతుంది. తన మనస్సు చంచలతకు కారకుడైన మన్మధుడిని భస్మంచేస్తాడు శివుడు. తన భర్త తప్పు ఏమాత్రంలేదని లోక కళ్యాణంకోసం ఈ పనిచేశాడని రతీదేవి శివుడ్ని వేడుకుంటుంది. శివుడు శాంత చిత్తుడై ‘‘నీ పతి నీతోపాటే అశరీరుడై ఉంటాడు. ద్వాపర యుగాంతంలో నీవు బాణాసురుని కూతురుగా, నీ పతి శ్రీకృష్ణుని కుమారుడిగా జన్మించి దంపతులవుతా’’రని వివరించి అంతర్థానమవుతాడు.
ఇక ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్ముడు గోపికలతో రాసక్రీడలు ఆడుతూ ఫాల్గుణ మాస శుద్ధపంచమి నుండి పౌర్ణమివరకు గోకులమంతా వసంతోత్సవం జరుపుకున్న కథలు అందరికీ విదితమే!
ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో సున్నపుతేట, పసుపు, కుంకుమ పువ్వు మిశ్రమం కలిపిన నీళ్ళను వసంతం అంటారు. భాగవత గోష్టి తదనంతరం ఆలయ పూజారులు భక్తులపై ఈ వసంతాన్ని మావిడాకుతో సుతారంగా చిలకరిస్తారు. ఇది అసలైనసిసలైన ఆధ్యాత్మిక వసంతోత్సవం.
మరి ఈనాడు ఆ వసంతోత్సవం సరదాలు ఒక్కొక్కమారు వికృతంగామారి ఇతరులను ఇబ్బందిపెడుతున్నాయి. ఏమైనప్పటికీ హోళీ పండుగ అంటేనే యువతీ యువకుల రంగులజోరు, ఆనందాల హోరు. తరతమభేదాలు మరచి సరదాగా తమ స్నేహితులతో, బంధుమిత్రులతో ఆడుకునే సరదా సరదా పండుగ. జీవితంలో అన్నీ చిరాకుల పరాకులు ఒడిదుడుకులు, సుఖదుఃఖాలు సహజమే. మనలో సర్వకాముకులను దహింపచేసినప్పుడు మిగిలేది బూడిద. భస్మమైన కామం తరువాత మానవ జీవితంలో ఆనందమేగా మిగిలేది. పునీతుడైన మనిషి తనవారితో మనసులు కలుపుకున్నప్పుడు ముచ్చట్లు, ఆ ముచ్చట్ల సరదాతో రెండుచేతులు కలిపి చప్పట్లు, హుషారైన గానంతో చేసుకునే పండుగే వసంతోత్సవం.

- కొలనుపాక మురళీధరరావు