మెయన్ ఫీచర్

‘నకిలీ హిందుత్వ’ వ్యాఖ్యల్లో నిజమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషుల కన్నా చరిత్ర గొప్పది. దానికి ఎన్నో మైలురాళ్లు ఉంటాయి. అవి చరిత్ర గతిని మలుపుతిప్పుతాయి. చరిత్రలో కొన్ని వేగ నిరోధకాలు కూడా ఉంటుంటాయి. వాటికీ చరిత్రలో స్థానం లభిస్తుంది. అంతమాత్రాన అదే చరిత్ర అనుకున్నా పొరపాటే. అలాంటి ఘట్టం ఒకటి పరిశీలించేందుకు మనం చరిత్రలోకి తొంగి చూస్తే వర్తమాన రాజకీయాలకు సమాధానం దొరుకుతుంది.
భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీకి గొప్ప స్థానం ఉంది. అంతకు ముందున్న భారతీయ యుద్ధ మెళకువలను ఆధునీకరించి, శత్రువు వ్యూహాన్ని పసిగట్టిన మహావీరుడు ఆయన. పరాయి మత పాలకులను నిలువరిస్తూనే మరోవైపు మొఘల్ సింహాసనంపై యుద్ధం ప్రకటించాడు. చివరకు క్రీ.శ.1674 జూన్ 6న ‘హైందవ సామ్రాజ్య నిర్మాణానికి’ అడుగువేసాడు. శివాజీ హిందుత్వను ముస్లిం రాజులు ఎంతలా ద్వేషించారో- కొందరు హిందువులూ అంతలా వ్యతిరేకించారు. అలాంటి వాళ్లలో రాజా జయసింగ్ ఒకడు. ఇతడు స్వయానా దైవభక్తుడు. గొప్ప హిందువు.కానీ శివాజీని సజీవంగాగానీ నిర్జీవంగా గానీ ఔరంగజేబుకు పట్టి ఇస్తానని భీషణప్రతిజ్ఞ చేసాడు. రెండు నెలలపాటు మహాచండీయాగం, 10వేల బ్రాహ్మణులకు, వేద పండితులకు ఘన సత్కారం చేసి లక్ష సైన్యంతో ఆగ్రానుండి బయల్దేరాడు. ఇక్కడ ధర్మం ముఖ్యమా? భక్తి, బ్రాహ్మణ సత్కారం ముఖ్యమా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది?!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కరీంనగర్, నిజామాబాద్ సభల్లో చేసిన ప్రసంగాలు మనల్ని ఈ చారిత్రక ఘట్టం వైపు తీసుకెళ్తాయి. కేసీఆర్ లాంటి రాజకీయ పరిపక్వత ఉన్న వ్యక్తిచేసే వ్యాఖ్యలు అలవోకగా తీసుకోలేం. తనకు ఉద్యమకాలం నుండి అత్యంత ఇష్టుడైన వినోద్‌కుమార్ కరీంనగర్‌లో తెరాస ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. అక్కడ ఇటీవల మతపరంగా ఎన్నో సున్నితమైన ఘటనలు చోటుచేసుకొన్నాయి. భాజపాకు చెందిన బండి సంజయ్‌కుమార్‌కు యువతలో మంచి ఆదరణ ఉంది. నిజానికి కరీంనగర్‌లో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ. అక్కడ హిందువుల పక్షాన సంజయ్ గట్టిగా నిలబడుతున్నాడు. అతనికి కరీంనగర్ భాజపా టిక్కెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ ఓడిపోయాక అతనిపై అక్కడి హిందూ యువతలో సానుభూతి పెరిగింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ కరీంనగర్, నిజామాబాద్ సభల్లో కాంగ్రెస్ కన్నా, భాజపాపై విసుర్లు ఎక్కువ విసిరారు. పనిలోపనిగా హిందుత్వపై ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. వాటిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరిగింది. ‘హిందూగాళ్లు-బొందూగాళ్లు’ అన్న కేసీఆర్ మాట చాలామందికి నచ్చలేదు. అందువల్ల సోషల్ మీడియా కేసీఆర్‌పై విరుచుకుపడింది. నిజామాబాద్ సభలో కేసీఆర్ అదే విషయాన్ని సున్నితంగా వదిలేస్తే అయిపోయేది. మళ్లీ భాజపాను దృష్టిలో పెట్టుకొని ‘రామజన్మభూమి’ అంశంపై వ్యాఖ్యలు చేశాడు. భాజపా వేరు, హిందుత్వ వేరు అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు. కానీ హిందువుల పక్షాన ఏ రాజకీయ పార్టీ నిలబడడం లేదని హిందువులకు అభద్రత ఉంది. ఇటీవల వరంగల్‌లో పూజారి సత్యనారాయణ గుడిలో మైక్ పెద్దశబ్దంతో పెట్టాడన్న సాకుతో ఒక ముస్లిం అతనిపై దాడి చేసాడు. ఆ తర్వాత పూజారి చనిపోయినా కేసీఆర్ స్పందించలేదని నెటిజనులు ఆరోపిస్తున్నారు. కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో అంతమంది హిందువులు చనిపోయినా కేసీఆర్ అటువైపుచూడలేదని వారు ఆరోపిస్తున్నారు. నిర్మల్, బోధన్‌లలో మతఘర్షణలకు కారణమైన వ్యక్తులను పోలీసులు వదిలిపెట్టి, హిందూ సంస్థలను టార్గెట్ చేసినా పట్టించుకోలేదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెట్టారు. మతతత్వ పార్టీగా పేరొందిన మజ్లిస్‌ను తెరాస ప్రభుత్వం నెత్తినపెట్టుకొని మోస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు, భాజపా నాయకులు ఎన్నోసార్లు ఆరోపించారు.
కేసీఆర్ చేసిన ఆయత చండీయాగం, యాదాద్రి అభివృద్ధి, రాజశ్యామల యాగం విషయంలో తెలంగాణ హిందువులు ఆయనను గొప్ప హిందువుగా భావిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాలు, సాంస్కృతిక పరిరక్షణ విషయంలో ఆయన కృషి అనన్య సామాన్యం. అలనాడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ సోమనాథ మందిరం నిర్మిస్తే, ఆ తర్వాత యాదాద్రిని చరిత్రలో నిలిచిపోయే దేవాలయంగా మలుస్తున్న చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ హిందువులకు కేసీఆర్‌పై ఎక్కువ అభిమానం పెరగడానికి ఇదొక కారణం. కేసీఆర్ చేస్తున్న యజ్ఞయాగాలు, బ్రాహ్మణభక్తి పండిత వర్గాల్లో ఆయనకు మంచిపేరు సంపాదించింది. ‘్భష్మద్రోణ కృపాది ధన్వి’ లాంటి కఠినమైన తిక్కన పద్యాలు కేసీఆర్ అలవోకగా చదవుతుంటే విద్యాధికుల్లో ఆయనపై గౌరవం ఏర్పడింది. తనకు చదువుచెప్పిన గురువుకు వేదికపై సాష్టాంగ దండప్రణామం చేస్తే సంప్రదాయవాదులకు ఆనందం కలిగించింది. కానీ, రామజన్మభూమి గురించి ఆయన అవహేళనగా మాట్లాడడం కొంతమందికి బాధ కలిగించింది. తెలంగాణలో నిజాం షాహీలతో అణచివేయబడిన హిందువులకు లోలోపల నివురుగప్పిన నిప్పులా ఈరోజుకూ బాధ ఉంది. కేసీఆర్ ఓవైపుచేస్తున్న సాంప్రదాయిక చర్యలు వాళ్లను అలా అణచి ఉంచాయి. ఇక్కడ వరుసగా కాంగ్రెస్ దెబ్బతినడానికి కారణం ఇదే. అన్నిరకాల రాజకీయ హంగులు కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్నా- కేసీఆర్‌లా హిందువుల మనసు గెలుచుకోలేదు. సెక్యులరిజం పేరుతో డెబ్బై ఏళ్లనుండి ఏ పంథాను కాంగ్రెస్ అనుసరించిందో అదే మార్గంలో ఇక్కడి కాంగ్రెస్ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా బిజేపి ఇంత విస్తృతం కావడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టుల సంతుష్టీకరణ విధానమే కారణం కదా. ఈ విషయం తెలంగాణ రాగానే పసిగట్టిన కేసీఆర్ సంప్రదాయ హిందుత్వ విధానాలతో భాజపాకు చెక్ పెట్టాడు. కేసీఆర్ చెప్పే ‘హిందుత్వ’లో ఆచారాలు, పూజలు, నమ్మకాలు, బ్రాహ్మణ సంతర్పణ బాగా ఉంటుంది. ఈరోజు చాలామంది హిందువులు ఇంతవరకే పరిమితం అయ్యారు. భాజపా చెప్పే హిందుత్వలో ‘జాతీయతతో కూడిన హిందూ ఆత్మగౌరవం’ ఉంటుంది.
దానిని కేసీఆర్ లాంటివారు నకిలీ హిందుత్వ అంటారు. అంతెందుకు? భాజపాపై ప్రతిదానికీ విరుచుకుపడే మమతా బెనర్జీ ‘నాలాగా మోదీ, షా మంత్రోచ్ఛారణ చేయగలరా?’ అన్నది. నిజానికి ఆచారాలు, నమ్మకాలు, ఎక్కువగా కేసీఆర్, లాలూ, దేవేగౌడ వంటి వాళ్లలోనే కన్పిస్తాయి. మోదీ ముఖంపై రెగ్యులర్‌గా బొట్టుకూడా ఉండదు. మోదీ, భాజపా చెప్పే హిందుత్వలో ‘దేశ సమగ్రత-జాతీయత’ ఉంటుంది. మెజార్టీ ప్రజల జీవన విధానంలో జాతీయభావం లేకపోతే దేశం సమగ్రంగా ఉండదని ఆరెస్సెస్ భావిస్తుంది. అందువల్ల జాతీయవాదుల హిందుత్వ ‘ఆచారాల’వరకే ఆగదు. కేసీఆర్ చెప్పే హిందుత్వ ప్రమాదం లేని స్థితిలో మాత్రమే పనికివస్తుంది. కశ్మీర్‌లో, హైద్రాబాద్ పాతబస్తీలో దీనిని అమలుచేయడం సాధ్యం కాదు. అధికారం లేనపుడు కూడా ఈ హిందుత్వ ముందుకు సాగుతుంది. అంతేగానీ కేసీఆర్‌కు ఉన్న పరిస్థితులు ఎప్పటికీ ఉంటాయనుకోరాదు. భాజపా చెప్పే హిందుత్వతో సంప్రదాయం ఒక ప్రతీక మాత్రమే. దాని వెనుక ఆత్మగౌరవంతో కూడిన రాజకీయ సంరక్షణ దాగి ఉంది. బహుశా దీన్ని కేసీఆర్ లోతుగా అధ్యయనం చేసి ఉండకపోవచ్చు. హిందుత్వపై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ అభిమానులైన ముస్లిం ఓట్లు, తటస్థులైన వారి ఓట్లు పొందడం ఓ పెద్ద ప్రయోజనం కావచ్చు. రామజన్మభూమిపై రాజకీయ పార్టీలకు అవసరం లేదన్నాడు కేసీఆర్. శృంగేరి పీఠాధిపతి, చినజీయర్ స్వామి లాంటి వారు దీనిపై చొరవ చూపించాలన్నారు. మన దేశంలోని ‘ఆమ్నాయ పీఠాల’కు కొన్ని హద్దులు ఉన్నాయి. వారు దేని గురించి పడితే దానిపై స్పందించరు. కేసీఆర్ చెప్పిన శృంగేరీ పీఠం దక్షిణామ్నాయ పీఠం. ఇది కన్నడ ప్రాంతంలో ఉంది. దీని పరిధిలోకి ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, కేరళ ప్రాంతాలు వస్తాయి. ఈ పరిధిలోని అయ్యప్ప (శబరిమల) వివాదంలో స్వామివారు స్పందించలేదు. అయోధ్యపై సాధుసంతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మనకున్నట్లు ఉత్తర భారతంలో చినజీయర్ స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతిలా ఒకరిద్దరు స్వామీజీలు మాత్రమే ఉండరు. అక్కడ అనేక మఠాలు, ఆశ్రమాల్లో సాధువులు పెద్దఎత్తున ఉన్నారు. అక్కడ సహజంగా రాజకీయాలుంటాయి. ఆయా మఠాధిపతులను ప్రజలు చాలా గౌరవిస్తారు. ప్రజలు వారిని అనుసరిస్తారు. వాళ్లను నాయకులు అనుసరిస్తారు. వారు హిందువులుకారని మనం చెప్పగలమా? వారి హిందుత్వను ఎవరైనా శంకిస్తారా? నిజానికి తెలంగాణలో హిందుత్వ, జాతీయత అనేది బహుజన కులాల్లోనే బాగుంది. నిజాం వ్యతిరేక పోరాటంలో మరాఠీ బ్రాహ్మణుల వెంట నడిచి ఆర్యసమాజ ఉద్యమాన్ని తీవ్రం చేసినవారు దళిత బహుజనులే. ఆరోజుల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి తిరిగినవారే ఇపుడు కేసీఆర్ వెంట చేరారు! ఏది ఏమైనా కేసీఆర్‌ను అభిమానించే హిందువులెందరో ఆయన వెంబడి ఉన్నారు. మతపరమైన విషయాల్లో రాజకీయ వ్యాఖ్యలు చాలామందిని నొప్పిస్తాయి గనుక సంయమనం పాటిస్తే మంచిది. గెలుపు మన ఎదుగుదలకు మలుపులా ఉండాలి కానీ మూసివేసే తలుపులా ఉండకూడదు. నకిలీ హిందుత్వకు, అసలీ హిందుత్వకు ఎన్నో కొలమానాలున్నాయి. వాటి ఉచ్చులో పడకుంటే మంచిది.

-శ్రీకౌస్త్భు