మెయిన్ ఫీచర్

‘ఆరోగ్యం’ క్షీణిస్తోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళ ఉష్ణోగ్రతలలో పెరుగుదల ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భూగోళ ఉష్ణోగ్రతలలో చోటుచేసుకుంటున్న పెరుగుదల మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. స్వచ్ఛమైన నీరు, గాలి లభించకపోవడంతో వ్యాధులు ఉద్ధృతమవుతున్నాయి. వైద్య నిపుణులు సైతం ఊహించని రీతిలో ప్రాణాంతకమైన కొత్త కొత్త వ్యాధులకు ఎందరో గురవుతున్నారు. ఇందుకు కారణం ఎలోబా, సార్స్, మెర్స్, జీకా వంటి వైరస్‌లే. ఈ వైరస్‌లు వృద్ధి చెందడానికి భూగోళ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం ముఖ్య కారణమని పర్యావరణ శాస్తవ్రేత్తలు అంటున్నారు.
గత వందేళ్ళలో భూగోళ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దీనికి నూటికి నూరుపాళ్ళూ మానవ కార్యకలాపాలే ప్రత్యక్ష కారణం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సాధిస్తున్న ఆర్థికప్రగతి ప్రజలను నగరీకరణవైపు పరుగులు తీయిస్తున్నాయి. దీంతో పట్టణాలు, నగరాల జనాభా విపరీతంగా పెరిగింది. ఫలితంగా ప్రకృతి వనరుల వినిమయం అడ్డూ అదుపూ లేకుండా పెరిగింది. మితిమీరిన వనరుల వినిమయం పెద్దమొత్తంలో అడవులనూ, వ్యవసాయ భూములనూ హరించి వేస్తోంది.
ఆధునిక యుగంలో మితిమీరిన పారిశ్రామికీకరణ వల్ల ఉత్పత్తిఅవుతున్న కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వంటి విషవాయువులు భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణవౌతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో సంభవించే ఉపద్రవాలను నివారించడం ఎవరితరమూ కాదు. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం పర్యావరణం విషయంలో ఉదాసీనంగానే ఉన్నాయి. వాటి దృష్టి అంతా ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ఎంతో బలపడాలాలన్న విషయంపైనే.
గ్లోబల్ వార్మింగ్ కారణం..
భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల కొత్త కొత్త వ్యాధికారక క్రిములు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆర్కిటిక్ వద్ద మంచు కరిగినట్లయితే అక్కడ వేల ఏళ్ళుగా మంచు ఫలకాల క్రింద ఉండిపోయిన సూక్ష్మజీవులు బయటపడి మానవ మనుగడకే ప్రమాదకారకమైన రోగాలు ప్రబలే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదెలా సాధ్యం?’ అని ఎవరికైనా అనిపించవచ్చు. మృత కళేబరం మంచుదిమ్మల మధ్య ఉంటే చెడిపోకుండా ఉంటుంది. మంచు కరగడం మొదలవగానే ఆ కళేబరం నుండి దుర్గంధంతోపాటు రోగకారక క్రిములు కూడా బయటికి వ్యాపించడం మొదలవుతుంది. వేల సంవత్సరాలుగా ధ్రువప్రాంతాల మంచుశిలల అట్టడుగున ఎన్నో వ్యాధికారక క్రిములు మగ్గిపోతున్నాయనీ, మంచు కరగడం మొదలైతే అవి బయటపడే ప్రమాదం ఉందనీ శాస్తవ్రేత్తలు అంటున్నారు.
భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే అంటువ్యాధులకు కారకమైన సూక్ష్మక్రిముల వ్యాప్తి మరింత ఎక్కువౌతుంది. ఉదాహరణకు 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మలేరియా వ్యాధి సోకేవారి సంఖ్య మరో 60 శాతం పెరిగే అవకాశం ఉంది. వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల వల్ల రోగకారక క్రిములు ఒకచోటి నుండి వేరేచోటికి వ్యాపిస్తాయి కూడా. దీనివల్ల ఫంగి వంటి పరాన్నజీవులు, నీళ్ళలో ఉండే సూక్ష్మక్రిములు మరింతగా విజృంభిస్తాయి.
భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడానికి, రోగకారక క్రిములు పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉందా? అంటే నేరుగా సమాధానం చెప్పడం కష్టమే. ఉష్ణోగ్రతలలో మార్పువల్ల నేలలోని తేమలో వచ్చే మార్పు అక్కడ ఉండే సూక్ష్మజీవులలో అసహజ ప్రతిక్రియకు కారణం కావడం ద్వారా అవి ఇతర ప్రాంతాలకు వ్యాప్తిచెందేలా చేస్తున్నాయి. ఇదంతా ఒక్క ముక్కలో అర్థం చేసుకోవడం కష్టమే.
వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధుల రూపంలో కనిపించడం అనేది పెద్దమొత్తంలో ప్రజలకు అంటురోగాలు ప్రబలినప్పుడే కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాతావరణంలోని మార్పులు చూపే ప్రభావాలను వెంటనే ఎవరూ గుర్తించడం లేదు. ఉదాహరణకు, రెండు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కప్పలు మృతి చెందడాన్ని జీవ శాస్తజ్ఞ్రులు గుర్తించేరు. ఆ తరువాత చాలా కాలానికి మాత్రమే ఇలా పెద్దమొత్తంలో కప్పలు చనిపోవడానికి కారణం ‘చిత్రిడ్స్’అనే ఒక రకమైన బూజు అని పరిశోధనల్లో తెలుసుకున్నారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల వల్లనే ఇలాంటి ప్రాణాంతకమైన ‘బూజు’వంటి పదార్థాలు పుట్టకొస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ ‘‘బూజు’’ ఉభయచర జీవులలో ప్రాణాంతక వ్యాధులు రావడానికి కారణవౌతోందని శాస్తవ్రేత్తలు అంటున్నారు. అయితే వీటి విషయంలో ఇంకా లోతైన పరిశోధనలు జరగాలి. ‘మానవులు తరచుగా ఒకరితో ఒకరు కలుస్తూ ఉండటం వల్ల రోగాలు, రోగకారక క్రిములు వ్యాపించే అవకాశం ఉంది కదా?’అని ఎవరైనా అడగవచ్చు. ఇది నిజమే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆమోదించలేము.
వీటికితోడు మానవజాతిని అనేక రోగాలకు గురిచేసే కొత్తకొత్త వైరస్‌లు వేగంగా వ్యాప్తిచెందటాన్ని శాస్తవ్రేత్తలు గుర్తిస్తున్నారు. బర్డ్ఫ్లూ, ఎబోలా, కరోనావైరస్ (శ్వాసకోశ సంబంధమైన వ్యాధికారిమైనవి), ఎబోలా, ఆర్బో వైరస్‌లు (డెంగ్యూ, చికెన్‌గున్యా, జీకా వంటివి) వంటి ప్రాణంతక వైరస్‌లు మితిమీరిన నగరీకరణ, ప్రపంచీకరణ కారణంగా విజృంభిస్తున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎబోలా, జీకా వంటి వైరస్‌లవల్ల కొత్తకొత్త అంటువ్యాధులు ప్రబలడమే కాదు, గతంలోనే దాదాపు అంతరించిపోయాయని మనం భావిస్తున్న మలేరియా వంటి వ్యాధులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు డయేరియా, కలరా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.
అంతరిస్తున్న ‘సైగా’ జాతి జింకలు
సైగా జాతి జింకలు ఒకప్పుడు మంగోలియా నుండి రొమేనియా వరకుగల ప్రదేశంలో పెద్దసంఖ్యలో సంచరిస్తుండేవి. అయితే ఈ జాతి జింకలు పెద్దసంఖ్యలో మరణిస్తుండడం 2015లో జీవ పరిరక్షణ శాస్తవ్రేత్తల దృష్టిలోకి వచ్చింది. 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్దం తొలి దశాబ్దాలలోను మితిమీరిన వేట కారణంగా ఈ జాతి జింకలు 95 శాతం వరకూ తుడచిపెట్టుకుపోయాయి. కజకస్తాన్‌లో మాత్రం ఇవి కొద్ది సంఖ్యలో మిగిలి ఉన్నాయి. గుంపుగా సంచరించే ఈ జింకలు వేట కారణంగా పెద్ద సంఖ్యలో చనిపోవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అయితే 2015లో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో 60వేల జంతువులు మరణించడం జీవ పరిరక్షణ శాస్తవ్రేత్తలను ఒక్క కుదుపు కుదిపింది. అతి తక్కువ కాలంలో ఇంత పెద్దసంఖ్యలో జంతువులు మరణించడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. 2015 మే నెలాఖరు వచ్చేసరికి లక్షా 20వేల జంతువులు చనిపోయాయి. శాస్తవ్రేత్తలు పరిశోధించగా బయటపడిన విషయం ఏమిటంటే 'పాస్ట్యురెల్ల’ లేదా ‘క్లోస్ట్రిడియా’ అనే బాక్టీరియా కారణంగానే ఇంత పెద్దసంఖ్యలో పశుమరణాలు సంభవించి ఉండవచ్చు అని తేలింది. శాస్తవ్రేత్తలకు విస్మయం కలిగించిన విషయం ఏమిటంటే సుదూర ప్రాంతాలలో సంచరించే ఈ జంతువులలో కూడా బాక్టీరియా వల్ల పెద్దసంఖ్యలో మరణాలు సంభవించడం.
'పాస్ట్యురెల్ల’ లేదా ‘క్లోస్ట్రిడియా’ బాక్టీరియా పెద్దమొత్తంలో వివిధ ప్రాంతాలలో వ్యాప్తి చెందడం వెనుక గల బలమైన కారణం ఏమై ఉంటుంది? 2018 జనవరిలో 'పాస్ట్యురెల్ల మల్టోసిడా టైప్ బీ’ అనే బాక్టీరియా వల్ల సైగా జింకలు చనిపోతున్నాయని కనుగొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆరోగ్యంగా ఉన్న జంతువులలో కూడా ఈ బాక్టీరియా పనిచేస్తుంటుంది. ఎటొచ్చీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే ఈ బాక్టీరియా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కజకస్తాన్ వాతావరణంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల ఈ ఫాస్ట్యురెల్లా బాక్టీరియా ప్రమాదకరంగా పరిణమించి పెద్దసంఖ్యలో సైగా జింకలు అతి స్వల్ప వ్యవధిలో చనిపోయాయని జీవశాస్తవ్రేత్తలు అంటున్నారు.
భూ ఉపరితల వాతావరణంలో ఎంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయో అంతే వేగంగా మానవ జీవితాలలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు మానవ జీవనం మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మానవజాతి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు, ప్రాణాంతక వ్యాధులు ప్రబలడానికి మధ్యగల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.

- ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690