మెయిన్ ఫీచర్

చట్టసభల్లో.. అతివలు అంతంత మాత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించాక 1952లో తొలి లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 24 కాగా, 2014లో కొలువుదీరిన 16వ లోక్‌సభలో ఆ సంఖ్య 62 మాత్రమే. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలం గడచినప్పటికీ- లోక్‌సభకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. పురుషులతో పాటు మహిళలకూ వోటు హక్కును మన ప్రజాస్వామ్యం ప్రసాదించినా, మొత్తం వోటర్లలో మహిళల సంఖ్య 48.5 శాతంగా ఉన్నా పరిస్థితిలో ఆశించిన మార్పు లేదన్నది విస్పష్టం.
మహిళలకు సమప్రాధాన్యం ఇస్తామంటూ మన నేతలు గొప్పలు చెబుతున్నారే తప్ప, ఎన్నికలొచ్చే సరికి అతివలకు సీట్లు కేటాయించేందుకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సుముఖత చూపడం లేదు. చట్టసభల్లో మహిళలకు నిర్ణీత శాతం సీట్లు కేటాయించాలంటూ ఎలాంటి శాసనాలు లేకపోవడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు శాసనసభల్లో అతివలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘మహిళా బిల్లు’కు పుష్కర కాలం దాటినా మోక్షం లేదు. కాగా, 17వ లోక్‌సభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే మహిళా బిల్లుకు ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఒడిశాలోని బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు లోక్‌సభ సీట్లకు సంబంధించి మహిళలకు ‘కోటా’ను అమలు చేస్తున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకోవడంతో ఆ రాష్ట్రంలోని 21 లోక్‌సభ సీట్లలో ఏడింటిని మహిళలకు అధికార బిజూ జనతాదళ్ కేటాయించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ గత లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళలకు 41 శాతం రిజర్వేషన్లను అమలు చేసింది. ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు తప్ప ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా మహిళలకు నిర్ణీత శాతం సీట్లు కేటాయించేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో అత్యున్నత చట్టసభలకు ఎంపికైన మహిళల శాతాన్ని బట్టి 193 దేశాల్లో మన దేశం 149వ స్థానంలో నిలిచింది. ఇక, శాసనసభల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంలో బిహార్, హర్యానా, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా, మహిళలకు అతి తక్కువ అవకాశం ఇస్తున్న రాష్ట్రాలుగా మిజోరం, నాగాలాండ్ నిలిచాయి. 2014 ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ముగ్గురు మహిళలు మాత్రమే విజయం సాధించారు.
వోట్లపైనే గురి..
మహిళల వోట్లు పొందేందుకు రాయితీలు, నజరానాలు ప్రకటించడంలో పోటీపడే రాజకీయ పార్టీలు వారికి సీట్లు కేటాయించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే చట్టసభల్లో మహిళలకు మూడోవంతు కాదు కదా, వారి భాగస్వామ్యం పదోవంతు కూడా దాటడం లేదు. చట్టపరంగా రిజర్వేషన్లు లేకపోవడం, కుటుంబ పరంగా- సామాజికపరంగా కట్టుబాట్లు, రాజకీయాలపై మహిళలకు అవగాహన లేదని భావించడం, లింగ వివక్ష వంటి అంశాలు రాజకీయాల్లో మహిళలకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి.
రాజకీయ నేపథ్యం ఉంటేనే..
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పరిస్థితులను విశే్లషించి చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లోని మహిళలే కీలక పదవులు పొందడాన్ని గమనించవచ్చు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె కావడంతో ఇందిరా గాంధీ తొలుత కేంద్రమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా రాణించారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇందిరా గాంధీ తర్వాత ప్రధానమంత్రి పదవి మరో మహిళకు దక్కలేదు. రాష్టప్రతిగా ప్రతిభా పాటిల్, లోక్‌సభ స్పీకర్లుగా మీరా కుమార్, సుమిత్రా మహాజన్‌లు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ ప్రభావంతో జయలలిత, ఉత్తరప్రదేశ్‌లో కాన్షీరామ్ మార్గదర్శకత్వంలో మాయావతి రాజకీయాల్లో రాణించి ముఖ్యమంత్రులయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగి ఇపుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారు తప్ప సొంతంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత పదవులు అలంకరించిన మహిళా నేతల సంఖ్య తక్కువే.
సమన్యాయం ఎక్కడ?
దేశ జనాభాలో మహిళల సంఖ్య 48 శాతానికి మించినప్పటికీ అందుకు తగ్గట్టుగా వారికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం లభించడం లేదు. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో మహిళల భాగస్వామ్యం 11.8 శాతంగా, 245 సీట్లు ఉన్న రాజ్యసభలో 11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ స్థాయిలోనే ఉందన్నది కాదనలేని కఠోర వాస్తవం. మహిళా బిల్లును ఆమోదిస్తే తప్ప చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడదన్నది విస్పష్టం. విద్యాహక్కు, ఆస్తిహక్కు ఉన్నట్టే చట్టసభల్లో మహిళలకు విధిగా రిజర్వేషన్లు ఉన్నపుడే లింగ వివక్ష అంతమయ్యే అవకాశం ఉంది.
ఎన్నికల వేళ షరామామూలే..
పదిహేడవ లోక్‌సభకు ఎన్నికల కోలాహలం ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల నేతలు మళ్లీ మహిళా సాధికారత, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ఎప్పటిలాగే హామీలు గుప్పిస్తున్నారు. అయిదేళ్లకోసారి ఇలా వారు వాగ్దానాలు చేయడం పరిపాటిగా మారింది. మనదేశంలో పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉండడంతో రాజకీయాల్లో మహిళల ప్రవేశంపై అనాదిగా ఎన్నో ఆంక్షలున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కొన్ని కుటుంబాల్లోని మహిళలు తప్ప మిగతావారు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. మన దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యలో మహిళల ప్రాతినిధ్యం 9 శాతం మాత్రమే. లోక్‌సభలో 12 శాతం, రాజ్యసభలో 11 శాతం మేరకు మహిళల ప్రాతినిధ్యం ఉండగా, శాసనసభల్లో వీరి సంఖ్య పది శాతానికి మించడం లేదు. ఝార్ఖండ్‌లో 10 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 10.3 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం, ఢిల్లీ అసెంబ్లీలో 9.8 శాతం మహిళలున్నారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో 3 శాతం, జమ్మూ కశ్మీర్, మణిపూర్‌ల్లో 4 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పదవులకు సంబంధించి భారతీయ జనతాపార్టీలో 150 మంది, కాంగ్రెస్ పార్టీలో 91 మంది, తృణమూల్ కాంగ్రెస్‌లో 44 మంది ఉన్నారు. మిగతా జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఉన్న కొద్దిపాటి మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో మంత్రి పదవులు దక్కేది అతి కొద్దిమందికే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస తొలి అయిదేళ్ల పాలనలో మహిళా మంత్రి లేకపోవడం గమనార్హం. మంత్రివర్గాల్లోనే కాదు, నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలను అనాదిగా చిన్నచూపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మహిళా బిల్లు’ను ఆమోదిస్తే తప్ప అతివలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి చూపితే తప్ప ఆ బిల్లుకు మోక్షం లభించడం అసాధ్యం.