మెయిన్ ఫీచర్

అవమానాలే సోపానాలుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగా, పొడుగ్గా.. అచ్చు వంకాయలా ఉన్నావు..
అద్దంలో ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా..?
నీకు మొగుడ్ని తేవడం కష్టం..
పైగా దళితురాలివి..
అసలు ఇలాంటి పిల్లకు పెళ్లవుతుందా?
ఆమె ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో.. కానీ ఆమె ఇలాంటివన్నీ లెక్కచేయకుండా ముందడుగేసి ప్రొఫెషనల్ మోడల్‌గా దూసుకెళ్తోంది రాజస్థాన్‌కు చెందిన 23 సంవత్సరాల సంగీతా ఘారూ. సంగీత ఘారూ వృత్తిరీత్యా మోడల్. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె మోడల్ కాగలిగింది. కానీ ఆ ప్రయాణం సాఫీగా సాగలేదు.. తిరస్కారాలు, అవమానాలు.. వంటి ముళ్లబాటలో ఏళ్లతరబడి ప్రయాణించింది.. చివరకు.. అనుకున్నది సాధించి.. తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపింది. సత్తా ఉన్న చోట అందంతో పనేంటి? అనే ప్రశ్నించే సంగీతను తన గురించి, తన విజయగాథ గురించి చెప్పమని అడిగితే..
మన భారతీయ సమాజంలో రంగు అనేది చాలా ముఖ్యమైన అంశంగా ప్రజలు భావిస్తారు. ఉదాహరణకు మీరేదైనా న్యూస్ పేపర్ చదివినప్పుడో, మాట్రిమోనియల్ సైట్లు చూసినప్పుడు.. అందులో కులం ఏదైనా ఫర్వాలేదు కానీ.. అమ్మాయి మాత్రం అందంగా, తెల్లగా ఉండాలని స్పష్టంగా రాసి ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ అందమైన అమ్మాయిల కోసమేనా? నల్లగా ఉండే ఆడపిల్లలు ఏమీ సాధించలేరా? అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నల్లగా ఉంటానన్న కారణంగా చిన్నప్పటి నుండి చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. చాలా నల్లగా ఉన్నావు.. కాస్త నీపై నువ్వు దృష్టిపెట్టి.. ఆ ముఖానికి ఏమైనా రాయి.. చూడలేకపోతున్నాం.. నల్లగా, పొడుగ్గా వంకాయలా ఉన్నావు.. ఇంత పొడుగ్గా, నల్లగా ఉంటే మొగుడ్ని తేవడం చాలా కష్టం.. ఇలాంటి మాటలు నా ముఖంపైనే చెప్పేవారు. కాస్త మోడ్రన్ దుస్తులు వేసుకుంటే చాలు.. ముఖం ఏవగింపుగా పెట్టి అలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పేవారు. ఆ సమయంలో నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే జనాలు ఎలాంటి మాటలు అంటారో అని నేను చాలా భయపడేదాన్ని. కానీ నాకు చిన్నప్పటి నుంచీ మోడల్ కావాలని కలలు కనేదాన్ని. ట్రెండీ దుస్తులంటే ఇష్టం. వేసుకున్న ప్రతీసారి ఏవేవో కామెంట్లు వినేదాన్ని. మోడలింగ్ అనేది ఓ రంగుల ప్రపంచం. ఏదో తెలియని శక్తినిచ్చి ప్రపంచం మీవైపు చూసేలా చేస్తుంది. అలాగే.. నాలాంటి ఓ సాధారణ అమ్మాయి కలలను ఎవరొచ్చి నిజం చేయాలనుకుంటారు? అసలు ఎలా చెయ్యగలరు? ఎవరైనా కలలు కన్నప్పుడు.. దానికోసం ఎంత కష్టమైనా భరించి పట్టుదలతో దాన్ని నిజం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో తనకు తానే ఓ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకోవాలి. ఈ మాటలు నాలో నేను చాలాసార్లు అనుకునేదాన్ని. ముఖ్యంగా నేను అవమానానికి గురైన ప్రతీసారి ఈ మాటలు గుర్తొచ్చేవి. మోడల్‌గా నన్ను చాలాసార్లు తిరస్కరించారు. డిజైనర్ నన్ను చూసినప్పుడు నేను ఏమాత్రం అందంగా లేనని నా ముఖంపైనే చెప్పేసేవారు. దాంతో కొన్నిసార్లు నాకు కాస్త అందాన్ని ఇవ్వమని దేవుడితో మొరపెట్టుకుంటూ ప్రార్థించేదాన్ని. ఈ అవమానాలను ఎదుర్కొంటూనే నెమ్మదిగా ఎదిగాను. నా పట్టుదల చూసి నాకు నెమ్మదిగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అయినా వేధింపులు ఆగలేదు. ‘తను ఓ మోడల్.. బహుశా డ్రగ్స్ తీసుకుంటుందేమో.. తన కారెక్టర్ ఎలాంటిదో..’ వంటి మాటలు వినిపించేవి. ఒక్కోసారి ఏడుపు కూడా వచ్చేది. కానీ అద్దం ముందు కూర్చుని నాకు నేను నచ్చచెప్పుకునేదాన్ని. నేను ఓ కేలండర్ ఫొటోషూట్ చేయబోతున్నానని, దానికోసం సిలికాన్ దుస్తులు వేసుకోబోతున్నానని మా అమ్మానాన్నలతో చెప్పాను. వారికి చాలా కోపం వచ్చింది. మా అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మా నాన్న అయితే కొన్ని రోజులు నాతో మాట్లాడటమే మానేశాడు. అయినా నేను వెనుకంజ వేయలేదు. ఎలాగైనా నేను మోడల్‌గా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఇప్పుడిప్పుడే వాళ్ళు నన్ను అంగీకరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నడుస్తోన్న నన్ను చూసి ‘తను మా అమ్మాయి. అలాగే మంచి మోడల్ కూడా..’ అని నాన్న అందరికీ చూపిస్తున్నారు. మా నాన్న ఇలా చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను దళితురాలిని కాబట్టి పెద్ద కులంతో వారితో వేదిక పంచుకోకూడదన్నారు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు నాకంటే పెద్దకులం వారితో, అందంగా, తెల్లగా ఉన్నవారితో ఒకే వేదికను పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను నల్లగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను మిగతావారిలా కాదు.. అలాగని వారికన్నా ఏమాత్రం తక్కువా కాదు.. నేను నేనే.. నేను సంగీతనే.. ఓ ప్రముఖ మోడల్ని.. ఇలా అనుకున్నప్పుడు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది.

-సన్నిధి