మెయిన్ ఫీచర్

నేటి దమయంతి కన్నీటిగాథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను.. నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను..
...
పెనిమిటి ఎన్నినాళ్ళైనాదో నినుజూచి కళ్ళారా.. ఎనె్నన్నినాళ్ళైనాదో నినుజూచి కళ్ళారా..
భర్తకోసం భార్య ఎదురుచూపుల్ని.. ఓ సినీకవి చాలా హృద్యంగా రాశాడు. అలాంటి పరిస్థితే ఇక్కడ దమయంతిది కూడా.. పురాణాల్లోని దమయంతి భర్త కు దూరమై ఎన్నో కష్టాలకు ఓర్చి భర్త ఒడిని చేరుతుంది. నేటి దమయంతి భర్త తప్పిపోయి 48 సంవత్సరాలు అయినా కళ్లు కాయలు కాచేలా అతడి కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఎదురుచూడటం అంత భారమైన పని మరొకటి ఉండదు. కాసేపు ఎదురుచూస్తూనే విసుగు, విరక్తి కలుగుతుంది. అలాంటిది జీవితాంతం ఎదురుచూడాల్సి వస్తే.. భరించలేం.. కానీ దమయంతి దాదాపు 48 సంవత్సరాలుగా భరిస్తోంది. ఎదురుచూపులు ఎంత భారమో.. ఈమెకి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో.. దమయంతి అంతర్జాతీయ బాడ్మింటెన్ క్రీడాకారిణి. జేఎన్‌యూలో మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పనిచేసింది. దమయంతి భర్త, ఫ్లైట్ లెఫ్టినెంట్ విజయ్ తాంబే ఇంటికి వస్తారని ఆమె గత 48 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆయన రాలేదు. అసలు విషయం ఏమిటంటే..
విజయ్ 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో అదృశ్యమయ్యారని, అప్పుడు పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుందని చెప్పారట. అప్పటి నుంచి తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని దమయంతి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ ఫిబ్రవరి 27న పాకిస్తాన్ దళాలకు చిక్కారు. 50 గంటల తరువాత విడుదలైన ఆయన తిరిగి భారతదేశానికి చేరారు. కానీ ఇలా చిక్కుకున్న చాలామంది భారతీయులు మాత్రం ఇంకా పాక్ చెరలోనే మగ్గిపోతున్నారు. వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ విజయ్‌తాంబే కూడా ఒకరు. 1971 యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ భూభాగంలో అదృశ్యమయ్యారు. అప్పటినుంచి దమయంతి తాంబే భర్త విడుదల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..
‘నేను ఈ రెండు ఘటనలను పోల్చడం లేదు. నా బాధను మీముందుంచుతున్నాను అంతే.. వింగ్ కమాండర్ అభినందన్‌ను తిరిగి దేశానికి అప్పగించినప్పుడు, నా భర్తను ఎందుకు అప్పగించరు? అప్పట్లో.. యుద్ధంలో మా ఆయన కనిపించకుండా పోయారని మొదట మాకు టెలిగ్రాం అందింది. తరువాత అదే వార్తను నేను రేడియోలో విన్నాను. విజయ్ కొలీగ్స్ కొందరు ఆయనను పాకిస్తాన్ టీవీ చానల్లో చూశామని చెప్పారు. మా మావయ్య పాకిస్తాన్ న్యూస్ పేపర్లను తీసుకొచ్చారు. వాటిలో ఐదుగురు భారత పైలెట్లను పాకిస్తాన్ పట్టుకుందని, వారిలో ఒకరి పేరు తాంబే అని ఉంది. దాంతో పైలెట్లను పాకిస్తాన్ నిర్బంధించినట్లు ఒప్పుకుందనే అనుకున్నాం.. తరువాత కొంత కాలానికి యుద్ధం ముగిసింది. సిమ్లా ఒప్పందం జరిగింది. యుద్ధ ఖైదీల అప్పగింత జరిగింది. యుద్ధ ఖైదీలను వారి దేశాలకు పంపించారు. విజయ్‌కు అందరిలాగే ఇంటికి తిరిగొస్తారని ఆశపడ్డాను. కానీ మొదటి రెండు జాబితాల్లో ఆయన పేరు లేదు. మూడో జాబితా వస్తుందని చెప్పారు. అందులో మిగిలినవారి పేర్లుంటాయిలే అనుకున్నాం. కానీ ఆ జాబితా ఇంతవరకు విడుదల కాలేదు. యుద్ధ ఖైదీలు కూడా రాలేదు.. ఎదురుచూసీ.. చూసీ.. మేం ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ మాకు ఎటువంటి సమాచారమూ లేదు.
ఒక మంత్రి మమ్మల్ని ప్రభుత్వ క్వార్టర్స్ నుంచి ఇంకా బయటకు వెళ్లలేదేం అని అడిగారు. అధికారులకు ఇళ్లు దొరకడం లేదని, అందుకే మేం ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారులు మాతో మాట్లాడటం అదే మొదటిసారి. యుద్ధం ముగిసింది. మనం గెలిచాం. భారతదేశం గెలిచింది. దేశమంతా విజయోత్సవాలు.. అలాంటి సమయంలో మా కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? మా గోడు ఎవరికి వినిపిస్తుంది? నిజం చెప్పాలంటే.. ఈ రోజు కూడా ఆ కేసు మూసేయడం గురించి నేను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే.. కేసు మూసేశారు అంటే ప్రయత్నాలన్నీ ఆపేశారు అని అర్థం. భారత ప్రభుత్వం.. అక్కడ ఇంకా యుద్ధ ఖైదీలు ఉన్నారని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమ దగ్గర యుద్ధ ఖైదీలు ఉన్నారని చెప్పడం లేదు. కానీ నాకు మాత్రం ఆయన అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఆ విషయం తెలుసుకునే మార్గం కూడా నాకు లేదు. నన్ను రెండుసార్లు పాకిస్తాన్‌కు పంపినప్పుడు మమ్మల్ని కోట్‌లఖ్‌పత్ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ కొంతమంది భారత ఖైదీలను మా ముందు పరేడ్ చేయించారు. ఆ భారత ఖైదీలను నేను చూడలేకపోయాను. వారి కాళ్లకు సంకెళ్లు.. ఒంటినిండా కమిలిపోయి, కుదుములు కట్టిన దెబ్బలు.. జీవచ్ఛవాల్లా కనిపించారు. వారి పరిస్థితి చూసిన నాకు ఒక్కక్షణం.. వీళ్లు ఇలా జీవించాలా? ఇలా బతకడం కంటే నా భర్త విజయ్ ప్రాణాలతో లేకపోవడమే మంచిది. ఆ కష్టాలు పగవాళ్లకు కూడా వద్దు అనిపించింది. కానీ మనసులో ఏదో మూల చిన్న ఆశ.. తిరిగొస్తారని.. ఆయన ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ తిరిగొస్తే మాత్రం.. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా నా జీవితంలోకి స్వాగతిస్తాను. అందుకే ఆయన విడుదల కోసం ఇంతగా ప్రయత్నిస్తున్నాను. ఎదురుచూస్తున్నాను.. అయినా.. నేను కాకుండా మరెవరు ఆయన విడుదల కోసం ప్రయత్నం చేస్తారు?’ అంటూ కంటతడి పెట్టుకుంటోంది దమయంతి.
తాము ఈ విషయాన్ని పాకిస్తాన్ దగ్గర ఎన్నోసార్లు ప్రస్తావించామని భారత ప్రభుత్వం చెబుతోంది.. కానీ దమయంతి మాత్రం నేటికీ తన ప్రయత్నాన్ని వదులుకోవడం లేదు.

-మహి