మెయిన్ ఫీచర్

వోట్లు సరే.. సీట్ల సంగతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మమతా బెనర్జీ, మాయావతి, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్.. వంటి కొద్దిమంది మహిళా నేతలు రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతం మాత్రంగానే ఉంది. స్ర్తిలకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా అవకాశాలు కల్పించని పరిస్థితులు కొనసాగుతుండగా, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్ర్తిల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికలోనూ మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. ఓటుహక్కుని వినియోగించుకొంటోన్న స్ర్తిల సంఖ్య క్రమేణా పెరుగుతున్నా, రాజకీయ భాగస్వామ్యం మాత్రం వారికి అందనంత దూరంలోనే ఉంది. అయితే, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్ల కేటాయింపు పరిస్థితిని చూస్తే కొంత మార్పు కనపడుతోంది.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ మహిళలకు 41 శాతం సీట్లిచ్చి తానూ మహిళా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. శతాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలకు వారి వాటా వారికి దక్కని పరిస్థితుల్లో ఈ రెండు ప్రకటనలు భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి పునాదిగా నిలవబోతున్నాయి.
ఎన్నికల్లో మహిళలు..
ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల్లో విజయం సాధించినవారి శాతం ఎక్కువగా ఉందని మీకు తెలుసా? 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి 16వ లోక్‌సభ ఎన్నికల వరకు గమనిస్తే ప్రతిసారీ విజయం సాధించినవారి నిష్పత్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం 1874 మంచి అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 1831 మంది పురుషులు, 43 మంది మహిళలు.. మొత్తం 1831 మంది పురుషు అభ్యర్థుల్లో 467మంది గెలుపొందగా, 43 మంది మహిళా అభ్యర్థుల్లో 22 మంది విజయం సాధించారు. ఈ లెక్కన మహిళల్లో విజయశాతం 51.6 ఉండగా, పురుష అభ్యర్థుల్లో 25.50 శాతం మాత్రమే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా విజయశాతం ఉంటుంది. కానీ రానురానూ ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.
రాజకీయాల్లో మహిళలు కొన్ని పరిమితుల్లో, మరొకరి కంట్రోల్‌లో ఉండాల్సి వస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కేవలం మహిళల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మాత్రమే మహిళలను ఎన్నుకోవాలని అందరూ అనుకోరు. మహిళల పాలన అత్యుత్తమంగా ఉంటుందో, లేదో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఎవ్వరూ ఆలోచించరు. మహిళల సమస్యలు పరిష్కరిస్తారనో, పురుషుల కంటే తక్కువ అవినీతికి పాల్పడుతారనో, లేదంటే మహిళలకు రాజకీయాల్లో నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయన్న కారణాలు, మహిళలను ఎన్నుకోవడానికి సిసలైన ప్రాతిపదిక కాదు. పరిపాలన చేయడానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కు ఉందనే మాట మాత్రం నిజం. పురుష ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారి నియోజక రవ్గాల్లో ఏడాదికి 1.8 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ఐక్యరాజ్య సమితి యూనివర్శిటీ.. వరల్డ్ ఇన్సిటిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ (యు.ఎన్.యు- డబ్ల్యూ.ఐ.డి.ఇ.ఆర్) 1992-2012 మధ్యకాలంలో 4,265 అసెంబ్లీ నియోజక వర్గాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం జరిగిన 20 ఏళ్లకాలంలో, చాలా రాష్ట్రాల్లో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఉపగ్రహ సమాచారం ద్వారా ఈ నియోజక వర్గాల్లో రాత్రిపూట వెలిగే విద్యుత్ కాంతుల ఆధారంగా ఆర్థిక పురోగతిని లెక్కగట్టారు. మహిళా పాలకులు.. మహిళలు, పిల్లలకు సంబంధించి ఆసక్తి కనబరుస్తున్నారని, స్ర్తి, శిశు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం అంశంలో మొత్తం 193 దేశాల్లో భారతదేశం 153వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 25 శాతం మాత్రమే.. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రువాండా 63 శాతం, క్యూబా 58 శాతం, బొవీలియా 53 శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారతదేశ పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం శాతం దగ్గర దగ్గరగా 11.8 శాతం ఉంది. దేశాభివృద్ధికి, పార్లమెంటు, అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రత్యక్ష సంబంధం లేదన్నది సుస్పష్టం. పురుష అభ్యర్థుల కంటే మహిళా అభ్యర్థుల విజయ శాతం ఎప్పుడూ ఎక్కువగానే ఉందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. కానీ పోటీచేసే పురుష, మహిళా అభ్యర్థుల శాతం పెరిగినప్పుడు, ఇద్దరిలోనూ విజయ శాతం పడిపోవడం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో విజయ శాతం ఎక్కువగా ఉంది. కానీ మహిళా ఓటర్ల శాతాన్ని కూడా మనం గమనించాలి. వారు కూడా పెరుగుతున్నారు. ఇది మంచి పరిణామం.
మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్ర్తిల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 1962 నుంచి దేశంలో స్ర్తిల ఓట్ల శాతం, మొత్తం ఓట్లలో దాదాపు సగభాగం ఉన్నా ఎన్నికల్లో 47 నుంచి 48 శాతమే పోలవుతున్నాయి. పురుషులకన్నా ఓటు హక్కును వినియెగించుకునే స్ర్తిల సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. 2014లో పోలైన మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 65 శాతం ఉన్నారు. ఎన్నికల కమీషన్ గణాంకాల ప్రకారం 1967 నుంచి ఇంత అధిక సంఖ్యలో మహిళలు ఓటుహక్కుని వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 2014లోనే పురుషుల పోలింగ్ శాతం 67గా ఉంది. జమ్ము-కశ్మీర్‌లో 2014లో అతి తక్కువగా 48 శాతం మాత్రమే మహిళల ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్, లక్షద్వీప్‌లో అత్యధికంగా 88 శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి.
స్ర్తిల ఓటింగ్..
ప్రణయ్‌రాయ్, దోరబ్‌సుపారీలు ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో పెరిగిన మహిళల ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 17, 18 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ శాంతి సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ప్రకారం ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది మహిళల నిర్ణయాత్మక శక్తి, అక్షరాస్యత పెరగడం, భారత ఎన్నికల కమీషన్ సైతం ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ప్రత్యేక వనరులు, ప్రత్యేక పోలింగ్ బూత్‌లు, పింక్ బూత్‌ల పేరుతో సౌకర్యాలను కల్పిస్తోంది. 2014లో 65 శాతం మహిళల ఓట్లు పోలైనా.. ఇంకా అధికసంఖ్యలో స్ర్తిలు ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. 2011 సెనె్సస్ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుషుల ఓటర్లకి 943 మహిళా ఓటర్లున్నారు. 2019 గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి కేవలం 925 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తేలింది. మహిళలందరూ ఓటుహక్కును వినియోగించుకున్నట్లయితే 2019 ఎన్నికలను మహిళామణులే శాసిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇదే వివక్ష పార్లమెంటులో మహిళల భాగస్వామ్యంలో సైతం ప్రతిబింబిస్తోంది. లోక్‌సభలోని మొత్తం 524 సీట్లలో 66మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ఎక్కువమంది అంటే 32 మంది బీజేపీ నుంచే ఉన్నారు. 1952లో లోక్‌సభలో మహిళల సంఖ్య 22, 2014 ఎన్నికల నాటికి ఇది 61కి పెరిగింది. అంటే ప్రతి పదిమంది లోక్‌సభ సభ్యుల్లో తొమ్మిదిమంది పురుషులుండటం లింగవివక్షకు నిదర్శనం. ప్రపంచస్థాయిలో చట్టసభలో మహిళల సగటు భాగస్వామ్యం 20 శాతం ఉంది. అయితే మనదేశంలో 1952లో 4.4 శాతం ఉండగా, 2014 నాటికి ఇది 11 శాతానికి చేరింది. సీట్ల పెంపకంలో జాతీయ రాజకీయ పార్టీలు వివక్షను పాటిస్తూనే ఉన్నయి. మహిళలు గెలవలేరనే భావంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్ర్తిలకు సీట్లను కేటాయించడం లేదు. కొన్ని పార్టీలు మాత్రం మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పుడిప్పుడే కొంత పరిణితిని చూపిస్తున్నాయి.
సమరంతో సమన్యాయం..
ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం కావాలంటూ మహిళలు దశాబ్దాల కాలంగా పోరాటాలు చేస్తున్నా రాజకీయ పార్టీలకు మాత్రం తలకెక్కడం లేదు. ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అన్ని పార్టీలు మహిళల ఓట్లు దండుకోవడానికి సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు దశాబ్దాల కాలంగా పార్లమెంటు బీరువాలో దుమ్ము కొట్టుకొనిపోయి ఉన్న విషయం సర్వవిదితమే.. ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడటం అన్ని పార్టీలకు మామూలైపోయింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో తొలిసారి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి మహిళా సాధికారత పట్ల తనకున్న చిత్తశుద్ధిని చూపించాడు. అదేబాటలో పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా మహిళలకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించి తన నిబద్ధతను చాటుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన బీజీపీ కాంగ్రెస్‌లు తమ సంకుచిత ధోరణిని విడవకుండా పార్టీ టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళలకు రిక్తహస్తం చూపిస్తున్నాయి. అయితే వీరు మాత్రం తమ గెలుపుకోసం మహిళల ఓట్లు పొందడానికి నానాతంటాలు పడుతున్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చేపట్టిన ‘మీటూ’ ఉద్యమం మాదిరిగానే, తమకు ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీకే మహిళలు ఓట్లు వేయాలని ఒక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మహిళా సంఘాలు మై వోట్ టూ అనే ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఈ ఉద్యమం చేపట్టినప్పుడే ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలుగుతుంది. అప్పటివరకు మహిళలు రాజకీయాల్లో రాణించడం సాధ్యం కాదు.
- పొనుగుపాటి హైమావతి, గుంటూరు

- సన్నిధి