మెయన్ ఫీచర్

విధ్వంసంతో రాజ్యాధికారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం అంటే ఏమిటి? లక్ష్యసాధనకు అనైతిక, అప్రజాస్వామిక మార్గాలను అనుసరించ టం, హింసను ఉపయోగించటం అని స్థూలం గా నిర్వచించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని గత 15 శతాబ్దాలుగా అరబ్బు జాతీయులు చేస్తున్న కృషి ఫలించింది. కేవలం ఖడ్గవిజయంతో వారు ఎన్నో దేశాలను పాదాక్రాంతం చేసుకున్నారు. భారత దేశానికి సంబంధించినంతవరకు బ్రిటీషువారు ప్రవేశించేవరకూ అవిచ్ఛిన్నంగా ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొగలులు ఢిల్లీని పాలించారు. దక్షిణ భారతాన్ని బహమనీ సుల్తానులు, అసఫ్ జాహీలు శాసించారు. ఇదంతా ఖడ్గ విజయంతోనే వారికి సాధ్యమయింది.
కారల్ మార్క్స్ వర్ణ సంఘర్షణ అనే ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రక్తవిప్లవం ద్వారా రాజ్యాధికారం పొందాలని ఆయన అభిప్రాయపడ్డాడు. ఫ్రాన్సులో విప్లవం వచ్చింది. ఆ తర్వాత రష్యా, చైనాల్లో రక్తవిప్లవాలు వచ్చా యి. ఇంగ్లండులో, ఇండియాలో రక్తవిప్లవాలలో రాజ్యాధికారం స్వాధీనం చేసుకోవాలని మతోన్మాదులు ఆశించారు. కాని ఇక్కడ ఆ పోరాటాలు విజయవంతం కాలేదు. అందుకు ప్రధాన కారణం నేషనలిజం?
ఉగ్రవాదం ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచదు. సైనిక నియంతృత్వాన్ని నమ్ముకుంటుంది. కేరళ, పశ్చిమ బెం గాల్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, త్రిపుర వంటి అనేక రాష్ట్రాల్లో హింస ద్వారా మార్క్సిస్టులు రాజ్యాధికారం పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్సులో ప్రజావిప్లవం ద్వారా రాజరికాన్ని కూల్చివేశారు. ఐతే ఆ తర్వాత అంతకన్నా భయంకర నేత నెపోలియన్ బోనపార్టీ నేతృత్వంలో సైనిక నియంతృత్వం వచ్చింది. రష్యాలో, చైనాలో ఇలాగే జరిగింది. బెంగాల్‌లో మార్క్సిస్టు ప్రభుత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూల్చివేసి తానే నియంతగా మారింది. కేరళలో అప్రజాస్వామిక మార్గాల ద్వారా పినరయి విజయన్ నేతృత్వంలో కమ్యూనిస్టులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
కేరళలో హిందూ సామాజిక సంస్థలను అణచివేసేందుకు దశాబ్దులుగా మార్క్సిస్టులు ముస్లిం లీగ్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. పాముకు పాలు పోసినా కాటువేయక మానదు. జూన్ 2018లో పిఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఇస్లామిక్ సంస్థకు చెందిన వారు ఎస్‌ఎఫ్‌ఐ (కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగం) కార్యకర్తను హత్యచేశారు. కోచిలోని మహారాజా కాలేజీలో అభిమన్యు అనే బిఎస్‌సి విద్యార్థిని పిఎఫ్‌ఐ ఉగ్రవాదులు హత్యచేశారు. ప్రిన్స్‌పాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అభిమన్యు ఎర్నాకుళం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యుడు. అంటే ఇస్లామిక్ ఉగ్రవాదులు కేవలం హిందువులనేకాక కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా చంపటం మొదలుపెట్టారని అర్థం. గత ఏడాది జూలైలో ఆఫ్ఘనిస్తాన్‌లో 17 మంది హిందువులు హత్య చేయబడ్డారు. ఇందుకు కారణం- వీరు హిందువులుగా పుట్టడం, ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో జీవించాలని కోరుకోవటం.
భారతీయ పురాణాల్లో భస్మాసురుని కథ అందరికీ తెలుసు. దుష్టులకు వరాలిస్తే వారు లోకకంటకులుగా మారుతారు. శ్రామిక పక్షపాతం అనే నినాదంతో సమాజంలో ఉద్యమాలు నడిపిన కమ్యూనిస్టులు కేరళలో ఎందరో శ్రామికులను ఎందుకు పొట్టనపెట్టుకున్నారు? తాంత్రిక విద్యలో క్షుద్ర దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత ఒక్కొక్కప్పుడు తనను పూజించిన వారినే భక్షిస్తుంది. కేరళలోని కోచి మహారాజా కళాశాలలోని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడు అభిమన్యు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే నరహంతక ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో హతుడు కావటం ఈ విషయాలనే గుర్తుచేస్తుంది.
2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీ వచ్చాక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, చైనా ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేస్తారని ప్రజలు ఎంతగానో ఆశించారు. కాని అలా జరగలేదు. సరికదా మోదీకి వ్యతిరేకంగా తృతీయ కూటమి (్థర్డ్‌ఫ్రంట్) ఏర్పడితే అందులో చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు కీలక పాత్ర పోషిస్తామని మాట ఇచ్చారు. ఈ కోవలోనే ‘మూకుమ్మడిగా రాహుల్ గాంధీకి ఓటువేయండి’- అని ముస్లిం సమాజానికి లష్కరే తోయిబా అనే మతోన్మాద ఉగ్రవాద సంస్థ బాహాటంగానే పిలుపునిచ్చింది.
1970 నాటికి ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో సుమా రు 80 వేల మంది సిక్కులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యి కంటే తక్కువగా ఉండడం గమనార్హం. గత జూలైలో సిక్కు సమూహం మీద ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడి మిగతా ఆఫ్ఘన్ సిక్కులను భయపెట్టడానికే. ఈ మొత్తం ఇతివృత్తం సారాంశం ఒక్కటే- ప్రపంచంలో హిందువులు ఎక్కడ మెజారిటీగా ఉంటారో అక్కడ ముస్లిం, క్రైస్తవ, యూదు, పార్సీ మైనారిటీలు సుఖజీవనం సాగింపగలరు. ఎక్కడ ముస్లిములు క్రైస్తవులు కమ్యూనిస్టులు మెజారిటీలో ఉంటారో అక్కడ మైనారిటీ హిందువుల మానప్రాణాలకు రక్షణ ఉండదు. ఇదే మూల సిద్ధాంతం!
సైఫుద్దీన్ సోజ్ పార్లమెంటు సభ్యుడు. ఇతడు కాంగ్రెసు పార్టీకి చెందినవాడు. కాశ్మీరుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చాలాకాలంగా వాదిస్తున్నాడు. సైఫుద్దీన్ సోజ్ కేరళలోని పిఎఫ్‌ఐకు నిధులు సమకూరుస్తున్నట్లు కొన్ని పత్రాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అల్‌ఖైదా, ఐసిస్‌లతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికి ఈ సంస్థ 27 హ త్యలు చేసినట్లు కేరళ హైకోర్టు నిర్ధారించింది. ఈ సంస్థతో కర్ణాటకలోని జెడిఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. జెడిఎస్ అంటే ప్రస్తుతం కర్ణాటకను పాలిస్తున్న హెచ్‌డి కుమారస్వామి పార్టీ. ఇలాంటివారి చేతిలో ఈ దేశం సురక్షితమేనా? కేరళలో ప్రముఖ హిందూ సంస్థ కార్యకర్త శశికుమార్‌ను, మంగుళూరులో ప్రశాంత్ పూజారిని హత్యచేసింది ఈ సంస్థయే. కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వం ముస్లిం లీగ్, పిఎఫ్‌ఐ వంటి సంస్థల మద్దతుతో నడుస్తోంది. సౌదీ అరేబియా నుండి నిధులు మన దేశంలోని ముస్లిం సంస్థలకు చేరుతున్నాయన్న వార్తలు గతంలోనే వెలుగు చూశాయి.
ఉగ్రవాద సంస్థలను అదుపుచేయటంలో భారత ప్రభుత్వం ఎందుకు విఫలమయింది? వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆయన హయాంలో పోక్రాన్ అణుపరీక్షలు జరిగాయి. ఇందిరా గాంధీ 1971లో తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చింది. మరి నరేంద్ర మోదీ ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయలేకపోయాడు? ప్రధాని హోదాలో మోదీ లాహోరు వెళ్లి నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి వచ్చాడు. బ్యాంకాక్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్‌ను, మన విదేశాంగ మంత్రి సుషమా స్వరాజ్‌ను సంప్రదింపులకోసం పంపాడు. ఇది ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. మన్మోహన్ సింగ్, మణిశంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ విషయంలో దాదాపు ఆ దేశపు ఏజెంట్లుగా వ్యవహరించారు. కనీసం మోదీ అయినా దేశాన్ని రక్షిస్తారని ఆశించిన వారికి గత అయిదేళ్ల భాజపా పాలన నిరాశను కలిగించింది. కశ్మీర్‌లో బుర్హన్‌వాని ఎన్‌కౌంటర్, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నుండి కొంత మార్పు కనిపించింది. పుల్వామాలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారీ సంఖ్యలో మన సిఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చిన అనంతరం ఇప్పుడు పాకిస్తాన్‌తో ప్రత్యక్ష యుద్ధం తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం చేయడం కన్నా పాక్ విషయంలో మన ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. సింధూ నదీజలాల మీద కిషన్‌గంగ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడాన్ని పూర్తిగా ఆపివేయాలి. దేశంలోని చైనా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను, ఇస్లామిక్ సంస్థలను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి. ప్రస్తుతం కరాచీ గద్వా పోర్టులు చైనా చేతిలో ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు?
ఉగ్రవాది బుర్హన్‌వాని ద్వితీయ వర్ధంతి సందర్భంగా గత ఏడాది జూలైలో కశ్మీరులో మరోసారి అల్లర్లు చెలరేగాయి. వాటిని ప్రత్యక్షంగా పాకిస్తాన్ నిర్వహించింది. కశ్మీరులో కల్లోలం సృష్టిస్తున్నది తామేనని అంగీకరించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు- అక్రమాస్తుల కేసులో పది సంవత్సరాల కారాగారశిక్ష విధిస్తూ పాక్ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సారాంశం ఏమంటే భారత్‌ను బలహీనపరిచే నిమిత్తం బ్రిటన్ పాకిస్తాన్‌ను 1947లో సృష్టించింది. మన శక్తిసామర్థ్యాలు పాక్ చుట్టూ నిరంతరం తిరుగుతుంటే భారత్‌లో అభివృద్ధి శూన్యమవుతుంది. ఈలోపల మతాంతీకరణల ద్వారా దేశాన్ని పాశ్చాత్యీకరణం చేయవచ్చునని కొన్ని విదేశీ సంస్థలవారు వ్యూహరచన చేశారు.
ఆర్థిక ఉగ్రవాదం కూడా జిహాదీ ఉగ్రవాదం లాంటిదే. ఈ రెండూ కలిసి పయనిస్తున్నాయి కూడా. దావూద్ ఇబ్రహీం, ఛోటారాజన్, హాజీ మస్తాన్, వరదరాజ పెరుమాళ్ వంటి ఆర్థిక నేరస్థులు, అండర్‌గ్రౌండ్ మాఫియా ముఠాలు, ఆయుధ వ్యాపారులు జిహాదీ ఉగ్రవాదులతో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుండడం గమనార్హం. పాకిస్తాన్‌లో నకిలీ కరెన్సీ ముద్రించి మన దేశంలోకి ప్రవేశపెట్టడం ఆర్థిక ఉగ్రవాదంలో భాగమే. మన దేశ సంపదను మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ, లండన్‌లకు తరలించటం ఆర్థిక ఉగ్రవాదం కిందికే వస్తుంది. పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పనామా బ్యాంక్, లండన్ బ్యాంకుల అక్రమాస్తుల కేసులో అరెస్టుచేశారు. మరి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారత్ మాటేమిటి? ఇక్కడ కూడా యుపిఏ ప్రభుత్వ కాలంలో కొందరు రాజకీయ ప్రముఖులు ఆర్థిక ఉగ్రవాదులైనట్లు సాక్ష్యాధారాలు లభించాయి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్