మెయిన్ ఫీచర్

ఏటుకూరి వారి ‘క్షేత్రలక్ష్మి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి తరం అభ్యుదయ కవి ఏటుకూరి వెంకట నరసయ్య. 1933 నుండి 1949 వరకు మొత్తం 16 సంవత్సరాలు మాత్రమే ఏటుకూరి కవిత్వ సృజన చేయగలిగారు. తొమ్మిది పద్య కావ్యాలు, ఒక హరికథ, చందమామ గేయకథలు మొదలైన రచనలు చేశారు. గాధావళి పేరుతో మర్యాద రామన్న తీర్పులు ప్రచురించారు. 13వ ఏట తెనాలి అమృతలూరులో సంస్కృత విద్యాభ్యాసం చేశారు. తెనాలిలోని సూత్రాశ్రమ ప్రవేశం చేశారు. కృష్ణాజిల్లా చిట్టిగూడూరులో సంస్కృత కళాశాలలో చేరి ఉభయ భాషా ప్రవీణ పూర్తిచేశారు. 28వ ఏట గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవనం ప్రారంభించారు. 1942లో గోవాడ రైతుసంఘం వారు ‘కవిబ్రహ్మ’ బిరుదు ఇచ్చి సత్కరించారు. 1911 ఏప్రిల్ 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు గ్రామంలో భూషయ్య, శేషమ్మ దంపతులకు జన్మించిన ఏటుకూరి కేవలం 38 సంవత్సరాల ప్రాయంలోనే 1949 నవంబర్ 10న విషజ్వరంతో కాలం చేశారు. జీవించిన అత్యల్పకాలంలోనే అనేక కావ్యాలు సృజించిన ఏటుకూరి ధన్యజీవి. తొందరగా వెళ్లిపోవాలని పనులన్నీ తొందరగా పూర్తి చేసుకున్నట్లు కనిపిస్తుంది సాహిత్య రచనా వ్యాసంగం. ఏటుకూరి వెంకట నరసయ్య రాసిన కావ్యాలలో రైతు గురించి గ్రామీణ జీవితాల గురించి రాసిన కావ్యం ‘క్షేత్రలక్ష్మి’ గురించి రాయటం ప్రస్తుత వ్యాస ఉద్దేశం.
పింగళి అంటే ‘సౌందర నందనం’ కావ్యం గుర్తుకువచ్చినట్లే ఏటుకూరి అంటే గుర్తుకువచ్చే కావ్యం ‘క్షేత్రలక్ష్మి’. పేరులోనే ఉదాత్తత ఉంది. పొలాన్ని లక్ష్మీదేవిగా భావన చేయటం జరిగింది. రైతుకు, రైతు జీవనానికి, గ్రామాలకు, గ్రామాల సంస్కృతికి ఈ కావ్యం పెద్ద పీట వేయడం జరిగింది.
కవి స్వయంగా వ్యవసాయం చేసినవారు. అందుకే ఇందులో రాసిన ప్రతి పద్యంలోనూ కవి ఆత్మీయత ప్రతిఫలిస్తుంది. ఒక వైపు భావ కవిత్వం, మరొకవైపు అభ్యుదయ కవిత్వం వెలువడుతున్న కాలంలో ప్రత్యేకించి రైతుల గురించి కూలీల గురించి 1938లో వెలువడిన విశిష్ట పద్యకావ్యం క్షేత్రలక్ష్మి. కావ్యం ఏడు ఘట్టాలుగా రాయబడింది. కావ్యం ప్రారంభంలో రైతుకు మించి గొప్పకవిత్వ వస్తువు లేదని, కవుల్ని హెచ్చరిస్తూ రాసిన 27 పద్యాలు ప్రతి కవి చదివి తీరాలి.
‘‘రా రమ్మోయి కవీశ్వరా, హృదయ మర్మక్షేత్రముం దున్ని సం / సంస్కారంబైన ఫలంబు నందుటకు, స్వర్గ స్థాన మందుండెరా / వారే రైతులు విశ్వ జీవన కళా పారంగతుల్ నీ కవి / త్వారంభంబున కిద్ది స్వర్ణయుగమన్నా, నాటికీ నీటికిన్’’ అని రైతుల గురించి కవిత్వం రాయాలని కవులకు సూచిస్తారు. ఇలా సాగిన పద్యాలన్నీ అద్భుత కవిత్వ శక్తితో ప్రకాశిస్తుంటాయి. మొదటి ఘట్టంలో రైతు కష్టాలను, అతని ఎడ్ల చాకిరీని కూడా కూడా గొప్పగా వర్ణించారు కవి. ద్వితీయ ఘట్టంలో క్రింది తోటల వ్యవసాయాన్ని వర్ణిస్తారు. అందులో ఒక మనోహరమైన పద్యం.
‘‘కుంకుమ గులాబి పూవులు కోయు పడతి / కొంగు పట్టిన ముండ్ల కే కోర్కె కలదో / పుష్ప వతి నిట్లు చెనకుట పోల దనియొ/ పూవు వలె రాలిపోవుట పుణ్యమనియొ’’ అంటారు. పుష్పవతి అంటే పూలున్న మొక్క. పూలున్న మొక్కను ఇలా ఇబ్బంది పెట్టటం బాగోదనా లేక పూవులా రాలిపోయే జీవితం ధన్యమనా అని కవి గడుసుదనం ప్రదర్శించారు. మూడవ ఘట్టంలో ఉదయమంతా దుక్కి దున్ని చెట్ల కింద ఎడ్లను విడిచి అన్నానికి ఎదురుచూసే రైతుల్ని, తలమీద అన్నం దుత్తతోవచ్చే ఇల్లాలిని, వారి ముచ్చటలను జనరంజకంగా వర్ణిస్తారు కవి.
‘‘ఎండ తాకున నెమ్మేను బెండగిల్లి / కుంట గట్టెక్కె ఆ కాంత కుతిలపడుచు / ఉప్పు విరిసిన వెలి చార లుప్పతిల్లి / వింతవేషమ్ము సొమ్ముగా విభుడు పల్కు’’అంటారు.
రైతు జీవనంతో ప్రత్యక్ష అనుభవం వున్న కవి మాత్రమే ఇలా వర్ణనలు చేయగలడు. రైతు రాజ్యం రావాలని కోరుకుంటాడు కవి.
ఇక నాల్గవ ఘట్టం ఒక ప్రత్యేక ఘట్టం. రైతు గురించి కవులు పద్యాలు రాసారు కానీ కూలీల గురించి పద్యాలు రాసిన కవులు లేరు. వ్యవసాయ కూలీల బాధలు, భూస్వాములు పెట్టే హింసలు, కూలీల జీవన స్థితిగతుల్ని విపులంగా చిత్రించారు. ఇది ఏటుకూరిలో గమనించాల్సిన ముఖ్య విషయం.
‘‘సగమిచ్చి సగము కూలీ ఎగవేసెడు ప్రభువు లితని కీశ్వరులన్నా’’ అని ఆవేదన చెందుతారు.
‘‘తాలిమి కూలికిన్ విసము త్రాపి ధనాడ్యులు స్వార్థకాంక్షులై / మేలిమి మ్రింగుచుండ తమ మే నలవోక వ్యయింప జూచ్చిరీ / బాలిశు లెందు కింక గుణపాఠము నేర్వరొ, ఎడ్లు దున్ని గుర్రాలను మేపుచున్న వపురా భగవంతుని పక్షపాతముల్’’- కష్టపడేది ఎడ్లు, సుఖాలు అనుభవించేది గుర్రాలు అని ఆవేదన. ఎడ్లు రైతులకు ప్రతీక. గుర్రాలు భూస్వాములకు ప్రతీక. కూలీలలో ముఖ్యభాగం దళితుల కష్టాలు కూడా దర్శించిన కవి ఏటుకూరి.
‘‘గాలి నీరు వోలె గల పదార్థము లందు / భాగ భర్త లఖిల పంచ జనులు / స్వార్థపరులు దీని సమ్మతింపరుగాని / కాల మూర్తి ప్రాలుమాలడన్న’’ అని దళితుల గురించి ఆవేదన చెందుతున్నారు కవి.
రైతుల కాపురాలలో అత్తల మానసిక స్థితిని కూడా వర్ణించారు. ‘‘చదువు నేర్చుకొన్న చక్కని జవరాలు / దొరికె నంచు లోన మురిసికొంటి / అత్త మామ లిర్వు లడగారినంగాని / కాలు పెట్టదేమొ కన్నతల్లి’’ అంటూ కాపురానికి రాని కోడలి గురించి అత్త ఆవేదన.
‘‘అండ దండ లేని బండెడు కాపుర / మీదుకొన్నదాన నింత వరకు / కొడుకు కత్తి సాము కోడలు మెడ పాము / చెప్పుకొన్న కొలది సిగ్గుచేటు’’ అని అత్తల మనోవేదనకు అక్షరరూపం ఇచ్చారు కవి.
అయిదవ ఘట్టంలో చేలకు కాపలా వున్న పడతులు, కొంచెం కొంచెం పెరుగుతున్న నగర వ్యామోహం, రైతుల దేశభక్తి మొదలైన అంశాలు కనిపిస్తాయి.
‘‘నీటి తీరువ క్రింద నిలువుదోపిడి చేయు / ఉద్యోగి మా తాట లొలుచువాడె / తన కులుపా చాలదని అల్లుకుర్రండు / సంచులు తొలగ త్రోయించువాడె / చదువు సంధ్యల పేర చెద పుర్వువలె చేరి / కొడుకమాంతము గుండె కొరకువాడె / నవ్య సభ్యతకు చెంతంజేరి భూషించి/ కుక్షింభరులు బలి కోరువారె / పట్టణాభ్యాసములు తలపడెడు లోన / సర్వ సన్యాస మిప్పించి సాగనంపు / దూరపుంగొండ నునుపుగా తోచుగాని / సభ్య జనులెంత మాత్ర మాశ్చర్యపడరు’’ అంటూ మాగాణి రైతుల కష్టాలు సూక్ష్మస్థాయిలో విశే్లషిస్తారు కవి.
‘‘సేద్య మొరుల పాలు జీవమ్ము మరపాలు / స్వాస్థ్య మంత ఇంతొ చదువు పాలు / కష్ట మోట్ల పాలు కల్మి డంబము పాలు / మా చరిత్ర తుదకు మచ్చపాలు’’ అని మాగాణి రైతుల ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు.
‘‘తీరిక వేళల రాటపు / ధోరణి మానకుము పనుల తొందర నైనన్ / దారిద్య్ర భంజకమ్మును / భారత సంస్థలకు నిండు ప్రాణమ్మిదియే’’ అని గాంధీజీ సందేశం కూడా రైతులకు అందిస్తారు కవి.
ఆరవ ఘట్టంలో రైతు దినచర్య, గ్రామీణ నిసర్గ సౌందర్యం కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
‘‘తరిమి కరచిపోవు త్రాచుపామటుబోలె / ఉరిమి కురిసిపోయె ఉడుకు మబ్బు / అందుకతన హాలికుడాత్ర ముద్దీపింప / ఆద మరచి ముందు కడుగు పెట్టె’’ అంటూ రైతుల్ని మోసం చేసే మబ్బుల్ని గమనిస్తారు.
‘‘చికిలి బాకు వోలె చీల మండకు క్రింద / సోడు ముట్టదాకె పాడు దుంప / ప్రాణ మెగిరిపోయి పాప మా సంసారి / కుప్ప వడియె ఒడలు గుడుసు వడగ’’ అంటూ తేట తెలుగు నుడికారంతో రైతు గాయాల్ని మన ముందుంచుతారు. రైతు గురించి సాధారణంగా కవిత్వం రాయటం వేరు, రైతు జీవితంలోని అశేష విశేష సూక్ష్మ అంశాలు గురించి బీరుపోకుండా కవిత్వం రాయటం వేరు. అందుకే రైతు కవుల్లో ఏటుకూరి స్థానం విశిష్టం, సుస్థిరం. ఇంకా ఏమంటున్నారో చూడండి.
‘‘రాగ రంజిమైన నీరాజనంబు / పట్టె కాబోలు పుడమికా పాద తలము / కష్టజీవికి ఫలమిచ్చు కనక గర్భ / పిండుచున్నది రక్తమ్ము కండలూడ్చి’’ అంటూ గాయాన్ని అందమైన గేయంగా చూపిస్తారు.
‘‘పుణ్యమున లభించు పూరుషుండైనను / భాగ్యమున లభించు భార్య అయిన / కష్ట సుఖము లందు కలసి రాకున్నచో / ఇంద్ర పదవియైన హితవు గాదు’’ అంటూ సరళ సుందర బోధ చేస్తారు.
ఇక చివరి ఘట్టంలో అడవి సేద్యం గురించి, గిరిజన రైతుల గురించి ఎవరూ ఇంతవరకు చ్పెని విషయాలు చిత్రిస్తారు.
‘‘్భల్ల కన్యలు పాడు బెట్రాయి పాటలో తెలుగుందనమ్మేర్చి తెచ్చికొనుము/ జల జల ప్రవహించు సెలల చప్పుళ్ళలో / నింపాదిగా లయ నేర్చుకొనుము/ కిలకిలలాడు పక్షుల కూజితమ్ములో / కల నాద మెలుగున కలిపికొనుము / పొంగి వచ్చెడు కమ్మ పూదేనె వాకలో / నిట్ట నిల్వున తీపి నింపుకొనుము/ కవుల కెందైన ఇట్టి సౌకర్యములకు / లోటు పాటొకటున్నదే లోకమందు’ అంటూ సొగసులన్నీ ప్రకృతిలోనే ఉన్నాయని, వాటిని కవులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
గగనంలో సూర్యుణ్ణి ఎలా వర్ణించారో గమనించండి. ‘‘కెంపుల దీపమొ, నిప్పుల / కుంపటియో, వ్రేల గట్టె, క్రూరుం డెవడో / సొంపైన గగన తలమున / నింపితములొ, కాలమూర్తికీ చిత్తరువుల్’’ అంటారు. వన సంరక్షణ, తరు సంరక్షణ నేటి నినాదాలు. వీటిని ఆనాడే చెప్పిన కవి ఏటుకూరి.
‘‘పూరి మేసి పడియనీ రాని జీవించు / లేటి కొమ్మ కెవని వేట భయము / కొమ్మ సందు పండి గుసగుసల్ పచరించు / గువ్వ జంట కెవని కోల బెదరు’’ అంటూ నిర్భయంగా ఉండే చెట్లను పక్షులను గమనించాలంటారు. మనిషే రకరకాల భయాలవల్ల అన్నిటినీ నాశనం చేయబూనుకుంటాడు.
‘‘ప్రతిఫలాపేక్ష లేని తపమ్ము సలిపి / పండి వ్రాలిన తరువుల బట్టి నరకు / మానవుడు సిగ్గుపడ డణుమాత్రమైన / నరులొనర్చెడు దురితమ్ము లరయ వశమె’’ అన్నారు.
‘‘ప్రకృతి బంధువు సాక్షిగా బ్రదుకు గన్న / జంతు సంతతి కున్న స్వేచ్ఛా ప్రవృత్తి / ప్రజలకు లవలేశమైన జొప్పడదు గాని / దురభిమానమ్ము స్వార్థమ్ము తురగలించు’’ అని మనిషికన్నా జంతువు నయం అంటారు.
‘‘నాటి భుక్తిగోరి పాటుపడు మృగాదు / లవసరమ్ము మట్టు కర్థిగోరు / కమల జాండ్ల మెల్ల కబళింప గోరెడు / మనుజ తృష్ణ నాగు మందదేది’’ అని ప్రశ్నిస్తారు.
‘‘మతము పేరిట జరుగు అమానుషములు / జాతి పేరిట నగు దురాచార విధులు / మచ్చునకు కానరావిందు మాత్రమెసగు / జాతి మర్యాద కే లోటు జరగదన్న’’ అని నేటికి కూడా అవసరమైన సందేశం ఇస్తారు. ఇంకా ప్రేమాలోకం, రుద్రమదేవి, త్రివేణి, పల్నాటి చరిత్రకు సంబంధించి రాసిన పద్యకావ్యాల మీద కూడా విపులమైన విశే్లషణ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఏటుకూరి కవిత్వానికి తగిన న్యాయం జరిగినట్లు.

- డా రావి రంగారావు 9247581825