మెయన్ ఫీచర్

జవాబుదారీతనం ఏదీ? ఎక్కడ??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం ఉందా? సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తే రాజకీయ పార్టీల తీరుపై చట్టపరమైన చర్యలకు సామాన్యులకు అధికారం దక్కుతుంది కదా! ఎన్నికల్లో గెలిపించడం, ఓడించడం అనే రెండు అస్త్రాలను మాత్రమే సిద్ధంగా ఉంచుకున్న ఓటర్లకు రానున్న రోజుల్లో సమాచార హక్కు అనే పాశుపతాస్త్రం చేతికి వస్తే రాజకీయపార్టీలు గాడిన పడతాయా? ఎన్నికల వేళ పార్టీలు, నాయకుల గురించి విస్తృతంగా చర్చిస్తున్న భారతీయులు ఎన్నికలు ముగిశాక వారి తీరుతెన్నులపై ఎలాంటి చర్చలకు అవకాశం ఉండటం లేదు. నాయకులు తమ పని తాము చేసుకుంటున్నారు. నాయకులు ఏమీ చేయలేదని ఆగ్రహం చెందడం వినా సామాన్యులు చేసేదేమీ ఉండటం లేదు. గ్రామాల్లో నాయకులను నిలదీసే శక్తి సామర్ధ్యాలు లేక మరోసారి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆయన బాధ్యులను చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ కింద రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తోంది. అలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం -2005లోని సెక్షన్ 2(హెచ్) కింద పబ్లిక్ అథారిటీగా గుర్తించాలనేది ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశం. గుర్తింపు పొందిన, పొందని రాజకీయ పార్టీలన్నీ సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను పాటిస్తూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను, అప్పిలెట్ అథారిటీని నియమించాలి. తద్వారా సామాన్యులకు ఆయా రాజకీయ పార్టీల కార్యకలాపాలపై అధీకృతంగా ప్రశ్నించే హక్కు కలుగుతుందని అశ్విని కుమార్ వాదిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పార్టీల ఆర్థిక స్థితిగతులు, ఖర్చులు, ఎన్నికలు, ఆదాయ వనరుల మూలాలు, ఆదాయపు పన్ను చెల్లింపు తదితర వివరాలు కూడా పొందవచ్చు. ఈ వివరాలను ప్రకటించని పార్టీలను ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశాన్ని కూడా కల్పించాలని కోరుతున్నారు.
రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని ఎంతో కాలంగా డిమాండ్లు ఉన్నా ఎన్నికల కమిషన్ మాత్రం ఉదారంగానే వ్యవహరిస్తోంది. దీంతో సామాజిక కార్యకర్తలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులు వంటి అవాంఛనీయ ధోరణుల వల్ల సమాజానికి తీవ్రమైన గాయం అవుతోందని, ఫలితంగా స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే అవకాశం ఉండటం లేదని , రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19, 21 ద్వారా కల్పించిన హక్కులను వినియోగించుకోలేని దుస్థితిలో పౌరులు ఉన్నారనేది ఆయన వాదన.
ఇక, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల వ్యవహారం ఒక ప్రహసనంగా మారుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 178 మంది రైతులు సహా 185 మంది అభ్యర్థులు రం గంలో ఉన్నారు. ఇష్టానుసారం అభ్యర్ధులు రంగంలోకి దిగడం వల్ల ఎన్నికల ప్రక్రియ సైతం గందరగోళంగా మారుతోంది. ఎక్కడైనా గరిష్టంగా 64 మంది వరకూ పోటీ చేస్తే అక్కడ ఈవీఎంలను వినియోగించవచ్చు. అంతకు మించి అభ్యర్ధులు పోటీలో ఉంటే ఈవీఎంల వినియోగం అసాధ్యమవుతుంది. దాంతో తిరిగి పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాలను వాడాల్సి వస్తుంది. బ్యాలెట్‌లోనూ 185 మంది అభ్యర్ధుల వివరాలను గుర్తించడం, ప్రతి అభ్యర్థి వివరాలను చూసి వోట్లు వేయాలంటే ఒక్కో ఓటర్‌కు చాలా సమయం పడుతుంది. ఈసారి తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 443 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో కొన్ని హామీలు, మేనిఫెస్టోలో లేకుండానే మరికొన్ని హామీలను గుప్పిస్తున్నాయి. మేనిఫెస్టో అమలు చేయని పార్టీలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలకు ప్రస్తుత ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎలాంటి కచ్చితమైన నిబంధనలు లేవు.
రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామని, మలేషియా చేస్తామని, అమెరికాలా మారుస్తామని మరికొంత మంది హామీలు ఇవ్వడం, లక్షల కోట్లు వ్యయం చేస్తే తప్ప పూర్తికాని ప్రాజెక్టులు, పథకాల గురించి మాట్లాడటం, కొన్ని పార్టీలు ప్రజాధనాన్ని నిర్లజ్జగా సంక్షేమ పథకాల పేరుతో కొల్లగొట్టడం, కొద్ది మంది లబ్దిదారులనే ఎంపిక చేసి వారికే అన్ని సౌకర్యాలను కల్పించడం వంటివి కళ్లారా కనిపిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిన వారుంటున్నారు. కొంతమంది నేతలు రాష్ట్భ్రావృద్ధి పేరుతో వందల సార్లు ప్రభుత్వ వ్యయంతో విదేశాలు పర్యటించడం, ప్రతినిధి బృందాలను విదేశాలకు తీసుకువెళ్లడం, మొహమాటం కొద్దీ కేంద్ర ప్రభుత్వం వారికి నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయడం అనునిత్యం జరుగుతున్నదే. రాజకీయ పార్టీల ప్రయోజనాలకు విదేశాల్లో ఆయా పార్టీల వ్యక్తులను ప్రతినిధులుగా నియమించడం, వారి కోసం కొంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో పార్టీలో కీలక వ్యక్తులకు మంత్రి పదవుల స్థానే సలహాదారుల పదవులను కట్టబెట్టి, మంత్రులకు మించి వారు ఎక్కువగా ఖర్చుచేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేయకుండానే మరో పార్టీతో అనుబంధంగా ఉంటున్నారు. పార్టీ మారితే అనర్హత వేటు వేసే చట్టాలు ఉన్నందున - తెలివిగా పార్టీ మారినట్టు చెప్పకుండానే ఫిరాయింపులు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మొత్తం ఎన్నికైన వారంతా సమూహంగా వేరే పార్టీలోకి మారుతూ ఫిరాయింపుల చట్టానికే తలవంపులు తెస్తున్నారు. ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలోకి మారిన వెంటనే మిగిలిన సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా వారిని అనర్హులను చేసే నిబంధనలు రావల్సి ఉంది.
ప్రస్తుతం దేశంలో ఏడు జాతీయ పార్టీలతో పాటు 59 ప్రాంతీయ పార్టీలు గుర్తింపు పొందాయి. 2,293 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. ఎన్నికల కమిషన్ గత వారం ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ మూడు నెలల్లో 149 కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిన్నింటినీ రిజిస్టర్ చేస్తున్నారు. అయితే వీటిని గుర్తింపు లేని పార్టీలుగా పరిగణిస్తారు. ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రెండు శాతం ఓట్లు సాధించాలి, మూడు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవాలి లేదా నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధించాలి, కనీసం నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలవాలి లేదా నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి గుర్తింపు ఉండాలి, అలాంటి పార్టీలు మాత్రమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతాయి. గత ఫిబ్రవరి వరకూ దేశంలో రిజిస్టర్ అయిన పార్టీలు 2143 మాత్రమే. ఆ తర్వాత తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు కొత్తగా 58 పార్టీలు పుట్టాయి. ఈ పార్టీలకు ఎలాంటి ఎన్నికల చిహ్నాన్ని కేటాయించరు, ఈ పార్టీలు గుర్తించిన 84 చిహ్నాల్లో ఎదో ఒక దానిని ఎంచుకుని వేర్వేరు చిహ్నాలతో పోటీ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన తర్వాత మాత్రమే వీటికి శాశ్వత చిహ్నాన్ని కేటాయిస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా గత దశాబ్దంలో ఎక్కడా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదని తేలింది. అలాంటి 255 రాజకీయ పార్టీల వ్యవహారంపైనా, వాటి ఆర్థిక మూలాలపైనా ఆరా తీయాలని ఎన్నికల కమిషన్ సీబీడీటీని కోరినపుడు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. ఆ పార్టీలకు పెద్ద ఎత్తున విదేశాల నుండి నిధులు వస్తున్నాయి, స్థానికంగా కూడా నిధుల సేకరణ జరుగుతోంది, ఖర్చు చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ మాత్రం చేయడం లేదు. నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 29సీ కింద రాజకీయ పార్టీలు తాము సేకరిస్తున్న నిధుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదిక రూపంలో ఇవ్వాలి. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ ప్రసార సాధనాల్లో స్లాట్‌లను ఉచితంగా ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలు కార్యాలయాలను నిర్మించుకునేందుకు అతి తక్కువ వ్యయానికే ఖాళీ స్థలాలను ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇన్ని ప్రయోజనాలు పొందుతున్నా పార్టీల తీరు మాత్రం మారడం లేదు. సామాన్యుడి ఆకాంక్షలను తీర్చే రాజకీయ పార్టీలు రావాలంటే చట్టాల్లో మార్పులు జరగాలి. పార్టీల అరాచకాలకు , నిర్లజ్జ హామీలకు ముకుతాడు పడాల్సిందే. సంక్షేమ పథకాలకు ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా మనకేమిటి? అనే ధోరణికి పార్టీలు చరమగీతం పలికేలా చట్టాల్లో నిబంధనలు ఉండాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090