మెయిన్ ఫీచర్

అనంతకాల సాగరలహరి ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సూర్యోమరీచి మాదత్తె సర్వస్మాద్భువనాదధి
తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం’’
సూర్యుడు సర్వ భువనములకు పైభాగములనందుండి కిరణములను ప్రసరింపజేస్తూ, వాటిని ప్రకాశింపజేయుచున్నాడు. సూర్యకిరణముల యొక్క ప్రకాశమువలన, సంకోచము వలన, సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, దినము మొదలగు కాల భేదములేర్పడుతున్నాయి. సూర్యరశ్మిలోని వేడియొక్క తరతమములను బట్టి ఋతువులు ఏర్పడి వర్షములు కురియుట, విత్తనములు మొలకెత్తుట, సస్యములు ఫలించుట, చెట్లు పుష్పించుట, వృక్షములు ఫలములనిచ్చుట మొదలగు ప్రక్రియలన్నీ జరుగుతున్నాయి. కనుక కాలము యొక్క పరిణామములకు, ఋతువులేర్పడుటకు, ఋతు ధర్మములు ప్రవర్తిల్లుటకు సూర్యకిరణములే కారణమని, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం పేర్కొన్నది. అటువంటి కాల సంబంధమైన పండుగే ఉగాది. కాలము అపరిమితమైనది. అపరిమితమైన కాలంలో పరిమితమైనది మానవ జీవితం. ఎన్నో జన్మల పుణ్యఫలము చేత లభించింది- మానవ జన్మ. కాలాన్ని, కేవలము లౌకిక వ్యవహారముల నిమిత్తమై, ధన కనక వస్తు వాహనములకోసం వినియోగించి, వృథాచేయక, అర్థకామాల్ని ధర్మబద్ధంగా అనుభవించి, కాలాన్ని కాయాన్ని సార్థకం చేసికోవాలని హెచ్చరించే కాల సంబంధమైన పండుగ ఉగాది.
కాలం - పరమాత్మ స్వరూపం
సంవత్సరం, సూర్యభగవానుని రూపమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పారమార్థికమైన చైతన్యమే కాలస్వరూపంగా ‘సంవత్సరః’ అని పిలుస్తారు అని వివరించారు శ్రీ శంకర భగవత్పాదులు. కాలస్వరూపుడై, సంవత్సర రూపంతో వెలుగొందేవాడు పరమాత్మ. సమస్తమును లెక్కచూచేవాడు- కాలుడు. సర్వజీవుల చరాచరముల ఆయువును గణనం చేసే, కాలస్వరూపుడైన ఈశ్వరుడే ‘కాలుడని’, ఆయనే్న ‘కాలాయనమః’ అన్నారన్నారు ఆదిశంకరులు. ఆద్యంతము విలువైన కాలము భగవంతుని స్వరూపమే. ‘కాల’ అంటే, ‘కా’ అనగా శుభములను, ‘ల’ అంటే అందించునది అని అర్థం. ‘అహమేవ అక్షయ కాలః’ అన్నది భగవద్వాక్యం. ‘అక్షయమైన కాలాన్ని నేనే’ అని చెప్పారు పరమాత్మ. ‘కాలః కలయతామహం’ అన్నాడు అందుకే. ‘కాలా అప్రునివిశనే్త’ అని చెప్పింది తైత్తిరీయ ఆరణ్యకం. కాలము జలములందున్నది. అనగా సంవత్సరానికి ‘నీరే’ స్థానం. ‘ఆపోవా ఇదమగ్రే సలిలమాసేత్’ అన్న వేద ప్రమాణము చేత, సృష్టికి పూర్వం అంతా జలమయమే అగుటచేత సంవత్సరము మొదలగు కాలములకు జలమే ఆధారం. జలములకు సంవత్సర స్వరూపుడైన సూర్యభగవానుడు ఆధారం. జలములవల్లనే సంవత్సరానికి అవసరమైన, జీవధాతువులు, ఆహారం లభిస్తాయి.
ప్రకృతి శోభ
మోడువారిన జీవితాలను చైతన్యవంతం చేసి, వైషమ్యాలు వైమనస్యాలను తొలగించి, నవ్య తేజస్సుతో భవిత ప్రగతికి బంగారు బాటలు దిద్దే మహోదాత్త శక్తి- ప్రకృతి. మృగ నగ ఖగ తరు లతాదులు, చీకటి వెలుగులన్నీ ప్రకృతి వరప్రసాదము. సూక్ష్మరూపంగా తన్మాత్రలుగా - శబ్ద స్పర్శ రూప రస గంధములుగా తనలో అదృశ్యంగా ఉండే పంచభూతములను దర్శించి, అవగాహన చేసికోటానికి, బాహ్య ప్రపంచంలోని భూమి నీరు నిప్పు గాలి ఆకాశాన్ని గురించి ఆలోచించాలి. అదే ప్రకృతి శోభ. అదే ‘కాల’స్వరూపం. అదే పరమాత్ముని వెలుగు.
వసంతఋతువు
సమస్త విశ్వంలో పదార్థ ధర్మాలకు ప్రతీకలైన ‘వసువులు’ అధిదేవతలుగానున్న వసంత ఋతువు ఆగమనంతో ప్రకృతిలో నవజీవనం వెలిగి నూతన తేజోత్సాహము విల్లివిరుస్తుంది. కనుకనే ‘ఋతూనాం కుసుమాకరః’, ‘ఋతువులలో వసంతఋతువు నేనే’నని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదవ అధ్యాయంలో వివరించాడు. ఆరు ఋతువులలో మొదటిది వసంతఋతువు. ‘మధుశ్చ మాధవశ్చ వాసన్తికావృతూ’ అన్నది వేదం. చైత్ర వైశాఖమాసములు వసంతుఋతువు. మధు పదానికి - చైత్రమాసము, అశోక వృక్షము, తేనె మున్నగు అర్థాలున్నాయి. పౌర్ణమి చిత్తానక్షత్రంతో కూడి ఉండే మాసం చైత్రమాసం. ‘ఇంద్రస్య చిత్రా’ చిత్తానక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజగ్రహానిది. కుజుడు అగ్ని సంబంధమైనవాడు. విశాఖా నక్షత్రంలో పౌర్ణమి వస్తే, అది వైశాఖమాసం. విశాఖా నక్షత్రానికి అధిపతి గురుడు. మాధవ పదానికి, వైశాఖం, తేనె, ఇంద్రుడు అనే అర్థాలున్నాయి. చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, వైశాఖమాసంలో వృషభరాశిలో ఉంటాడు. కుజ, గురులు సూర్యునికి మిత్రులు, ఇంద్రాగ్నులు సూర్యస్వరూపులు. చిత్తా విశాఖ నక్షత్ర కాంతులు సూర్యకాంతులు. కనుక రవి, మేష వృషభరాశులలలో ఉన్నపుడు కలిగే ప్రకృతి శోభ, దాని ప్రభావము; ఇంద్రాగ్నుల చిత్తా విశాఖా నక్షత్రముల ప్రభావముల మేలుకలయికతో వచ్చేది వసంతఋతువు అని జ్యోతిష ఖగోళ, వేద శాస్తమ్రులు పేర్కొన్నాయి.
ఉగాది పండుగ
మాసములలో మొదటిది చైత్రమాసం. పక్షములలో మొదటిది శుక్లపక్షము. తిథులలో మొదటిది పాడ్యమి, నక్షత్రములలో మొదటిది అశ్విని, ఋతువులలో మొదటిది వసంతఋతువు. వసంతఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి పాడ్యమి తిథి వున్న రోజునే సంవత్సరం ఆరంభం అవుతుందని నిర్ణయించారు. ఆ రోజు ‘ఉగాది’ నూతన సంవత్సరాది పండుగను జరుపుకుంటారు. పేరంటానికి వెళ్ళే బాలిక జడలోని మల్లెమొగ్గ, వేపకొమ్మకు ఆని చిగురాకు సజ్జనీనెకు పట్టిన పూత, కోకిల కుహూ కుహూకారములు, మగ కోయిల ఆమ్రకిసలయములనన్నింటిని ముక్కుతో చిదిమి, ఆ రసాన్ని పెంటి కందించే హొయలు, సెలయేళ్ళలో నీళ్ళుపోసుకుంటున్న ఏనుగుల మధుర మనోవికారాలు, చక్రవాక పక్షుల అనురాగాల వర్ణనలతోను, మహాకవి కాళిదాస, కవిసమ్రాట్ విశ్వనాథల ‘ఋతు సంహార’ కావ్యరచనలతో, ఏటేటా శోభాయమానంగా వస్తుంది వసంతఋతువులో ఉగాది పండుగ.
ఉగాదికి ఆధ్యాత్మిక అర్థం
ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినం. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ సంధిరోజు ‘ఉగాది’. ఉగాది అనే పదం ‘యుగాది’ అనే సంస్కృత పదానికి వికృతిరూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. ఉగము ఆదిగా గలది- ఉగాది. ఉగము అంటే జన్మ, ఆయుష్షు, యుగము అనే అర్థాలున్నాయి. ‘యుగము’ అంటే జన్మ అనే అర్థముంది. కనుక ‘ఉగాది’ అంటే జన్మాది, జన్మకు ఆది- జన్మాది. ఎవరు? శ్రీమహావిష్ణువు. ‘జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః’ అన్నది విష్ణు సహస్రనామ స్తోత్రం. కనుక ఉగాది అంటే పరమాత్మ.
ఉగాది విశేషార్థాలు
ఉగము ఆదిగాగలది ‘గాది’. ఉక్ ఆదౌ యస్యసః ఉగాదిః’- ఉగ్ ఆది యందుగల రోజు ఉగాది. ‘ఉ’ అంటే ‘శివుడు’. ‘ఉ’ ఆదిగాగలది- ‘ఉమ’ కనుక ‘ఉగాది’ అంటే ‘ఉమ’- ప్రకృతి శక్తి. బ్రహ్మవిద్య, కుండలినీ యోగశక్తి, చేతనా చేతన జీవరాశికి ప్రతీక. అనగా సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకోటానికి ప్రారంభదినము ఉగాది. ఉగాదికి మరొక అర్థం పరిశీలిద్దాం. ‘ఉ’ అంటే ఉత్తమమైన, ‘గం’ అంటే జ్ఞానం. కనుక ‘ఉగం’ అంటే ఉత్తమమైన జ్ఞానం. ఏమిటది? పరమాత్మను తెలిసికోవటం- సత్యానే్వషణ అనగా ‘వేద జ్ఞానం’. వేదం ధర్మస్వరూపం. ‘ఉం పరమాత్మా నం గమయతీతి ఉగం’- పరమాత్మ తత్వాన్ని తెలియజేసేది వేదము, అనగా ధర్మము. ఉగాది అంటే ఉగమునకు ఆది, అంటే వేదమునకు ఆది- ఏమిటది? ఓంకారము. ఓంకార ప్రణవ నాదము. ప్రాణాగ్నుల కలయికతో నాదము ఏర్పడుతుంది. అదే దైవీవాక్కు. దైవీం వాచ మన యన్తదేవాః తాం విశ్వరూపాః పశవోవదన్తి’ దైవీ వాక్కుగా సృజింపబడిన నాదాన్ని ఇంద్రాది దేవతలు వ్యవహార యోగ్యమగునట్లుగా, అకారాది అక్షర స్వరూపము నొందించారు. అదే ప్రణవనాదమయింది. ఈ ప్రణవనాదమే, వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారమైనది. ఇదే వేదనాదము, అవే సప్తస్వరములు- స, రి, గ, మ, ప, ద, ని. కనుక ఉగాది అంటే వేదములకు ఆది యందున్న స్వరము- ఓంకార ప్రణవనాదమే అని అర్థం. ‘యో వేదా దౌ స్వరప్రోక్తో వేదాం తేషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం. కనుక స్వరము కూడా ఉగాదే. సారమతి రాగం దేశాది తాళకీర్తనలో ‘ప్రాణానల సంయోగమువల్ల ప్రణవనాదము సప్తస్వరములై బరగ’ అని; రూపకతాళం ఆరభిరాగ కీర్తనలో ‘వేద పురాణాగమ శాస్త్రాదుల కాధారవౌ అని, జగన్మోహిని రాగం రూపకతాళంలో ‘శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా’ అని కీర్తించిన, బ్రహ్మ విద్యా సార్వభౌముడు శ్రీ త్యాగరాజస్వామి, ఉగాది విశేషాలను గంభీరంగా స్ఫూర్తిదాయకంగా అందించాడు. ఉగాది రోజున తప్పకుండా మననం చేసికోవలసిన కీర్తనలు.
ఉగస్య ఆది ఉగాది
ఉగమంటే, నక్షత్ర గమనం. చుక్కల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలైన కాలము యొక్క ఆది ఉగాది. వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుండి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి, మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజు అని పురాణములు పేర్కొన్నాయి. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు. పూర్వీకులు యుగారంభ దినమును పండుగ దినములుగా జరుపుకునేవారు. కానీ తరువాత ఖగోళ శాస్తవ్రేత్తలు, జ్యోతిష శాస్తవ్రేత్తలు ఒక నిర్ణయానికి వచ్చి వసంత ఋతువులో ప్రారంభ దినమున చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ప్రారంభ దినముగా నిర్ణయించి, యుగాదిగాక, ఉగాదిగా సంవత్సరం ఆరంభంలోనే ఉగాదిని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటినుండి ఉగాది పండుగను జరుపుకుంటున్నాము.
ఉగాది రోజున ఉదయమే లేచి, అభ్యంగన స్నానం చేయటం మన అలవాటు. ఇళ్ళను, ముంగిళ్ళను ద్వారాలను, మామిడాకుల తోరణాలతో కనుల పండువగా అలంకరించి సూర్యుణ్ణి సంవత్సరాది దేవతను పూజిస్తారు. ‘‘వేదమరుూం, నాదమరుూం, బిందుమరుూం, పరపదోద్య దిందు మరుూం మంత్రమరుూం, తంత్రమరుూం, ప్రకృతి మరుూం, నౌమి విశ్వ వికృతి మరుూం’’- ‘‘ఓడ్యాణ పీఠ నిలయా బిందుమండల వాసిని; విధాత్రీ వేదజననీ; ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా; వీరగోష్ఠిప్రియా వీరా నష్కర్మ్యా నాదరూపిణి; మహాతంత్రా, మహామంత్ర, మహాయంత్రా, మహాసనా..’’ అనే లలితా సహస్రనామ స్తోత్రములోని ఈ మంత్రాలు, శ్రీ వికారి నామ సంవత్సర దేవత, శ్రీ లలితా పమేశ్వరీ దేవి అని స్పష్టం చేస్తాయి. పై శ్లోకాన్ని పఠిస్తూ, లిలతా అష్టోతరంగాని, సహస్రంగాని పఠించి, అమ్మకు పూజ చేస్తే, ఈ వికారి నామ సంవత్సరమంతా, గ్రహ సంచారం మన రాశిమీద ఎటువంటి ప్రభావం చూపినా, అవన్నీ జగన్మాతే చూసుకుంటుంది. సంవత్సర దేవతా పూజ, ఇష్టదేవతార్చన తదుపరి ఉగాది పచ్చడి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రకృతి కొత్తగా ప్రసాదించిన ఫల పుష్పాదులను, అర్థం పరమార్థంగల సంప్రదాయంతో తీసికోవడం- ఉగాది పచ్చడి విశిష్టత. సర్వకాలములలోనూ, సమతుల్యమైన ఆరోగ్యాన్ని పొందడానికి దోహదపడే ప్రకృతి ప్రసాదం- వేపపువ్వు. జీవితాన్ని సమదృష్టితో చూడాలనే ఆధ్యాత్మికతను తెలియజేసేది ఉగాది పచ్చడి. వేపపువ్వు, మామిడి, బెల్లం, క్రొత్తచింతపండు, ఉప్పు, కారం (పచ్చిమిర్చి సన్నని ముక్కలు) షడ్రుచుల సమ్మేళనంగా, సమతుల్య జీవన విధానాన్ని ప్రకృతిపరంగా నిర్వచిస్తోంది ఉగాది పచ్చడి. జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, శే్లష్మాన్ని హరించి రక్తశుద్ధిని జేసి, ఆకలిని పెంపొందింపజేసి, మనోవ్యాధిని నశింపజేసి, శాంతిని కలిగించే ఉగాది పచ్చడిని ‘శతాయుధ్వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం’ అని పఠిస్తూ సేవిస్తే ఆయుర్యుద్ధి జరుగుతుందని ఆయుర్వేద విజ్ఞానశాస్త్రం పేర్కొన్నది.
పంచాంగ శ్రవణం
తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడినది పంచాంగం. తిథివలన సంపద, వారమువలన ఆయుష్షు, నక్షత్రమువలన పాప పరిహారము, యోగమువలన వ్యాధి నివారణ, కరణము వలన కార్యానుకూలత చేకూరుతాయి. పంచాంగ శ్రవణమువలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రాచీన మహర్షులు, ప్రతి సంవత్సరానికి పరిపాలకులను నిర్ణయించారు. ప్రభవ నుండి అక్షయ వరకు ఉండే అరవై సంవత్సరములకు, ఉగాది వచ్చిన సమయాన్ని, వారాన్ని బట్టి ఏ ఏ గ్రహములకు ఏఏ అధికారములు సంక్రమిస్తాయో తెలియజేసేది పంచాంగం.
ఉగాది: కాలనిజ స్వరూపం - ఆదిశంకరుల హితబోధ
రాత్రింబవళ్ళు, ఉదయాస్తమానాలు ఆకురాలే కాలమూ చిగురించే కాలము, మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. కాలం అన్నిటికన్నా బలీయమైంది. దాని క్రీడా విలాసాలలో ఆయుష్షు క్షీణిస్తూనే ఉంటుంది. తరాలు గడుస్తూనే ఉంటాయి. అయినా మనిషిలో ఉండే స్వార్థం, మూర్ఖత్వం తొలగవు. ‘కాలః క్రీడతి’ అన్నారు శంకరులు. మానవుని వివేకాన్ని నాశనం చేసి అతని పతనానికి మూలమైనవి ధన జన వన గర్వాల. మానవుడు వీటిద్వారా ఎంత విఱ్ఱవీగినా, కాలం ప్రతికూలమైతే, క్షణాలమీద పేకమేడల్లా కుప్పకూలిపోతాయి. ‘మాయా మయ పాద మఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా’ అన్నారు శంకర భగవత్పాదులు.
ఉగాది మనకిచ్చే సందేశం
మనిషి మనిషిగా పుట్టడం ఒక వరం. కాలం విలువను జీవితం విలువను గుర్తించి, తనలోని పశు రాక్షస ప్రవృత్తిని రూపుమాపుకొని, మానవతా విలువలను పెంచుకొని, అంతర్లీనంగా వున్న దివ్య ప్రకృతిని ప్రజ్వలింపజేసికొని ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసికొనే జ్ఞానాన్ని పొంది, సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వ మానవ కల్యాణాన్ని కాంక్షించాలని బోధిస్తోంది- శ్రీ వికారి నామ ఉగాది.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464