మెయిన్ ఫీచర్

హీరోలకే హీరోలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వినయ విధేయ రామ, యన్‌టిఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలనే తీసుకుందాం. ఒకటి భారీ బడ్జెట్ సినిమా. మరొకటి గొప్ప చరిత్రవున్న వ్యక్తి బయోపిక్. ఏమైంది? ప్రేక్షకుడికి ఇవేం పట్టలేదు. సినిమా నచ్చలేదంతే అంటూ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. అంత పెద్ద హీరోలు సైతం కామ్‌గా ఉండిపోయారు. అందుకే అనేది -ప్రేక్షకుడు హీరోలకే హీరో అని.
*
సంక్రాంతి పండుగలా వచ్చిన ఎఫ్-2ని -మొదట అదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమేననుకున్నారు. సినిమా విడుదలైన తరువాత తెలిసింది -ఆడియన్స్‌కి నచ్చితే, వాడు చూపించే చిత్రమే వేరుగా ఉంటుందని. వారం కాదు, పక్షం కాదు, ఏకంగా నెలలపాటు థియేటర్లను వదిలిపెట్టకుండా ఆడేసింది ఎఫ్-2. చిత్రమేమంటే రిపీటెడ్ ఆడియన్స్‌లోనూ రీపీటెడ్‌గా సినిమాకు వెళ్లిపోయారు. చూడాల్సింది చూశారు. ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేశారు.
*
మొన్న నిన్న నేడు రేపు ఎప్పుడూ..
తారలున్నంత కాలం సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గదు. సినిమా ఎప్పటికీ అతి పెద్ద వినోద సాధనమే. సినిమాలన్నా, హీరోలన్నా అభిమానుల్లో పిచ్చి తగ్గదు. నచ్చిన హీరో ఎవరు? అన్న ప్రశ్న పడితే చాలు -చిరు, నాగ్, వెంకీ, బాలయ్య, పవన్, మహేష్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, చరణ్, బన్నీ, చైతూ, నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్.. ఇలా వెటరన్ లిస్ట్‌నుంచి ఎదుగుతున్న హీరోల వరకూ ఎవరోకరి పేరు ఠక్కున బయటపడుతుంది. ఇదే సినిమా పిచ్చి. చిత్రమేంటంటే -ఇంతమంది రీల్ హీరోలకు ఒకే ఒక్క రియల్ హీరో -ప్రేక్షకుడు. ప్రేక్షకులే దేవుళ్లంటూ సభావేదికల పైనుంచి నిజమైన అభిమానాన్ని చాటేవాళ్లు, కెరీర్ కోసం కొత్తగా బిస్కట్లు వేసేవాళ్లూ ఉండొచ్చు. కాకపోతే ప్రేక్షకుడు మాత్రం హీరోకి -హీరోనే.
ఎందుకంటే -దర్శకుడు నిబద్ధతతో అందంగా చుట్టేసిన రీల్ నాసిరకమా (ఫ్లాపా)? నాణ్యమా (హిట్టా) అని తేల్చిపారేసేది ప్రేక్షకుడే. సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడి వర్కవుటవుతుందో? లేదో?నని జడ్జిమెంట్ ఇచ్చేదీ ప్రేక్షకుడే.
ఎంత పెద్ద స్టార్‌డమ్‌వున్న హీరో అయినా ప్రేక్షకుడిని కాదంటే (వాళ్ల అభిరుచి మేరకు సినిమాలు చేయకుంటే) ఏదోకరోజు భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈ విషయం సినీ చరిత్రలో ఎన్ని పుటల్ని తడిమినా పేజీల్లో రీళ్లై కదలాడతాయి. అందుకే యువ హీరో నాగచైతన్య ఈమధ్య ‘మీరు నానుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో ఇకనుండి అలాంటి సినిమాలే చేస్తానన్నా’డు ప్రేక్షకుడిని ఉద్దేశించి. ఎందుకంటే ఏడాదికి ఎన్ని సినిమాలు రిలీజైతేనేం -ప్రేక్షకుడిని అలరించే కొన్ని సినిమాలైనా రావాలిగా. అందుకే సినిమారంగం విషయానికొస్తే అసలైన హీరో వీక్షకుడవుతాడు.
**
గత ఏడాదిలో దగ్గర దగ్గరగా విడుదలైన రెండు సినిమాలు తీసుకుందాం. ఒకటి నాని హీరోగా -యంసిఏ, రెండోది అఖిల్ చేసిన -హలో. విశేషమేంటంటే చాలామంది క్రిటిక్స్ యంసిఏని సాదాసీదాగా పోలుస్తూ గ్రేడింగిచ్చారు. హలో సినిమాని క్లీన్ అండ్ క్యూట్ లవ్ చిత్రంగా రేటింగుల్లో పేర్కొన్నారు. కానీ ఈ రేటింగులు ప్రేక్షకుడికి పట్టలేదు. కాదు, పట్టించుకోలేదు. అఖిల్‌ను ‘హలో’ అని తిరిగి విష్ చేయలేకపోయారు. మొహం చాటేశారు. యంసిఏని చూడ్డానికి క్యూగట్టారు. అఖిల్ సెకండ్ పిక్చర్ బాక్సాఫీసు దగ్గర నిరాశపర్చింది. నాని ఖాతాలో యంసిఏ హిట్‌గా (రేంజ్ మేరకు కలెక్షన్స్ రాబట్టి) నమోదైంది. ఎందుకిలా జరిగి ఉంటుందని ఎవరూ డీప్‌గా ఆలోచించరు. ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం లేకుండానే విషయం తెలుస్తోంది కనుక. ప్రేక్షకుడు తెల్లకాగితం. అతడి హృదయ ఫలకంపై సిరా విదిలిస్తే (్ఫ్లపు) మరకవుతుంది. రంగులద్దితే (హిట్) పెయింటవుతుంది. సినిమావాళ్లు తమకు నచ్చింది తీస్తే బొమ్మ కనుమరుగవుతుంది. ప్రేక్షకుడు మెచ్చింది తీస్తే తెరమయమవుతుంది. ఈ నగ్నసత్యం ఎరిగిన నాగచైతన్య యుద్ధం శరణం... ఇచ్చిన అనుభవంతో పైన చెప్పుకున్న స్టేట్‌మెంటిచ్చాడు సభాముఖంగా సవినయంగా.
మొన్న మొన్ననే సేమ్ సిట్యుయేషన్ రిపీటయ్యింది. చి.ల.సౌ., గూఢచారి చిత్రాలు రెండూ కలిసి బరిలోకి దిగాయి. సినీ క్రిటిక్స్ చి.ల.సౌ.ని అభినందిస్తూ ముందువరుసలోకి నెట్టారు. క్లాస్ అండ్ నేచురల్ మూవీగా అభివర్ణించారు. ఒక న్యూ ఎఫర్ట్‌గా ప్రశంసించారు. ప్రేక్షకుడు వింటేగా. తన మనసుకి నచ్చింది చూసేసాడు. చి.ల.సౌ. సినిమా బాక్సాఫీసుని లాగలేక చతికిలపడింది. గూఢచారి పిక్చర్ కలెక్షన్ల మోతతో(సినిమా స్టామినామేరకు) ఏకంగా బాక్సాఫీసు బాక్స్‌ని గాల్లో గిరగిరా తిప్పేసింది. ఇదీ ప్రేక్షకుడి లీల, ఇచ్చే ఫలితం
సీనియర్ యన్టీఆర్ ‘పాతాళభైరవి’లో తోటరాముడు (హీరో)! ఇతడిని ఉద్దేశించి మాంత్రికుడు యస్వీఆర్ అంటుంటాడు. ‘సాహసం సేయరా డింభకా!’ అని. మరి దర్శక నిర్మాతలు సినిమాలు తీయడంలో ఎలాంటి సాహసాలు, పిహెచ్‌డీలు చేయనక్కరలేదు. జస్ట్ ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేస్తేచాలు. అది హారరా, హ్యూమరా, ఫ్యామిలీనా, అడ్వెంచర్ థ్రిల్లరా... ఇలా ఎన్నుకున్న జోనర్ ఏదైనా ‘అతడి’ని ఆకట్టుకోవాలి.
వాడే కింగ్. వాడే సూపర్ స్టార్. అంతే మెగాస్టార్. అతనే సుప్రీమ్. అతనే జడ్జి. మరి అతడే క్యాషియర్ కదా. వెండి తెరపై సినిమాని బంగారు ఛాయలతో నగిషీలు చెక్కితేనే పసందు అంటాడు. మళ్లా అదే వెండితెరపై సినిమాను ఇనుప తాపడం చేస్తే ఈడ్చికొడతాడు.
**
టాలీవుడ్‌లో ఈ విషయం ఓ రికార్డేమో. గతేడాది పెళ్లి చేసుకున్న ఫ్రెష్ జంట -వేర్వేరు సినిమాలతో ఒకే రోజు (2018 సెప్టెంబర్ 13న) థియేటర్లకు వచ్చారు. వాళ్లే చైతూ అండ్ సమంత. ఆ సినిమాలు శైలజారెడ్డి అల్లుడు, యూ-టర్న్. శై.అ-ను రెగ్యులర్ ఫార్మాట్ ఫిల్మ్‌గా క్రిటిక్స్ తేల్చేస్తే, యూటర్న్ మూవీకి కొంత పాజిటివ్ సమీక్షలు రాసేసారు. ఎప్పటిలా ప్రేక్షకుడు కామ్‌గానే ఉన్నాడు. థియేటర్‌కు వచ్చాడు. అప్పటివరకు వసూలుచేయని ఆక్యుపెన్సీని ఫస్ట్‌టైం నాగచైతన్య చేసేశాడు. అతని చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పట్టంకట్టేసారు. గమ్మత్తేంటంటే యూటర్న్ కూడా బాక్సాఫీసుని తనస్థాయిలో టర్న్‌చేసి కలెక్షన్లు రాబట్టుకుంది. అదీ ప్రేక్షక నాడి.
**
అచ్చు ఇలాగే కాదుగాని గతంలోనూ ఎన్నో గమ్మత్తులు జరిగాయి జానపద చిత్రాల హీరో రొమాంటిక్ ‘దేవదాసు’ సినిమాను హవ్వ! అన్నారట. ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డ్ ఏఎన్నార్ దేవదాసుదే! దేవదాసుగా అక్కినేని కాదు అక్కినేని నాగేశ్వరరావే దేవదాసయ్యాడు. అంచనాలు అలా తారుమారయ్యాయన్న మాట. మాయాబజార్‌లో కృష్ణుడి వేషమంటే అందరిలాగే తొలుత రామారావూ ఆశ్చర్యపోయాడట. నేనేంటీ, నాకీ వేషమేంటీ అని. మరి -ఇప్పటికీ కృష్ణుడంటే నందమూరే. అల్లూరి సీతారామరాజుకి ముందు ఇలాంటి నెగెటివ్ టాకే. రిలీజయ్యాక గాని సినిమా అల్లూరి పవర్ తెలిసిరాలేదు. బ్రదర్ కృష్ణ చాలా బాగా చేశాడంటూ ఏకంగా రామారావు మెచ్చుకోవడం జరిగింది. అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమాకు ముందు చిరంజీవికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిరంజీవికిది యాప్ట్ అవుతుందా అని. రికార్డుల మోత మోగించింది. రిలీజయ్యాక, ఇక రొమాంటిక్ హీరో ముద్రపడిన నాగ్ అన్నమయ్య వేషం ఏంటని పెదవి విరిచారు. రాఘవేంద్రరావు నవ్వుకున్నాడంతే. అన్నమయ్య చేయగల సత్తా ఒక నాగ్‌దేనని ప్రశంసలందాయి.
ఇక్కడ చెప్పూచ్చేదేంటంటే ప్రేక్షకుడికి కనెక్టవ్వాలి. తలపండిన సినీ తలకాయల ఆలోచనలు, సమీకరణలు కాదు. కథను ఎలా వండాలోనని కుస్తీపట్టడం కాదు. కథలో ప్రేక్షకుడిని ఎలా ఇన్‌వాల్వ్ చేయాలో మర్మమెరగాలి. సినిమాను ఎలా తీయాలో తలలు బద్దలుకొట్టుకోవడం కాదు. సినిమా ఏ కోణంలో తీస్తే ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటాడో తెలుసుండాలి. ఎందుకంటే హీరో అతడే -ప్రేక్షకుడే! మరి ప్రేక్షకుడే హీరో అయినపుడు అతడి టేస్ట్ చూట్టూ దర్శక, నిర్మాతలు తిరగాలి కదా. తాను మునిగింది గంగ వలచింది రంభ అనే చందాన ఉండకూడదుగా. ప్రేక్షకుడికి ఎప్పుడు ఏది నచ్చుతుందో ఎలా తెలుస్తుందండీ! అంటూ తప్పించుకోవడం కరెక్ట్‌కానేకాదు. తప్పటడుగుకి సంకేతం.
ఏవండీ! పిల్లవాడికి ఎలాచెబితే బాగా అర్థమవుతుందో టీచర్ ఎరుగడా? క్లాసులో నలభై మందికి అర్ధంకాకపోవచ్చు కానీ సగం మందికైనా అర్థమవుతుందిగా! ఇదీ అంతే నండీబాబూ! మూస అనికాదు గాన జరంత లవ్ ట్రాక్, ఒకింత సెంట్‌మెంట్ డ్రామా, రవ్వంత కామెడీ, పవర్‌ఫుల్ కాకపోయినా ప్రేక్షకుడికి పట్టే డైలాగ్‌లు... మసాలా జల్లినంత లైట్‌గా ఫైటింగులు, ఉండాలి కదా! అవన్నీ సినిమాలో ఉండాల్సిందేనా, అనే రూల్ ఉందా అంటే... దెయ్యం సినిమాల్లో హాస్యమేంటని నుదురు చరుచుకుంటే ‘ప్రేమకథాచిత్రమ్’లాంటి హిట్స్ వచ్చి ఉండేవి కాదు కదా! ఈమధ్య సక్సెస్ అయిన ఏ సినిమానైనా వెతకండి. అవే అంశాలు కనిపిస్తాయ్! అవే అతడిని అలరిస్తాయ్, తథాస్తు!!

-ఎనుగంటి వేణుగోపాల్