మెయన్ ఫీచర్

కేంద్రంలో చక్రం తిప్పేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి మెజారిటీ సీట్లు దక్కని పక్షంలో తలెత్తే పరిస్థితిపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. భాజ పా మాత్రం తమ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయనే ధీమాతో ఉంది. ఎన్డీఏకు దీటుగా కూటమిని ఏర్పాటు చేయడంలో విపక్ష పార్టీలు విఫలమయ్యాయి. కేవలం యూపీలో ఎస్పీ,బీఎస్పీ కూటమి మాత్రమే ‘కమలనాథుల’కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎన్డీఏకు 272 సీట్లు రాకుండా ఉండాలంటే యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో భాజపా ఘోరంగా దెబ్బతినాలి. ఎన్డీఏ బలం 200 సీట్లకు పడిపోతేనే ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పే పరిస్థితులు వస్తాయి. ఉత్తరాదిలో కాంగ్రెస్ కోలుకుని, వందకుపైగా సీట్లు తెచ్చుకుంటే- భాజపా తర్వాత రెండవ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. కాని కాంగ్రెస్ ప్రతిపాదించే కూటమిలో చేరేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాదు. 200కు పైగా సీట్లు ఎన్డీఏకి వచ్చాయంటే, ఏదో ఒక ప్రాతిపదికన భాజపాకు మద్దతు ఇచ్చేందుకు చాలా పార్టీలు ‘క్యూ’ కడతాయి. కాంగ్రెస్, భాజపాల్లో ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో టీఆర్‌ఎస్, వైకాపా, టీడీపీ, బీఎస్పీ, ఎన్సీపీ, ద్రవిడ పార్టీల పాత్ర కీలకం కావొచ్చు.
ప్రస్తుత ఎన్నికల్లో సిద్ధాంతపరమైన విధానాలకు అన్ని పార్టీలూ తిలోదకాలిచ్చాయి. ప్రధాని మోదీని గద్దెదించడమే తమ లక్ష్యమని చాలా ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. భాజపాను మతతత్వ పార్టీగా ముద్రవేసిన ఇతర పార్టీలు ఈ రోజు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంటే భాజపా అంటరాని పార్టీ కాదు. కాని మోదీ విధానాలను వ్యితిరేకిస్తున్నామనే సిద్ధాంతాన్ని జనంలోకి ప్రాంతీయ పార్టీలు తీసుకెళుతున్నాయి. ఇందులో టీడీపీ, టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ,ఎన్సీపీ, డీఎంకే పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఏదో విధంగా ఢిల్లీలో చక్రం తిప్పాలనే తాపత్రయంతో ఉన్నాయి. విపక్ష పార్టీలు భాజపాను కాకుండా మోదీని వ్యతిరేకిస్తున్నాయంటే- ఎన్డీఏకి మెజారిటీ రాకుంటే తమ మద్దతు అవసరమవుతుందని గంపెడాశలు పెట్టుకున్నాయి.
1989 నుంచి 2014 వరకు కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. 2014లో ఎన్డీఏకి, అందులోనూ భాజపాకు సొంతంగా ఆధిక్యత రావడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేకుండాపోయింది. దాదాపు పాతికేళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారాన్ని అనుభవించిన ప్రాంతీయ పార్టీలు ఇపుడు జాతీయ రాజకీయాల్లో తాము కీలకం కావాలని ఉత్సాహపడుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఒక కారణం.
కాంగ్రెస్ పార్టీ తన శత్రువు ఎవరో గుర్తించడంలో విఫలమై, చివరికి ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకొంది. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం ఇందుకు నిదర్శనం. భాజపాపై పోరాడుతున్న వామపక్ష పార్టీలపై రాహుల్ పోటీకి దిగడం విమర్శలకు దారితీసింది. ఇపుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బిహార్‌ల్లోనే పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తోంది. తమిళనాడు, బిహార్‌ల్లో ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరింది. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు లేకుండా కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసుకుంది.
జాతీయ స్థాయిలో కీలకం కావాలని భావిస్తున్న పార్టీలు ఆ మేరకు తమ మేనిఫెస్టోలను రూపొందించలేదు. జాతీయ దృక్పథం లేని పార్టీలు ఢిల్లీ కేంద్రంగా అధికారాన్ని అనుభవించేందుకు వేస్తున్న ఎత్తుగడల వల్ల దేశ ప్రయోజనాలకు ముప్పు తప్పదు. భాజపా మేనిఫెస్టో మాత్రమే జాతీయ స్థాయిలో అన్ని వర్గాలకు చేరింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ‘కనీస ఆదాయ గ్యారంటీ స్కీం’ బాగున్నా, ఎన్ని రాష్ట్రాలకు తన సందేశాన్ని చేరవేసింది? ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను భాజపా ముందుగానే సిద్ధం చేసుకుంది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ ఐదేళ్ల విరామం తర్వాత కూడా భావసారూప్యత ఉన్న పార్టీలతో బలమైన ప్రత్యామ్నాయం ఏర్పరచడంలో విఫలమైంది. కాంగ్రెస్ వైపల్యం వల్లే- బలమైన నేత ఉన్న పార్టీగా భాజపా మరోసారి ప్రజల ముందుకు వచ్చింది.
కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ భాజపా విధానాలను విమర్శించడం మానేశాయి. మాయావతి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ, చంద్రబాబు, స్టాలిన్ తదితర ప్రాంతీయ పార్టీల నేతలు మోదీని గద్దెదించితే దేశం అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి పొందుతుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వెనకేసుకుని రావడానికి ప్రాంతీయ పార్టీలు ఇష్టపడడం లేదు, రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా బలమైన నాయకుడున్న పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనపడుతోంది.
కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు మోదీ నాయకత్వమే అడ్డనుకుంటే, అంతకు మించిన నాయకుడిని ప్రధానిగా భాజపా చోదకశక్తి ఆరెస్సెస్ అందించగలదు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించడంలో విపక్ష పార్టీలు తప్పటడుగు వేశాయి. సిద్ధాంతపరమైన పార్టీల్లో సారథి మారినంత మాత్రాన విధానాలు, భావజాలం మరుగునపడవన్న సత్యాన్ని ప్రాంతీయ పార్టీలు గ్రహించాలి.
ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేశారు. వాస్తవానికి భాజపాకి ఆంధ్ర రాజకీయాల్లో తగిన ప్రాతిపదిక లేదు. ఏపీకి తెలంగాణ ఒక పొరుగు రాష్ట్రం. మరో ముఖ్యమంత్రిపై చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ విజ్ఞత కాదేమో? ఈ తరహా విమర్శలు రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రాంత నాయకులను విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్లు ‘మీరు స్నేహితులను మార్చుకోవచ్చు.. కాని ఇరుగు పొరుగువారిని మార్చలేరు’ అన్నది నిజం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలు ఓట్లు వేయకపోవచ్చు, కాని ఆదరించారు. దేశంలోని చోటా మోటా నాయకులందరినీ చంద్రబాబు ఆంధ్రాకు తెచ్చి వారి చేత ప్రధాని మోదీని తిట్టించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఓడించేందుకు ఆంధ్రాకు రప్పించిన ప్రాంతీయ పార్టీల నేతల మాటలను ప్రజలు వింటారనుకుంటే పొరపాటు.
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. అవి కాలక్రమంలో పరిష్కారమయ్యేవి మాత్రమే. భద్రాచలం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రాలో భాగమనే అంశం వాస్తవం. ‘భద్రాచలం ముంపునకు గురవుతుందనుకుంటే మాకు ఇచ్చేయండి, భధ్రాచలం మాదే..’ అని ఐదేళ్ల తర్వాత చంద్రబాబు మాట్లాడడం సరికాదంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది.
తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఏపీలో వైకాపాకు కనీసం 15, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కనీసం 12 సీట్లు వస్తే లోక్‌సభలో ఈ పార్టీలు కీలకం అవుతాయి. తనకు మెజారిటీ రాని పక్షంలో- ఎస్పీ, బీఎస్పీలను నమ్ముకునే బదులు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలను భాజపా విశ్వసిస్తుంది. తమకు ప్రత్యామ్నాయ శక్తి భాజపా అని వైకాపా, టీఆర్‌ఎస్ పార్టీలు భావించవు. ఈ పార్టీలతో సిద్ధాంత పరమైన పోరు భాజపాకు ఉండదు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే వైకాపా, టీఆర్‌ఎస్, టీడీపీలు ఏకతాటిపైకి వస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పవచ్చు. రాజకీయ స్పర్థలు ఎలా ఉన్నా, తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ పార్టీలు జాతీయస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097