మెయిన్ ఫీచర్

ఆత్మస్థయిర్యమే అసలైన అందం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. పేదరికమైనప్పటికీ పరదాల చాటున జీవితాన్ని మగ్గిపోనివ్వకుండా చదువుకుంటుంది. జీవిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ..అనుకోనివిధంగా ఆమ్లదాడికి గురైంది. ముఖం మొత్తం కాలిపోయింది. ఓ కన్ను పోయింది. అయినప్పటికీ ఏటికీ ఎదురీదుతూ ఆత్మసౌందర్యమే మాలాంటివారికి నిజమైన అందం అంటూ ఆత్మస్థయిర్యంతో అడుగుముందుకు వేస్తోంది. ఆమే రేష్మా. ఇటీవల నూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్‌పై నడిచి పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమ్లదాడులకు గురైన అమ్మాయిలూ..మనమెందుకు ముఖం దాచుకోవాలి అని అంటూ వీడియోల ద్వారా చైతన్యం తీసుకువస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంచింది..
ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆమ్లదాడికి గురై ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన నేను పూర్తిగా డిఫ్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఇంటి నుంచి అసలు బయటకు వచ్చేదాన్ని కాదు. చుట్టుప్రక్కలవారు ఎందుకు అలా చూస్తున్నారు? ఇందులో నా తప్పేముంది? అని కుమిలిపోయేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో ‘‘మేక్ లవ్ నాట్ స్కేర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రియో శర్మ నన్ను కలిశారు. ఆమె ఇచ్చిన అండదండలు, చేయూతతో నేడు ఇలా అందరి ముందుకు రావటమే కాదు నేడు యాసిడ్ బాధితుల కోసం పనిచేసేందుకు కావల్సిన ఆత్మస్థయిర్యాన్ని సైతం కూడగట్టుకున్నాను. నాలాంటి బాధితులు నలుగురిలోకి ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు ఇలా ఫ్యాషన్‌షోల్లో పాల్గొంటూ వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాను.
ఆనాటి సంఘటన కళ్లముందు మెదులుతూనే ఉంది..
అది మే 19,2014 సంవత్సరం. మా అక్క వాళ్లింటికి వెళ్లాను. అప్పటికే అక్క కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. బావ ఆమెను వేధింపులకు గురిచేస్తూ.. కొట్టేవాడు. నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అత్తింటివారిపై కేసు పెట్టటం జరిగింది. ఆ కేసు విచారణకు వచ్చిన రోజు అక్క అత్తంటివారు ఈ యాసిడ్ దాడికి పాల్పడ్డారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా వారు దాడికి పాల్పడ్డారు. నేను అక్క చేయి పట్టుకుని బయటకు పరుగెత్తాను. అత్తంటివారు మా వెంట పడ్డారు. నా జుట్టు పట్టుకుని కిందపడేసి ముఖంపై యాసిడ్ పోశారు. అక్క మీద ఉండే కోపానికి అలా బలయ్యాను. బాధతో, మంటలతో అరుస్తూ కుప్పకూలిపోయాను. అందరూ చూస్తున్నారేగానీ ఎవ్వరూ సాయం అందించలేదు. చివరకు దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారు చేర్పించుకోలేదు. మంటల బాధతోనే పోలీసు స్టేషన్‌లో కూర్చుబెట్టి కేసు పెట్టాను. సంఘటన జరిగిన ఏడుగంటల తరువాత అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రి ట్యాక్సీ డ్రైవర్. పెద్ద కుటుంబం. అందరూ తండ్రి రెక్కల కష్టంపైనే ఆధారపడి బతకాలి. కాని కన్నకూతురు కోసం ఆ పేద తండ్రి జీవనాధారమైన ట్యాక్సీని అమ్మేసి ముంబయికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఇంటికి వచ్చిన తరువాత అందవిహీనమైన నా ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేక కుంగిపోతున్న సమయంలో రియో శర్మ మా ఇంటికి వచ్చి మూడు గంటల సేపు మాట్లాడి నాలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. ఆమె ఫండ్స్ వసూలు చేసి సర్జరీ చేయించింది. సర్జరీ సందర్భంగా చూపు పోతుందని వైద్యులు భయపడ్డారు కానీ ఓ కన్నుమాత్రమే పోయింది.
చిరునవ్వుతో ఆహ్వానాలు.. మెస్సేజ్‌లు
ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నల కంటే చిన్నదైన రేష్మా బతుకు నిస్సారంగా కాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మానసిక దౌర్భాల్యాన్న వదులుకున్నది. ఇటీవలనే ముంబయి నుంచి ఢిల్లీకి విమానంలో వెళుతుండగా..ముగ్గురు వ్యక్తులు స్లిప్‌లపై ఏదో రాసి ఇచ్చారు.తెరిచి చూస్తే ‘అందంగా ఉన్నావంటూ’ అందులో రాశారు. ఎంత ఆనందమేసిందంటే.. మొట్టమొదటిసారి అద్దంలో నా ముఖాన్ని చూసుకుని నిజంగానే నా ముఖం ప్రత్యేకంగా ఉంది అని సంతోషించాను.
అనుకోకుండా ఫ్యాషన్ షోలకు..
ఓ రోజు మున్సిపల్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్ ఫ్యాషన్ షోకి తీసుకువెళ్లారు. అలా ఫ్యాషన్ షోల్లో పాల్గొంటున్న నాకు న్యూయార్క్‌లో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది.
టీచర్‌నవుతా.. జీవిత పాఠాలు బోధిస్తా..
టీచర్‌నవుతా.. పిల్లలకు పాఠ్య పుస్తకాలతో పాటు జీవిత పాఠాలను బోధిస్తానంటుంది రేష్మా. ప్రస్తుతం వీడియోలతో నాలాంటి ఆమ్ల బాధితులలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాను.‘ రేష్మా బ్యూటీ టిప్స్’ అని ఆన్‌లైన్ వీడియో మహిళలకు ఎంతగానో నచ్చింది. ఎంతోమంది ప్రోత్సహిస్తూ మెస్సేజ్‌లు పంపుతున్నారు. టీచర్ ఉద్యోగం చేస్తూనే.. నాలాగే రకరకాల కారణాల వల్ల ఒళ్లు కాల్చుకున్నవారికీ, యాసిడ్ బాధితులకు వీడియోల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నా.. ఉడతాభక్తిగా సాయం అందిస్తూ.. వారు నలుగురిలో జీవించేందుకు తోడ్పడతా అని అంటుంది. ఎవరో చేసిన పనికి మన ముఖాలు దాచుకోవటమెందుకు? నిర్భయంగా అడుగు బయటకు వేద్దాం అని అంటుంది.

chitram.. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలో రేష్మా