మెయిన్ ఫీచర్

అడవి బిడ్డల ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో నెలకొనిఉన్న శ్రీరామబంటు ఆంజనేయుడి ఆలయాల్లో మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం అత్యంత ముఖ్యమైంది. ప్రసిద్ధమైంది. ఈ ఆలయం అడవిబిడ్డలైన గిరిజనుల ఆలనాపాలనలో కొనసాగుతోంది. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అడవిలోని పచ్చటి చెట్లు, ప్రకృతి మధ్య ఓలలాడుతోంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు అనే గ్రామం ఉంది.
మన్ననూరు నుండి దక్షిణం వైపు వెళితే శ్రీశైలం, మన్ననూరు నుండి తూర్పువైపు 52 కిలోమీటర్లు వెళితే మద్దిమడుగు వస్తుంది. పులుల సంరక్షణ కేంద్రంగా పేరెన్నిక గన్న ‘నల్లమల అడవి’ లో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. కృష్ణానది-డిండి (దుందుబి) నదుల సంగమం ఈ క్షేత్రం నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం పరిధిలోకి మద్దిమడుగు వస్తోంది.
కమనీయమైన ‘మద్దిమడుగు’
నల్లమల అడవిలో నివసిస్తున్న చెంచులు ఆంజనేయుడి విగ్రహాన్ని కనుగొన్నారు. స్వయంభూ ఆలయంగా వెలుగొందుతోంది. చెంచు నాయకుడైన ఒకరికి హనుమంతుడు కలలో వచ్చి తన విగ్రహం వారి గుడిసెల సమీపంలోనే పుట్టలో ఉందని, తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించాడట.
చెంచులంతా కలిసి పుట్టలో ఉన్న ఆంజనేయుడిని వెలికి తీసి తమకు తోచిన విధంగా ఆలయాన్ని నిర్మించారట. రాను రాను ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. 1994 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుంది.
వెయ్యి సంవత్సరాల క్రితం విగ్రహం ఏ వైపు తిరిగి ఉందో, ఎలా ఉందో..నేటికీ అలానే ఉంది. గిరిజనుల కోరిక మేరకు దేవాదాయ శాఖ అధికారులు విగ్రహాన్ని ముట్టుకోకుండా, విగ్రహం కోణం మార్చకుండా గర్భగుడి కట్టారు. గర్బగుడి వెలుపల మండపం నిర్మించారు. ఇక్కడ స్వామి వారికి పూజలు చేస్తే ఏ కోరికలు కోరినా నెరవేరతాయని భక్తులు నమ్ముతున్నారు. పబ్బతి హనుమంతుడిని మనఃస్పూర్తిగా సేవిస్తే అన్ని రకాల సమస్యలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతున్నారు. చేతులెత్తి దండం పెట్టే రూపంలో విగ్రహం ఉండటం వల్లనే ‘పబ్బతి ఆంజనేయస్వామి’గా పేరుతెచ్చుకున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు కనీసం ఒక రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తారు. ఈ విధంగా నిద్ర చేయడాన్ని ‘ప్రాణాచారం’ అంటున్నారు.
వేలాదా మంది భక్తులు ఏటా రెండు సార్లు 40 రోజుల పాటు ‘హనుమాన్ దీక్ష’ చేస్తుంటారు. దీక్ష చేసే భక్తులు మద్దిమడుగు వచ్చి దీక్ష విరమిస్తుంటారు. అయ్యప్ప భక్తులు శబరిమలై ఏ విధంగా వెళతారో, హనుమాన్ దీక్ష చేసే భక్తులు మద్దిమడుగు వస్తారు. చైత్ర మాసంలో కొంత మంది భక్తులు దీక్ష చేస్తుండగా, కార్తీక, మార్గశిర మాసాలలో లక్షలాది మంది భక్తులు హనుమాన్ దీక్ష చేస్తుంటారు. సాధారణంగా అక్టోబర్ / నవంబర్ నెలల్లో హనుమాన్ దీక్ష సాగుతుంది. మార్గశిర మాసం శుద్ద దశమి నుండి పౌర్ణమి వరకు శ్రీహనుమాన్ గాయత్రి మహా యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి.
హనుమాన్ ఆలయంలో రోజూ విశేష పూజలు జరుగుతుంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఆలయం వెలుపల ధుని ఉంటుంది. రోజంతా ధుని వెలుగుతూనే ఉంటుంది.
గిరిజన తెగకు చెందిన పూజారులు పూజ చేస్తుంటారు. ప్రత్యేకంగా రొట్టెలు చేసి, బెల్లంతో కలిపి స్వామి వారికి నైవేద్యంగా ధునిలో వేస్తుంటారు. ప్రస్తుతం భావోజీ, లక్ష్మణ్ అనేవారు ధునిని నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో వీరయ్య శాస్ర్తీ, రఘుశర్మ, వెంకటేశ్వర శర్మ, త్రిపాఠీ అనే అర్చకులు స్వామి వారి సేవలో కొనసాగుతున్నారు.
ఏటా రెండుసార్లు ఉత్సవాలు
ఏటా రెండు సార్లు స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణిమ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు 2019 ఏప్రిల్ 17 నుండి 19 వరకు జరుగుతున్నాయి. తొలిరోజైన ఏప్రిల్ 17 త్రయోదశి (బుధవారం) రోజు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహనం ఉంటుంది. రాత్రి ఒంటే వాహన సేవ, శ్రీశివపార్వతుల కల్యాణం ఉంటుంది. రెండోరోజైన చతుర్ధశి (ఏప్రిల్ 18) గురువారం నాడు ద్వాదశ వాస్తుపూజ, హోమం, మన్యసూక్తిహోమం, గవ్యాంతర పూజలు, గరుడవాహన సేవ, రాత్రికి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. మూడోరోజైన ఏప్రిల్ 19 పౌర్ణమి శుక్రవారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి మహాకుంభాభిషేకం, హనుమాన్ గాయత్రి హోమం, పూర్ణాహుతి ఉంటుంది. ఈ మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు.

మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు వౌలిక వసతులు కల్పిస్తున్నాం. రోజు వారీగానే కాకుండా, ఉత్సవాల సందర్భంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. భక్తులు నివసించేందుకు ప్రస్తుతం 40 గదులు ఉన్నాయి. తాగునీటి వసతి, స్నానాలకు నీటి వసతి ఉన్నాయి. ప్రస్తుతం ఉత్సవాల సందర్భంగా ఆలయానికి రంగులు వేశాం. భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నాం. అచ్చంపేట, దేవరకొండ డిపోల నుండి ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
వేసవి సందర్భంగా రోజువారీగానే కాకుండా శనివారం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధిపనులు చేపట్టాం. అన్నదానం కోసం పక్క్భావనం, నిత్యనివేదన ప్రసాదశాల, తలనీలాలు సమర్పించే భవనం, సత్యనారాయణస్వామి మండపం, మరుగుదొడ్ల నిర్మాణం, 1,20,000 లీటర్ల నిలువ నీరు ఉండేలా ఓవర్‌హెడ్ నీటి ట్యాంకు, పరిపాలనా భవనం, భక్తులు ప్రసాదం కోసం చేసే రొట్టెల తయారీకి మరొక భవనం నిర్మించేందుకు టెండర్లు పిలుస్తున్నాం. భక్తుల నివాసం కోసం మరో 50 గదులతో భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గ్రామీణ నీటి సరఫరా శాఖ మరొక వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు అంగీకరించింది.
ప్రస్తుతం ఆలయానికి దక్షిణం వైపు 170 లక్షల రూపాయలతో రాజగోపురం నిర్మించాం. తూర్పు, ఉత్తరం, పశ్చిమం వైపు కూడా రాజగోపురాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. వీటి నిర్మాణానికి దాతలెవరైనా ముందుకు రావచ్చు. అలాగే అభివృద్ధి నిర్మాణాల్లో కూడా భక్తులు, దాతలు చేయూత ఇవ్వవచ్చు. శాశ్వత అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు విరాళాలు ఇవ్వవచ్చు. అదనపు వివరాలు కావలసిన వారు ఫోన్ (94406 64677) చేయవచ్చు. ఆలయం కార్యాలయంలో పనిచేసే జయపాల్‌రెడ్డి, ఎల్. సోమ్లా తదితరులను కూడా సంప్రదించవచ్చు.

- పి.వి.రమణారావు 98499 98093