Others

ఎన్నికల బాండ్ల లోగుట్టు బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల బాండ్ల వివాదంపై మరోమారు విస్తృత చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయం అపరిమితంగా పెరిగిపోవడం, అక్రమాలకు తావివ్వడం వంటి చర్యలను నిరోధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ప్రతిపాదించింది. దీనిద్వారా రాజకీయపార్టీలకు జవాబుదారీతనాన్ని తీసుకురావచ్చని, అకౌంట్లను పారదర్శకంగా నిర్వహించేలా చూడొచ్చనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.
పదేళ్లలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ఆదాయం మూడు నుండి ఆరు రెట్లు పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే 1018 డిసెంబర్ 18 నాటికి బీఎస్పీ బ్యాంకు అకౌంట్ 670 కోట్లు, ఎస్పీ అకౌంట్ 471 కోట్లు, కాంగ్రెస్ 196 కోట్లు, టీడీపీ 107 కోట్లు, బీజేపీ 83 కోట్లు, సీపీఎం మూడు కోట్లు, ఆప్ నాలుగు కోట్లు మొత్తంగా చూస్తే బిఎస్పీ బ్యాంకు ఖాతాలో 669 కోట్లు ఉన్నాయి. బిఎస్పీ తర్వాతి స్థానాల్లోనే ఎస్పీ, కాంగ్రెస్, టీడీపీ ఉన్నాయి. ఇష్టానుసారం రాజకీయ పార్టీలు నిధులను సేకరిస్తున్నాయి. దాతల వివరాలను వెల్లడించడం వల్ల గోప్యతకు, వారి వ్యక్తిగత రాజకీయ హక్కుకు గండి కొట్టినట్టవుతుందని కేంద్రం వాదన, వారిపేర్లను గోప్యంగా ఉంచడం అనేది రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం అనే ప్రక్రియకు కొనసాగింపేనని వ్యాఖ్యానిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వాదనను కొట్టిపారేస్తున్న వారూ లేకపోలేదు. గోప్యత నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడానికి దారి తీస్తుందని అంటున్నారు. రాజకీయ పార్టీలకు డబ్బులిచ్చే బడా కార్పొరేట్ సంస్థలు తమ ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచన కూడా దీని వెనుక ఉందనే ఆరోపణ లేకపోలేదు. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేసినట్టవుతుందన్న కేంద్రం వాదనతో ఈసీ విబేధిస్తోంది. చట్టానికి చేసిన మార్పులు అభ్యంతరకర పరిణామాలకు దారితీస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం ద్వారా ఫైనాన్స్ యాక్టు -2015, 2017 ద్వారా బీజేపీ ప్రభుత్వం కంపెనీల చట్టం, ఆదాయపన్నుచట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం, రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం , విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలోని అనేక నిబంధనలను సవరించింది. దీంతో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై మాజీ సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత అక్టోబర్‌లో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బాండ్ల వ్యవహారంపై 2018 ఫిబ్రవరిలో సీపీఎం మొదట కోర్టు మెట్లు ఎక్కింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం బాండ్ల జారీని నిలిపివేయాలని దాతల వివరాలు వెల్లడించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెముక్రటిక్ రిఫార్మ్సు ఎన్‌జీఓ సైతం సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలుచేసింది. దాతల పేర్లను గోప్యంగా ఉంచేందుకు ఉద్దేశించిన నిబంధనలను భారత ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదకారిగా మారుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఒక రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం అందజేస్తున్నారనే విషయం సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించకపోతే ఈ పథకం పారదర్శకత స్ఫూర్తిని మట్టిలో కలిపినట్టవుతుందనే విమర్శలు ఉన్నాయి.
* * *
కేంద్రప్రభుత్వం 2017 ఫైనాన్స్ చట్టం ద్వారా ఎన్నికల బాండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 జనవరి 2న దీనిని నోటిఫై చేసింది. ఎన్నికల వ్యయ ప్రక్షాళన కోసమే దీనిని తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ బాండ్ ప్రామిసరీ నోటు తరహాలో ఉంటుంది. అధీకృత బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి దీనిని పొందాల్సి ఉంటుంది. దేశ పౌరుడు లేదా దేశంలో నమోదైన సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. పదిహేను రోజుల్లోగా రాజకీయ పార్టీలు వీటిని నగదుగా మార్చుకోవల్సి ఉంటుంది. బాండ్ల జారీ విషయంలో రాజకీయ పార్టీలకు - దాతలకు మధ్య ఆర్బీఐ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పద్ధతిలో రాజకీయ పార్టీలకు నగదు సమకూర్చే విధానం లేదని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా భూరివిరాళాలతో బలపడ్డాయి. విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు ఉండటం వల్ల పెద్ద ఎత్తున విరాళాల సేకరణ తేలికగా మారింది. వీటిని నగదుగా మార్చుకున్న పార్టీలు మాత్రం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు గత ఏడాది మార్చిలో 1951 ప్రజాప్రాతినిధ్యచట్టంలో మార్పులు చేసింది.
ఎన్నికల బాండ్ల ద్వారా పొందే రెండు వేలకు పైబడిన మొత్తానికి సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు కూడా తెలియజేయనవసరం లేదని పేర్కొంది. ప్రతి త్రైమాసికంలో వీటి కొనుగోలుకు పది రోజుల వ్యవధి ఇస్తారు. లక్ష రూపాయలు, పది లక్షలు, కోటి రూపాయలు సహా ఎంత మొత్తానికైనా బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్లపై దాత పేరును నమోదు చేయరు. బాండ్ల ద్వారా ఎవరు ఎంత మొత్తం అందుకున్నారనేది మాత్రమే వెల్లడిస్తూ రాజకీయ పార్టీలు ఈసీకి రిటర్న్‌లు సమర్పించాలి. ఇంత వరకూ వ్యవహారం బాగానే ఉన్నా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీలు ఇరకాటంలో పడ్డాయి.
విరాళాల విషయంలో కావల్సింది పారదర్శకతే, దాతలు ఎవరో, ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చారో అందరూ తెలుసుకోగలిగే విధానం పారదర్శకంగా ఉంటే ఒక పారిశ్రామిక వేత్త లేదా ఓ కార్పొరేట్ సంస్థ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చింది తెలిస్తే ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాల్లో వారికి మేలు ఎలా చేకూరిందో ప్రజలకు అర్థమవుతుంది. క్విడ్‌ప్రోకో ద్వారా రాజకీయ పార్టీలూ మరో పక్క కార్పొరేట్ సంస్థలు ఎలా లాభ పడ్డాయో కూడా తెలుస్తుంది. బాండ్ల ద్వారా విరాళం అందుకున్న రాజకీయ పార్టీకి కూడా దాత ఎవరో అధికారికంగా తెలిసినా దానిని బయటపెట్టదు. రాజకీయపార్టీలు ఎన్నికల సంఘానికి బాండ్ల ద్వారా ఎంత సొమ్ము సమకూరిందో చెబుతాయే తప్ప దాతల జాబితాలను అందించవు. విరాళం ఇచ్చిన కంపెనీ తమ బ్యాలెన్స్ షీట్‌లో ఎంత సొమ్ము వెచ్చించి బాండ్లను కొన్నారో చూపిస్తారే తప్ప ఏ పార్టీకి దానిని విరాళంగా ఇచ్చిందో పేర్కొనాల్సిన అవసరంలేదు.
ఇన్ని సదుపాయాలు ఉండటం వల్లనే రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల్లో ఏకంగా 99.8శాతం నిధులు కోటి రూపాయల ముఖ విలువ కలిగినవే ఉన్నాయి. తర్వాతి స్ధానం 10 లక్షల ముఖ విలువ ఉన్నవే. వాస్తవానికి బాండ్ల రూపంలో వెయ్యిరూపాయలు, 10వేలు, లక్ష రూపాయలు విలువైనవి కూడా ఉన్నా, అంతా పెద్ద మొత్తంలోనే బాండ్లను కొనుగోలు చేశారు. 2018 మార్చి నుండి 2019 జనవరి వరకూ దాతలు 1407.09 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయగా అందులో 1403.90 కోట్ల బాండ్లు పెద్ద ముఖ విలువ కలిగినవే. ఇందులో ఆయా పార్టీలు 1395.89 కోట్లు విలువైన బాండ్లను మార్చుకున్నాయి. అయితే ఏయే పార్టీలు ఎంత మొత్తంలో మార్చుకున్నదీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వెల్లడించలేదు. ఎస్‌బీఐ ఏడు భాగాలుగా ఈ బాండ్లను విక్రయించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన సర్వోన్నత న్యాయస్థానం రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది.
జనస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చకుండా అడ్డుకట్టవేస్తూ, అవినీతి మేటలు ఎన్నికల రంగంలో పేరుకుపోకుండా చేసేందుకు రాజకీయ పక్షాలను నియంత్రించాలని ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికపుడు ఎన్నో సూచనలు చేస్తూ వచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాల పారదర్శకతకు దోహదపడేలా విరాళాల వివరాలతో పాటు వాటిని ఇచ్చిన వారి పూర్తి వివరాలను ఒక సీల్డు కవరులో మే 30వ తేదీలోగా సమర్పించాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాజకీయ పార్టీల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అజ్ఞాత విరాళాల లోగుట్టు ఎలాగూ ప్రజల ముందుకు రానుంది. ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్‌లోనూ, వీవీ ప్యాట్‌ల లెక్కింపులోనూ రాజకీయ పార్టీల, ప్రజల నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ అభ్యర్థుల అఫిడవిట్ల వ్యవహారంలోనూ ప్రజా నిరసనను ఎదుర్కొంటోంది. ఎక్కడి నుండి ఎంతెంత మొత్తం విరాళాల రూపంలో ఏ రాజకీయ పార్టీకి ఎంత అందాయో ఓటర్లకు తెలియాల్సిందేనని పేర్కొనడం ద్వారా ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించినా, సవ్యమైన దిశలో సముచిత నిర్ణయాలను సకాలంలో తీసుకోకుంటే తాజాగా విరాళాల వివరాల అంశంలోనూ ఎన్నికల కమిషన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

- బీ వీ ప్రసాద్ 9849998090