మెయిన్ ఫీచర్

అద్దెకు బంగారు నగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే నెక్లెస్.. అవే గాజులు.. మొన్న పెళ్లికీ అవే.. నిన్న రిసెప్షన్‌కూ అవే.. అందరూ నీకున్న నగలు ఇవేనా.. వేరేవి లేవా? అని అడుగుతుంటే ఇబ్బందిగా ఫీలై.. ఎన్నిసార్లని ఇవే వేసుకోవాలి దేవుడా.. కొత్తవి కొనాలి అంటూ బడ్జెట్ లెక్కలు వేసుకోవడం.. బంగారు ధర అటకెక్కి కూర్చోవడం.. దిగాలు పడడం.. బంగారు నగల విషయంలో ఇలా అనుకోని అతివలు అరుదే.. కాబట్టే ఇప్పుడు బంగారు ఆభరణాలు, ఖరీదైన రాళ్ల నగలు అద్దెకు దొరుకుతున్నాయి. ఫంక్షన్‌లో కొత్తగా ఒక నగ కనిపిస్తే చాలు ఇక ఆడవాళ్లు చుట్టూ చేరి నగల గురించి ఊసులే ఊసులు. ఇందులో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే అందంగా తయారవ్వడం మగువకు దేవుడే ఇచ్చిన హక్కు. ఇక పెళ్లిళ్లూ, ఫంక్షన్లున్నాయంటే ఆరోజు ఎలా తయారవ్వాలి, మ్యాచింగ్ నగలు ఏం వేసుకోవాలి అని తెగ ప్రణాళికలు వేసేసుకుంటారు. ఇక ఆ ఇంట్లో పెద్దవాళ్లు అంటే.. నానమ్మ, తాతయ్యలు ఉన్నారంటే.. వెళ్లే పెళ్లిళ్ళలో ఇంటి కోడలు దర్పంగా కనిపించాలని కోరుకుంటారు. సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇదివరకైతే కాసులపేరో, చంద్రహారమో, కంఠహారమో చేయించేసుకుంటే.. వేడుక ఏదైనా దానే్న వేసేసుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. వారానికో ఫ్యాషన్, నెలకో ట్రెండ్ అన్నట్లుంది పరిస్థితి. దాంతో సంవత్సరం కింద చేయించుకున్న నగలు కూడా ఇప్పుడు పాత ఫ్యాషన్‌లా మారిపోతున్నాయి. స్మార్ట్ఫోన్లు, సెల్ఫీలు, ప్రొఫైల్ పిక్‌ల పుణ్యమా అని ఎప్పుడూ అవే నగలు వేసుకుంటే కొత్తదనం ఏముంటుందన్న ఆలోచన ఒక పక్క.. బంధువులు, స్నేహితులు ముందు మనం ప్రత్యేకంగా కనిపించాలంటే ఆమాత్రం కొత్తదనం ఉండడం తప్పనిసరి అని మరోపక్క.. వెరసి కొత్త బంగారు నగలు చేయించుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఆర్థిక పరిస్థితి అందరికీ ఉండొద్దూ.. ఒకవేళ ఉన్నా ఎప్పుడో ఒకసారి వేసుకునే వాటికోసం లక్షలు ఖర్చుపెట్టి కొనుక్కోవడం, తర్వాత భయంతో వాటిని లాకర్లలో దాచిపెట్టడం అంతా వృథాప్రయాస. కనీసం ఖరీదైన రాళ్లతో అచ్చం బంగారు నగల్లా రూపొందించే డిజైనర్ ఆభరణాలన్నా కొనుక్కుందామంటే అవి కూడా సెట్ మొత్తం కొనాలంటే రూ. యాభై వేలకు పైగా ఖర్చు పెట్టాల్సిందే.. ఈ బాధంతా లేకుండా బంగారు ఆభరణాలు, విలువైన రాళ్లతో చేసిన ఇమిటేషన్ నగల్ని అద్దెకు తెచ్చుకుంటే.. అవునున ఇప్పుడు ఆన్‌లైన్‌లో నగల్ని అద్దెకిస్తున్న దుకాణాలెన్నో..
ముంబైకి చెందిన రాహుల్ బంకా ప్రారంభించిన ఈవ్స్24. కామ్ అనే ఆన్‌లైన్ స్టోర్‌లో ‘జ్యువెల్ లైబ్రరీ’ పేరుతో బంగారు వజ్రాభరణాలను అద్దెకిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో అచ్చంగా బంగారంతో చేసినవే కాకుండా రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన నెక్లెస్‌లు, హారాలు, గాజులు, పోగులూ, బ్రేస్‌లెట్లు.. ఇలా ఎన్నో రకాల నగల ఫొటోలుంటాయి. వాటిలో మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటే కంపెనీ సిబ్బందే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వీటిని మూడురోజుల పాటు మన దగ్గరుంచుకుంటే నగల విలువలో 3-4 శాతాన్ని అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. అదే వారమైతే 4-6 శాతం వరకూ అద్దె ఉంటుంది. అయితే ఎవరిని పడితే వారిని నమ్మి బంగారు, వజ్రాభరణాలను అద్దెకు ఇవ్వలేరు కాబట్టి, వినియోగదారుల దగ్గర ఆ నగ విలువకు సరిపోయే మొత్తాన్ని ముందుగా కట్టించుకుంటారు. నగ తిరిగిచ్చెయ్యగానే డబ్బుని మళ్లీ మన అకౌంట్‌కు బదిలీ చేస్తారు. ఎక్కువసార్లు ఫంక్షన్‌లకు వెళ్లాలంటే ప్రతీసారి ఇలా అంతంత మొత్తాన్ని అటూ ఇటూ బదిలీ చెయ్యడం ఇబ్బంది అనుకునేవాళ్లు ఈవ్స్24 సంస్థలో వార్షిక సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. దీనిలో లక్ష నుండి అయిదు లక్షల వరకూ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఎనిమిది శాతం వడ్డీ ఇస్తుంది కంపెనీ. ఇక మనం ఎంత డిపాజిట్ చేస్తే అంతకు సరిపోయే విలువైన నగల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్దెకు తీసుకోవచ్చు.
పెళ్లిళ్లకు..
ఈ తరహాలోనే ఖరీదైన ఇమిటేషన్ నగలను అద్దెకు ఇచ్చేందుకు రెంట్‌జ్యువెల్.కామ్, టీబీజీబ్రైడల్‌స్టోర్.కామ్.. వంటి వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వీటిలో కెంపులు, పచ్చలు, కుందన్లు, నీలాలు, అమెరికన్ డైమండ్లు.. ఇలా విలువైన రాళ్లతో రూపొందించిన కాస్ట్యూమ్ నగలు ఎన్నో రకాల్లో దొరుకుతాయి. ఇవి బంగారు నగలంత రాజసంగా ఉండడంతోపాటు, డిజైనర్ పీసుల్లా వస్తుండటంతో ఇవి నేటితరం యువతులకూ నచ్చుతున్నాయి. ఇక పెళ్లికూతుర్లకు చీరకు మ్యాచ్ అయ్యేలా పోగులు, హారం, గాజుల్లాంటి వాటితో కలిపి ఆభరణాలనున సెట్‌లా వేయడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఆ మొత్తాన్ని ఒకేసారి కొనాలంటే అందరికీ సాధ్యం కాదు. అందుకే విలువైన రాళ్లతో పొదిగిన ఇమిటేషన్ నగల్ని అలంకరిస్తున్నారు. అయితే ఇవి కూడా వేలు, లక్షల్లో ఉంటున్నాయి. పైటా వీటినీ ఎక్కువసార్లు వేసుకోం. అందుకే ఈ తరహా ఇమిటేషన్ నగల సెట్ మొత్తాన్ని మూడు రోజులకు రూ. మూడు వేల నుంచి ఎనిమిది వేల అద్దెతో ఇస్తున్నారు. వీటికి కూడా ముందు కొంత మొత్తాన్ని ఆయా కంపెనీ అకౌంట్‌కి బదిలీ చేయాలి. నగల్ని తిరిగి ఇచ్చిన తరువాత డబ్బుని వాపసు ఇస్తారు. రెంట్‌జ్యువెల్.కామ్ హైదరాబాద్‌తో పాటు మరో 80 నగరాల్లో డిజైనర్ నగల్ని అద్దెకు ఇస్తోంది. వచ్చేది పెళ్లిళ్ల కాలమే కాబట్టి, లక్షలు లక్షలు పోసి నగలు కొనకుండా.. ఇక మీరూ ఇలాంటి నగల్ని తెప్పించుకోవచ్చు.

-సన్నిధి