మెయిన్ ఫీచర్

ఇంకా.. తేరుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలోవున్న అదృష్టం మెదడుకు చేరకముందే మర్చిపోతే-
ఇదేదో సినిమా పాయింట్‌లా ఉందనిపిస్తోంది కదూ. నిజమే -పాయింట్ కనెక్టయితే చాలు కొత్త దర్శకులు.. కాదు కాదు కుర్ర దర్శకులు చెలరేగిపోతున్నారు. సినిమా అంటే ఒకప్పటి రుచి కాదు, కొత్త రుచులు కూడా ఆస్వాదించండంటూ వినోదాన్ని విస్తట్లో వడ్డిస్తున్నారు.
వినోదమంటే -వచ్చే వెక్కిళ్లు వెనక్కిపోయేంత హాస్యమే కాదు, గుండె బరువెక్కేంత భావోద్వేగం కూడా. నిండైన జీవితాన్ని రెండు గంటల్లో కళ్లకు కట్టేసి.. చాలిక ఇంటికెళ్లండంటూ -కొన్న టిక్కెట్‌కు నిజాయితీని చూపిస్తున్న దర్శకులు మనకేం తక్కువేం లేరు. లఘు చిత్రాలతో బిగ్ స్క్రీన్‌కు వస్తున్నా, స్టార్ దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో చిట్టిపొట్టి అడుగులేస్తున్నా -ఆడియన్స్‌కు మాత్రం సినిమా చూపించి ఆటాడేస్తున్నారు. అలాంటి కుర్ర దర్శకుల జాబితాలో ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్న పేరు -గౌతమ్. ఇంకా చెప్పాలంటే గౌతమ్ తిన్ననూరి.
నటించిన నాని కూడా ఆశగా ఎదురు చూస్తున్న జెర్సీ -మొత్తానికి ఆడిటోరియానికి వచ్చేసింది. ఒక్కో థియేటర్ ఒక్కో క్రికెట్ స్టేడియంలా కళకళలాడుతోంది. కారణం -జెర్సీకి హిట్ టాక్. మేకింగ్ కోసం అహర్నిశలూ కష్టపడిన గౌతమ్ -కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడేశాడు. ఆడియన్స్ అంపైరింగ్‌లో టీం నెగ్గేసింది. జెర్సీ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది.
ఇంత సక్సెస్ కొట్టిన తరువాత కూడా కెప్టెన్ ఓ మాటంటున్నాడు -ఇంత సీన్ ఊహించలేదని. ఓ క్రికెటర్ లైఫ్‌ని నిజాయితీగా చూపించేందుకు అనేక సన్నివేశాలు ఊహించుకున్న దర్శకుడు -సక్సెస్ సీన్ మాత్రం ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించలేదనడంలో మళ్లీ నిజాయితీయే కనిపిస్తోంది. ఎందుకంటే -అతని ఉద్దేశంలో సినిమా బాధ్యత. దర్శకుడిని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతను ఊహించుకుంటేనే -గుండెలో దడ మొదలవుతుంది. మొన్నటి వరకూ నన్ను నమ్మి ఇంతమంది నావెనుక సైన్యంలా నిలబడ్డారు కదా! ఏమవుతుందో?ననే టెన్షన్ ఉండేది. కానీ జెర్సీకి హిట్ టాక్ వచ్చాక ఎంజాయ్ చేస్తున్న వాళ్లను చూస్తున్నానే తప్ప, నమ్మడానికి కొంచెం సమయం పట్టే స్థితిలోనే ఉన్నా అంటున్నాడు గౌతమ్. ఇది -అతని సత్తామీద అతనికి నమ్మకం లేక కాదు. అనూహ్య విజయాన్ని అకస్మాత్తుగా రిసీవ్ చేసుకోలేని ఆనందం. క్రైసిస్‌లో పడిన జట్టును గెలిపించడానికి లాస్ట్ షాట్ కొట్టిన ఆటగాడి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న
గౌతమ్ తిన్ననూరితో -వెనె్నల ఇంటర్వ్యూ.
నాచురల్ స్టాల్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా -జెర్సీ. బతుకునుంచి పుట్టిన కసితో మైదానంలో అలుపెరుగని పరుగులు తీసిన నానిని -అద్భుతంగా డిజైన్ చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. భావోద్వేగాలను కొత్తగా రుచి చూపించిన చిత్రంగా జెర్సీ హిట్ టాక్ తెచ్చుకుంది.
జెర్సీకి స్ఫూర్తి?
-ముందు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అనుకోలేదు. అలాంటి కథనే ఊహించలేదు. హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా కాన్ఫరెన్స్‌లో హర్ష భోగ్లే మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పోడో చెప్పారు. సచిన్‌లాంటి గొప్ప ఆటగాళ్లు చాలామందివున్నా, సచిన్ ఆటిట్యూడ్ కారణంగానే గొప్పవాడయ్యాడన్నది భోగ్లే కామెంట్. నాకు సచిన్ టెండూల్కర్ గొప్పతనం కన్నా, ఆయనలా టాలెంట్ ఉన్నోళ్లు చాలామంది ఉన్నారన్న పాయింట్ బాగా కనెక్టయ్యింది. దాంతో అలాంటి ఫెయిల్యూర్ టు సక్సెస్ స్టోరీ చెబితే ఎలావుంటుందన్న ఆలోచన వచ్చింది. సాధారణంగా సక్సెస్ అయిన వాళ్లనే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంత కష్టపడి ఎన్నో కారణాలతో లక్ష్యాన్ని చేరుకోక లూజర్స్‌గా మిగిలినోళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల కథ చెప్పాలనిపించినపుడు పుట్టిన సన్నివేశాల సమాహారమే -జెర్సీ.
రమణ్ లాంబా లైఫ్ పోలిక?
-రమణ్ లాంబా కథ కాదు. ఆయన క్రికెట్ ఆడుతూ గాయపడి చనిపోయారు. సినిమా చూసిన తరువాత రమణ్ లాంబా జీవిత కథకు, అర్జున్ కథకూ ఎలాంటి లింక్ లేదన్న విషయం అర్థమవుతుంది.
రీసెర్చిలాంటిది చేశారా?
-రీసెర్చి అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. చిన్నప్పటినుంచి క్రికెట్ ఆడుతున్నాం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నా. కథపై ఎక్కువ రోజులు వర్క్ చేశాను. నా తొలి చిత్రం ‘మళ్లీరావా’ కంటే ముందునుండే నా దగ్గరనున్న స్టోరీ ఇది. కానీ మొదటి ప్రయత్నమే ఇదంటే ఎవరు చేస్తారు. అందుకే ముందు ‘మళ్లీరావా’ తెరకెక్కించా.
ఇంత రెస్పాన్స్ ఊహించారా?
-లేదు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. ఎందుకంటే సినిమా ఓ బాధ్యత. ముఖ్యంగా దర్శకుడిని నమ్మే నిర్మాత డబ్బులు పెడతాడు. మొన్నటివరకూ నాకు టెన్షన్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నా సరే, నేను ఎంజాయ్ చేయడానికి ఇంకా సమయం పట్టేలావుంది. నా దగ్గరున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్టమైన స్క్రిప్ట్. కథ రాసుకున్న తర్వాత రెండు మూడేళ్లు నాదగ్గరే ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరు నాతో ఇలాంటి సినిమా చేయరని ఎవరినీ అప్రోచ్ కాలేదు.
ఇంతకీ కథతో ఏం చెప్పాలనుకున్నారు?
-ఇది ఓ అండర్‌డాగ్ స్టోరీ. ప్రపంచమంతా ఇతనేం చేయలేడు, వయసైపోయిందన్న నిర్ణయానికి వచ్చేసిన ఓ వ్యక్తి, అతను ఎలాంటి ప్రయత్నం చేశాడు? దాన్ని సాధించడానికి అతను ఎంతవరకు ముందుకెళ్లాడన్నది కథ. ఇలాంటి సక్సెస్‌లు చాలామంది రీచ్ అయ్యారు. వివిధ రంగాలనుంచి చాలామందినే ఉదహరించొచ్చు.
సినిమా విషయంలో నాని కాన్ఫిడెంట్?
-నాని కాన్ఫిడెన్స్ చూసి చాలా సందర్భాల్లో భయమేసింది. ఎందుకంటే నేను ఓ మంచి సినిమా చేయాలనే తపనతో వచ్చాను. ఔట్‌పుట్‌ను డబ్బింగ్ థియేటర్‌లో చూసుకున్న తర్వాత ఇది మనం చేసిన సినిమాయేనా? అనిపించింది. ఈ సినిమా విషయంలో నాని ఎంతగానో నమ్మాడు. ఆ నమ్మకం నిజమైంది.
అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్?
-అవును ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్ అభినందనలు చెప్పడం హ్యాపీగా ఉంది. దాంతోపాటు కాస్త టెన్షన్ కూడా ఉంది.
బాలీవుడ్‌లో సినిమా చేస్తారా?
-అర్జున్‌రెడ్డిని సందీప్‌వంగా బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన వేరు. నా కథ వేరు. నాకు బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనే ఆలోచన ఇప్పట్లో లేదు.
హీరో అర్జున్‌లాంటి స్ట్రగుల్స్ మీరు అనుభవించారా? మీ రియల్ లైఫ్ సంఘటనలు?
-అర్జున్‌లాంటి స్ట్రగుల్స్ ఏమీ లేవు. అయితే ఇక్కడ కొన్ని సినిమా కష్టాలు అనుభవించాను. ఇక రియల్‌లైఫ్ సంఘటనలైతే ఏమీ లేవు.
నెక్స్ట్ ప్రాజెక్ట్?
-ఇప్పటికైతే సిద్ధంగా కథలున్నాయి. ఆ కథలకు తగిన హీరోని ఎంచుకుని వాళ్లకు నేరేట్ చేస్తా. అయితే వెంటనే కాదు, కాస్త గ్యాప్ తీసుకుంటా.

-శ్రీనివాస్