మెయిన్ ఫీచర్

మహామనీషి మధునాపంతుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ జగత్తులో కొంతమందికి రామాయణ రచనతో కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. మరికొంతమందికి ‘భారత రచన’తో గొప్ప కీర్తివస్తుంది. సరే, భాగవతాన్ని ఒకవేళ తలక్రిందులుగా తపస్సుచేసి వ్రాసినా ఆ ‘పోతన’గారిని మాత్రం ఎవడూ మించి వ్రాయలేడు. దాటిపోలేడు. అది వేరే విషయం. ఇక అద్యతనాంధ్ర సాహిత్యంలో గొప్పగొప్ప చారిత్రక నవలలు వ్రాసి విశేష కీర్తినార్జించినవారూ ఎందరో ఉన్నారు. విశ్వనాథ, నోరి, అడవి, ముదిగొండ, చిలకమర్తి వంటి మహాకవుల సంగతి, చారిత్రక నవలా సాహిత్య విషయపరంగా విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నాటక రచనారంగం విషయానికి వస్తే, కందుకూరి, బలిజేపల్లి, గురజాడ, కాళ్ళకూరి, ధర్మవరం, పానుగంటి, తిరుపతి వేంకటకవులు మొదలైనవారు నేనంటే నేను అంటూ కొట్టవచ్చినట్లుగా కనబడతారు. ఎవరి సరస్వతి వారిదే! చారిత్రక గాథలను గొప్ప నాటకాలుగా అందించిన కోలాచలం, కొప్పరపు సుబ్బారావుగారి లాంటి మహనీయులూ ఎందరో ఉన్నారు. కానీ ఒక జాతి చరిత్రను పురాణంగా చెప్పిన మహనీయులను మాత్రం వేళ్ళమీద లెక్కబెట్టవలసిందే! ఈ పరంపరలో నిన్నమొన్నటివరకూ మన కళ్ళముందు నడయాడిన మహనీయుడు, మధుర వచస్కుడు, సాధువర్తనుడు మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ రచించిన ‘ఆంధ్ర పురాణం’ ఈ తరంలో చాలా విశిష్టమైన గ్రంథం. వీరి సమకాలికులైన మహాకవులందరూ, ముఖ్యంగా పద్యకవులు మధునాపంతుల వారి పద్యరచనా పాండిత్య వైభవాన్ని వేనోళ్ళ కొనియాడినవారే! 2019 సం. మధునాపంతులవారి శత జయంతి వర్షంగావడం విశేషాన్ని సంతరించుకున్నట్లే అవుతుంది. ఆ మహనీయునికి ప్రతి తెలుగువాడు సభక్తిపూర్వకంగా అంజలి ఘటించాల్సిన తరుణం యిది. నాకు తెలిసినంతవరకు ‘ఆంధ్ర పురాణము’ తొలిసారిగా 1954లో రాజమహేంద్రవరంలోనే ముద్రితం అయినట్లు గుర్తు. ద్వితీయ, తృతీయ ముద్రణలు గూడా 1964, 1983లలో అయినట్లు పరిశోధకులు వెల్లడించారు. మధునాపంతులవారి మహోన్నతమైన గ్రంథం ఈ ఆంధ్ర పురాణంలో ఉదయపర్వము- శాతవాహన పర్వము- చాళుక్య పర్వము-కాకతీయ పర్వము- పునఃప్రతిష్ఠాపర్వము- విద్యానగర పర్వము- శ్రీకృష్ణదేవరాయ పర్వము- విజయ పర్వము- నాయక రాజపర్వము- యిలా పేర్లతో 9 పర్వాలు కనబడతాయి. ఈ కవి పద్యరచనలో ఎంత మొనగాడో ‘అవతారిక’లోనే తేలిపోతుంది. అవతారికలో 37 పద్యాలు కనబడతాయి. దైవప్రార్థనలు అందరూ చేస్తారు. తమ తాతముత్తాతలను ఆనాటి ‘తిక్కన’గారి దగ్గరనుంచి, శ్రీనాథాదుల దగ్గరనుంచి ఆధునికులైన విశ్వనాథ యిత్యాదులందరూ చేసినవారే! మధునాపంతులవారి కులదేవత ‘కామేశ్వరీదేవి’ అని తెలుస్తున్నది. ఆ తల్లిని ఎంత దీనంగా వినమ్రంగా ప్రార్ధిస్తున్నారో చూడండి-
శ్రీకారంబును జుట్టినాడ గృతి కాశీర్వాదముల్ సేయుమ
మ్మా, కామేశ్వరి! విశ్వలోక జననీ! మా తల్లి పుట్టింటివే
ల్పై కాపాడుచునున్న యనె్ననరు నాయందింతసారింపుమ
మ్మా, కైమోడ్తు భవత్కటాక్ష రసభిక్షాభ్యర్థి నైభక్తిమై!
‘కామేశ్వరీ’పరమైన యిటువంటి పద్యాలు మళ్లీ ‘చెళ్ళపిళ్ళ’వారి కవనంలో మనం చూస్తాము. ఈ గోదావరీ మండలాంతర్గత మహాకవులయిన వాళ్ళందరూ ‘కామేశ్వరీ’ పాదదాసులే అనే విషయం అవగతమవుతున్నది- అలాగే పూర్వులలో తల్లితండ్రులను, తాతను ఎక్కువగా స్మరించినవాడు కవి సార్వభౌముడు మనకు కనిపిస్తాడు. ‘‘కవితా విద్యాధరుంగొల్తు నా మనుగుం దాతబ్రదాత శ్రీ కమలనాభామాత్య చూడామణిన్’’ అంటూ తన తాతకు ప్రత్యేక నమస్కారాలు తెలియచేశాడు భీమ ఖండంలో శ్రీనాథుడు. ఆంధ్ర పురాణంలో శాస్ర్తీగారు వ్రాసిన ఈ పద్యం ఎంత కమనీయంగా రమణీయంగా ఉందో చూడండి -
శా॥ మన్మల్ పిన్నటి మన్మరాండ్రు నిరుచెంపంగాయలుంబూవులౌ
చు నే్మలూరిన ‘‘దోసతోట’’ గతిమెచ్చుల్ గూర్చు సంసార యా
త్ర న్మాధుర్య ధురీణముల్ ఫలములందం జుబ్బజూఱాడు జీ
వ న్మాతాపితలార! మీ చరణ సేవాజీవి దీవింపుడా!
అంటారు- ‘దోసతోట’ జుబ్బజూడాడు’ ఈ శబ్దప్రయోగాలు మధునాపంతులవారికే చెల్లు-
‘‘అభితః పరిమళిత యశః
ప్రభవిష్ణులు సుకవిజన సభాజన లీలా
రభటీకాస్థానులు ప్రా
క్ప్రభువుల చారిత్రమిటు పురాణింపబడెన్’’
అని మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ ప్రాచీనాంధ్ర ప్రభువుల చరిత్రను పురాణంగా తెలుగులో రచించారు. ‘‘ఆంధ్ర పురాణము’’ అని నామకరణం చేశారు. చరిత్ర తన కృతిలో పురాణింపబడిందని పేర్కొన్నారు. ఆంధ్ర రాజుల చరిత్రలోని రసవత్తర ఘట్టాలను కావ్యస్ఫూర్తితో వినిర్మించారు శాస్ర్తీగారు. ‘‘ఆంధ్రపురాణము- సమగ్ర పరిశీలనము’’ అనే అంశంపై పరిశోధనా వ్యాసాన్ని దాదాపు 35 సం.ల క్రిందటే రచించిన నా సహ నట మిత్రుడు డా.బి.నాగిరెడ్డి ఈ పురాణంలోని ప్రత్యేకాంశాలను అనేకం ఆనాడే అందించారు. స్వయంగా మధునాపంతుల వారితో ‘ముఖాముఖి’- గోష్ఠిచేశాడు- మీరు ఇతిహాసం వ్రాసి పురాణం అని ఎందుకు పేరుపెట్టారు? అన్న నా మిత్రుడి ప్రశ్నకు సమాధానంగా శాస్ర్తీగారు-
‘ఆంధ్రజాతి ప్రాచీనమైనదగుట ఒక కారణం. పంచ లక్షణాలలో వంశానుచరితం ఉండడం, పాల్కురికి సోమనాథుడు బసవ చరిత్రను ‘పురాణం’ అనడం- కన్నడ భాషలో కావ్య శబ్దానికి పర్యాయవాచిగా ‘పురాణ’ శబ్దంవాడుకగా ఉండడం’’- అంటూ సమాధానం యిచ్చారు. ఏది ఏమైనా ఆంధ్ర సాహిత్యంలో ‘‘ఆంధ్రపురాణం’’ శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్నదనే విషయం నిర్వివాదాంశం. శాస్ర్తీగారి పద్య రచనా సంవిధానం అనన్యసామాన్యం. నిజంగానే ప్రతి పర్వమూ రసోదయమే! ఇది ఇతిహాసమా, పురాణమా, కావ్యమా, మహాకావ్యమా, చరిత్రా -ఈ ప్రశ్నలు నిజంగా అనవసరమైనవి. రచనా వైశిష్ట్యం, పాండితీప్రకర్ష, సంవిధానం మొదలైన అంశాలను మనస్సులో ఉంచుకుని చూస్తే మన తెలుగు సాహిత్యంలో నిజంగా యిదొక వజ్రాలగని. శాస్ర్తీగారే స్వయంగా ఈ కావ్యరచనకు ఉపక్రమిస్తూ- ‘‘ఒకనాటి బ్రహ్మముహూర్తమునందొలినాటి తెలుగువారి చరిత్ర సారంబు ‘‘నవ’’ పర్వపరిమితంబుగా వింగడించుకుని ‘యాంధ్ర పురాణ’ కావ్యరచన కుంగడం గినాడ; సర్గప్రతిసద్గాది పంచలక్షణ లక్షితముకాక, త్రిలింగ రాజవంశ్యానుచరిత ప్రధానమై యుదయ, శాతవాహన, చాళుక్య, కాకతీయ, పునఃప్రతిష్ఠా, విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ, నాయకరాజ సమాహ్వమంబులగు ‘‘నవ’’ పర్వంబులతో సంభృతమైన యేతత్కృతి’’- అంటూ ప్రారంభించారు. కాబట్టి కవిగారే ఇలా అన్నప్పుడు ఇది వంశ్యానుచరిత వర్ణన రూపమైన పురాణమని, స్వభావం చేత కావ్యమని, ఒక రకంగా ‘‘పురాణ కావ్యవిశ్వరూప’’మని అభిప్రాయపడని పరిశోధకుల నిర్ణయం ఎంతైనా సత్యం. ఈ ఆంధ్ర పురాణాన్ని ‘తొమ్మిది’ పర్వాలలోనే రచించడానికి కారణాన్ని గూడా మధునాపంతుల వారు తమ ముఖాముఖిలో నా నటమిత్రుడు డా.బి.నాగిరెడ్డితో ఇలా అన్నారు-
‘‘ఆంధ్రుల అభిమాన గ్రంథమైన భారతమున పదునెనిమిది పర్వములున్నవి. దానిలో సగమీసంఖ్య. మా ఇలవేల్పు కామేశ్వరి. ఆమెకిష్టమైన సంఖ్య కావున తొమ్మిది పర్వములుగా విభజింపనైనది’’- ఇంతేగాదు. మరో విషయాన్నిగూడా వివరించారు. మొదటి నాలుగు పర్వాలూ పూర్వార్థమనబడుతుంది. అది 1954లో ప్రచురితమైందని, మిగిలిన అయిదు పర్వాలూ ఉత్తరార్థంగా 1964లో వెలువడినట్లు చెప్పారు. పూర్వార్థంలో మధునాపంతులవారు మొదట చాళుక్య పర్వాన్నీ, ఆ తరువాత క్రమంగా కాకతీయ, శాతవాహన, ఉదయపర్వాలనూ రచించారు. చారిత్రకంగా ఏ పర్వం ముందు రచింపబడ్డా ‘ఆంధ్ర పురాణం’లో చరిత్ర క్రమంలోనే అవి అమర్పబడి ఉన్నాయన్న నా మిత్రుడి అభిప్రాయం సర్వవిధాలా సత్యం. మన మిగతా కావ్యాలలో లాగానే (ఆంధ్రప్రశస్తి, శివభారతం, రాణాప్రతాపచరిత్ర) శాస్ర్తీగారి ఆంధ్ర పురాణంలో గూడా జాతీయాభిమానం, ఆంధ్రాభిమానం, రాష్ట్భ్రామానం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ‘‘చిన్ననాటినుంచీ నాకు సంస్కృత కావ్యములపై అధికమైన యాదరమున్నది. ఈ రచనమునకు నాకు ఆదర్శకావ్యము ‘‘రఘువంశము’’. దీనికితోడు జాతీయోద్యమ కాలమున వెలువడిన ‘‘ఆంధ్ర పౌరుషము’’ ‘ఆంధ్రప్రశస్తి’ వంటి కావ్యములు చారిత్రక వస్తువరణమునకు ప్రేరేచినవి’’- అన్న శాస్ర్తీగారి మాటలు ప్రత్యేకంగా మనం గమనించాలి. అంతేగాదు మధునాపంతులవారు ఆంధ్రుల చరిత్రలోని ఘట్టాలను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసికొన్నారు. వారి మాటల్లోనే- ‘‘నేను కావ్య రచనమున చారిత్రకులామోదించు అంశములనే చెప్పినాను. కీ.శే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఈ విషయమున నాకు తోడ్పడినారు. దానికి తార్కాణముగా రాజరాజుకు- సారంగధరునకు సంబంధించిన వృత్తమును చారిత్రకులామోదింపరని వదలినాను. రాయలు అప్పాజీ గుడ్లు పెరికించిన కథను గూడా వదలినాను. బంధితుడై ఢిల్లీకి కొనిపోబడిన ప్రతాపరుద్రుని యుగంధరుడు తిరిగి తీసికొనివచ్చెనన్న కథయూ నిట్టిదే’’ అంటూ చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలను శాస్ర్తీగారు ఈ కావ్య రచనా విషయం గూర్చి చెప్పుకున్నారు -
శాస్ర్తీగారి ‘ఆంధ్ర పురాణం’లోని ప్రతి పర్వంలో అద్భుత ఘట్టాలున్నాయి. శాతవాహన పర్వంలోని ఘట్టాన్ని ఒక్కటి వివరిస్తా- ప్రాకృత కవితాభిమానియైన హాలుని సభలో శర్వావర్మ గుణాఢ్యుల నడుమ గీర్వాణ భాషతో చర్చలు సాగుతుండేవి. వారి మధ్య తీర్పు చెప్పడానికి రాణి న్యాయ నిర్ణేత. హాలుడికి గుణాడ్యుటండే ప్రీతి. రాణి లీలావతికి శర్వావర్మ అంటే అభిమానం. ఒకనాడు జరిగిన సారస్వత గోష్ఠిలో శర్వవర్మ సంస్కృత భాషా కావ్య చర్చ సాగిస్తాడు. రాణి ‘‘ఇంతకును భాషా విజ్ఞతను బట్టి కదా రసజ్ఞత’’- అని రాజును ఎత్తిపొడుస్తుంది. ఆ పలుకు హాలుని మనసులో ములుకులా గుచ్చుకుంటుంది. హాలుడికి సంస్కృత భాషా సాహిత్యాలు అభ్యసించాలనే సంకల్పం కలుగుతుంది. శర్వవర్మ సంస్కృత వ్యాకరణాన్ని ఆరునెలల్లో రాజుకు బోధిస్తానని శపథం చేస్తాడు. అది అసాధ్యమని గుణాఢ్యుడు పేర్కొంటాడు. అంతేకాదు అలా చేయగలిగితే ‘‘కేవలము ప్రాణమైన ప్రాకృతము దుడిచి, వౌనియైముందు కాంతారమధ్యమందు’’- అంటూ ఘోర శపథం చేస్తాడు. శర్వవర్మ, కుమారస్వామి వరప్రసాదంతో నూతన వ్యాకరణ సృష్టిచేసి హాలుణ్ణి ఆరు నెలల్లో సంస్కృత భాషా కోవిదుణ్ణి చేయడం, గుణాఢ్యుడు వనవాసానికి బయలుదేరడం, హాలుడు సంస్కృత భారతీసమారాధనం చేయడం ఈ ఘట్టాలన్నీ పాఠకులను నిజంగానే ఒక రాజదర్బార్‌లో కూర్చోబెడతాయి.
అలాగే ‘విద్యానగర పర్వం’లో శ్రీనాధునికి కనకాభిషేక సమయంలో శ్రీనాధుడు కూర్చున్న భంగిమ, ఆ బ్రాహ్మీదత్త వరప్రసాదుని ఠీవి మన కళ్ళముందు నిలబెట్టారు శాస్ర్తీగారు -
కస్తూరికాపుండ్రకమ్ము దిద్దిన మేలి పస బిందులాడు నెన్నొసలివాడు
తీరహారముల ముత్యాల పేరుల మ్రోల గొమరాదు తెలిజన్నిదములవాడు
రత్నాంగుళీయక ప్రభకు శోభలు దీర్చి విలసిల్లు కెంజేతి వ్రేలివాడు
చెలువారు పైకి పువ్వులు కుట్టినంచుల పట్టుసాలువ వలె వాటువాడు
ఠీవి గలవాడు- శంభుసేవావివేక
సాధుశీలమ్మువాడు శ్రీనాథ విబుధు
డచ్చమగు తెల్గునొడుపు ముందడగులిడగ
వెడలె గనకాభిషేకపుంబెండ్లికొడుకు (వి.ప.155 పద్యం)
నిజంగానే ఈ ‘ఆంధ్ర పురాణం’ ప్రజాపరిషత్తులలో పాడబడుతూ ఉండాలి. ఆంధ్ర రసిక లోకం- ఆంధ్రజాతి తన పూర్వచరిత్రను చెవులారా, చవులారా వినగలిగే ఆంధ్ర పురాణ కావ్యగాన సభలను రాష్టమ్రంతటా ఏర్పాటుచేయాలి.

- డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, 9703553510