మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడెంతయు ప్రశాంతచిత్తుడై యుండును. మునుపటిగోల అంతయు పూర్తిగా అంతరించును. ప్రేమ పూరిత హృదయుడై, మనసార భక్తుడు ప్రార్థించినంతనే భగవానుడిక ప్రత్యక్షమగుటకు ఒక నిముసమైనను జాగుచేయజాలడు.
భక్తుడు: భగవంతుడు
భగవంతుడు ఎందుచే కాన్పింపడు?
640. సూర్యమండలము భూమికంటె ఎన్నియో రెట్లు పెద్దది; కాని ఎంతయో దవ్వుననుండుటచే చిన్న సిబ్బివలె కాన్పించుచున్నది. అటులనే భగవంతుడు అనంతుడును అఖండుడునైయున్నాడు. కాని మనము (అజ్ఞానముచే) వానికి అతి దూరముననుండుటచే వాని యఖండ స్వరూపమును గ్రహింపజాలకున్నాము.
641. నాచుచేతను రెల్లుచేతను గప్పబడిన చెఱువులో ఈదులాడు చేపలు పైకి గాన్పింపని రీతిని భగవంతుడు నరులు గానరాకుండ మాయావృతుడై మానవ హృదయమున క్రీడించుచున్నాడు.
642. జగజ్జననిని మనము ఎందుచే జూడజాలము? ఆమె తెరచాటున నుండి వ్యవహారమునంతయు జక్కబెట్టుకొను గొప్ప కుటుంబమునందలి స్ర్తివంటిది. ఆమె యందఱను జూచుచుండును, కాని యామె నెవ్వరును జూడజాలరు. ఆమె ప్రియపుత్రులగు భక్తులు మాత్రము తెరను తొలగించుకొని యామెను దర్శింతురు.
643. పోలీసు జవాను తన దొంగలాంతరు మూలమున నెవ్వరినైనను జూడగలడు. కాని యతడు దాని వెలుగును తనపైకి త్రిప్పుకొనినదే ఎవ్వరును వానిని గనజాలరు. అటులనే భగవంతుడందఱను జూచుచునే యుండును. కాని కృపాపూర్ణుడై స్వయముగా సాక్షాత్కరింపనిదే వాని నెవ్వరును గనజాలరు.
భగవంతుడు: భక్తుడు
644. భూస్వామి గొప్ప జమీందారైయుండవచ్చును. కాని బీద రైతు ప్రేమతో ఏదోయొక చిన్న కానుకను తనకు సమర్పించునేని మహానందముతో ఆతడు స్వీకరించును. అటులనే సర్వేశ్వరుడు అఖండ మహిమాన్వితుడయ్యును మనఃపూర్వకముగా తన కర్పింపబడు నైవేద్యమెట్టిదైనను మహావందనముతో స్వీకరించును.
645. సంస్కృతము రానిచో నాకేమి కొదువ? భగవంతుని సాక్షాత్కారము నొందినచో నేను సంతుష్టుడను. పండితులు కానిండు, పామరులు గానిండు, తన్ను దెలిసికొనుటకు పరితపించు తన బిడ్డలందఱియందును సమానముగా భగవంతుడు ప్రేమానురాగములను జూపును. ఒకనికి ఐదుగురు బిడ్డలున్నారనుకొనుము.
వారిలో గొందఱు వానిని ‘నాన్న’యని పిలువగలుగుదురు. మఱికొందఱు ఆ మాటను పూర్తిగా ఉచ్చరింపజాలక, ‘నా’యని మాత్రమే ఉచ్చరింపగలిగి యుండవచ్చును. కాని తండ్రి వారిని తక్కువ ప్రేమించునా? వారు కేవలము పసిబాలురు కావున తన్ను సరిగా పిలువజాలకున్నారని యాత డెఱుగును.
646. ధూళిలోను ఇసుకలోను పొరలాడి ఒడలెల్ల మలినము చేసికొనుట బిడ్డల స్వభావము. కాని తల్లి యాబిడ్డలనట్లే మలినముగా నుండనీయదు. పదేపదే కడిగి శుభ్రముచేయుచుండును. అటులనే పాపము చేయుట నరునికి సహజము; కాని యాతడు పాపము చేయుటెంత నిశ్చయమో, భగవంతుడు వానికి తరుణోపాయమును జూపుటయు అంతకు పదిరెట్లు నిశ్చయము.
647. ఒకే పెద్ద చేపతో తల్లి చేయు పులుసు, కూర మొదలగువానిలో నెవరికి హితవగునదివారు గైకొనునట్లు భక్తుల అభీష్టముననుసరించి ఒకే భగవానుడు వేర్వేరు రూపములతో సాక్షాత్కరించుచుండును.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి