మెయిన్ ఫీచర్

‘చిన్నారి వధువుల’ ఊసెత్తని నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సమయంలో రాయితీలు, నజరానాలు, ‘ఉచిత పథకాల’తో వోటర్లకు ఎర వేసే రాజకీయ నాయకులకు- సామాజిక దురాచారాల సంగతి అసలే పట్టదు.. అనాదిగా కొనసాగుతున్న అర్థం లేని ఆచారాలు, దుష్ట సంప్రదాయాలను అంతం చేస్తామని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వదు.. కులపరమైన కట్టుబాట్లను, పద్ధతులను ఎన్నికల వేళ ప్రస్తావిస్తే కొన్ని సామాజిక వర్గాల వోట్లు తమకు దక్కవన్నదే నేతల భయం.. ఈ పరిస్థితులకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా సాక్షీభూతంగా నిలుస్తోంది. బెంగాల్ రాష్ట్రం మొత్తమీద బాల్యవివాహాల దురాచారం మాల్డా జిల్లాలో ఎక్కువగా ఉందని సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఘోషిస్తున్నా- ఈ సమస్యపై నేతలు దృష్టి సారించిన దాఖలాలు లేవు. బాల్యవివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసు కేసుల సంఖ్య, నిందితులకు శిక్షలు బహు అరుదు. మాల్డా జిల్లాలో బాల్యవివాహాల జోరుపై ‘యూనిసెఫ్’ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) తాజా నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లీడు రాకుండానే బాలబాలికలకు వివాహాలు జరిపించడంలో మాల్డా జిల్లా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ‘యూనిసెఫ్’ నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్‌లో బాల్యవివాహాలు 47 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి. అయితే, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బాల్యవివాహాల దురాచారం తగ్గుముఖం పట్టలేదు. మాల్డా జిల్లాలో గత దశాబ్ద కాలంలో జరిగిన మొత్తం పెళ్లిళ్లలో 42 శాతం మేరకు బాల్యవివాహాలు జరిగినట్టు తేలింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఏ రాజకీయ వేదికలపైనా ఈ దురాచారం గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు. సామాజిక కట్టుబాట్లు, సనాతన పద్ధతుల్లో తాము జోక్యం చేసుకొంటే కొన్ని వర్గాలకు దూరం కావలసి ఉంటుందన్న నేతల భావనే ఇందుకు కారణం.
మాల్డా జిల్లా హబీబ్‌పూర్‌లో ఓ బాల్యవివాహాన్ని అడ్డుకోవాలని కొన్నాళ్ల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కడి మహిళా సర్పంచ్‌ను కోరారు. ప్రజాసేవలో కృషిచేస్తున్నందుకు ఆ సర్పంచ్‌ను అదే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గతంలో ఘనంగా సన్మానించారు. అయితే, బాల్యవివాహాన్ని అడ్డుకొని ఓ బాలికను రక్షించాలని ఆ సంస్థ చేసిన విజ్ఞప్తిని మహిళా సర్పంచ్ పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో స్థానికులు తనకు వోట్లు వేయరన్న భయంతో మహిళా సర్పంచ్ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ బాల్యవివాహాలపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల మేరకు పశ్చిమ బెంగాల్‌లో 18 ఏళ్లలోపు బాలికల్లో 41.6 శాతం మంది తమ ప్రమేయం లేకుండానే దాంపత్య బంధంలోకి అడుగుపెడుతున్నారు. మాల్డా జిల్లాలో 56.3 శాతం మంది బాలికలు (18 ఏళ్ల వయసు లోపు) ‘అత్తారింటికి’ చేరుకొన్నారు. ము ఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద కుటుంబాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. 12-13 ఏళ్ల వయసులో తాళిబొట్లు మెడలో పడగానే చాలామంది బాలికలు 18 ఏళ్లు రాకుండానే తల్లులవుతున్నారు. చిన్న వయసులోనే గర్భధారణ కారణంగా ఎంతోమంది బాలికలు రోగాల బారిన పడుతున్నారు. శారీరక ఎదుగుదల లేకుండానే లైంగిక దాంపత్యం వల్ల రక్తహీనత, నరాల బలహీనత వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు జరగడంతో- బాగా చదువుకోవాలన్న బాలికల కలలు కల్లలుగా మారుతున్నాయి. మిగతావారి లాగానే తాము కూడా హైస్కూళ్లలో, కళాశాలల్లో సందడి చేయాలని ఆశపడుతున్న బాలికలకు నిరాశే మిగులుతోంది. పాఠశాల స్థాయిలో రాణిస్తున్న కొందరు బాలికలు సైతం చదువులకు దూరమవుతున్నారు. మాల్డా జిల్లాలోని షాయిల్‌పూర్‌లోని బుదియా హైస్కూల్‌లో 150 మంది బాలికలు చదువుతుండగా, 12-13 ఏళ్ల వయసులోనే దాదాపు 30 మంది అమ్మాయిలు దాంపత్య జీవితంలో ప్రవేశించారు. ఈ దురాచారాన్ని ఎదిరించేందుకు కొంతమంది బాలికలు సిద్ధపడుతున్నా- కుటుంబ సభ్యుల నుంచి వారికి వేధింపులు తప్పడం లేదు. రసూలాదహ గ్రామానికి చెందిన 16 ఏళ్ల పర్వీన్‌కు 14 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. ఓ బిడ్డకు జన్మనిచ్చాక, 16 ఏళ్ల వయసులో మళ్లీ చదువుకోవాలని పర్వీన్ ఆశపడింది. ఇందుకు ఆమె అత్తింటివారు సమ్మతించలేదు. పదివేల రూపాయలు ‘ఎదురు క ట్నం’గా చెల్లించి వివాహం రద్దు చేసుకోవచ్చని అత్తింటివారు తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీలేక పర్వీన్ మిన్నకుండిపోయింది. ఇలాంటి ఘటనలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో నిత్యకృత్యంగా మారాయి. చిన్న వయసులో చేసిన వివాహాన్ని రద్దు చేయాలని కొం దరు బాలికలు కోరుకుంటున్నప్పటికీ, వారు పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించే పరిస్థితి కనిపించడం లేదు. తల్లిదండ్రులు, అత్తింటివారు, కులపెద్దలు, గ్రామస్థుల నుంచి వచ్చే బెదిరింపుల కారణంగా ఎంతోమంది ‘చిన్నారి పెళ్లికూతుళ్లు’ వౌనంగానే వేదనను భరిస్తున్నారు.
‘బాల్య వివాహాల నిరోధక చట్టం-2006’ కింద దేశవ్యాప్తంగా 2015లో 293 కేసులు, 2016లో 326 కేసులు నమోదైనట్లు ‘జాతీయ మానవ హక్కుల సంస్థ’ తన నివేదికలో పేర్కొంది. మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 3,600 వరకూ బాల్యవివాహాలు జరుగుతున్నాయని ఆ నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాల్యవివాహాల్లో 40 శాతం మేరకు భారత్‌లోనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న బాల్యవివాహాల్లో 40.7 శాతం మేరకు పశ్చిమ బెంగాల్‌లోనే జరుగుతున్నాయి. బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఈ దురాచారం ఎక్కువగా కనిపిస్తోంది. బెంగాల్‌లో బాల్యవివాహాలపై 2016లో కేవలం 41 కేసులు మాత్రమే నమోదుకాగా, కేవలం 35 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి.
కొన్ని శతాబ్దాల క్రితం నుంచే బెంగాల్‌లోని మాల్డా తదితర ప్రాంతాల్లో బాల్యవివాహాల ఆచారం కొనసాగుతోందని బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజీ పరిశోధకుడు ప్రొఫెసర్ బిశ్వజిత్ ఘోష్ చెబుతున్నారు. బాలికలకు 8-10 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేయడం సంప్రదాయంగా మారింది. ఆకతాయి కుర్రాళ్ల వేధింపుల కారణంగా బాలికలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపతున్న ఘటనలు కూడా బెంగాల్‌లో ఎక్కువగా ఉన్నాయని సామాజికవేత్తలు అంటున్నారు.
బాల్య వివాహాల నిరోధానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలను నియమించాలని చట్టంలో పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీలను నియమించి, అవి సమర్ధవంతంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవలసి ఉంది. తాము వివాహాలను అడ్డుకోగలమే తప్ప, ఈ దురాచారాన్ని నిర్మూలించే బాధ్యత ‘బాలల హక్కుల పరిరక్షణ సంఘాల’దేనని పోలీసు అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో స్థానికుల నుంచి సహాయ సహకారాలు లేనందున తాము ఏమీ చేయలేమని బాలల సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకచోట బాల్యవివాహాన్ని తాము అడ్డుకొంటే, ఆ తర్వాత అదే జంటకు వేరే చోట పెళ్లి చేస్తుంటారని వారు అంటున్నారు.
కాగా, బాల్యవివాహాలను నిరోధించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2013లో ‘కన్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. 13-18 ఏళ్లలోపు, 18 ఏళ్లు నిండిన బాలికలను చదువులో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలను అందిస్తున్నారు. ‘కన్యశ్రీ’ పథకం కింద స్కాలర్‌షిప్‌లు పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్న బాలికల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాల్యవివాహాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేత ఏబీఏ ఘనీఖాన్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రులుగా కొనసాగినప్పటికీ మాల్డా జిల్లాలో బాల్యవివాహాల జోరు తగ్గలేదు. మరోవైపు- సామాజిక రుగ్మతలు, దురాచారాల గురించి హామీలిచ్చే నేతలు ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేనేలేవు. దీంతో ఈ సమస్యల జోలికి వెళ్లేందుకు నేతలెవరూ సాహసించడం లేదు. ‘వోటుబ్యాంకు’ రాజకీయాలు కొనసాగినంత కాలం సామాజిక దురాచారాలు అదృశ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

-ఎస్.ఆర్.