మెయన్ ఫీచర్

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తులు లేదా సంస్థలు నిర్భీతిగా ముందడుగు వేస్తున్నపుడు ఆరోపణల రూపంలో దాడి చేయడం, వారి సర్వసత్తాక సామర్ధ్యాలను దెబ్బతీయడం మన ప్రజాస్వామ్య దేశంలో చాలాకాలంగా చూస్తున్నదే. సైనిక పాలన ఉన్న దేశాల్లోనో, రాచరిక పాలనలోనో అయితే ఇలాంటి ఆరోపణలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రధాన మంత్రిని సైతం పంచాయతీ వార్డు సభ్యుడు కూడా విమర్శించేంత స్వేచ్ఛ ఉంది. అలాంటి సందర్భంలో కేసు పెడితే క్షమాపణలు చెప్పి తప్పించుకోవచ్చు. తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై దాడి కూడా అలానే అనిపిస్తోంది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలను, జరిగాయో లేదో తెలియని అంశాలను తెరమీదకు తీసుకువచ్చి ప్రధాన న్యాయమూర్తినే అనుమానాస్పదంగా చూపించడం ద్వారా సుప్రీం స్వతంత్రతపై దాడి చేసే కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది.
ఆ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హార్వర్డు లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసించిన ఉత్సవ్ బెయిన్స్ చేసిన తాజా ఆరోపణలు చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక కొంతమంది నిస్పృహతో కూడిన న్యాయమూర్తులు, కార్పొరేట్ సంస్థలు, లాబీయింగ్ వ్యక్తులున్నట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి తరఫున వాదించి, లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపునకు శిక్ష పడేలా చేయగలిగిన ఉత్సవ్ బెయిన్స్‌ను కొంత మంది కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. సీజేఐ గొగొయ్‌పై ఆరోపణలు చేయించి.. పదవికి ఆయన రాజీనామా చేసేలా కేసును చర్చకు తేవాలని ఒత్తిడి చేసినట్టు, అందుకు ప్రతిఫలంగా కోటిన్నర చెల్లిస్తామని పేర్కొన్నట్టు బెయిన్స్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరపనుంది. ఆరోపణలు చాలా తీవ్రమైనవి.. ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది సామాన్య పౌరుడు కాదు, దేశంలో సర్వోన్నత న్యాయస్థానానికి అధినేత. దాంతో ఈ వార్తాకథనాలకు విశేషమైన ప్రాధాన్యత వచ్చింది. నాలుగు గోడల మధ్య ఎవరేం చేసినా అది కూడా పెనుసంచలనంగా మారుతున్న ఈ రోజుల్లో బహిరంగంగానూ, లిఖితపూర్వకంగానూ జరిగిన ఆరోపణల వ్యవహారంపై చర్చ జరగకుండా ఎలా ఉంటుంది?
ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఎలా స్పందిస్తాయనేది పత్రికల ఇష్టానికే వదిలేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొనడం ద్వారా పత్రికలు సైతం జవాబుదారీతనంతో, రుజువైన వార్తలను మాత్రమే ప్రచురించాలనే నైతిక సూత్రాన్ని గుర్తుచేసింది.
సీజేఐపై నేతృత్వంలోని ధర్మాసనమే గొగొయ్‌పై వచ్చిన ఆరోపణలను విచారించడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏనాడో ఒక సందర్భంలో ఆ కేసుతో తనకో, తన కుమారుడికో లేదా బంధువులకో సంబంధం ఉందనే కారణంతో కేసుల నుండి న్యాయమూర్తులు తప్పుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్న వర్తమాన కాలంలో తన కేసు విషయంలో విచారణ జరుపుతున్న ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి స్వయంగా అధ్యక్షత వహించడంపై చర్చ మొదలైంది. సీజేఐ తన సొంత కేసును తానే విచారించుకోవచ్చా ? ఆ మాట కొస్తే సీజేఐనే కాదు, దేశంలో ఏ పౌరుడైనా తనపై వచ్చిన ఆరోపణలకు తానే సర్ట్ఫికెట్ ఇచ్చుకోవడం ఎంత మాత్రం సరికాదు. ఇది ఒక కోణం. మరో కోణంలో సీజేఐ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే వేదిక వేరొకటి ఉందా? ధర్మాసనంలో ఆరోపణలకు సంబంధించి తన ఉన్న సమాచారాన్ని అందించారు కదా. తీర్పు చెప్పే సమయంలో ధర్మాసనం నుండి తప్పుకున్నారు కదా ఆయనేమీ తనకు అనుకూలమైన తీర్పును ప్రకటించుకోలేదు కదా.. ఇది మరో వాదన. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి కూర్చోవచ్చా? లేదా? అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది మాట్లాడుతూ, ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఎవరి కేసులో వారే తీర్పు చెప్పకూడదనేది సహజ న్యాయసూత్రమని, అంతగా తన అభిప్రాయం చెప్పాలనుకుంటే పత్రికల వారిని పిలిచి వివరణ ఇవ్వవచ్చన్నది రాకేష్ ద్వివేది భావన.
గతంలో ఐదుగురు న్యాయమూర్తులు జరిపిన మీడియా సమావేశంలో రంజన్ గొగొయ్ కూడా ఉన్నారు కనుక అదే రీతిన పత్రికా విలేకరుల సమావేశం పెట్టవచ్చనేది రాకేష్ సలహా. విచారణ జరిగే వరకూ కూర్చుని ఉత్తర్వులపై సంతకాలు చేయకపోవడం అసాధారణ విషయమని, ఇది ఒక విధంగా విధి నిర్వహణ నుండి తప్పించుకోవాలని చూడటమేనని రాకేష్ చెబుతున్నారు. కేసు విచారణ జరుగుతున్నపుడు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరుకావల్సిన పనేముందని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. ఒక ఉద్యోగి చేసిన ఆరోపణలతో ప్రభుత్వానికి, కోర్టుకు ప్రాథమిక దశలో సంబంధం ఉండదని, దానిని పోలీసులు దర్యాప్తు చేసి నివేదికలు ఇచ్చిన తర్వాతనే కేసులు నమోదు అవుతాయని ఆ తర్వాతనే కోర్టుల ప్రమేయం వస్తుందని అన్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు, న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగొయ్‌కు బాసటగా నిలిచారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అసత్యాలు, కల్పితాలు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఈ అంశంపై చర్చించి భారత బార్ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని కూడా చేసింది.
ఆరోపణలను ఖండించే స్థాయికి తాను దిగజారాలని అనుకోవడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. ధర్మాసనంలో సీనియర్ అయిన జస్టిస్ అరుణ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేస్తారని సీజేఐ చెప్పారు. ఆరోపణల వెనుక కుట్ర ఉందని, ఏదో ఒక పెద్ద శక్తి ఉందనే భావన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల సేవల తర్వాత తనకు దక్కిన బహుమతి ఇదేనా? అని ఆవేదనగా ఉన్నారు. రెండు కార్యాలయాలపై ఏదో ఒక శక్తి దృష్టి పెట్టిందని, అందులో ఒకటి ప్రధాన మంత్రి కార్యాలయమని, ఇంకోటి సీజేఐ కార్యాలయమేనని, తన కార్యాలయాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జరిగే ప్రయత్నాలను తిప్పికొడతామని కూడా చెప్పారు. త్వరలో అత్యంత కీలక కేసులు విచారణకు రాబోతున్న ఈ దశలో ఇలాంటి ఆరోపణలను తెరమీదకు తీసుకురావడం వెనుక ఉద్దేశం అర్థమవుతోందని కూడా పేర్కొన్నారు. డబ్బు విషయంలో తనను ఎవరూ వేలెత్తి చూపలేరని, దాంతో తనను లక్ష్యం చేసుకోవాలంటే ఇంకో అంశాన్ని ఎంచుకోవాలనే ఈ ప్రయత్నం జరిగిందన్నారు. రాఫెల్ కేసు, పశ్చిమబెంగాల్ లోని శారదా చిట్‌ఫండ్ కేసు, ప్రధాని మోదీ జీవితచరిత్రపై వచ్చిన బయోపిక్, అస్సాం జాతీయ పౌర హక్కుల పట్టిక రూపకల్పన, తమిళనాడు ఎన్నికల సందర్భంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ వంటి ఎన్నో కేసులు తక్షణం విచారణకు రానున్నాయి.
ప్రస్తుతం తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 6.90 లక్షలు ఉందని, భవిష్య నిధి ఖాతాలో 40 లక్షలు ఉందని, తన ఆస్తి మొత్తం ఇదేనని సీజేఐ చెబుతున్నారు. తాను న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఇంతకంటే ఎక్కువ సొమ్ము తన వద్ద ఉండేదని, ఇపుడు తన ప్యూన్ వద్ద తనకంటే ఎక్కువ ఉందని పేర్కొనడం ఆలోచించ దగ్గది. ఏ న్యాయమూర్తికైనా ఏకైక ఆస్తి ప్రతిష్ట మాత్రమేనని, లైంగిక వేధింపుల వంటి నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్ట మీదనే దాడి చేస్తే న్యాయమూర్తి పదవి చేపట్టాలంటేనే భయపడతారని, కేసులను ఇంకేం పరిష్కరించగలుగుతారని గొగొయ్ ధర్మాసనంలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాల్సి ఉంటుందని, దానికే పెనుముప్పు ఏర్పడిందని, ఇది చాలా దయనీయమని అన్నారు.
ధర్మాసనంలో చర్చ సందర్భంగా ఆరోపణలు చేసిన మహిళ ప్రస్తావనను గొగొయ్ తెచ్చారు. ఆమేకు నేర నేపథ్యం ఉందని, మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, సుప్రీంలో చేరిన నాటికి ఆమెపై ఒక ఎఫ్‌ఐఆర్ పెండింగ్‌లో ఉందని, ఆమె భర్తపై కూడా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఒక కేసులో ఆమె అరెస్టయిందని, తర్వాత బెయిల్ పొందిందని, ఆమెకు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు ఢిల్లీలోని ట్రయిల్ కోర్టును ఆశ్రయించారని గొగొయ్ పేర్కొన్నారు. ఆ మహిళ చేసిన ఆరోపణలను వెబ్ పోర్టళ్లు కథనాలుగా ప్రచురించాయని, దీనిపై సీజేఐ కార్యాలయ స్పందన కూడా కోరాయని చెప్పారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ ఇవన్నీ బెదిరింపు ఎత్తుగడలని , ఇలాంటి నిరాధార ఆరోపణలను చేసిన సదరు మహిళపై దర్యాప్తు జరపాలని అన్నారు. గతంలోనూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిపైనా, ఒక సీనియర్ న్యాయవాదిపైనా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుచేశారు. ఇలాంటి ఆరోపణల విషయంలో ఫిర్యాదుదారు, ప్రతివాది పేరును వెల్లడించరాదని చట్టం చెబుతున్నాయని కూడా ఏజీ గుర్తుచేశారు. చర్చ అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళన నెలకొందన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ కేసులు పరిష్కరించాల్సిన న్యాయమూర్తులపైనే ఇలాంటి ఒత్తిడి పెట్టడం తగదన్నారు. ఆరోపణలు చేసిన సదరు మహిళను నిర్దేశిత ప్రక్రియను పాటించిన తర్వాతనే ఉద్యోగం నుండి తొలగించారని, ఇపుడు అకస్మాత్తుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కేసు విచారణ అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు సంక్షిప్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. విషయం పరిశీలించిన తర్వాత దీనిపై ప్రస్తుతానికి తామేమీ న్యాయపరమైన ఆదేశాలు ఇవ్వడం లేదని, ఇదే సమయంలో దీనిపై ఎంత సంయమనం , బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టకు సరిదిద్దలేని నష్టం కలిగించడంతో పాటు తక్కువ చేసి చూపించడానికి చేసిన ఇలాంటి అనైతిక ఆరోపణలను ప్రచురించాలా? వద్దా?? అన్న నిర్ణయాధికారాన్ని వారికే వదిలేస్తున్నామన్నారు. ఇలాంటి యోగ్యత లేని ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోతుందని, నిజానిజాలు తెలియకుండా ఆమె చేసిన ఫిర్యాదును ప్రచురించాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.
గొగొయ్ నివాసంలో తాను పనిచేస్తున్నపుడు 2018 అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తాను లైంగిక వేధింపులను ప్రతిఘటించడం వల్లనే తనపై కక్ష కట్టారని ఆమె 24 పేజీల అఫిడవిట్‌తోపాటు రెండు పేజీల సంక్షిప్త లేఖను 22 మంది న్యాయమూర్తులకు పంపించారు. 2014 మే 1 నుండి 2018 డిసెంబర్ వరకూ ఆమె సుప్రీం కోర్టులో అసిస్టెంట్‌గా పనిచేశారు. 2018 అక్టోబర్‌లో తన భర్త సోదరుడికి ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికార కోటాలో ఉద్యోగం ఇప్పించారు. లైంగిక వేధింపులను ప్రతిఘటించడంతో తనను చాలా అమర్యాదకరంగా తొలగించారని ఆమె పేర్కొంది. ‘దీ లీఫ్‌లెట్ పోర్టల్’లో ఈ అంశంపై అనేక కథనాలు వచ్చాయి. ఆరోపణలు నిజమా? కాదా? అనే అంశంతో పాటు విచారణ యంత్రాంగం , మంత్రాంగం ఉండగా ప్రతి ఒక్కరూ ఈ అంశంలో జోక్యం చేసుకోవడం వారి వ్యక్తిగత గోప్యతను భగ్నం చేయడమే. ఈ వారంలో ఈ అంశంపై సుప్రీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..!

-బీవీ ప్రసాద్ 98499 98090