మెయిన్ ఫీచర్

ఆ స్ఫూర్తి.. ఇంకొంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనంపై సినిమా ప్రభావమేమీ ఉండదంటారు కొందరు. సినిమాయే జనాన్ని నడిపిస్తుందంటారు మరికొందరు. ఎవరి వాదనలో ఎంత బలమన్నది పక్కనపెడితే - సినిమా కొత్తగా అనుభవంలోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రభావం లేదని కొట్టిపారేయలేం. సినిమా టాకీ దశకొచ్చిన తొలినాళ్లలో పీడిత జనానికి సినిమాయే ప్రతినిధి అయ్యంది. వాళ్ల కష్టాలు కన్నీళను తెరపై చూపించింది. వాటినే కథలుగా మలచుకుంది. వారి తరఫున పోరాడుతూ జన చైతన్యానికి ఊపిర్లూదింది.
మంచిని గ్రహించు. చెడును తరిమికొట్టు. ఈ మాటల్ని చాలామంది చాలాసార్లు చాలారకాలుగా చెప్పారు. కానీ -ఇదే విషయాన్ని సినిమా చెప్పినపుడు మాత్రం ప్రేక్షకులు ఆసక్తిగా విన్నారు. ఆచరణకూ ప్రయత్నించారు. ఇది గ్రహించారు కనుకే -గూడవల్లి రామబ్రహ్మంలాంటి సంస్కర్తలు చైతన్యం, విప్లవం, ప్రభోదాత్మక రూపాల్లో సాంఘిక చిత్రాల నిర్మాణానికి నడుంగట్టారు. ఆనాటి నుంచీ ఎందరో దర్శకులు, దార్శనికులు ఉత్తమ సమాజ ఆవిష్కరణకు బాటలు వేసే ఎన్నో చిత్రాలను తెరపైకి తెచ్చారు. ఏ ఆదర్శాన్ని ఆశించి ఎవరెలాంటి సినిమాలను మనకు అందించారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సమాజంపట్ల నీతివంతమైన వాళ్ల ఆలోచనలను మననం చేసుకుందాం.
‘మేడే’ కార్మిక దినోత్సవం. కార్మికులకూ ఓ రోజంటూ -వామపక్ష భావజాలం నుంచి పుట్టింది. విస్తృత రచనలతో విప్లవ భావాలు ప్రజానీకంలోకి చొచ్చుకెళ్లాయి. నాటకాలు, గేయాలు.. ఇలా అనేక రూపాల్లో ప్రజలకు చేరువైంది. చలన చిత్రం టాకీ దశకు చేరింతర్వాత -విప్లవాలు, ఉద్యమమార్గాలు, ప్రభోదాత్మక భావాలు.. ఇలా పామరుల ఆదరణకు పాత్రమైంది. సాంఘిక చిత్రాల్లో పీడిత జనాల ఈతి బాధలు, దారిద్య్ర కష్టాలను మానవీయ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. చైతన్యం, విప్లవం, ప్రభోదాత్మకం.. ఇలా అనేక రూపాలు చిత్ర ఇతివృత్తాలయ్యాయి.

తొలి టాకీ సాంఘీక చిత్రం ‘ప్రేమ విజయం’ (1936) తర్వాత ప్రభోద ప్రయోగాలకు ప్రభావితుడైన గూడవల్లి రామబ్రహ్మం రెండో సాంఘీక చిత్రంగా ‘మాలపిల్ల’ (1938) తెచ్చారు. చైతన్యస్ఫూర్తితో నిర్మించిన సినిమా ఘన విజయంతోపాటు ఆనాటి ప్రజానీకంలో సంచలనం రేకెత్తించింది. దీంతోపాటు వచ్చిన ‘గృహలక్ష్మి’లో మద్యపాన నిషేధానికి స్ఫూర్తినిచ్చే ప్రభోద గీతం ‘కల్లు మానండోయ్ బాబూ కల్లు మానండోరుూ’ నాటి ప్రజానీకంలో ఆలోచనకు హేతువైంది. రామబ్రహ్మం రెండో చిత్రం ‘రైతుబిడ్డ’ -సంస్కరణాత్మక చిత్రంగా సాగితే, బియన్ రెడ్డి తొలి చిత్రం ‘వందేమాతరం’ నిరుద్యోగ సమస్యకు అద్దంపట్టింది. వైవి రావు తీసిన ‘మళ్లీ పెళ్లి’ వితంతు పునర్వివాహాన్ని చర్చిస్తే, వరకట్న దురాచారాన్ని తూర్పారబట్టిన కాళ్లకూరి ‘వరవిక్రయం’ నాటకాన్ని సి పుల్లయ్య చిత్రంగా మలిచారు. ఇవన్నీ 1939లోని సంచలనాలు. 1940లో వచ్చిన ‘సుమంగళి’ మహిళా చైతన్యవంతాన్ని సాధించింది. ఇలాంటివే ఇల్లాలు, కాలచక్రం, చదువుకున్న భార్య. 1947లో వచ్చిన ‘మన దేశం’ స్వాతంత్య్ర పోరాట విప్లవాత్మక చిత్రమైతే, చారిత్రాత్మక ‘పల్నాటియుద్ధం’ చిత్రంలో బ్రహ్మనాయుడి ‘చాపకూడు’ సిద్ధాంతాన్ని నాటి ప్రజావాహినిలోకి తెచ్చి హరిజనుల్ని ఉద్ధరించే సంస్కరణ భావాలు చూపించారు. అంటే 1936 నుంచి పుష్కరకాలంపాటు నిర్మాణమైన సాంఘీక చిత్రాలన్నీ విప్లవ భావాలతో కూడుకున్నవే. కార్మికులకు అండగా నిలిచే సంస్కరణాత్మక, ప్రభోదాత్మక, ప్రయోగాత్మక చిత్రాలే అయ్యాయి.
1950ల తరువాత ఈ సినిమాల ఒరవడి తగ్గింది. ప్రేమ, హాస్యం, కుటుంబ కథ, మానవీయ కోణం, మానసిక సంఘర్షణ కోణాల దిశగా సాంఘీక చిత్రం పయనించింది. విప్లవాత్మక, ప్రభోదాత్మక చిత్రాలు అడపాతడపా అయిపోయాయి. అప్పటి తారాగణం కూడా అన్ని రకాల చిత్రాల ద్వారా తమ ప్రతిభను చాటారు. నాటి యన్టీఆర్ -పల్లెటూరు, తోడుదొంగలు, పిచ్చిపుల్లయ్య, దేశద్రోహులు, పెత్తందార్లు, తల్లా పెళ్లామా?, దేశోద్ధారకులు, బడిపంతులు, బంగారు మనిషి, వరకట్నం, మిస్సమ్మ, రైతుబిడ్డ, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, నా దేశం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, విశ్వరూపం, కథానాయకుడు లాంటి చిత్రాలన్నీ ప్రభోదాత్మక, సంస్కరణాత్మక సంఘర్షణతో సాగినవే. ఇక అక్కినేనికి ఇలాంటి చిత్రాలు స్వల్పం. రోజులుమారాయి, అన్నదాత, తోడికోడళ్లు, వెలుగునీడలు, నమ్మినబంటు, ఇల్లరికం, కులగోత్రాలు, సుడిగుండాలు, మరోప్రపంచం, బుద్ధిమంతుడు, బందిపోటు దొంగలు, జై జవాన్, బీదలపాట్లు, మంచిరోజులు వచ్చాయి, కలెక్టర్‌గారి అబ్బాయి, రాజకీయ చదరంగం, సూత్రధారులు, రగులుతున్న భారతం, ప్రాణదాత.. ఇలాంటివి ఏఎన్నార్ అకౌంట్‌లో చెప్పుకోవచ్చు. ఈ చిత్రాల్లో పాత్రలపరంగా ఉన్నత ఆదర్శభావాలు, సంస్కరించే తత్వాలు, పోరాట పటిమ, ముక్కు సూటితనం ప్రస్ఫుటంగా కనబడుతుంటుంది. జగ్గయ్య -పదండి ముందుకు, శోభన్‌బాబు -మనుషులు మారాలి, కల్యాణ మండపం, మానవుడు దానవుడు, బలిపీఠం, దేవాలయం లాంటి చిత్రాలను ఈ కోవలో ప్రస్తావించుకోవచ్చు. ఇక కృష్ణంరాజు నటించిన -గాంధి పుట్టిన దేశం, మేమూ మనుషులమే, బంగారుతల్లి, మనవూరి పాండవులు, నాకు స్వాతంత్య్రం వచ్చింది చిత్రాల్లో కొంతవరకు అభ్యుదయ భావాలు హీరో పాత్రకు ఆపాదించారు. ఇలాంటి చిత్రాల్లో ప్రధానంగా కుటుంబ విలువలతోపాటు విప్లవ భావాలు, ప్రబోధాత్మక అంశాలను చూపించారు. కృష్ణకు ప్రధానంగా అల్లూరి సీతారామరాజు తర్వాత ప్రజారాజ్యం, ముఖ్యమంత్రి, ప్రజల మనిషి, ఈనాడు, సర్ధార్ కృష్ణమనాయుడు, ప్రజానాయకుడు లాంటి చిత్రాల్లో హీరోయిజంతోపాటు ప్రజా సమస్యలపై పోరాటాన్ని ప్రధానాంశం చేసుకున్నారు. అయితే ఇలాంటి చిత్రాలన్నీ ఆయా హీరోలకున్న హీరోయిజంతో ముడిపడి విప్లవభావాలు ఉంటాయి. పూర్తిస్థాయి విప్లవాత్మక చిత్రాలు కావు. వ్యాపారాత్మక అంశాలతో కలగలిపినవే. హీరోయిజం లేని పాత్రలతో ప్రభోధాత్మక, సంస్కరణాత్మక, విప్లవాంశాల కథనాలతో నిర్మించిన చిత్రాలూ లేకపోలేదు. అవి -గొప్పవారి గోత్రాలు (1967), ఒకనారి వంద తుపాకులు (1972), నేనూ- నా దేశం (1973) సినిమాలను ప్రస్తావించొచ్చు. నక్సలైట్లు పాత్రలను తెరపై తొలిసారిగా పరిచయం చేసిన సినిమా బాలమిత్రుల కథ (1973). ఆ తరువాత కాలంలో మనిషి రోడ్డున పడ్డాడు, ఓ మనిషీ తిరిగిచూడు, చిల్లర దేవుళ్లు, తరం మారింది, అంగడి బొమ్మ, అనుగ్రహం, చలిచీమలు, మార్పు, డూడూ బసవన్న, ప్రాణం ఖరీదు, నగ్నసత్యం, నీడ, పునాదిరాళ్లు, కుడి ఎడమైతే, మంచికి స్థానంలేదు, యువతరం కదిలింది, మంచిని పెంచాలి, ధర్మం దారితప్పితేలాంటి చిత్రాలు 1980ల వరకూ వచ్చాయి. ఇంకా, పేదల బ్రతుకులు, సమాధి కడుతున్నాము చందాలివ్వండి, సమాజానికి సవాల్, విప్లవజ్యోతి, ఎర్రమల్లెలు, హరిశ్చంద్రులు, ధర్మవడ్డీ, మరోమలుపు, విప్లవశంఖం ఇలాంటివెన్నో.
కొంతమంది దర్శకులైతే సమకాలీన సమస్యలపై విప్లవాత్మక ధోరణిలో మాత్రమే తీశారు. వీటిలోనే వ్యంగ్య ధోరణిలోనే విమర్శలు చేస్తూ మాస్‌ని అలరించేలా చక్కని వినోదాన్నీ అందించారు. చౌకబారు కమర్షియల్ అంశాల జోలికెళ్లకుండా నమ్మిన సిద్ధాంతాలపైనే దృష్టి పెట్టారు. అలాంటి వాళ్లలో వేజళ్ల సత్యనారాయణ, టి కృష్ణ, రాజ్‌కుమార్, ధవళసత్యం, ఆర్ నారాయణమూర్తిని ప్రస్తావించొచ్చు. వరుసగా వీరు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలను పరిశీలిద్దాం. -మరోమలుపు, ఈదేశంలో ఒకరోజు, ఈ చదువుల మాకొద్దు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా, ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు, మార్చండి మన చట్టాలు, ఓటుకు విలువ యివ్వండి చిత్రాలను వేజళ్ల రూపొందించారు. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, సుబ్బారావుకు కోపంవచ్చింది, చైతన్యరథం లాంటివెన్నో ధవళ సత్యం రూపొందిస్తే, నేటి భారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రతిఘటన, దేవాలయం, రేపటి పౌరులు, వందేమాతరంలాంటి చిత్రాలను టి కృష్ణ సమకాలీన సమస్యలపై నిర్మించి ఘన విజయాలు అందుకున్నారు.
టి కృష్ణకంటే ముందు వచ్చిన రాజకుమార్ -పునాదిరాళ్లు, ఈ సమాజం మాకొద్దు, మన వూరుగాంధీ, స్వర్ణ్భారతం, జనప్రియ, మా సిరిమల్లె లాంటి వాటిని రూపొందించారు. ఈయన పునాదిరాళ్లు -తర్వాత పరిశ్రమలోకి వచ్చిన వామపక్ష భావాలు కలిగిన దర్శకులకు పునాది అయ్యింది. నటుడు ఆర్ నారాయణమూర్తి అసలుసిసలు వామపక్ష భావాలుగల వ్యక్తికావటం చేత ఈయన దర్శకుడిగామారి తొలి చిత్రం ‘అర్థరాత్రి స్వతంత్య్రం’ మొదలుకొని ‘అన్నదాతా సుఖీభవ’ వరకు తను నమ్మిన సిద్ధాంతాల కోసం వ్యాపారపరంగా లాభనష్టాలను లెక్కచేయక ఇప్పటివరకు 35 చిత్రాలను నిర్మించారు. వాటిలో ముఖ్యమైనవి ‘ఆలోచించండి, అడవి దివిటీలు, భూపోరాటం, దండోరా, చీకటి సూర్యులు, ఎర్రసైన్యం, ఊరు మనదిరా!, ఎర్ర సముద్రం, లాల్‌సలామ్, అన్నలరాజ్యం, అడవి బిడ్డలు, దేవరకొండ వీరయ్య లాంటివెన్నో. కోడి రామకృష్ణ అయితే తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, భారత్ బంద్ లాంటి చిత్రాలు అభ్యుదయ కోణంలో నిర్మించినవే. ఇలా చూస్తే ఎన్నో చిత్రాలు. ప్రతి దర్శకుడూ తను రూపొందించిన చిత్రాల్లో ఈ కోణం నుంచి ఒకటి రెండు చిత్రాలు తప్పక నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య కమర్షియల్ చిత్రాలతోపాటు -అరుణకిరణం, నవభారతం, భారతనారి, సగటు మనిషి, నవయుగం, ఎర్ర మందారం లాంటివి నిర్మిస్తే, పి చంద్రశేఖర్‌రెడ్డి -విప్లవ శంఖం, రేపటి స్వరాజ్యం, నవోదయం మాదాల రంగారావు కోసం నిర్మించారు. మాదాల రంగారావు నిర్మించిన తొలి చిత్రం ‘యువతరం కదిలింది’ నుండి నిర్మించినవన్నీ విప్లవాత్మక చిత్రాలే! అలాగే పోకూరి బాబూరావు ‘నవతరం’ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాలన్నీ సమకాలీన సమస్యలపైనే. దాసరి నుంచి లంచావతారం, ఎంఎల్‌ఏ ఏడుకొండలు, బలిపీఠం, ఓ మనిషీ తిరిగిచూడు, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, నేనే రాజు నేనే మంత్రి, అడవి చుక్క, సమ్మక్క సారక్క, ప్రజాప్రతినిధి, సర్ధార్, తిరుగుబాటు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఒక ఎత్తయితే వీటన్నింటికి మూలాధారం 1954లో దర్శకులు కెవి రెడ్డి రూపొందించిన ‘పెద్ద మనుషులు’ చిత్రం. మాలపిల్ల, మళ్లీ పెళ్లి సాంఘీక అసమానతలపై వస్తే, ఈ పెద్ద మనుషులు ఆనాటి సమకాలీన సమస్యలపై పురపాలక సంఘ చైర్మన్‌కు తోడుగా ముగ్గురి ఉన్నత వ్యక్తుల అవినీతి భాగోతాల్ని వ్యంగ్యధోరణిలో చూపించిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ఇంకా ఇలాంటి కథాంశ చిత్రాలు- ప్రజాస్వామ్యం, విముక్తికోసం, కులాల కురుక్షేత్రం, సత్యాగ్రహం, అంకురం, ఎర్రమట్టి, ప్రజాతీర్పు, నేటి స్వతంత్రం, భారతరత్న, కొమురం భీమ్, సింధూరం, స్వతంత్ర భారతం, వౌనపోరాటం, డాక్టర్ అంబేద్కర్, అన్న దళం, బాణం, మరో క్విట్ ఇండియా, ఖడ్గం, కానిస్టేబుల్ వెంకట్రామయ్య, సింగన్న, పీపుల్స్ ఎన్‌కౌంటర్, అన్న సైన్యం, ఒక ఊరి కథ, భూమికోసం, మాభూమి, రంగుల కల.. ఇలా చెప్పుకోవచ్చు. మర్చిపోయినవి, గుర్తుకురానివి ఇంకా ఎన్నో.
సినిమా కథలే కాదు, చాలా సినిమాల్లో సమకాలీన సమస్యలపైన, అణగారిన బ్రతుకులపై చైతన్య స్ఫూర్తినిచ్చి మనసుల్ని తట్టి లేపే ఉద్రేకపూరితమైన పాటలెన్నో కనిపిస్తాయి. సూపర్ హిట్టయిన కొన్ని పాటలను ప్రస్తావిస్తే -పెద్దమనుషులు చిత్రంలో ‘గణగణమూర్తివి గణనాథా’, వెలుగునీడలు చిత్రంలో ‘పాడవోయి భారతీయుడా’, గుండమ్మకథలో ‘లేచింది నిద్ర లేచింది మహిళాలోకం’, ‘వేషము మార్చెను భాషను మార్చెను తలలే తీశెను.. అయినా మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు’, రాముడు భీముడులో ‘కాలంబు మారిందోయ్ దేశమ్ము మారిందోయ్’, కథానాయకుడులో ‘ఇంతేనయా తెలుసుకోవయా’, ‘వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్యా!’, తల్లా పెళ్లామాలో ‘తెలుగుజాతి మనది’, పవిత్రబంధంలో ‘గాంధీపుట్టిన దేశమా ఇది’, అల్లూరి సీతారామరాజులో జాతీయ అవార్డు పొందిన శ్రీశ్రీ గీతం ‘తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’, వరకట్నంలో ‘ఇదేనా మన సంప్రదాయమిదేనా’, నిండు సంసారంలో ‘ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు’, ఎర్రమల్లెలులో ‘నాంపెల్లి టేషన్ కాడ’, దేశోద్ధారకులులో ‘ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’, బలిపీఠంలో ‘మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి’, ఒకే కుటుంబంలో ‘మంచిని మరచి మానవుడే ఈనాడూ’, బడిపంతులులో ‘్భరతమాతకు జేజేలు’, ఈనాడులో ‘నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంబరం’, నేటి భారతంలో అర్థరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం, చివరగా ఠాగూర్‌లోని ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కరు ఆహుతిచ్చాను’లాంటి పాటలు కనిపిస్తాయి. విప్లవాత్మత, ప్రభోదాత్మక, సమకాలీన సమస్యల చిత్రాలెన్నో ఉనికిని చాటుకొని పే ప్రతిష్టలు సాధించాయి. అగ్రస్థాయి హీరోలనుండి చిన్నస్థాయి హీరోలవరకు అందరూ ఈ చిత్రాల్లో నటించి సత్తా చాటుకున్నారు. ఇలాంటి చిత్రాలు ఎప్పుడూ వస్తుండాలి. దర్శకులు, నిర్మాతలు ఇలాంటి చిత్రాల్ని నిర్మిస్తూ తమ అభిరుచుల్ని చాటుకోవాలి.
చిత్రం...రైతుబిడ్డ చిత్రంలో గంగారత్నం, వేదాంతం రాఘవయ్య, సుందరమ్మ

-పి లక్ష్మీసుజాత