మెయన్ ఫీచర్

నిఘా వ్యవస్థకు జవసత్వాలు ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకలో ఇటీవల ‘ఐసిస్’ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తరహా దారుణాలను ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందా? మతోన్మాద ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలను పసిగట్టే యంత్రాంగం మన దేశంలో లేదు. ఉగ్రవాదులు భారీ హింసాకాండకు పాల్పడ్డాక మన పాలకులు ఘనమైన ప్రకటనలు చేస్తుంటారు. ఆ హడావుడి ముగిశాక ఉగ్రవాద నిరోధక యంత్రాంగాల ఏర్పాటు గురించి పట్టించుకోరు. గత ఐదేళ్లలో, అంతకుముందు జరిగిన ఉగ్రదాడులతో పోల్చితే భారత్‌లో మతపరమైన టెర్రరిజం సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. జమ్మూ కశ్మీర్‌లో మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు.
ఉగ్రవాదం భారత్‌కు కొత్తకాదు. చరిత్రను తిరగేస్తే గత 1200 ఏళ్లుగా ఉగ్రవాద దాడులకు భారత్‌కు గురవుతున్నా ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు. 1947 వరకు మనలో మనం కీచులాడుకోవడం వల్ల విదేశీ దురాక్రమణదారుల చేతిలో బలయ్యాం. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఓటుబ్యాంకు రాజకీయాలకు కొమ్ముకాసే దుర్మార్గపు రాజకీయ పార్టీల వల్ల భరతమాత రక్తసిక్తమవుతోంది. పొరుగున ఉన్న శ్రీలంక 30 ఏళ్లపాటు తమిళ ఉగ్రవాదుల చేతిలో విలవిలలాడింది. తాజాగా ఐసిస్ ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల దాడిలో దద్దరిల్లింది. ఈ కుట్రకు శ్రీలంక, భారత్ తీరప్రాంతంలోని ఒక మతానికి చెందిన వారిలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువకులే కారణమని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
1970 నుంచి 2019 వరకు భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద తండాల వల్ల జరిగిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ ముష్కరులకు మనదేశానికి చెందిన కొంత మంది అండదండలు ఉన్నాయనేది నగ్నసత్యం. గత 49 ఏళ్లలో 12,050 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో 20వేల మంది పౌరులు, భద్రతాదళ సిబ్బంది మరణించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఉగ్రవాద దాడులతో దేశం దద్దరిల్లింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఉగ్రవాదం జమ్మూ కశ్మీర్‌కే పరిమితమైంది. అడపాదడపా కొన్ని సంఘటనలు దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరిగినా అంతకు ముందు ఘటనలతో పోల్చితే ఉగ్రవాదుల దాడుల తీవ్రత తగ్గింది. గత ఫిబ్రవరి 14న పుల్వామా దాడితో భారత్ మేల్కొంది. దీనికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులతో పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టింది. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి 350 మంది ఉగ్రవాదులను మన సైనికులు మట్టుబట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకుని ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు సైతం మన సైన్యం వీరోచిత దాడులను ప్రశ్నించే స్థాయికి దిగజారారు. 2008లో నవంబర్ 26న యూపీఏ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబయిలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఆనాటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యువనేత రాహుల్ గాంధీ ఏమి చేశారు? కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల 1947 నుంచి కశ్మీర్ రావణకాష్టంలా మండుతోంది.
బీజేపీ కూడా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సాధ్వి ప్రజ్ఞ్ఠాకూర్‌కు భోపాల్ టిక్కెట్ ఇచ్చి తప్పు చేసింది. ఆమెకు ఉన్న పాండిత్యం, జ్ఞానం, స్థాయి ఏ పాటిది? మాలేగావ్ పేలుళ్లకు సంబంధించి ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె ‘హిందూత్వ ఫైర్ బ్రాండ్’ కావచ్చు. కానీ ఆమెపై జాతి సిగ్గుతో తలవంచుకునే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు రాజకీయ అనుభవం ఉందా? ఆమెకు రా జ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి తెలుసా? ముంబయి పేలుళ్లలో ముష్కరులతో పోరాడి అమరుడైన హేమంత్ కర్కరే గురించి చాలా చౌకబారు ప్రకటనలు చేసిన ప్రజ్ఞ్ఠాకూర్ లాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న హిందూత్వ వాదులకు టిక్కెట్ ఇచ్చి బీజేపీ తప్పు చేసింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు రావడంతో ప్రజ్ఞ్ఠాకూర్ ప్రకటనతో తమకు సంబంధం లేదని భాజపా ప్రకటించినా, ఆ పార్టీ కావాల్సినంత అప్రతిష్టను మూటగట్టుకుంది.
మన దేశంలో మతపరమైన ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను పట్టుకునే వ్యవస్థలేదు. అనేక ఏళ్ల తర్జనభర్జనల తర్వాత నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీని (ఎన్‌ఐఏ) ఏర్పాటు చేశారు. కానీ, జాతీయస్థాయిలో మతపరమైన ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను, వాటికి నిధులు ఇచ్చే వారి కదలికలను పసిగట్టే యంత్రాంగం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నా ఆ సంస్థ విధులు వేరు. నేషనల్ టెక్నికల్ రీసెర్చి ఆర్గనైజేషన్ అనే సంస్థను 2004లో ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2008లో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏకు వివిధ రాష్ట్రాల నుంచి అందే సహకారం అంతంత మాత్రమే. రాష్ట్ర స్థాయిలో నిఘా వ్యవస్థల పనితీరు అధ్వానంగా ఉంది. దేశం మొత్తం మీద అత్యంత అద్భుతంగా పనిచేసే నిఘా సంస్థ ఒక్క తెలంగాణలోనే ఉంది. తెలంగాణ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఉగ్రవాదుల కదలికలను పసిగడుతున్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో నిఘా సంస్థలు పటిష్టంగా లేవు. నిఘా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నిఘా సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు ఉగ్రవాద సంస్థల చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ అరబ్బీ,పారశీక భాషల్లో జరుగుతుంటాయి. వాటిని అధ్యయనం చేసే నిపుణులు ఈ రాష్ట్రాల్లో లేరు. ఈ నిఘా సంస్థల్లో పనిచేసే వారికి హిందీ కూడా రాదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకునేందుకు 1999 కార్గిల్ యుద్ధం తర్వాత మల్టీ ఏజన్సీ సెంటర్‌ను ఏర్పాటు చేసినా ఇంత వరకు అతీగతీలేదు. నేషనల్ కంప్యూటరైజ్డ్ ఇన్ఫర్‌మేషన్ షేరింగ్ నెట్‌వర్క్‌ను 2001లో కేంద్రం ప్రతిపాదించింది. 2008 వరకు ఈ సంస్థకు నిధులు ఇవ్వలేదు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీని 2002లో ఏర్పాటు చేసినా ఇంతవరకు వెలుగుచూడలేదు. రీసెర్చి అనాలిసిస్ వింగ్ అత్యంత సాహసోపేతమైన నిఘా సంస్థ. కాని ఈ సంస్థకు నిర్దేశించిన విధులు, బాధ్యతలు వేరు.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనే పేర్లు వినడానికి చాలా గొప్పగా ఉంటాయి. కాని ఈ కమిటీలు ఎప్పుడు సమావేశమవుతాయో, వీటికి ఉండే అధికారాలు ఏమిటో ఎవరికీ తెలియదు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (ఎన్‌సీటీసీ)ని వాజపేయి ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇది మంచి నిఘా సంస్థ. కాని ఈ ప్రతిపాదనకు యూపీఏ సర్కార్ పాతర వేసింది. దీనికి రాష్ట్రప్రభుత్వాలు సహకరించాయి. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టే ముసుగులో తమకు కేంద్రం ఎక్కడ ద్రోహం చేస్తుందో అన్న చింతనతో రాష్ట్రప్రభుత్వాలు ఎన్‌సీటీసీ ప్రతిపాదను వ్యతిరేకించాయి.
120 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థతో అలరారుతున్న భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏకీకృత వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను రంగంలోకి దింపుతారు. మతపరమైన అల్లర్లు జరిగితే సీఆర్‌పీఎఫ్ బలగాలను పంపుతారు. ఇవన్నీ కేంద్రం ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర నిఘా సంస్థలకు తగిన నైపుణ్యం లేనందు వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల కదలికల సమాచారం తెలియదు. పైగా దీనికి తోడు ఎవరైనా స్థానికంగా సానుభూతిపరులు దొరికితే వారిని విడిచిపెట్టేయాలంటూ రాజకీయపరమైన ఆదేశాలు వెలువడుతున్నాయి. ఓటు బ్యాంకు దృష్టితో చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు కొకొల్లలు. ఈ తరహా ఆరోపణలు జాతీయ, ప్రాంతీయ పార్టీలపై ఉన్నాయి.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ తన కోరలను దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరిస్తోంది. గత 50 ఏళ్లుగా ఉగ్రవాదానికి బలవుతున్న భారత్ తన పొరుగు దేశమైన శ్రీలంకలో తాజా పేలుళ్లను చూసైనా ఇక జడత్వాన్ని వదిలేయాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పీచమణిచేందుకు జాతీయ స్థాయిలో బలమైన చట్టాలు తేవాలి. పరిపాలన రంగంలో సివిల్ సర్వీసు విభాగం ఉన్నట్లు, నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలో ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలకు సత్తా లేనందువల్ల, రాజ్యాంగ సవరణ చేసి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ, నేషనల్ యాంటీ టెర్రరిస్టు పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల మధ్య కచ్చితంగా సమన్వయ వ్యవస్థను నెలకొల్పాలి. చట్టాల్లో సవరణలు తేవాలి. సుశిక్షితమైన శిక్షణ సంస్థలను ఏర్పాటుచేయాలి. ఉగ్రవాదం పీచమణిచే పోలీసు వ్యవస్థకు విశేషమైన అధికారాలు ఇవ్వకుండా, ఉగ్రవాదుల ఏరివేత అనే బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయకుండా, ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద తండాల కార్యకలాపాలను నిలువరించడం దుర్లభం. అంతర్గత శత్రువులతో సతమతమయ్యే భారత్‌లో జాతీయ స్థాయిలో ఉగ్రవాదులను నిర్వీర్యం చేసేందుకు బలమైన చట్టాలు కావాలి. నేరాలకు పాల్పడిన వారిని విచారించి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకుండా, ఉగ్రవాదం నిర్మూలన దిశలో ఒక్క అంగుళం కూడా ముందుకు వేయలేం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097