మెయిన్ ఫీచర్

‘గీతాంజలి’కి యేట్స్ తూకపు రాళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మే 7న విశ్వకవి టాగూర్
158వ జయంతి సందర్భంగా...
*
కొన్నాళ్ళ కిందట వైద్యానికి ప్రసిద్ధుడైన ఒక బెంగాలీ డాక్టర్‌తో అన్నాను ‘‘చూడండి నాకు జర్మన్ భాష తెలీదు, కానీ ఒక జర్మన్ కవి రచన అనువాదం నన్ను కదిలిస్తే, నేను బ్రిటీష్ మ్యూజియంకి వెళ్లి అక్కడ ఆయన జీవితం, ఆయన ఆలోచనల చరిత్ర తెలిపే పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా అని వెదుకుతాను. అయితే, రవీంద్రనాథ్ టాగూర్ కవిత్వనువాదాలు చాలా ఏళ్లుగా నాలో రక్తస్పందనలు కలిగిస్తున్నా అతని జీవితం గురించి గానీ, అతని రచనలను సాధ్యం చేసిన ఆలోచనలక్రమాన్ని గానీ ఎవరో ఒక భారతీయ యాత్రికుడు కనుక చెప్పకపోతే నాకేమీ తెలిసే అవకాశం లేదు’’.
నేనిలా స్పందించడం సహజమే అని తోచి ఉంటుంది అతనికి. ‘‘నేను రవీంద్రనాథ్‌ను ఒక పంక్తిఅయినా ప్రతిరోజూ చదువుతాను, ప్రపంచంలో ఉండే సమస్యలు మరిచిపోవడానికి’’ అని జవాబిచ్చాడు. ‘‘లండన్‌లో, రెండో రిచర్డ్ (1367-1400) కాలంలో నివసించే ఒక ఇంగ్లీష్ వ్యక్తికి, పెట్రార్క్, లేదా దాంటేరచనల అనువాదాలు చూపిస్తే, తనకి ఏర్పడే ప్రశ్నలకు సమాధానాలుగా ఏ పుస్తకాలూ దొరికి ఉండే అవకాశం లేదు. తాను ఏ ప్లోరెంటైస్ బాంకర్‌నో లేదా లొంబార్డ్ వర్తకుడినో, నేను మిమ్మల్ని ప్రశ్నించినట్టు ప్రశ్నించి ఉండేవాడు. నాకు తెలిసినంతవరకూ, ఈ కవిత్వం, చాలా నిండుగా, నిరాడంబరంగా ఉంది. మీ దేశంలో కొత్త పునరుజ్జీవ దశ కన్ను విప్పినట్టే ఉంది కానీ ఎవరో చెప్తే తప్ప నాకు తెలీనే తెలీదు’’. తను జవాబిచ్చాడు. ‘‘మాకు ఇంకా ఇతర కవులున్నారు కానీ తనకి సమానులు కారు. దీనిని మేము రవీంద్ర శకం అని పిలుస్తున్నాము. యూరప్‌లో ప్రస్తుతం ఏ కవికి, మా సమాజంలో తనకిగల పేరు ప్రఖ్యాతులు లేవు. తను సంగీతంలోనూ, కవిత్వంలోనూ కూడా గొప్పవాడు. తన సంగీతం భారతదేశంలోనూ, బర్మాలో కూడా ఎక్కడెక్కడ బెంగాలీ మాట్లాడుతారో, అక్కడంతా ప్రసిద్ధం. పందొమ్మిదేళ్ళకే పేరు పొందిన తాను, అప్పటికే తొలి నవల కూడా రాశాడు. మరికొద్ది ఏళ్లకే తను నాటకాలు కూడా రాశాడు. ఇప్పటికీ ఆ నాటకాలు కలకత్తాలో ప్రదర్శింపబడుతూనే ఉన్నాయ. తన జీవితపు సంపూర్ణత్వాన్ని చూసి నేను అబ్బురపడుతుంటాను. ఇంకా చిన్నప్పుడే, తను తన చుట్టూ వుండే ప్రకృతి గూర్చి రచనలు చేశాడు. ఎక్కువ సమయం తమ తోటలోనే గడుపుతుండేవాడు. పాతికేళ్ళ వయసు నుండీ ఒక పదేళ్ళ కాలం తన జీవితంలో పెను విషాదాలు జరిగినప్పుడు, తను బెంగాలీ భాషలోకెల్లా విశిష్టమైన ప్రేమ కవిత్వం రాశాడు. అపుడు టాగూర్ అన్నాడు భావావేశపూర్ణంగా- ‘‘నేను ప్రేమ కవిత్వానికి ఎంత రుణపడి ఉన్నాను అన్నది మాటలు వ్యక్తం చేయలేవు’’. ‘‘అటుపై తన కళాసృష్టి ఇంకా గాఢమైంది. ధార్మిక చింతన, తాత్విక సంపన్నత తన కవిత్వంలో ప్రధానమయ్యాయి. మానవాళికి అవసరమయ్యే ప్రతి ప్రేరణా కూడా మనకి తన కవిత్వంలో లభిస్తుంది. జీవితాన్ని నిరాకరించని సాధు సంతల్లో తను మొదటివాడు, నేరుగా జీవితాన్నుంచే తను మాట్లాడాడు. అందుకే మేము తనని అంతగా ప్రేమిస్తాము’’- ఆ వ్యక్తి నాకు చెప్పిన దానిలో మాటలేమన్నా మారాయేమో కానీ, వాటి సారాంశం మాత్రం ఇదే. ‘‘కాసేపటిముందు, తను ఒక ప్రార్థన మందిరంలో ఆరాధనా సేవలో ఉన్నాడు. ‘‘మేము బ్రహ్మసమాజీకులం, ఇంగ్లీషులో మా ప్రార్థనా మందిరాలకు చర్చ్ అని మీ మాటే వాడుతాము’’. కలకత్తాలోనే బహు రద్దీ అయన ప్రాంతంలో వున్న పెద్ద చర్చ్ అది. పెద్ద ఎత్తున ప్రజలు ఉంటారు రోజూ. చాలామంది భారతీయులు నన్ను చూడటానికి వచ్చారు. వారిలో టాగూర్ పట్ల గౌరవ ప్రతిపత్తులు, మన దేశంలో అయితే చాలా కొత్తగా అనిపిస్తాయి. మనం చిన్నా పెద్ద విషయాలను ఒకే ముసుగు వేసి హాస్య చతుర్లు గానో, లేదా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యతతో వెక్కిరింతగానో తీసి పడేసే స్వభావంగలవారం. మన కేథడ్రల్‌ల నిర్మాణం జరిగేటప్పుడు మనం మన పెద్దలకు ఇటువంటి గౌరవం ఇచ్చామా? ఒకాయన చెప్పాడు నాతో- ‘‘ప్రతిరోజూ ఉదయం మూడు గంటలకి’’, ‘‘నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను కనుక’’ తను దాదాపు రెండు గంటల సేపు ధ్యానంలో కూచుంటాడు. అతని తండ్రి, మహర్షి, ఆ మరునాడు, ఒక్కోసారి రోజల్లా ధ్యానంలోనే ఉంటారు. ఓసారి ఒక నదిపై ప్రయాణిస్తూ, తాను అక్కడ ప్రకృతి నిసర్గ సౌందర్యం చూసి, ధ్యానంలోనికి వెళ్లిపోగా, పడవ సరంగులు, ఎనిమిది గంటలసేపు అక్కడ ఉండిపోవలసి వచ్చింది అతనికి భంగం కలుగుతుంది’’.
అపుడు తను నాతో చెప్పాడు, ఎలా టాగూర్ల కుటుంబంలో తరతరాలుగా గొప్ప వ్యక్తులు జన్మిస్తూ వచ్చారో, ఇవాళ గగనేంద్రనాథ టాగూర్, అబనీంద్రనాథ టాగూర్, ఇద్దరు చిత్రకారులు. రవీంద్రనాథ్ సోదరులు ద్విజేంద్రనాథ్ గొప్ప తత్వవేత్త. ఉడుతలు కొమ్మలమీంచి వచ్చి తన ఒంటిమీద ఆడుకుంటాయి. పక్షులొచ్చి తన చేతులమీద వాలుతాయి’’. చూస్తూ ఉంటే, వీళ్ళ మాటల్లో తాత్వికుడు నీషే చెప్పినటువంటి భౌతికమైన వాటిలో ప్రతిఫలించని ఏ నైతిక ఉన్నతి, ఏ సౌందర్య గరిమ ఎందుకూ కొరగావు అన్న ఎరుక సార్థకంగా గోచరిస్తూ ఉంటుంది. నేను నాతో ఈ పాటల రాతప్రతి తోడుగా ఉంచుకుని చాలా రోజులుగా, రైల్వే స్టేషన్‌లలోనూ, బస్ ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ చదువుతూనే ఉన్నాను, ఒక్కోసారి మూసేయాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే, ఈ పుస్తకం నన్ను ఎంతలా కదిల్చింది అనేది ఇతరులెవరన్నా గమనిస్తారేమోనని. ఈ గీతాలు మూల భాషలో సున్నిత లయబద్ధంగా, అనువాదాలకు అందని పదాల రంగులతో, ఛందస్సుల అమరికతో ఉంటాయని వాటివలన నేనెప్పుడూ చూడనిదీ, చూడాలని కలలుగనే కొత్త ప్రపంచం వారి మనసుల్లో ఆవిష్కృతం అవుతుంటుందని నా భారతీయ మిత్రులు చెప్తుంటారు.
స్విట్జర్లాండ్ సుందర సరస్సుల అందాలను ఎక్కడ చూడడంలో పడిపోతానో, లేక బుక్ ఆఫ్ రెవెలేషన్స్‌లో ఉన్నట్టువంటి హింసాత్మక వచో ధాటికి లోబడిపోతానో అని కనులు మూసుకున్న సెయింట్ బెర్నార్డ్‌తో మనకి వున్న పోలికేమిటి? ఈ పుస్తకంలో అటువంటి గౌరవ వచనాలు కనిపిస్తాయి మనకి. ‘‘నాకు సెలవైంది. వీడ్కోలివ్వండి సోదరులారా, మీ అందరికీ నమస్కరించి ప్రయాణవౌతున్నాను. ఇదిగో నా ద్వారపు తాళపు చెవులు. నా ఇంటిపై నాకే హక్కులున్నా అవన్నీ వదులుకుంటున్నాను. నాకు మీ నుంచి కావలసిందల్లా దయతో కూడిన పలుకులు. మనం చాలాకాలం ఇరుగుపొరుగువారం. నేను ఇవ్వగలిగినదానికన్నా, ప్రతిఫలాన్ని ఎక్కువే పొందాను. వేకువైంది, నా కుటీరాన్ని వెలిగించిన దివ్వె మలిగింది. పిలుపాజ్ఞ వచ్చింది, నేను సిద్ధం ప్రయాణానికి’’. ఇక మన మనోస్థితి బట్టి- కేంపిస్‌కో, శిలువపై జాస్‌కో దూరంగా ఉన్నపుడు రోదిస్తాము.. ‘‘జీవితాన్ని బహుగా ప్రేమించాము కాబట్టి, మాకు తెలుసు మృత్యువుని కూడా అంతలా ప్రేమిస్తాము’’ అని.
అలా అని కేవలం మన వీడ్కోలు గూర్చిన ఆలోచనలకు మాత్రమే సంబంధించింది కాదు ఈ పుస్తకం. మనం దైవాన్ని ప్రేమించము అని మనకి తెలిసిరాలేదు, మహా అయితే, మనకి తనలో విశ్వాసం ఉందన్న వరకూ తెలుసును. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితంలో మనం కనుగొనేవన్నీ, ఆ అటవీ ప్రాంతాల మన వెదుకులాటలో, మన ఆనందాల గిరి సానువుల ఏకాంతాలలో, మనం ఆమెపై ప్రేమ విషయమై చేసిన నిగూఢమైన ఎరుక ప్రకటనలో, ఇంతటి మాధుర్యాన్ని కలిగించిన ఆ భావావేశంలో తోస్తాయి ఇటువంటి పంక్తులు. ‘‘సామాన్యుల గుంపులోకెల్ల సామాన్యుడైన నా హృదయంలోనికి పిలవకుండానే ప్రవేశించిన, నేనెరుగని ఓ ప్రభూ- నువ్వేకదా శాశ్వతత్వపుటుంగరపు ముద్రను ముద్రిస్తావు తరలిపోయే అసంఖ్యక క్షణోపక్షణాలపై’’!
ఏ పేజీ రాస్తున్నప్పుడూ, రాయడం అనే ఆనందాన్ని పొందలేకుండా మనం పెద్ద పెద్ద పుస్తకాలు రాసి, ఏదో ఒక వ్యూహం ఉంది కదా అన్న ధీమాతో, వాదులాటల ద్వారా ధనార్జన చేస్తూ మన తలల నిండా రాజకీయాలను నింపుకుని ఉండే వేళల్లో, టాగూర్ భారతీయ సంస్కృతిలాగే, ఆత్మను కనుగొని, ఆ స్వచ్ఛంద లోస్వరానికి తనని సమర్పించుకోవడంలో సంతృప్తిని పొందుతున్నాడు. మన పద్ధతుల్లో ఎవరైతే ప్రేమ పేరిట ఎక్కువ ఆర్భాటం చేస్తారో, ఎక్కువ పలుకుబడి ప్రపంచంలో కలిగి ఉంటారో, వాటిపట్ల తనకేమీ ఆకర్షణ లేకుండా, చాలా వినయంగా ఇది నా తీరు అని తన సంగతి ఏదో స్పష్టరచుకున్న వ్యక్తివలె కనిపిస్తాడు. ‘‘ఇంటికిపోతున్న మనుషులు నన్ను చూసి నవ్వుతుంటే, నాకెందుకో తగని అవమానం కలుగుతుంది. నేనొక భిక్షుకివలె కూచొని ఉంటాను నా చెంగు మొగాన వేసుకొని. వారు గనుక అడిగితే ఏం కావాలి నీకని, నేను కనులు వాల్చి ఏ జవాబూ ఇవ్వకుండా ఉంటానలా’’. మరొకసారి ఎలా తన జీవితం వేరే రకంగా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ- ‘‘ఎన్నో గంటలు ఈ మంచి చెడు ఘర్షణలో గడిపాను. ఇప్పుడిక నా శూన్య దినాల చెలికాని వంతు, ఆనందమయ రీతుల్లో నా హృదయాన్ని తన వశం చేసుకోవడం, నాకు తెలీదు ఎందుకీ హఠాత్ ఆహ్వానం ఏ పనికిరాని నిష్ప్రయోజనం కోసమో!’’
సాహిత్యంలో మరెక్కడా కనిపించని ఒక అమాయకత్వం, ఒక నిరాడంబరత, పిట్టల్నీ, ఆకులనీ అతనికి పిల్లలను దగ్గర చేసినంతగా చేస్తుంది. రుతువుల మార్పులు ఆలోచనల ఎగుడుదిగుడు మల్లే సంఘటనా సమ్మర్దవౌతాయి. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. బెంగాల్ సాహిత్యంనుంచా, లేక అక్కడి ధార్మికావేశం నుంచా ఎక్కడ్నుంచి తెచ్చుకున్నాడు ఇవన్నీ- లేదా తన అన్న చేతుల మీద వాలి పరవశాలు పోయే పక్షిగణాలవలె, నాకు ఆనంద దాయకంగా తోస్తుంది, ఇదంతా అనువంశికమేమోనని, మనకి తెలిసినదీ, శతాబ్దాల గుండా క్రమాభివృద్ధిగా సంభవిస్తున్న ఒక ట్రిప్తాస్ ఒక పేలనోర్‌ల ఘర్షణామయ హృదయ ఔదార్యంలాగా. నిజంగా తను చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నపుడు ఈ లక్షణాలన్నీ ప్రస్ఫుటమవుతాయి. సాధువర్యుల గురించి కూడా అదే సమయంలో మాట్లాడటం లేదు అని చెప్పలేము. ‘‘వాళ్ళు ఇసుక గూళ్ళు కట్టుకుంటారు. గవ్వ గుల్లలతో ఆడుకుంటారు. ఎండుటాకులతో తమ పడవలను అల్లిక చేసుకుంటారు, వాటిని నవ్వుతూ కడలి అనంతాలలోనికి వదలి వేస్తారు. ప్రపంచ తీరాల్లో పిల్లలు ఆడుకుంటారు. ఎలా ఈదాలో తెలీదు, ఎలా వలలు విసరాలో తెలీదు. ముత్యపు చిప్పల వేటగాళ్ళు ముత్యాలకోసమని సముద్రపు లోతుల్లోనికి దూకుతుంటే, వర్తకులు తమ నావల్లో సముద్రాలపై వ్యాపార యాత్రలకు వెళ్తుంటే, పిల్లలు గులకరాళ్ళు పోగుచేసుకుని మళ్లా జల్లేసుకుంటూ ఉంటారు. వారికి దాచిన నిధులతో పనిలేదు, వారికి వలలు విసరడమూ రాదు’’.
*
(రవీంద్రనాథ్ టాగూర్‌కు నోబెల్ బహుమతి రావడానికి ముందే 1913లో ‘గీతాంజలి’ ఆంగ్లానువాదానికి ఆంగ్ల కవి వరేణ్యుడు డబ్ల్యూ.బి.యేట్స్ రాసిన ముందుమాటకు మొదటిసారిగా తెలుగు అనువాదం ఇది.)
*
చిత్రాలు.. రవీంద్రనాథ్ టాగూర్‌ * ‘గీతాంజలి’ *యేట్స్
*‘గీతాంజలి’లోని ‘ప్రార్థన’ గీతానికి రవీంద్రుడు స్వయముగా చేసిన ఇంగ్లీషు రచన స్వహస్తలిపి ఇది...

- డబ్ల్యూ.బి.యేట్స్ (సెప్టెంబర్ 1912) తెలుగు సేత: రామతీర్థ