మెయిన్ ఫీచర్

సిరులిచ్చే సింహాచలేశ్వర స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరంలో పనె్నండు గంటలు మాత్రమే తన భక్తులకు నిజ స్వరూపాన్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తాడు సింహాచలేశ్వరుడు. అంతవరకు ఆ దేవుని స్వరూపం చందనంతోనే నిండి ఉంటుంది. అరుదుగా లభించే ఆ దేవుని దర్శనం కోసం భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తారు.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిగా సింహాచలంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. విష్ణువు కృతయుగంలో దుష్ట రాక్షసులైన అన్నదమ్ములు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను సంహరించడానికి వరాహ, నారసింహ అవతారాలను ధరించాడు. వేదాలను తస్కరించి భూగర్భంలో దాచిన హిరణ్యాక్షున్ని మట్టుబెట్టి వేద సంరక్షణ చేసాడు . హిరణ్యకశిపుని కుమారుడు, తన భక్తుడు అయిన ప్రహ్లాదుని రక్షించడానికి, బ్రహ్మనుండి పొందిన వరాలు పొల్లుకాకుండా హిరణ్యకశిపుని వధించాడు.
ఈ రెండు అవతారాల సమన్వయ స్వరూపాన్ని ప్రసాదించి, ఆ రూపంలో తాను ఆరాధించుకోవడానికి అవకాశం కల్పించమని ప్రహ్లాదుడు కోరడంతో, భక్తుని కోరికను మన్నిస్తూ భూదేవితో కూడి ‘వరాహ లక్ష్మీనారసింహుని’గా సింహాచలంలో వెలిశాడు. దక్షిణ భారతదేశంలోని నృసింహ క్షేత్రాలలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో వైష్ణవ క్షేత్రాలలో ప్రధానమైనది.సింహాచల క్షేత్ర వైభవాన్ని, మహత్మ్యాన్ని పలు పురాణాలు ప్రస్తావించాయి. జానపదుల పాటల్లో కూడా కన్పిస్తాయి. అయితే సంపూర్ణమైన క్షేత్ర మహాత్మ్యం తెలియజేసే గ్రంథమంతటా అందుబాటులో లేదు. అయితే ఆ కొరతను గోగులపాటి కూర్మనాథకవి ఒకానొక సందర్భంలో స్వామి ఎదుట ఆశువుగా చెప్పిన ‘నారసింహ శతకం’ చాలావరకు తీర్చింది.
పురాణాలననుసరించి హిరణ్యకశిపుని వధించడానికి విష్ణువు నృసింహునిగా అవతరించి, అవతార ప్రయోజనాన్ని పూర్తిచేస్తాడు. ప్రహ్లాదుని భక్తికి సంతసించి, తన అవతార రూపాలైన వరాహ, నారసింహ ఆకృతులతో, భూదేవి సహితంగా - వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించమని ఆదేశిస్తూ నృసింహస్వామి ఇస్తాడు. ప్రహ్లాదుడు దానిని సింహగిరిపై ప్రతిష్ఠించి ఆరాధిస్తాడు.
ప్రహ్లాదుని అనంతరం స్వామికి పూజలు కరువయ్యాయి. విగ్రహం పుట్టతో కప్పబడింది. అటు పిమ్మట కొంతకాలానికి చంద్ర వంశానికి చెందిన పురూరవుడు వాహ్యాళికై సింహాచలంపై వెళుతుండగా ఆ స్థలానికి గల శక్తికారణంగా విమానం ఆకర్షించబడి కొండపై నిలిచింది. విస్మితుడైన పురూరవునికి ఆకాశవాణి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి, పుట్టలోనున్న స్వామిని తీసి, అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించమని వినిపించింది. పురూరవుడు ఆకాశవాణి ఆదేశాన్ని పరిపాలిస్తూ పుట్టను ఛేదించి, స్వామిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశాడు. ఆనాడు అక్షయ తృతీయ. తన పరివారంతో ఎంత పుట్ట మన్ను తొలగించారో అంతే పరిమాణంగల చందనాన్ని స్వామికి అలదాలని ఆజ్ఞాపించాడు. అలా అక్షయ తృతీయనాడు ఉదయం స్వామికి దివ్యస్నానం నిర్వహించి, రోజంతా పూజాదికాలు నిర్వహించాక తిరిగి సాయంత్రం చందనం అద్దుతారు. అలా స్వామి నిజరూప దర్శనం ఆనాడు ఉదయం నుండి సాయంత్రంవరకే లభ్యవౌతుంది.
కాలాంతరంలో చందనపు పూతను ఆగమశాస్త్ర విధాన పరంగా సంవత్సరంలో నాలుగు విడతలుగా చందనపు పూతను చేస్తారు. తొలగించిన పుట్టమన్ను పనె్నండు మణుగులు నాలుగు విడతల్లో మూడు మణుగుల చొప్పున (120 కేజీలుగా లెక్కించారు) అక్షయ తృతీయ, వైశాఖ, జ్యేష్ఠ, అషాఢపూర్ణిమ తిథులలో చందనాన్ని అలదుతారు. ఈ సంప్రదాయం నాటినుంచి నేటికీ కొనసాగుతున్నది.
సింహాచల దేవాలయం పశ్చిమ ముఖంగా వుంటుంది. ఆలయం నల్లరాయితో, ఉత్కృష్టమైన శిల్ప సంపదతో తనరారుతూ వీక్షకులకు విందునిస్తుంది.
ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రెండుసార్లు దర్శించారు. ఉత్తరాంధ్ర విజయ సందర్భంగా కొండపై విజయస్థూపం నిర్మించి, ఆరాధించి, స్వామివారి కైంకర్యాలకై ఎన్నో గ్రామాలను సమర్పించాడు. స్వామివారి అలంకరణకై ఆభరణాలు సమర్పించాడు.
తదనంతరకాలంలో, విజయనగరం పూసపాటి గజపతి వంశీయులు రాజ్య పరిధిలోకి వచ్చిన సింహాచల క్షేత్రం బహుముఖీనంగా వర్థిల్లింది. స్వామివారి నిత్య ఆరాధనలకై శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించి వున్న తమ సంస్థానాల ఆస్తులలో పలు గ్రామాలను సమర్పణ చేశారు. స్వామివారి సేవలను పర్యవేక్షిస్తూ, భక్తులు సమర్పించే నిధులను ఆలయ అభివృద్ధితో పాటు స్వామి వారి పేరున పలు విద్యాలయాలను, సాంస్కృత సంస్థలను, సంస్కృత, వేద విద్యలను పోషిస్తున్నారు.
సింహాచలం కొండ సువిశాలమైన చదును నేల కావడంతో, ఎన్నో వసతి సదుపాయాలతోపాటు స్వామివారికి నిత్యం పూజలకు అనువుగా ఉద్యాన వనాలను, మంటపాలను ఏర్పాటుచేశారు. పచ్చని కొండల మధ్య నెలకొన్న ఆలయం చుట్టూ మామిడి, పనస, సంపెంగ వంటి పెక్కు ఫల పుష్ప వనాలతో, తూర్పుసముద్రంపైనుండి వచ్చే గాలులతో ఆహ్లాదపరుస్తాయి.
స్వామివారికి ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. నిత్య కల్యాణంగా పచ్చతోరణంగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రధానంగా చందనోత్సవం దేశంలోని ప్రజలందర్నీ ఆకర్షిస్తుంది. ఒడిషా వాసులకు ఇలవేల్పు. జగన్నాధుడే సింహాద్రినాధుడుగా అవతరించాడని నమ్మకం. కొండపైనే కాకుండా, కొండ దిగువన కూడా వసతి సదుపాయాలున్నాయి. విశాఖ నుంచి రవాణా సౌకర్యం విస్తృతంగా ఉంది. సింహాచలేశుని దర్శనం కోసం భక్తులకు ఏరకంగానూ ఇబ్బంది లేదు. ఆనందప్రదంగా యాత్ర చేసుకోవచ్చు. చందనయాత్రను కూడా అలా చేసుకుని అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్ష!

-ఏ.సీతారామారావు